వాయనాడ్: కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న 'ర్యాగింగ్' డెత్, రంగంలోకి దిగిన సీబీఐ

సిద్ధార్థ్
ఫొటో క్యాప్షన్, సిద్ధార్థ్ (ఫైల్)
    • రచయిత, ఎస్ ప్రశాంత్
    • హోదా, బీబీసీ తమిళ్ ప్రతినిధి

కేరళలోని వాయనాడ్ జిల్లా పూకోడ్‌లోని వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ వర్సిటీలో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఘటన యావత్ రాష్ట్రాన్ని కుదిపేసింది.

ఫిబ్రవరి 18న ఆ కళాశాలలోని హాస్టల్ టాయిలెట్‌లో సిద్ధార్థ్ (18) అనే విద్యార్థి శవమై కనిపించాడు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, కేసు దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటనకు పాలక కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘానికి (ఎస్‌ఎఫ్‌ఐ) చెందిన విద్యార్థులే బాధ్యులని, ప్రభుత్వం కేసును సరిగా విచారించకుండా దోషులను రక్షిస్తోందని సిద్ధార్థ్ తల్లిదండ్రులు జయప్రకాష్, షీబాలు ఆరోపించారు.

కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ను కలిసి, విచారణ బాధ్యతలను సీబీఐకి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు విద్యార్థి సిద్ధార్థ్ మృతిలో మిస్టరీ ఉందని, ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిరసనలు చేపట్టింది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. దీంతో సిద్ధార్థ్ మృతి ఎన్నికల సమయంలో కేరళలో చర్చనీయాంశమైంది.

సీబీఐ

ఫొటో సోర్స్, Getty Images

రంగలోకి సీబీఐ..

సీఎం పినరాయి ఆదేశాలతో పోలీసులు ఈ కేసును సీబీఐకి అప్పగించారు.

అంతకుముందు పోలీసులు దాఖలు చేసిన దర్యాప్తు రిపోర్టులో.. సిద్ధార్థ్ మరణానికి ముందు 29 గంటలపాటు నిరంతర వేధింపులు, దాడికి గురయ్యాడని తెలిపారు. అలాగే సిద్ధార్థ్‌పై దాడి జరిగినట్లు వైద్య పరీక్షల్లోనూ నిర్ధారణ అయింది.

ఫిబ్రవరి 16న ఉదయం 9 నుంచి ఫిబ్రవరి 17 మధ్యాహ్నం 2 వరకు, 29 గంటల పాటు తోటి విద్యార్థులు బెల్టులతో కొట్టారని తెలిపారు. చిత్రహింసలు జరిగిన రూం నంబర్, ప్రాంతాన్ని కూడా పోలీసులు నివేదికలో పేర్కొన్నారు.

కేసు విచారణ ప్రారంభించిన సీబీఐ అధికారులు, మూడు రోజుల క్రితం కాలేజీలో తనిఖీ చేశారు.

కేరళలో విద్యార్థి సిద్ధార్థ్ మృతి
ఫొటో క్యాప్షన్, విద్యార్థి సిద్ధార్థ్ మృతిలో మిస్టరీ ఉందని, ఆర్‌ఎస్‌ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిరసనలు చేపట్టింది

కాలేజీ డీన్ సస్పెన్షన్‌

ఈ కేసులో ఇప్పటివరకు 15 మందికి పైగా అరెస్టయ్యారు.

వర్సిటీ డీన్ ఎంకే నారాయణన్‌, హాస్టల్ వార్డెన్‌‌లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ కేరళ పశుసంవర్ధక శాఖ మంత్రి జె. చించురాణి ఉత్తర్వులు జారీ చేశారు.

''సిబ్బంది కొరతపై కళాశాల డీన్ సమాచారం ఇవ్వలేదు. హాస్టల్‌ నిర్వహణ సరిగా లేదు. కాలేజీ డీన్, హాస్టల్ వార్డెన్‌లు విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో వారిని తొలగించాం" అని మంత్రి చించురాణి మీడియాతో తెలిపారు.

ఎస్‌ఎఫ్‌ఐ పగ పెంచుకుంది: సిద్ధార్థ్ బంధువు సిబు

సిద్ధార్థ్‌ను ఎస్‌ఎఫ్‌ఐ సభ్యులే హత్య చేశారని సిద్ధార్థ్ బంధువు ఆరోపించారు.

"సిద్ధార్థ్ నా చెల్లెలు షీబా కొడుకు. కాలేజీలో ఎప్పుడూ ఉల్లాసంగా ఉండే సిద్ధార్థ్ ప్రకృతి ప్రేమికుడు, ఫోటోగ్రాఫర్. అది కూడా విశ్వవిద్యాలయం గుర్తించిన కళాశాల ఫోటోగ్రాఫర్" అని బీబీసీతో సిద్ధార్థ్ బంధువు సిబు అన్నారు.

"సిద్ధార్థ్ కాలేజీలో ఫస్టియర్ చదువుతున్నప్పుడే స్టూడెంట్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాడు. సెకండియర్‌లో సిద్ధార్థ్‌ను స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ)లో చేరమని కోరారు, దానికి అతను నిరాకరించాడు. అప్పటి నుంచి సిద్ధార్థ్ ఎదుగుదల చూసి ఎస్ఎఫ్ఐ సిద్ధార్థ్ పట్ల అసూయ, పగతో ఉంది. అందుకే అతన్ని తరచుగా ర్యాగింగ్‌ చేసేవారు" అని సిబు ఆరోపించారు.

ఎస్‌ఎఫ్‌ఐ ఏమంటోంది?

సిద్ధార్థ్ తల్లిదండ్రుల ఆరోపణలను ఎస్‌ఎఫ్‌ఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి అర్షో ఖండించారు.

''సిద్ధార్థ్ మృతికి మాకు ఎలాంటి సంబంధం లేదు. విచారణ పూర్తయ్యాక నిజానిజాలు బయటకు వస్తాయి’’ అని బీబీసీతో అర్షో అన్నారు.

సిద్ధార్థ్ మృతిపై మంత్రి చించురాణిని బీబీసీ వివరణ కోరింది.

''కాలేజీ డీన్, హాస్టల్‌ వార్డెన్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకున్నాం. సిద్ధార్థ్ కేసులో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు కాలేజీలు, హాస్టళ్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించాం'' అని చించురాణి తెలిపారు.

కేరళలో విద్యార్థి సిద్ధార్థ్ మృతి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ర్యాగింగ్ జరిగితే ఏం చేయాలి?

ర్యాగింగ్ నిరోధించడానికి, బాధితులను రక్షించడానికి ప్రతి కళాశాలలో ప్రిన్సిపల్ లేదా ఆయా విభాగాల అధిపతులు, ప్రొఫెసర్ల నేతృత్వంలో యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని భారత యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాలున్నాయి.

ర్యాగింగ్ బాధితులు ఆయా కళాశాలల్లోని ఈ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లో https://www.antiragging.in/ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయవచ్చు. లేకపోతే సహాయం కోసం టోల్-ఫ్రీ నంబర్ 1800 – 180 – 5522కి కాల్ చేయాలని యూజీసీ సూచించింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)