ఒక ముస్లిం ఈ దేశంలో స్వలింగ సంపర్కుడిగా బతకడం ఎందుకంత కష్టం?

ఫొటో సోర్స్, Getty Images
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించే దిశగా థాయ్‌లాండ్ చర్యలు చేపట్టింది. ఇది ఒక చారిత్రక మార్పుగా భావిస్తున్నారు.
థాయ్‌లాండ్‌లోని ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు, ఇంకా చాలాదూరం వెళ్లాల్సి ఉందని వారు బీబీసీతో అభిప్రాయం పంచుకున్నారు.
దక్షిణ థాయ్‌లాండ్‌లోని యాలా నగరానికి చెందిన అలీఫ్ అనే స్వలింగ సంపర్కుడు బీబీసీతో మాట్లాడుతూ “నేను బిల్లుకు మద్దతిస్తున్నా, నాకూ ఒక కుటుంబం ఉంటుంది. అప్పుడు నేను బయటకు వెళ్లి వేరే చోట బతుకుతాను''అని అన్నారు.
అలీఫ్ స్వలింగ సంపర్కుడని కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలుసు, అయితే, అలీఫ్ తన 'గే' స్నేహితుడిని కుటుంబానికి ఇంకా పరిచయం చేయలేదు.
తన లైంగికతపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అలీఫ్ అంటున్నారు, తన గుర్తింపును వెల్లడించవద్దని అభ్యర్థించారు.

ఫొటో సోర్స్, Getty Images
ముస్లింల ప్రాబల్యం..
25 ఏళ్ల అలీఫ్ నివసించే దక్షిణ ప్రావిన్సులో ముస్లింల జనాభా అధికం. థాయ్‌లాండ్‌లోని దక్షిణ ప్రాంత వ్యవహారాలు ఒక ముస్లిం నాయకుడి చేతిలో ఉన్నాయి. మలయ్ ముస్లింలు ఇక్కడ ఎక్కువగా ఉంటున్నారు. ఈ భాగం 20వ శతాబ్దం ప్రారంభంలో థాయిలాండ్‌లో చేరింది. ఇప్పుడు థాయ్‌లాండ్‌లో ఎక్కువ మంది బౌద్ధమతాన్ని అనుసరిస్తున్నారు.
తను సాధారణ ముస్లింల మాదిరే దుస్తులు ధరిస్తానని, మాట్లాడుతానని అలీఫ్ అంటున్నారు. తన గురించి తెలిస్తే, తన కమ్యూనిటీ తనను దూరం చేస్తుందని అలీఫ్ భయపడుతున్నారు.
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చే బిల్లును థాయ్‌లాండ్ పార్లమెంట్ దిగువ సభ ఇటీవల ఆమోదించింది.
ఈ బిల్లు ఇంకా సెనేట్‌లో ఆమోదం పొందాల్సి ఉంది. అనంతరం రాజకుటుంబం అనుమతి పొందిన తర్వాత చట్టంగా మారనుంది.
'జంతువులతో పోల్చుతారు'
అయితే, ఇది 2024 చివరి నాటికి చట్టం రూపంలోకి మారుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే, స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన ఏకైక ఆగ్నేయాసియా దేశం థాయ్‌లాండ్ కానుంది.
''కొత్త చట్టం ముస్లింలకు వివాహం చేసుకునే హక్కును కల్పిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో జరిగే వాటిపై సందేహముంది. ఇస్లామిక్ ఆచారాల ప్రకారం కొంతమంది ముస్లింలు గే వివాహం అనుమతించకపోవచ్చు'' అని బీబీసీతో స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన దిగువ సభ కమిటీలో సభ్యురాలు నైనా సుపాపుంగ్ తెలిపారు.
మరోవైపు, తను నివసించే ప్రాంతంలోని ప్రజలు స్వలింగ సంపర్కుల వివాహాన్ని స్వాగతిస్తారని భావించడం లేదని అలీఫ్ అంటున్నారు.
"మసీదులో శుక్రవారం ప్రార్థనల తర్వాత, ప్రజలు స్వలింగ సంపర్కులను జంతువులతో పోల్చుతూ మాట్లాడుకోవడం విన్నాను. ఆ ద్వేషపూరిత వ్యాఖ్యలు విని ఆందోళన కలిగింది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ చట్టంతో కొత్తగా వచ్చే ఇతర ప్రయోజనాలేంటి?
పార్లమెంట్ దిగువ సభలోని మొత్తం 415 మంది సభ్యుల్లో 400 మంది బిల్లును ఆమోదించారు. ఈ బిల్లు ప్రకారం, వివాహం అనేది స్త్రీ, పురుషుడు కాకుండా ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం.
దీంతో ఎల్జీబీటీక్యూ+ జంటలు కూడా పెళ్లి చేసుకునే హక్కును పొందుతారు. వారసత్వంగా వచ్చే ఆస్తిపై కూడా వారికి హక్కు ఉంటుంది.
ఒకవేళ వారి భాగస్వామి వికలాంగులైతే వైద్య చికిత్స కోసం సమ్మతి తెలిపే హక్కు కూడా వస్తుంది.
బిల్లు చట్ట రూపంలోకి మారితే వివాహిత స్వలింగ జంటలు పిల్లలను దత్తత తీసుకోవచ్చు.
అయితే "ఫాదర్, మదర్" అనే పదాలకు బదులుగా 'పేరెంట్స్' అనే పదాన్ని ఉపయోగించాలన్న కమిటీ సూచనను పార్లమెంట్ 'దిగువ సభ' ఆమోదించలేదు.
థాయ్‌లాండ్‌లో ఇప్పటికే 'సెక్సువల్ ఓరియెంటేషన్, సెక్సువల్ జెండర్ (ఎస్‌వోజీఐ)' నిషేధించే చట్టాలున్నాయి.
అందుకే ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీకి ఆసియాలోని అత్యంత స్నేహపూర్వక దేశాలలో థాయ్‌లాండ్‌ను పరిగణిస్తున్నారు.
అయితే స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టపరంగా గుర్తింపు రావడానికి చాలా ఏళ్లు పట్టింది.
విస్తృతంగా ప్రజల మద్దతు ఉన్నప్పటికీ, స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి గతంలో చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.
గత ఏడాది చివర్లో నిర్వహించిన ప్రభుత్వ సర్వేలో 96.6 శాతం మంది బిల్లుకు అనుకూలంగా ఉన్నట్లు తేలింది.
కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీని ఆదరించే దేశంగా థాయిలాండ్ స్థానం బలోపేతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
“ఇది సమానత్వానికి నాంది. ఇది ప్రతి సమస్యకు పరిష్కారం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా సమానత్వం వైపు వేసే మొదటి అడుగు'' అని పార్లమెంట్‌లో ఈ బిల్లును సమర్పిస్తూ 'దిగువ సభలో గే వివాహాలపై కమిటీ' ఛైర్మన్ డానుఫోర్న్ పున్నకాంత అన్నారు.
"మేం వారికి కొత్త హక్కులను ఇవ్వడం లేదు, ఈ చట్టం ద్వారా వారి హక్కులను తిరిగి ఇవ్వాలనుకుంటున్నాం" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ముస్లింలలో సందేహాలెందుకు?
ప్రతిపాదిత చట్టం ఈ ప్రాంతంలో మార్పును కలిగిస్తుందని దక్షిణ థాయ్‌లాండ్‌లోని సాంగ్‌క్లా నగరంలో జన్మించిన 27 ఏళ్ల ముస్లిం వ్యక్తి నమ్మడం లేదు. ఆ వ్యక్తి కూడా స్వలింగ సంపర్కుడే.
ఈ వ్యక్తి తన గుర్తింపును వెల్లడించడానికి ఇష్టపడలేదు, కాబట్టి మేం ఆ వ్యక్తి పేరును వేల్‌గా మార్చాం. తన లైంగికత కారణంగా తరచూ అవమానాలకు గురవుతున్నాననివ వేల్ బీబీసీకి తెలిపారు.
వేల్ తన కజిన్స్‌తో పెరిగారు, తరచుగా మేకప్, అమ్మాయి దుస్తులను ధరించేవారు, ఇది తన ముస్లిం తల్లిదండ్రులకు నచ్చకపోయేది.
తనతో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వైఖరి కూడా అంత బాగుండకపోయేదని వేల్ అంటున్నారు. వేల్ ఎదుగుతున్న కొద్దీ తన లైంగికత్వంపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.
అయితే, ఈ ప్రతిపాదిత చట్టాన్ని స్వాగతిస్తున్నానని, కానీ వివాహం చేసుకోలేనని వేల్ సందేహం వ్యక్తంచేశారు.
థాయ్‌లాండ్‌లోని చాలామంది ముస్లింల మాదిరిగానే తన తల్లిదండ్రులు కూడా స్వలింగ సంపర్కాన్ని వ్యతిరేకంగానే చూస్తారని వేల్ చెప్పారు.
వివాహంపై తల్లిదండ్రులను ఒప్పించడం వేల్‌కు సవాలుతో కూడుకున్నది.
ఇవి కూడా చదవండి:
- ఎంపీ, ఎమ్మెల్యేగా గెలిచినా లెక్క చెప్పకపోతే ఇంటికే.. ఎందుకు?
- నీలం సంజీవ రెడ్డి: సీఎం, రాష్ట్రపతి సహా 5 కీలక పదవులు చేపట్టిన ఒకే ఒక్కడు
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- కోటిన్నర రూపాయల జీతం, ఇల్లు, ఇంకా ఇతర సౌకర్యాలు ఇస్తారట... స్కాట్లండ్ దీవుల్లో ఉద్యోగం చేస్తారా?
- రాధికా మర్చంట్: ముకేశ్ అంబానీ కోడలవుతున్న ఈ అమ్మాయి ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














