దభోల్కర్ హత్య కేసు: ఎన్నో మలుపులు తిరిగిన ఈ కేసులో ఇప్పటివరకు ఏం జరిగింది?

డాక్టర్ నరేంద్ర దభోల్కర్

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, డాక్టర్ నరేంద్ర దభోల్కర్
    • రచయిత, భాగ్యశ్రీ రౌత్
    • హోదా, బీబీసీ కోసం

సుమారు పదకొండేళ్ల కిందట పుణెలో జరిగిన ఓ ఘటన దేశాన్ని కుదిపేసింది.

అది 2013 ఆగస్టు 20వ తేదీ.

మహారాష్ట్ర హేతువాద ఉద్యమంలో ప్రముఖ కార్యకర్త, అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి వ్యవస్థాపకులు నరేంద్ర ధబోల్కర్‌ను ఆ రోజు పుణెలోని మహర్షి విఠల్ రామ్‌జీ శిందె వంతెన వద్ద కాల్చి చంపారు.

ఈ కేసులో పదకొండేళ్ల తర్వాత 2024 మే 10న తీర్పు వెలువడింది.

దభోల్కర్ హత్య కేసులో నిందితులు సచిన్ అందురే, శరద్ కలాస్కర్ దోషులుగా తేలింది.

వీరేంద్ర తావ్డే, న్యాయవాది సంజీవ్ పునలేకర్, విక్రమ్ భవేలను కోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.

అందురే, కలాస్కర్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష, ఐదు లక్షల జరిమానా విధించింది.

పుణె కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి పీపీ జాదవ్ ఈ తీర్పు వెలువరించారు.

కోర్టు తీర్పు అనంతరం డాక్టర్ నరేంద్ర దభోల్కర్ కుమారుడు హమీద్ దభోల్కర్ మీడియాతో మాట్లాడుతూ, ''కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అసలు హంతకులకు శిక్ష పడింది. మిగిలిన వారికి కూడా శిక్ష పడాలి. హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం'' అన్నారు.

''హత్య వెనక ఉన్న అసలు సూత్రధారులకు శిక్ష పడలేదు. హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం.'' అని దభోల్కర్ కుమారుడు అన్నారు.

దభోల్కర్ కుమార్తె ముక్తా దభోల్కర్ మాట్లాడుతూ, ''అసలు హంతకులకు కోర్టు శిక్ష విధించడం సంతృప్తినిచ్చింది. శిక్ష పడని ముగ్గురిపై హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్తాం. న్యాయం జరుగుతుందనే నమ్మకముంది'' అన్నారు.

''ఆ ముగ్గురిని ఏ ప్రాతిపదికన విడుదల చేశారో ఇంకా తెలియదు. ఎందుకంటే, తీర్పు కాపీ ఇంకా అందుబాటులోకి రాలేదు. కానీ కేసులో సంబంధం ఉన్నవారు 8 ఏళ్లు జైల్లో ఉండాలి. ఆ శిక్ష వారికి పడింది. వారికి శిక్ష పడేలా హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయిస్తాం.''

''దీని వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరో ఇంకా తేలలేదు. ఇందులో పెద్ద టెర్రర్ కుట్ర ఉందని సీబీఐ పేర్కొంది. వాళ్లెవరో సీబీఐ గుర్తించాలి.'' అన్నారామె.

నిందితుల తరఫు న్యాయవాది ప్రకాశ్ సల్శింగికర్ మాట్లాడుతూ, ''శరద్ కలాస్కర్, సచిన్ అందురేలకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. రూ.5 లక్షల జరిమానా కూడా విధించారు. జరిమానా చెల్లించకుంటే శిక్ష మరో ఏడాది పెరుగుతుంది. సాక్ష్యాధారాలు లేకపోవడంతో మిగిలిన ముగ్గురిని నిర్దోషులుగా విడుదల చేసింది.

ఈ కేసుకి సంబంధించి పుణె పోలీసులు, క్రైమ్ బ్రాంచ్, సీబీఐ వేర్వేరు వాదనలు చేశాయి. వారికి శిక్ష పడినప్పటికీ, తీర్పును గౌరవిస్తాం. తీర్పు కాపీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత హైకోర్టు, సుప్రీం కోర్టులను ఆశ్రయిస్తాం'' అన్నారు.

ఈ కేసులో ఇప్పటి వరకు చోటుచేసుకున్న పరిణామాలేంటో చూద్దాం.

బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు..

2013 ఆగస్టు 20న ఉదయం డాక్టర్ దభోల్కర్ వాకింగ్‌కి వెళ్లారు.

ఆయన బాలగంధర్వ రంగ్ మందిర్ వెనుక ఉన్న వంతెన వద్దకు చేరుకోగానే మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు ఆయనపై కాల్పులు జరిపారు.

ఆయన్ను హత్య చేసేందుకు నిందితులు అక్కడికి సమీపంలోనే వేచిచూస్తున్నట్లు భావిస్తున్నారు.

దభోల్కర్‌పై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు.

ఆ తర్వాత ఇద్దరు నిందితులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ హత్యపై మహారాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దభోల్కర్ హంతకులను అరెస్టు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది.

రాష్ట్రంలోని సామాజిక కార్యకర్తలు ''ఆమ్హీ సారే దభోల్కర్'' (అంటే, మనందరం దభోల్కర్‌లమే) అనే నినాదం మార్మోగింది.

దీంతో మహారాష్ట్రలో అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ - ఎన్సీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. పుణె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

దభోల్కర్ హత్య

ఫొటో సోర్స్, Getty Images

మొదటి అరెస్టు, కానీ..

మరుసటి ఏడాది 2014 జనవరిలో డాక్టర్ దభోల్కర్ హత్య కేసులో మొదటి అరెస్టు జరిగింది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధాల వ్యాపారి మనీశ్ నగోరి, అతని సహాయకుడు వికాస్ ఖండేల్‌వాల్‌లను పుణె పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ ఇద్దరి అరెస్టులు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. ఎందుకంటే, హత్య జరిగిన అదే రోజు, 2013 ఆగస్టు 20న సాయంత్రం 4 గంటలకు థానే పోలీసులు వారిని అరెస్టు చేశారు.

అయితే, ఈ హత్యతో సంబంధం లేని ఓ దోపిడీ కేసులో వారు అరెస్టయ్యారు. అది కూడా దభోల్కర్ హత్య జరిగిన కొద్దిగంటల్లోనే ఈ అరెస్టులు జరిగాయి.

2013 అక్టోబర్‌లో నగోరి, ఖండేల్‌వాల్‌లను మహారాష్ట్ర ఏటీఎస్ (యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్) కస్టడీలోకి తీసుకుంది. వారి నుంచి 40 అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.

ఈ తుపాకుల్లో ఒకదానిపై ఉన్న గుర్తులు, దభోల్కర్ హత్య జరిగిన ప్రదేశంలో స్వాధీనం చేసుకున్న క్యాట్రిడ్జ్‌‌తో సరిపోతున్నాయని ఏటీఎస్ స్పష్టం చేసింది.

ఈ సమాచారంతో పుణె పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

దభోల్కర్ హత్య కేసులో ఆరోపణలు రాకముందే, 2012లో పుణె యూనివర్సిటీలో జరిగిన ఓ సెక్యూరిటీ గార్డు హత్య కేసులో వారు అరెస్టైనట్లు రికార్డుల్లో ఉంది.

అయితే, 2014 జనవరి 21న ఈ కేసులో పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది.

దభోల్కర్‌ను తామే హత్య చేశామని ఒప్పుకోవాలంటూ ఏటీఎస్ చీఫ్ రాకేశ్ మారియా తమకు రూ.25 లక్షలు ఇచ్చారని వారు కోర్టులో చెప్పారు.

అయితే, తదుపరి విచారణలో అవి తప్పుడు ఆరోపణలని అంగీకరించారు.

పుణె పోలీసులు వారిద్దరిపై చార్జిషీట్ కూడా దాఖలు చేయలేదు, వారిద్దరికీ ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని తేలింది.

దీంతో కోర్టు నిందితులిద్దరినీ బెయిల్‌పై విడుదల చేసింది.

దభోల్కర్ హత్య

ఫొటో సోర్స్, Getty Images

కేసు పుణె పోలీసుల నుంచి సీబీఐ చేతికి..

పుణె పోలీసుల దర్యాప్తు ఎటూ తేలకపోతుండడంతో కేసును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్లు వచ్చాయి.

2014 జూన్‌లో కేసు విచారణను బాంబే హైకోర్టు సీబీఐకి అప్పగించింది.

ఆ తర్వాత రెండేళ్లకు, 2016 జూన్ 10న సీబీఐ ఈ కేసులో మొదటి అరెస్టు చేసింది.

సనాతన్ సంస్థతో సంబంధమున్న డాక్టర్, ఈఎన్‌టీ నిపుణులు డాక్టర్ వీరేంద్ర సింగ్ తావ్డేను అరెస్టు చేశారు.

గతంలో 2015లో, పన్సారే కేసులో తావ్డేను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

డాక్టర్ దభోల్కర్ హత్యకు ప్లాన్ చేయడంలో తావ్డే కీలకపాత్ర పోషించారని, సనాతన్ సంస్థ, మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన్ సమితి మధ్య వివాదమే ఈ హత్య వెనక ఉద్దేశమని సీబీఐ పేర్కొంది.

హత్యకు కుట్ర పన్నారంటూ తావ్డేపై 2016 సెస్టెంబర్ 6న చార్జిషీట్ దాఖలైంది.

అదే చార్జిషీట్‌‌లో, సనాతన్ సంస్థకు చెందిన సారంగ్ అకోల్కర్, వినయ్ పవార్ డాక్టర్ దభోల్కర్‌ను కాల్చిచంపారని సీబీఐ నిర్ధరించింది. వారు పరారీలో ఉన్నట్లు పేర్కొంది.

కొల్హాపూర్‌కి చెందిన హిందూ కార్యకర్త, లోహ కళాకారుడు సంజయ్ సద్విల్కర్ వాంగ్మూలం ఆధారంగా తావ్డే అరెస్టు జరిగింది.

తావ్డే, అకోల్కర్ 2013లో సద్విల్క్‌ర్‌ను కలిశారు. ఆయుధం సిద్ధం చేసేందుకు సాయం చేయాలని సద్విల్కర్‌ను తావ్డే కోరారు. అందుకోసం అకోల్కర్ దేశీ తుపాకులు, రివాల్వర్లను తీసుకొచ్చారు. దభోల్కర్‌ను చంపమని అకోల్కర్, పవార్‌కు తావ్డే చెప్పినట్లు చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొంది.

హత్య జరిగి రెండేళ్లు గడుస్తున్నా దర్యాప్తు మాత్రం నత్తనడకన సాగుతోందంటూ దభోల్కర్ కుటుంబం కోర్టును ఆశ్రయించింది.

పుణె పోలీసులపై విమర్శలు రావడంతో డాక్టర్ హమీద్ దభోల్కర్, ముక్తా దభోల్కర్ 2015లో బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు పర్యవేక్షణలో ఈ కేసు విచారణ జరగాలని తమ పిటిషన్‌లో వారు డిమాండ్ చేశారు. అనంతరం హైకోర్టు పర్యవేక్షణలో తదుపరి విచారణ జరిగింది.

ఈ కేసు దర్యాప్తు ఎనిమిదేళ్ల పాటు హైకోర్టు పర్యవేక్షణలో సాగింది. మొత్తం ఐదుగురు నిందితులపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయడంతో 2023 ఏప్రిల్‌లో హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు పర్యవేక్షణలో విచారణ సాగుతున్న సమయంలో ఐదేళ్ల తర్వాత సీబీఐ ఇద్దరు నిందితులను అరెస్టు చేసింది.

అయితే, చార్జిషీట్ దాఖలైన తర్వాత.. సీబీఐ దర్యాప్తుపై సందేహాలు తలెత్తాయి.

దభోల్కర్‌ను కాల్చి చంపింది సారంగ్ అకోల్కర్, వినయ్ పవారేనని సీబీఐ మొదట పేర్కొంది.

కానీ, 2018 ఆగస్టులో శరద్ కలాస్కర్, సచిన్ అందురేలను అరెస్టు చేసిన తర్వాత దభోల్కర్‌ను కాల్చి చంపింది వీరేనని చెప్పడంతో సీబీఐ దర్యాప్తుపై ప్రశ్నలు తలెత్తాయి.

దభోల్కర్ హత్య

ఫొటో సోర్స్, Getty Images

కలాస్కర్, అందురే అరెస్టు ఎలా?

గౌరీ లంకేశ్ హత్య కేసులో అరెస్టైన పరశురాం వాఘ్మరే దగ్గర దొరికిన క్లూతో కలాస్కర్, అందురే అరెస్టయ్యారు.

మహారాష్ట్ర ఏటీఎస్ 2018లో నలసోపరాలోని వైభవ్ రౌత్ ఇంటిపై దాడి చేసి రౌత్‌తో పాటు కలాస్కర్‌ను ఆయుధాలతో సహా అరెస్టు చేసింది.

విచారణలో దభోల్కర్ హత్యతో కలాస్కర్‌కు సంబంధం ఉందని తేలింది. కలాస్కర్‌ కూడా నేరాన్ని అంగీకరించారు.

ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ఔరంగాబాద్‌లో సచిన్ అందురేను అదుపులోకి తీసుకున్నారు. దభోల్కర్ హత్య కేసులో ఇది మూడో అరెస్టు.

చట్టప్రకారం అరెస్టు చేసిన మూడు నెలల్లోపు చార్జిషీట్ దాఖలు చేయాలి.

అయితే, కేసు సంక్లిష్టత కారణంగా సీబీఐ మరింత సమయం కావాలని కోర్టును కోరింది.

చివరికి, 2019 ఫిబ్రవరి 13న ఇద్దరు నిందితులపై చార్జిషీట్ దాఖలైంది. దభోల్కర్‌ను కలాస్కర్‌, అందురే కాల్చి చంపారని సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది.

దభోల్కర్ హత్య కోసం అందురేకి పిస్టల్, బైక్‌ను గౌరీ లంకేశ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమోల్ కాలే సమకూర్చినట్లు పుణె కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

అయితే, నిందితులు ఉపయోగించిన ఆయుధాలు ఎక్కడ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సీబీఐ మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. తుపాకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

2019 మే 26న ముంబయిలో సనాతన్ సంస్థకు చెందిన న్యాయవాది సంజీవ్ పునలేకర్, ఆయన సహచరుడు విక్రమ్ భవేలను సీబీఐ అరెస్టు చేసింది.

దభోల్కర్ హత్యకు ఉపయోగించిన పిస్టల్‌ను పారేయాలని శరద్ కలాస్కర్‌కు పునలేకర్ సలహా ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. ఆ తర్వాత కలాస్కర్‌ ఉద్దేశపూర్వకంగానే నాలుగు పిస్టళ్లను థానే వాగులో పారేశారు. అందుకోసం భవే ఆ ప్రాంతంలో రెక్కీ చేశారని తెలిపింది.

సీబీఐ కస్టడీ విచారణ అనంతరం, 2019 జూలై 5న పునలేకర్ బెయిల్‌పై విడుదలయ్యారు.

థానే వాగులో విసిరేసిన పిస్టల్ కోసం విదేశీ ఏజెన్సీల సాయంతో సీబీఐ సోదాలు నిర్వహించింది. అందుకోసం దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు వెచ్చించారు.

చివరికి, 2020 మార్చి 5న పిస్టల్‌ను కనుగొన్నట్లు సీబీఐ పేర్కొంది. ఈ పిస్టల్‌ని హత్యకు ఉపయోగించారా? లేదా? అనేది నిర్ధరించేందుకు ఫోరెన్సిక్‌, బాలిస్టిక్‌ పరీక్షలకు పంపించారు. నిపుణులు అందజేసిన నివేదికను సీబీఐ ఇంకా అధికారికంగా బహిర్గతం చేయలేదు.

కానీ, ఈ పిస్టల్ దభోల్కర్‌ను చంపడానికి ఉపయోగించింది కాదని బాలిస్టిక్స్ నిపుణులు పేర్కొన్నారంటూ జూలై 2021లో హిందుస్థాన్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

నిందితులను అరెస్టు చేసి, ఆయుధాల కోసం అన్వేషణ సాగిస్తూనే చార్జిషీట్ దాఖలు చేశారు. కానీ, నిందితులపై అభియోగాలను నిర్ధరించేందుకు తొమ్మిదేళ్లు పట్టింది.

దభోల్కర్ హత్య

ఫొటో సోర్స్, BBC/SHARAD BADHE

9 ఏళ్ల తర్వాత అభియోగాల నిర్ధరణ

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత 2021 సెప్టెంబర్ 15న దభోల్కర్ హత్య కేసులో ఐదుగురు నిందితులపై పుణె ప్రత్యేక కోర్టు అభియోగాలు మోపింది.

డాక్టర్ వీరేంద్ర సింగ్ తావ్డే, సచిన్ అందురే, శరద్ కలాస్కర్, విక్రమ్ భవేలపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) కింద హత్య, కుట్ర, ఆయుధాలకు సంబంధించిన సెక్షన్ల కింద అభియోగాలు మోపారు.

సాక్ష్యాలను నాశనం చేసినందుకు లేదా తప్పుడు సమాచారం అందించినందుకు సంజీవ్ పునలేకర్‌పై అదనంగా ఐపీసీ సెక్షన్ 201 కింద అభియోగాలు నమోదు చేశారు.

అయితే, నిందితులు కోర్టులో నేరాన్ని అంగీకరించలేదు.

ఐదుగురు నిందితులపై నేరాభియోగాల ఖరారు అనంతరం, 2021లో విచారణ ప్రారంభమైంది. విచారణలో మొత్తం 20 మంది సాక్షులను విచారించారు.

ఎవరెవరి వాంగ్మూలాలు నమోదు చేశారు?

దభోల్కర్ హత్య కేసులో ఆయన ఇంటి పక్కనే ఉండే అవినాశ్ ధావల్భక్త్ నుంచి మొదటి వాంగ్మూలం నమోదు చేశారు.

సదాశివపేట అమేయ్ అపార్ట్‌మెంట్స్‌లోని దభోల్కర్ నివాసం నుంచి పుస్తకాలు, డైరీలు, బట్టలు వంటి వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు ధావల్భక్త్ సాక్షిగా ఉన్నారు.

నిందితుడి తరఫు న్యాయవాదులు కూడా ఆయన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.

ఈ కేసులో పలువురు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన తర్వాత డాక్టర్ హమీద్ దభోల్కర్‌ను కూడా మరోసారి విచారించారు.

2022 జనవరి ఒకటిన దభోల్కర్ కుమారుడు హమీద్ దభోల్కర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆ సెషన్‌లో దభోల్కర్ పని, మతపరమైన సంస్థలు, బోగస్ వైద్యులపై ఫిర్యాదులు, వార్కారీ కమ్యూనిటీకి దభోల్కర్ మధ్య ఏదైనా వివాదం ఉండేదా అని నిందితుల తరఫు న్యాయవాది ప్రకాశ్ సల్శింగికర్ ఆయన్ను ప్రశ్నించారు.

తన తండ్రి పని గురించి తనకు పెద్దగా తెలియదని హమీద్ దభోల్కర్ పేర్కొన్నారు. ఆ తర్వాత వార్కారీ కమ్యూనిటీ వ్యతిరేకించిన మూఢనమ్మకాలు, చేతబడులకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్‌ను న్యాయవాది సల్శింగికర్ చదివి వినిపించారు.

దానికి డాక్టర్ హమీద్ స్పందిస్తూ, మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని వార్కారీ కమ్యూనిటీలోని కొందరు వ్యతిరేకిస్తున్నప్పటికీ, అది ఆ కమ్యూనిటీ మొత్తానికి వర్తించదని అన్నారు.

శ్యామ్ మానవ్‌కి, నరేంద్ర దభోల్కర్‌కి మధ్య విభేదాల గురించి అడిగినప్పుడు, ''అప్పట్లో నా వయస్సు కేవలం 7, 8 ఏళ్లు. అందువల్ల నాకు గుర్తులేదు. అయితే, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇద్దరూ కలిసే ఉండేవారు. వారి దారులు వేరు'' అని చెప్పారు.

దభోల్కర్ హత్య

దభోల్కర్ హత్య కేసు విచారణలో, 2022 మార్చి 19న సచిన్ అందురే, శరద్ కలాస్కర్‌ను ఒక సాక్షి గుర్తించారు.

దభోల్కర్‌పై అందురే, కలాస్కర్ కాల్పులు జరిపారని, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారని పుణె మున్సిపల్ కార్పొరేషన్‌ క్లీనర్ వాంగ్మూలం ఇచ్చారు.

నిందితుల తరఫు న్యాయవాది ఆ సాక్షిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.

సకల్ కథనం ప్రకారం, ''జైలులో నిర్వహించిన ఐడెంటిఫికేషన్ పరేడ్‌లో నిందితులను గుర్తుపట్టలేదు. అయితే, సీబీఐ అందురే, కలాస్కర్ ఫోటోలను చూపించడానికి ముందు, ఆయన వారి ఫోటోలను వార్తాపత్రికల్లో చూశారు'' అని సాక్షి కోర్టుకు చెప్పారు.

ఆ తర్వాత 2023 జనవరిలో, హత్య జరిగిన సమయంలో దక్కన్ పోలీస్ స్టేషన్‌‌ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న ఎంఎస్ జోషి కూడా సంఘటన జరిగిన రోజు ప్రధాన సాక్షి వినయ్ కేల్కర్ వాంగ్మూలం నమోదు చేసినట్లు కోర్టులో సాక్ష్యమిచ్చారు.

నిందితుడి తరఫు న్యాయవాదులు ఆయన్ను క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఆ సమయంలో ఫిర్యాదు చేసిన వ్యక్తికి తుపాకీ శబ్దం వినిపించిందా? అని ప్రశ్నించారు. అందుకు, వినిపించలేదు అని జోషి సమాధానమిచ్చారు.

అదే కేసులో, దభోల్కర్‌ను చంపడానికి ఉపయోగించిన ఆయుధానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం గురించి సీబీఐ మాజీ అధికారి ఇచ్చిన వాంగ్మూలం కూడా నమోదైంది.

2022 డిసెంబర్‌లో రిటైర్ అవ్వకముందు వరకూ సీబీఐ మాజీ అధికారి ఎస్‌ఆర్ సింగ్ దభోల్కర్ హత్య కేసు దర్యాప్తు కొనసాగించారు.

2023 సెప్టెంబర్‌లో ఆయన వాంగ్మూలాన్ని కోర్టు పరిశీలించింది, ఆ సమయంలో ఆయన దభోల్కర్ హత్యకు ఉపయోగించిన ఆయుధం గురించి కీలక సమాచారం బయటపెట్టారు.

దభోల్కర్ హత్యకు అవసరమైన ఆయుధాలు, బైక్‌లను జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య, కల్బుర్గి హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు, సనాతన్ సంస్థ సభ్యుడు అమోల్ కాలే సమకూర్చారని సింగ్ తెలిపారు.

2019లో చార్జిషీట్ వేసిన అనంతరం ఆయుధం కోసం గాలించినప్పటికీ, అది దొరకలేదు.

తమ ప్రయత్నాలు విఫలమయ్యాయని సింగ్ కోర్టుకు తెలియజేశారు. దానితో పాటు ఔరంగాబాద్‌లో సచిన్ అందురే పనిచేసే దుకాణం అటెండెన్స్ రిజిస్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సింగ్ తెలిపారు.

దభోల్కర్ హత్యకు ముందురోజు, తర్వాతి రోజు అతను విధులకు హాజరుకాలేదు.

కోర్టు విచారణకు సంబంధించిన ఈ వివరాలను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది.

దభోల్కర్ హత్య

కోర్టులో వాళ్లు ఏం చెప్పారు?

నిందితుల తరఫు న్యాయవాదులు నిందితుల సోదరీమణులను సాక్షులుగా కోర్టులో హాజరుపరిచారు.

2024 జనవరిలో శరద్ కలాస్కర్, సచిన్ అందురే సోదరీమణుల వాంగ్మూలం నమోదు చేశారు.

2013 ఆగస్టు 20న రక్షాబంధన్‌ అని, ఆ రోజు తమ సోదరులు తమతోనే ఉన్నారని వారు వాంగ్మూలం ఇచ్చారు. అయితే, సీబీఐ న్యాయవాది ప్రకాశ్ సూర్యవంశీ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.

ప్రశ్నలు అడిగే సమయంలో, మీ సోదరులు మీతో ఉన్నారని దర్యాప్తు సంస్థకు లేదా బాంబే హైకోర్టుకు తెలియజేశారా? అని ప్రశ్నించగా, వారు ప్రతికూలంగా స్పందించారు.

దీంతో వారు తమ సోదరులను రక్షించేందుకు తప్పుడు వాంగ్మూలం ఇస్తున్నారని సీబీఐ ఆరోపించింది. విచారణ సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది.

సాక్షులందరి వాంగ్మూలాలు నమోదు చేసి, క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత, చివరికి కేసు ముగింపు దశకు చేరుకుంది.

కోర్టులో సీబీఐ చివరి వాదనలు

2024 ఫిబ్రవరి 17న సీబీఐ తన తుది వాదనలను వినిపించింది.

ఆ సమయంలో దభోల్కర్ కుమారుడు డాక్టర్ హమీద్ దభోల్కర్, సామాజిక కార్యకర్త ప్రశాంత్ పొద్దార్, కొల్హాపూర్‌కి చెందిన వ్యాపారవేత్త సంజయ్ సద్విల్కర్‌ల వాంగ్మూలాలను సమర్పించారు.

ఈ సాక్ష్యాలు దభోల్కర్‌పై హిందూత్వ సంస్థలతో పాటు, నిందితుడు తావ్డేకి శత్రుత్వం ఉన్నట్లుగా సూచించాయి.

నిందితులిద్దరినీ ప్రత్యక్ష సాక్షులు గుర్తించారు. దానితో పాటు అందురే నేరాన్ని అంగీకరించాడని సీబీఐ వాదించింది.

దభోల్కర్ శరీరంపై పొడవాటి వెంట్రుకలు కనిపించాయని, సాక్ష్యులెవరికీ ఈ వివరాలు తెలియవని పేర్కొంది.

అయితే, క్రాస్ ఎగ్జామినేషన్ సమయంలో సీబీఐ కోర్టులో వాదించినట్లుగా అది జుట్టు కాదని, నల్లని దారమని తావ్డే గట్టిగా వాదించారు.

దభోల్కర్ మృతదేహాన్ని టెంపోలో నుంచి వంతెనపై పడేశారని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు.

అయితే, ''హత్య తూర్పు వైపు జరిగింది. టెంపో పడమర వైపు వెళ్లింది. అందువల్ల నిందితుల వాదన తప్పు, దభోల్కర్ హత్యలో వారి ప్రమేయాన్ని సూచిస్తోంది'' అని సీబీఐ వాదించింది.

సనాతన్ సంస్థకు చెందిన ఈ నిందితులకు కఠిన శిక్ష విధించాలని కోర్టును కోరింది. ఈ విషయాన్ని స్థానిక వార్తాపత్రికలు సకల్, పుధారి రిపోర్ట్ చేశాయి.

సీబీఐ తుది వాదనలు పూర్తయిన తర్వాత దభోల్కర్ కుటుంబం తరఫున న్యాయవాది ఓంకార్ నెవాగి ప్రత్యేక కోర్టులో లిఖితపూర్వక వాదనలు సమర్పించారు.

దభోల్కర్ హత్య కేసులో అరెస్టైన నిందితులపై ఆరోపణలు రుజువయ్యాయని, వారికి గరిష్ట శిక్ష విధించాలని అందులో కోరారు. డాక్టర్ దభోల్కర్ హత్య వెనుక ఉద్దేశం ఏమిటనే వివరాలు తమకు కూడా అందించాలని అభ్యర్థించారు.

సీబీఐ తుది వాదనలు పూర్తయిన తర్వాత, నిందితుల తరఫు న్యాయవాదులు తుది వాదనలు ప్రారంభించారు.

దభోల్కర్ హత్య

ఫొటో సోర్స్, NARENDRA DABHOLAKR'S THOUGHTS

డిఫెన్స్ లాయర్ల వాదనలేంటి?

నిందితుల తరఫు న్యాయవాది ప్రకాశ్ సల్శింగికర్ 2024 మార్చి 2న తన తుది వాదనలు ప్రారంభించారు. సీబీఐ దర్యాప్తు సరిగ్గా లేదని ఆరోపించారు.

''ఇతర కోణాల్లో విచారణ చేయకుండా కేవలం సనాతన్ సంస్థపైనే సీబీఐ దృష్టి పెట్టింది. దభోల్కర్ కాల్ రికార్డుల వివరాలను సీబీఐ అందించలేకపోయింది. ఇప్పుడు కూడా ఆయనకు చివరిసారిగా ఎవరు కాల్ చేశారనే విషయాన్ని వెల్లడించలేదు. డాక్టర్ దభోల్కర్ డైరీలోని ఆర్థిక లావాదేవీలను వారు విస్మరించారు'' అని ప్రశాశ్ సల్శింగికర్ ఆరోపించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ చేసింది.

2024 మార్చి 14న నిందితుల తరఫు న్యాయవాదులు తమ తుది వాదనలు వినిపించారు. రెండో నిందితుడి తరఫు న్యాయవాది ఇచ్చల్‌కరంజికర్ సీబీఐ విచారణపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

''దుండగులు దభోల్కర్‌ను వెనక నుంచి కాల్చితే, ఒక బుల్లెట్ ఆయన కనుబొమ్మలో నుంచి దూసుకెళ్లి తల వెనక భాగం నుంచి ఎలా బయటికొచ్చింది? దీనిపై సీబీఐ స్పష్టత ఇవ్వలేదు. నిందితుల ఐడెంటిఫికేషన్ పరేడ్ కూడా నిర్వహించలేదు. కేవలం సాక్షులు ఫోటోను గుర్తించడంపైనే సీబీఐ ఆధారపడింది. కానీ, సాక్షులు వారిని స్పష్టంగా గుర్తించలేదు.

సీబీఐ అన్నింటినీ సృష్టించింది. అలా సృష్టించిన పత్రాల ఆధారంగా సీబీఐ అందురే వాంగ్మూలం తీసుకుంది. ఖాళీ కాగితంపై అందురే సంతకం తీసుకుని తర్వాత దానిని వాంగ్మూలంగా పేర్కొన్నారు. శరద్ కలాస్కర్ విషయంలోనూ అదే జరిగింది. పోల్చిచూస్తే రెండూ ఒకేలా ఉంటాయి. పేర్లు మాత్రమే మారాయి'' అని ఇచ్చల్‌కరంజికర్ వాదనలు వినిపించారని లోక్‌మత్, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేశాయి.

హత్యకు ఉపయోగించిన తుపాకీని కలాస్కర్ ధ్వంసం చేసినట్లు సీబీఐ పేర్కొంది. ఆ తర్వాత థానే వాగులో తుపాకీని వెతకడానికి విదేశీ ఏజెన్సీల సాయంతో ప్రయత్నాలు జరిగాయి.

అయితే, అందులో కూడా సీబీఐకి విజయం దక్కలేదని నిందితుల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. వారు తమ చివరి వాదనల్లో దీనిని ప్రస్తావించారు.

ఇరుపక్షాల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి పి.పి.జాదవ్ తీర్పును రిజర్వ్ చేశారు.

హత్య జరిగిన పదకొండేళ్ల తర్వాత, మే 10న తీర్పు వెలువడనుంది. ప్రస్తుతం ఐదుగురు నిందితుల్లో పునలేకర్, భవే బెయిల్‌పై ఉండగా, శరద్ కలాస్కర్, సచిన్ అందురే, వీరేంద్ర తావ్డే జైల్లో ఉన్నారు.

కోర్టు తీర్పును రిజర్వ్ చేయడంతో ఈ కేసు గురించి వ్యాఖ్యానించేందుకు సీబీఐ తరఫు న్యాయవాది ప్రకాశ్ సూర్యవంశీ నిరాకరించారు. దభోల్కర్ ఫ్యామిలీ లాయర్ అభయ్ కూడా ఇప్పుడేమీ మాట్లాడలేనన్నారు.

నిందితుల తరఫు న్యాయవాది సల్శింగికర్ బీబీసీ మరాఠీతో మాట్లాడుతూ, ''కాల్పులు జరిపిన నిందితుల గురించి సీబీఐ మొదటి నుంచి మాటమారుస్తూనే ఉంది. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల్లో తేడాలున్నాయి. పెట్రోలింగ్ పోలీసులకు కూడా తుపాకీ కాల్పుల శబ్దం వినిపించలేదు. ఈ కేసులో 20 సాక్ష్యాలను పరిశీలించారు. కీలక సాక్షులను సీబీఐ కోర్టులో హాజరుపరచలేదు, అందువల్ల విచారణ ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా విడుదల చేయాలి'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)