జార్జియా: ‘రష్యన్ చట్టం మాకొద్దు’ అంటూ వర్షంలో తడుస్తూ వేలమంది ఆందోళన.. అసలేంటీ వివాదం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహన్ దిమిత్రి,
- హోదా, బీబీసీ ప్రతినిధి
జార్జియా ప్రభుత్వం తీసుకొచ్చిన “ఫారెన్ ఇన్‌ఫ్లుయెన్స్” బిల్లుకు వ్యతిరేకంగా దేశ రాజధాని టిబ్లిసీలో వేలమంది ఆందోళనకు దిగారు.
జార్జియా, ఈయూ జెండాలను పట్టుకున్న ఆందోళనకారులు ‘రష్యన్ చట్టం వద్దు’ అని నినదిస్తూ టిబ్లిసీలోని యూరప్ స్క్వేర్ వైపు దూసుకువెళ్లారు.
విదేశీ నిధులతో నడుస్తున్న స్వచ్చంధ సేవా సంస్థలు, స్వతంత్ర మీడియాను లక్ష్యంగా చేసుకుని ఈ బిల్లుని తీసుకొచ్చినట్లు ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.
జార్జియాలో అధికారిక జార్జియన్ డ్రీమ్ పార్టీ ప్రభుత్వం నెల రోజుల క్రితం ఈ బిల్లును తీసుకువచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా భారీగా ఆందోళనలు జరుగుతున్నాయి.
శనివారం జరిగిన ప్రదర్శనలో పదుల కొద్దీ ఎన్జీవోల సభ్యులు, కార్యకర్తలు, ప్రతిపక్ష నాయుకులు పాల్గొన్నారు. ఆందోళనలు చేస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ వారు వెనక్కి తగ్గలేదు. భౌతిక దాడులు చేస్తామని భయపెట్టినా లొంగలేదు.
భారీ వర్షంలోనూ వేల మంది నిరసనకారులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ప్రదర్శన చేశారు.
ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లుని ‘రష్యన్ చట్టం’గా పిలుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతను అణచివేయడానికి రష్యా ప్రభుత్వం 2012లో ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చింది.
ఈ బిల్లు భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతమని అమెరికా అంటోంది.
జార్జియా పొరుగున ఉన్న రష్యాలో అధ్యక్షుడి నియంతృత్వ పోకడలన ప్రశ్నించిన కళాకారులు, మీడియా సంస్థలు, పౌర సంస్థలను అణచివేసేందుకు ఈ చట్టాన్ని ఉపయోగిస్తున్నారు.
రష్యా ఆధిపత్య నాయకత్వం తమ దేశంలోకి వస్తోందని, అలాంటి పాలకులు తమకు అవసరం లేదని ఆందళనకారులు అంటున్నారు.
“మేము తిరిగి సోవియట్ యూనియన్‌లోకి వెళ్లాలనుకోవడం లేదు” అని 38 ఏళ్ల జార్జియన్ లాంగ్వేజ్ టీచర్ లెలా టిక్లౌరి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
యూరోపియన్ భవిష్యత్‌పై జార్జియన్ల ఆశలు
“మేము మా యూరోపియన్ భవిష్యత్‌ను, స్వేచ్చను కాపాడుకుంటున్నాం” అని మరో ఆందోళనకారుడు మరియం మెన్జింయా చెప్పారు. ఆయన ఓ జర్మన్ సంస్థలో పని చేస్తున్నారు.
ఈ బిల్లు అమల్లోకి వస్తే యూరోపియన్ యూనియన్‌లో చేరాలనకుంటున్న జార్జియన్ల ఆశలకు కళ్లెం పడినట్లేనని ఆందోళన పెరుగుతోంది.
ఈ బిల్లుని పునః సమీక్షించాలని నోర్డిక్, బాల్టిక్ దేశాల విదేశాంగమంత్రులు జార్జియా ప్రభుత్వాన్ని కోరారు.
జార్జియా ప్రజలు “యూరోపోయన్ భవిష్యత్” కోరుకుంటున్నారని గతవారం, ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డర్‌లియన్ అన్నారు.
“జార్జియా క్రాస్‌రోడ్స్ మధ్యలో ఉంది. అది యూరప్ వైపు వెళ్లే రోడ్డు వైపు తన మార్గం వైపు స్థిరంగా ఉండాలి” అని ఆమె ‘ఎక్స్’లో పోస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
బిల్లును సమర్థించుకుంటున్న ప్రభుత్వం
అయితే, జార్జియా ప్రభుత్వం మాత్రం ఈ బిల్లును సమర్థించుకుంటోంది. దీన్ని వల్ల ఎన్జీవోలకు వచ్చే నిధుల్లో ‘పారదర్శకత’ పెరుగుతుందని చెబుతోంది. ఈ బిల్లును మే మధ్యలో చట్టంగా మార్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఈ చట్టం అమల్లోకి వస్తే, ఏదైనా స్వచ్చంధ సంస్థ లేదా మీడియా సంస్థకు వచ్చే ఆదాయంలో విదేశీ నిధుల వాటా 20 శాతం దాటితే, దాన్ని విదేశీ ప్రయోజనాల కోసం పని చేస్తున్న సంస్థగా రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది.
అయితే ఈ చట్టాన్ని ఉపయోగించి వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటరీ ఎన్నికల్లో విమర్శకుల గొంతు నొక్కేస్తారని ఆందోళనకారులు భయపడుతున్నారు.
ఈ బిల్లు చట్టంగా మారేందుకు అవసరమైన రెండో దశను దాటింది. రెండో దశలో భాగంగా పార్లమెంటులో జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా 83 వ్యతిరేకంగా 23 ఓట్లు వచ్చాయి. మూడో దశలో భాగంగా దీనిపై అధ్యక్షురాలు సలోమ్ జురబిష్విలి సంతకం చేయాల్సి ఉంటుంది. అయితే ఆమె ఈ బిల్లుని వీటో చేస్తానని ఇప్పటికే చెప్పారు.
అధ్యక్షురాలు బిల్లుని తిరస్కరిస్తే ఆమెను తొలగించేందుకు అధికార జార్జియన్ డ్రీమ్ పార్టీకి పార్లమెంట్‌లో అవసరమైనంత బలం ఉంది.
2023లోనూ ఇలాంటి బిల్లును తీసుకు వచ్చేందుకు జార్జియన్ డ్రీమ్ పార్టీ చేసిన ప్రయత్నాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళనలు జరగడంతో ప్రభుత్వం వెనకడుగు వేసింది.
ఇవి కూడా చదవండి:
- హెచ్డి దేవేగౌడ: అన్నం లేక పస్తులున్న రోజుల నుంచి ప్రధానమంత్రి పదవి దాకా.
- దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం భయంతో ఎందుకు అన్నీ సర్దుకుంటున్నారు?
- లోక్‌సభ ఎన్నికలు: ఒకనాడు 400కు పైగా స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 300 స్థానాలలో మాత్రమే ఎందుకు పోటీ చేస్తోంది?
- 4.7 కోట్ల ఏళ్లనాటి వాసుకి పాము అవశేషాలు వెలుగులోకి.. అసలేంటి ఈ పాము కథ?
- అడాల్ఫ్ హిట్లర్ కోసం ఆ మహిళలు కన్న వేలమంది ‘ఆర్య పుత్రులు’ ఏమయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














