కిడ్నాప్‌ చేసి గడ్డివాము కింద 26 ఏళ్లు దాచిన నిందితుడు, బాధితుడిని ఎలా రక్షించారంటే...

కిడ్నాప్

ఫొటో సోర్స్, MEDIOS LOCALES

    • రచయిత, లూసీ క్లార్క్-బిల్లింగ్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అల్జీరియాలోని ఎల్ గ్యుడిడ్ పట్టణంలో కనిపించకుండా పోయిన ఒక వ్యక్తిని 26 ఏళ్లకు తన పొరుగింటి వ్యక్తికి చెందిన బేస్‌మెంట్‌లో గుర్తించారు. ఈ బేస్‌మెంట్ ఆయన నివసించిన ఇంటికి కొద్ది మీటర్ల దూరంలోనే ఉంది.

బాధితుడి పేరు ఒమర్ బిన్ ఒమ్రాన్. 1990లలో అల్జీరియా దేశంలో అంతర్యుద్ధం చెలరేగిన సమయంలో ఆయన కనిపించకుండా పోయారు.

ప్రస్తుతం ఆయనకు 45 ఏళ్లు. ఆయన పుట్టి పెరిగిన ఇంటికి కేవలం 200 మీటర్ల దూరంలోనే ఒమర్‌ను గుర్తించారు.

ఒమర్‌ను కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్న 61 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

అల్జీరియా ప్రభుత్వానికి, ఇస్లామిస్ట్ గ్రూప్‌లకు మధ్య దశాబ్ద కాలం పాటు సాగిన ఘర్షణలలో 1998లో ఒమర్ కనిపించకుండా పోయారు.

అంతర్యుద్ధంలో చనిపోయిన, కనిపించకుండా పోయిన వేలమంది వ్యక్తులలో ఒమర్ కూడా ఒకరని ఇన్నాళ్లూ ఆయన కుటుంబం భావిస్తూ వచ్చింది.

కానీ, మే 12న ఒక గడ్డివాము అడుగున ఉన్న నేలమాళిగలో ఒమర్‌ను ప్రాణాలతో గుర్తించినట్లు స్థానిక అధికారులు చెప్పారు.

కిడ్నాప్

ఫొటో సోర్స్, Getty Images

దారుణమైన నేరం

ఒమర్ బిన్ తన పొరుగింటి వారి ఇంటి కింద ఉన్న నేలమాళిగాలో ఉన్నాడని విచారణాధికారులకు ఒక గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెసేజ్ వచ్చింది.

‘‘ఈ మెసేజ్ తర్వాత, దీనిపై లోతైన విచారణ జరపాలని అక్కడి సాయుధ దళాలైన నేషనల్ జెండర్‌మెరీని అటార్నీ జనరల్ ఆదేశించింది. దీంతో ప్రశ్నించేందుకు అధికారులు వారి ఇంటికి వెళ్లారు’’ అని జ్యూడిషియల్ అధికారి చెప్పారు.

‘‘మే 12న స్థానిక సమయం ప్రకారం రాత్రి 8 గంటలకు, బాధితుడు ఒమర్ బిన్ ఒమ్రాన్‌ను అతని పొరుగిల్లు BA, 61లోని బేస్‌మెంట్‌లో గుర్తించారు’’ అని తెలిపారు.

ఆయన్ను కిడ్నాప్ చేసిన అనుమానితుడు అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ, అతన్ని అరెస్ట్ చేశారు.

ఆస్తి వారసత్వం విషయంలో వచ్చిన గొడవ కారణంగా తన సోదరుడిని ఆ వ్యక్తి కిడ్నాప్ చేశాడని ఒమర్‌ సోదరుడు సోషల్ మీడియాలో ఆరోపించారు.

ఈ వ్యవహారంపై విచారణ జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. ఒమర్‌కు వైద్య, మానసిక చికిత్సలను అందిస్తున్నారు.

ఈ నేరం చాలా దారుణమైందని ప్రాసిక్యూటర్ల ఆఫీసుకు చెందిన అధికార ప్రతినిధి చెప్పారు.

అప్పుడప్పుడు తన కుటుంబాన్ని చూసే అవకాశం ఇచ్చే వారని, కానీ, వారితో మాట్లాడేందుకు వీలుండేది కాదని అధికారులకు చెప్పారు బాధితుడు.

ఒక మాయాలోకంలో ఉన్నట్లు తనను నమ్మించేందుకు కిడ్నాప్ చేసిన వ్యక్తి ప్రయత్నించే వారని ఒమర్ చెప్పారు.

తన కొడుకు బతికున్నాడని, ఎప్పటికైనా తన దగ్గరకు వస్తాడని ఒమర్ తల్లి నమ్మేదని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు.

అయితే, ఒమర్ బతికున్నాడన్న విషయం తెలియకుండానే 2013లో ఆయన తల్లి మరణించినట్లు స్థానిక పత్రికలు చెప్పాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)