లోక్‌సభ ఎన్నికలు: ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి గుర్తింపు పెరిగినా రాజకీయాల్లో మాత్రం వారు ఎందుకు కనిపించడం లేదు

ఎల్‌జీబీటీక్యూ భారతీయులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జోయా మటీన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తానొక ఇంద్రధనుస్సు లాంటి దానినని మధు బాయి చెప్పారు. ఒక తుపాను నుంచి పుట్టి, ప్రజలకు ఎక్కడలేని సంతోషాన్ని నింపి, తిరిగి ఆకాశంలోకి వచ్చినట్లు చెప్పారు.

మధు బాయి 2015లో భారత్‌లో మేయర్‌గా ఎన్నికైన తొలి ట్రాన్స్‌జెండర్ వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

చత్తీస్‌గఢ్‌లోని చిన్న పట్టణం రాయ్‌గఢ్‌‌కు ఆమె మేయర్ అయ్యారు. 2020లో తన పదవీ కాలం ముగియడంతో, తిరిగి పాత జీవితంలోకి వచ్చేశారు. ఎలాంటి పెన్షన్‌ను లేదా ప్రభుత్వ ప్రయోజలను పొందడం లేదు.

భారత్‌లో ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఉపాధిగా ఉండే పెళ్లిళ్లు, పుట్టిన రోజు వేడుకల్లో ఇతర హిజ్రాలు లేదా ట్రాన్స్ మహిళలతో కలిసి ఆమె డ్యాన్స్ చేస్తున్నారు. పాటలు పాడుతున్నారు.

తిరిగి రాజీకీయాల్లో వచ్చే ఉద్దేశ్యం తనకు లేదన్నారు మధు బాయి.

తాను చాలా అలసిపోయానని, ఈ ప్రపంచం పోలరైజ్డ్‌గా మారినట్లు భావిస్తున్నానని చెప్పారు.

‘‘పోరాడాను. గెలిచాను. ప్రజల కోసం పనిచేశాను. ఇక ఇప్పుడు నాకోసం నేను జీవించాలనుకుంటున్నా’’ అని మధు బాయి తెలిపారు.

ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ ఇంకా తీవ్ర అణచివేతకు గురవుతున్న నేటి కాలంలో మధు స్వల్పకాలమే పనిచేసినప్పటికీ, విజయవంతంగా రాజకీయ రంగ ప్రవేశం చేయడం అరుదు.

ప్రజాస్వామ్యంలో లింగ వైవిధ్యాన్ని అంగీకరించడం పెరుగుతోందని కార్యకర్తలు అంటున్నారు.

రాయ్‌గఢ్ నగరానికి 2015లో మేయర్‌గా ఎంపికైన మధు బాయ్

ఫొటో సోర్స్, Madhu Kinnar

ఫొటో క్యాప్షన్, రాయ్‌గఢ్ నగరానికి 2015లో మేయర్‌గా ఎంపికైన మధు బాయి

2014లో సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్ వ్యక్తులను, సంక్షేమం, ఇతర ప్రభుత్వ ప్రయోజనాల కోసం వారి హక్కులను అధికారికంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది.

ట్రాన్స్‌జెండర్లు కూడా భారతీయ పౌరులేనని, వారికి కూడా ఎదిగేందుకు సమాన అవకాశాలను ప్రభుత్వం కల్పించాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

ఆ తర్వాత నాలుగేళ్లకు గే సెక్సుపై ఉన్న వలసవాద కాలంనాటి నిషేధాన్ని రద్దు చేసింది.

స్వలింగ వివాహాలను చట్టబద్ధమైనవిగా గుర్తించాలని కూడా ఈ కార్యకర్తలు కోరారు. కానీ, స్వలింగ వివాహాలను చట్టబద్ధమైనవిగా గుర్తించడం పార్లమెంట్, రాష్ట్ర శాసన సభల పని అని సుప్రీంకోర్టు తెలిపింది.

స్వలింగ సంపర్కుల వివాహాలను చట్టబద్ధం చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై గత ఏడాది తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాలను మార్చడం రాజకీయ నాయకుల విషయమని, న్యాయ వ్యవస్థకు దీనితో సంబంధం ఉండదని తెలిపారు.

రాజకీయ నాయకులే తమ కమ్యూనిటీకి అసలైన న్యాయవాదులని ఎల్‌జీబీటీక్యూ క్యాంపెయినర్లు అంటున్నారు.

అయితే, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో, ఏ ప్రధాన రాజకీయ కూడా ఎల్‌జీబీటీక్యూ అభ్యర్థిని పోటీలో నిలబెట్టలేదు.

‘‘క్వీర్ కమ్యూనిటీ గురించి ఎవరూ మాట్లాడటం లేదు. ఎంతో కాలంగా వారికి రాజకీయాలు ఒక వేదికగా ఉండటం లేదు’’ అని పింక్ లిస్ట్ ఇండియా వ్యవస్థాపకులు, రచయిత అనీష్ గవాండే చెప్పారు.

ఈ సంస్థ ఎల్‌జీబీటీక్యూ ప్లస్ హక్కులకు మద్దతిచ్చే రాజకీయ నాయకుల పేర్ల జాబితాను తయారు చేస్తోంది.

‘‘వారి డిమాండ్లను నెరవేర్చుకునేందుకు అవసరమైన విధానాలను అభివృద్ధి చేసుకునేందుకు వారికసలు అవకాశమే దక్కలేదు’’ అని తెలిపారు.

మధు కంటే ఎవరికీ ఎక్కువగా దీని గురించి తెలియదు. తేలికగా తనతో కలిసిపోయిన ఓటర్లను ఆకర్షించడం కంటే ప్రత్యర్థుల తిరస్కారాలను, వెక్కిరింతలను ఎదుర్కొనడం చాలా సవాలుతో కూడుకున్న విషయమని ఆమె చెప్పారు.

పలు రోజుల పాటు తన స్నేహితులతో కలిసి ఇంటింటికి వెళ్లి, క్యాంపెయిన్ కోసం డబ్బులు అడిగిన తర్వాత, ఆమెకు పార్టీ టిక్కెట్ లభించడం కష్టమైంది.

ఎల్‌జీబీటీక్యూ ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

భారత్‌లో ఎన్నికలు ఎంతో ఖర్చుతో కూడుకున్నవి. ఏ రాజకీయ పార్టీ నిధులు లేకుండా స్వతంత్రంగా బరిలోకి దిగడం కాస్త కష్టమే.

కానీ, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ఆమెను తిరస్కరించిన తర్వాత, ఒంటరిగా బరిలోకి దిగడమే తప్ప, ఎటువంటి ఆప్షన్ లేకుండా పోయింది.

ఆమె గెలిచిన తర్వాత, లీడర్లు తనను సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెడతారని మధు భావించారు. కానీ, అలా జరగలేదు. ఆమె తొలి సమావేశంలోనే, చాలా పార్టీల సభ్యులు బయటికి వెళ్లిపోయారు.

ఆమె డ్యాన్స్ వీడియోలు అసభ్యకరంగా ఉన్నట్లు గుర్తించడంతో స్థానిక నేత తనను కొడతానని బెదిరించినట్లు మధు ఆరోపించారు.

పార్టీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన మహిళల వాష్‌రూమ్‌ను వాడుకోవచ్చా లేదా అనే విషయంలో ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయని మధు గుర్తుకు తెచ్చుకున్నారు.

‘‘ప్రజలు నన్ను, నా పనిని ఆదరించారు, ప్రేమించారు. కానీ, ప్రత్యర్థులు నా ధైర్య సాహసాలను ద్వేషించారు. వెక్కిరింతలు, అవహేళనలతో పాటు, ఒక హిజ్రా మేయర్ ఎలా అయింది? అని ప్రతి ఒక్కరూ అనుకున్నట్లు నాకు తెలుసు’’ అని చెప్పారు.

అధికారిక గణాంకాల ప్రకారం భారత్‌లో ఎల్‌జీబీటీక్యూ జనాభా 25 లక్షలుగా ఉంటుందని అంచనా. కానీ, అసలు సంఖ్య 13.5 కోట్లకు పైనేనని పలు సర్వేలు అంచనా వేస్తున్నాయి.

మధు గెలిచినప్పటి నుంచి పలు విషయాల్లో మార్పులు వచ్చినట్లు క్యాంపెయినర్లు అన్నారు.

ఒకప్పుడు ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీని ఏ మాత్రం పట్టించుకోని కొందరి రాజకీయ నేతలు ప్రస్తుతం వారికి దగ్గరవుతూ, మరిన్ని హక్కులు కల్పిస్తామంటూ వాగ్దానాలు చేస్తున్నారు.

‘‘భారత్‌లో రాజకీయ పార్టీలు నెమ్మదిగా మూసధోరణి నుంచి బయటికి వస్తూ.. ఎల్‌జీబీటీక్యూ హక్కుల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాయి’’ అని భారత్‌లో తొలిసారి బహిరంగంగా తాను గే అని ప్రకటించుకున్న రాజకీయ నేతలలో ఒకరైన హరీష్ అయ్యర్ చెప్పారు.

స్వలింగ వివాహాల చట్టబద్ధత అంశం తమ పరిధిలోనిది కాదని, ఆ పని చట్టసభలు చేస్తాయని సుప్రీంకోర్టు ప్రకటించిన తర్వాత కొన్ని నెలల్లోనే భారత్‌లో ఎన్నికల ప్రచారాలు మొదలయ్యాయి.

మూడు విపక్ష పార్టీలు స్వలింగ సంపర్కుల వివాహాలకు గుర్తింపును ఇస్తామంటూ వాగ్దానం చేయగా....పాలక పార్టీ బీజేపీ మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఎల్‌జీబీటీక్యూ సంబంధాలను గుర్తించడం, ట్రాన్స్‌జెండర్ ప్రజల జీవితంలో స్థిరపడేలా చర్యలు తీసుకోవడం, వైద్య సంరక్షణ పథకాలకు యాక్సెస్ కల్పించడం భవిష్యత్‌లో జరగొచ్చని గవాండే అన్నారు.

గ్రేస్ భాను
ఫొటో క్యాప్షన్, గ్రేస్ భాను

‘‘కుల కోణంలో కూడా ఎల్‌జీబీటీక్యూ ఆందోళనలను చూడాల్సి ఉంది’’ అని తమిళనాడుకు చెందిన దళిత ట్రాన్స్‌ ఉమెన్ యాక్టివిస్ట్ గ్రేస్ భాను చెప్పారు.

పేద కుటుంబంలో పుట్టిన గ్రేస్ భాను, తొలుత కులం విషయంలో వివక్షను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత జెండర్ పరంగా కూడా హేళనకు గురయ్యారు.

14 ఏళ్ల వయసప్పుడు ఆమె జెండర్ బయటికి తెలియడంతో, తరగతులకు హాజరు కాకుండా స్కూల్ నుంచి గ్రేస్ భానును బహిష్కరించారు.

ఆమెను చెట్టు కింద కూర్చోమని పనిష్‌మెంట్ ఇచ్చారు. ఆమె దీనిని వ్యతిరేకించడంతో, అనారోగ్యం వచ్చిందంటూ, దాన్ని నయం చేయించేందుకు సైకియాట్రిక్ హాస్పిటల్‌లో చేర్పించారు గ్రేస్ భాను తల్లిదండ్రులు.

‘‘ఇది నా తలరాత కాదు అని నాకు నేను చెప్పుకున్నా. ఒక రోజు నా తలరాతను నేను తీర్చిదిద్దుకోవడం కోసం దూరంగా పరిగెత్తాల్సి వస్తుంది’’ అని తెలిపారు.

ఇవాళ గ్రేస్ భాను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. తన రాష్ట్రంలో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన తొలి ట్రాన్స్ ఉమెన్ ఆమె. 12 మంది ట్రాన్స్ ఉమెన్‌లకు తల్లిగా ఆమె తనను భావిస్తారు.

మరో ముగ్గురు ట్రాన్స్ ఉమెన్‌తో కలిసి చెన్నైలో ఆమె నివసిస్తున్నారు. వారందరూ కూడా కుల వ్యతిరేక, ట్రాన్స్ హక్కుల ఉద్యమంలో పాలుపంచుకున్న వారే.

ఒకే రూమ్‌లో నివసిస్తూ, వారి జీవితాలను ఎలా మెరుగుపరుచుకోవాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు.

ఒక క్షణంలో వారు తర్వాత జరగబోయే కోర్టు పోరాటం గురించి మాట్లాడుకుంటే, తర్వాత నిమిషంలో లంచ్‌లో ఏం తినాలని ఆలోచిస్తారు.

ఎంతో కాలంగా వెనుకబడిన వర్గాలకు ఇస్తున్న ప్రస్తుత కోటాలలోనే ప్రభుత్వ ఉద్యోగాలలో ట్రాన్స్‌జెండర్ ప్రజలకు ప్రత్యేక కోటాలో లేదా హారిజాంటల్ రిజర్వేషన్లు కల్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

అప్సరా రెడ్డి

ఫొటో సోర్స్, Twitter@talktoapsara

ఫొటో క్యాప్షన్, అప్సరా రెడ్డి

మరోవైపు చెన్నై బీచ్‌కు సమీపంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో అప్సరా రెడ్డి నివసిస్తున్నారు. ట్రాన్స్‌ ఉమెన్ అయిన అప్సరా రెడ్డి తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటైన ఏఐఏడీఎంకేకు అధికార ప్రతినిధి.

ఆస్ట్రేలియా, బ్రిటన్‌ల నుంచి డిగ్రీలు పొందిన అప్సరా రెడ్డి, మాజీ జర్నలిస్ట్ కూడా.

అప్సరా రెడ్డి జీవితం చాలా లగ్జరీగా ఉండేది. వెండి రంగులో మెరిసే జాగ్వార్‌ను ఆమె నడిపేవారు. సిల్క్ చీరలనే ఆమె కట్టుకునే వారు.

‘‘రాజకీయాలను చాలా పెద్ద కోణంలో చూడాల్సి ఉంటుంది. కేవలం మీ సొంత కమ్యూనిటీకే మీరు స్వరం కాకూడదు’’ అని అప్సరా రెడ్డి అన్నారు.

ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, ఒకవేళ పోటీలోకి దిగితే ఆమె పార్టీపై ఎల్‌జీబీటీక్యూ అనే ముద్ర పడకూడదని కోరుకుంటున్నారు.

‘‘మీరు నన్ను విమర్శించాలనుకుంటే, కేవలం విధాన రూపకర్తగా నా సామర్థ్యాలను ఆధారంగా చేసుకుని విమర్శించండి. నా జెండర్ ఐడెంటిటీ ద్వారా కాదు’’ అని గట్టిగా చెప్పారు.

అప్సరా లాగా ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీలో కొందరు బయటికి వస్తూ, రాజకీయాల్లో సొంతంగా తమ జీవితాన్ని వెతుక్కుంటున్నారని కార్యకర్తలు చెప్పారు.

ఎల్జీబీటీక్యూ

ఫొటో సోర్స్, Getty Images

చాలాకాలం పాటు ఈ కమ్యూనిటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని గవాండే అన్నారు.

ప్రస్తుతం కమ్యూనిటీ క్షేతస్థాయిలో రాజకీయ కార్యకలాపాలపై దృష్టిపెట్టాలని ఆయన కోరుకుంటున్నారు. అప్పుడే ఎల్‌జీబీటీక్యూ సమస్యలపై స్వరాలు వినిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు.

ప్రస్తుతం బంతి దేశ నేతల చేతిలో ఉందని అయ్యర్ అన్నారు.

‘‘మేం మీ స్నేహితులం, మీ కుటుంబ సభ్యులం, కస్టమర్లం, లబ్దిదారులం. మేం ప్రతి దగ్గరా ఉన్నాం. మీరు మమ్మల్ని చూడలేదు. మమ్మల్ని పిలిస్తే, మీ దగ్గరకు వస్తాం. ఇదే రాజకీయ పార్టీల నుంచి మేం కోరుకుంటున్నది’’ అని అయ్యర్ తెలిపారు.

ఫిక్స్‌డ్ జీతం అంటూ లేకపోవడంతో కొన్నిసార్లు బతకడం కష్టమవుతుందని మధు బాయి అన్నారు. ప్రస్తుతం తాను అనుభవించిన జీవితాన్ని చూస్తే, మున్ముందు ఏం జరుగుతుందోనన్న భయం లేదన్నారు.

తమ కమ్యూనిటీలో ఇతరులు ముందుకు వచ్చి రాజకీయ అవకాశాలను వెతుక్కుంటే, క్వీర్ ప్రజలు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోరని ఆమె భావిస్తున్నారు.

‘ఎవరికి తెలుసు, దేశం మళ్లీ ఇంధ్రదనుస్సును చూడొచ్చు’ అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)