సల్తనత్ నుకెనోవా: ఒక సెలబ్రిటీ హత్య ఆ దేశ చట్టాలను ఎలా మార్చిందంటే...

కజకిస్తాన్, గృహ హింస చట్టం

ఫొటో సోర్స్, Family handout

ఫొటో క్యాప్షన్, పెళ్లయిన ఏడాదికే భర్త కొట్టిన దెబ్బలకు ప్రాణం కోల్పోయిన సల్తనత్ నుకెనోవా
    • రచయిత, సోఫీ అబ్దుల్లా, ఐసింబత్ టొకొఎవా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

హెచ్చరిక: ఈ కథనంలో మహిళలపై హింసకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.

ఓ హై ప్రొఫైల్ హత్య కేసులో కజకిస్తాన్ మాజీ మంత్రిపై విచారణను లక్షల మంది ఫాలో అయ్యారు. ఈ హత్య కేసు దేశంలో మహిళలపై గృహ హింస మీద కూడా దృష్టి సారించేలా చేసింది.

భార్యను హత్య చేసినందుకు ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతకు శిక్ష విధిస్తూ కోర్టు చారిత్రక తీర్పు చెప్పింది. దీంతో పాటు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అలాగే ఇతర గృహ హింస బాధితులకు కూడా న్యాయం జరుగుతుందా అన్న ఆశలను రేకెత్తించింది.

ఈ కేసుకు సంబంధించి కోర్టులో ప్రవేశ పెట్టిన వాస్తవాలు భయం కలిగించేలా ఉన్నాయి.

కజకిస్తాన్ మాజీ ఆర్థికమంత్రి కుండిక్ బిషింబయేవ్ తన భార్య సల్తనత్ నుకెనోవాపై దాడి చేసి చనిపోయేలా కొట్టడం సీసీ కెమెరాల్లో కొంత వరకు రికార్డైంది.

కజకిస్తాన్, గృహ హింస కేసు

ఫొటో సోర్స్, Supreme Court of Kazakhstan/Telegram

ఫొటో క్యాప్షన్, కోర్టులో విచారణ ఎదుర్కొంటున్న కుండిక్ బిషింబయేవ్

సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు

స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.15కి దేశ రాజధాని ఆస్తానాలోని ఓ రెస్టారెంట్‌లో సేకరించిన వీడియో ఫుటేజ్‌లో కుండిక్ బిషింబయేవ్ తన భార్య సల్తనత్‌ను తంతూ, జుట్టు పట్టుకుని ఈడుస్తూ ఉన్న దృశ్యాలు కనిపించాయి.

ఆ తర్వాత 12 గంటల వరకు ఏం జరిగిందనేది అస్పష్టంగా ఉంది. ఇందులో కొంత ఆయన మొబైల్‌లో రికార్డైంది. ఈ దృశ్యాలను కోర్టులో చూపించారు, కానీ బహిర్గత పరచలేదు.

బిషింబయేవ్ మరో వ్యక్తి గురించి ప్రశ్నిస్తూ సల్తనత్‌ను అవమానించడం ఆడియోలో రికార్డైంది. బిషింబయేవ్ భార్య ఒక గదిలో స్పృహలో లేకుండా పడి ఉన్న సమయంలో అతను ఒక జ్యోతిష్యుడికి అనేకసార్లు ఫోన్ చేయడాన్ని కోర్టు విన్నది. ఆ గదిలో కెమెరాలు లేవు.

రాత్రి 8 గంటలకు ముందు ఎట్టకేలకు ఒక అంబులెన్స్ వచ్చింది. అప్పటికే ఆమె చనిపోయి ఆరు నుంచి ఎనిమిది గంటలు గడిచి ఉండవచ్చని పోస్టు మార్టం నివేదిక వెల్లడించింది.

బయట నుంచి కొట్టిన దెబ్బలు, నేలకేసి బాదడం వల్ల సల్తనత్ మెదడుకు గాయం అయిందని, ఇతర గాయాలు ఉన్నాయని, ఆమె మెదడులోని పుర్రె ఉపరితలం మీద నుంచి 230 మిల్లీ మీటర్ల రక్తాన్ని సేకరించినట్లు ఫోరెన్సిక్ నివేదిక కోర్టుకు వెల్లడించింది. గొంతు పిసికినట్లు గుర్తులు ఉన్నాయని కోర్టు తెలిపింది

ఆస్తానా, కజకిస్తాన్, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Supreme Court of Kazakhstan/YouTube

ఫొటో క్యాప్షన్, బిషింబయేవ్ కొట్టడం వల్ల టాయిలెట్‌లోని ఓ తలుపుకు రంధ్రం పడినట్లు కోర్టులో ప్రదర్శించిన ఫోటో

ఈ సంఘటన జరిగిన రెస్టారెంట్ ఉన్న పుడ్ కాంప్లెక్స్ మేనేజర్, బిషింబయేవ్ బంధువు, బఖ్తియన్ బైజనోవ్‌ మీద నేరాన్ని దాచి పెట్టేందుకు ప్రయత్నించాడనే అభియోగం మోపారు. అది నిజమని తేలడంతో కోర్టు ఆయనకు నాలుగేళ్ల జైలుశిక్ష విధించింది.

సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను డిలీట్ చేయాలని బిషింబయేవ్ తనపై ఒత్తిడి తెచ్చినట్లు అతను కేసు విచారణ సమయంలో కోర్టుకు తెలిపారు.

నుకెనోవాను హత్య చేసినందుకు ఆస్తానాలోని సుప్రీంకోర్టు మే13న కుండిక్ బిషింబయేవ్‌కు 24 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

అయితే, కజకిస్తాన్‌లో ఏటా వందల మంది మహిళలు తమ భర్తల చేతుల్లో చేతుల్లో చనిపోతున్నారు. వీరిలో చాలామందికి శిక్షలు పడటం లేదు. దేశంలో జరుగుతున్న ప్రతీ నాలుగు గృహహింస కేసుల్లో ఒక్కరికే శిక్ష పడుతోందని ఐక్యరాజ్య సమితి అంచనాలు చెబుతున్నాయి.

గృహ హింస బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు.

“కజకిస్తాన్ మహిళలు చాలా కాలం నుంచి గొంతెత్తి అరుస్తున్నారు. అయితే అవి ఎవరికీ వినిపించడం లేదు” అని సల్తనత్ సోదరుడు చెప్పారు.

పవోల్దార్, కజకిస్తాన్

ఫొటో సోర్స్, Family handout

ఫొటో క్యాప్షన్, కజకిస్తాన్‌లోని పోర్ట్ ఆఫ్ పవోల్దార్‌లో చిన్నప్పటి సల్తనత్( 1996-997)

ఇప్పటి వరకు ఏం జరిగింది?

సల్తనత్ బాల్యం అంతా కజకిస్తాన్- రష్యా సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఈశాన్య నగరం పవల్దార్‌లో గడిచింది.

స్కూలు చదువు పూర్తైన తర్వాత ఆమె అప్పటి రాజధాని అల్మాటీకీ వెళ్లారు. అక్కడ ఆమె అన్నయ్య ఎబెక్ అమాంగెల్డీతో కలిసి కొంతకాలం ఉన్నారు.

సల్తనత్ నుకెనోవా హత్యకు గురికావడానికి ఏడాది ముందే పెళ్లయింది. ఆమెను కుండిక్ బిషిబయేవ్ వివాహం చేసుకున్నారు.

లంచం తీసుకున్నారనే ఆరోపణల మీద ఆయనను 2017లో అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనకు పదేళ్ల జైలుశిక్ష పడిందని నివేదికలు చెబుతున్నారు. ఈ కేసులో మూడేళ్లు జైల్లో గడిపిన తర్వాత ఆయన బయటకు వచ్చారు.

ఆ సమయంలో సల్తనత్ జ్యోతిష్యురాలిగా పని చేస్తోంది. జ్యోతిష్యం అంటే ఆమెకు పిచ్చి. 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆమెకు వాళ్ల అమ్మమ్మ ఇచ్చిన పుస్తకం వల్ల జ్యోతిష్యం మీద ఆసక్తి ఏర్పడిందని ఆమె అన్నయ్య చెప్పారు.

“ఇంట్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అనేక మంది మహిళలకు ఆమె సాయం చేశారు. వారిలో గృహహింస బాధితులు, వివాహా సంబంధమైన, పిల్లల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నవారికి సాయం అందించారు” అని అతను చెప్పారు.

సల్తనత్ ఎప్పుడూ నవ్వుతూ ఉండేదని, జ్యోతిష్యం బోధించేందుకు ఒక పాఠశాలను ప్రారంభించాలని కలలు కనేదని ఆమె సోదరుడు అన్నారు.

కజకిస్తాన్, గృహ హింస కేసు, ఆస్తానా

ఫొటో సోర్స్, Family handout

ఫొటో క్యాప్షన్, సల్తనత్‌ నుకెనోవాతో అబెక్ ( 1996-1997)

కజకిస్తాన్‌లో పెరుగుతున్న గృహహింస కేసులు

సల్తనత్‌ను కలిసేందుకు బిషింబయేవ్ అపాయింట్‌మెంట్ అడిగారని, అయితే ఆమె అతని విజ్ఞప్తిని తిరస్కరించారని ఎబెక్ కోర్టుకిచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.

“చాలా కాలం, ఆమె చుట్టు తిరిగిన తర్వాత బిషింబయేవ్ ఆమె ఫోన్ నెంబర్ సంపాదించాడు’’ అని ఎబెక్ చెప్పారు. తన చెల్లికి అతను పంపిన మెసేజ్‌లను ఆమె తనకు చూపించిందని, అందులో ఆమెను కలుసుకోవాలని ఉందని రాశాడని, అయితే అందులో రాసి ఉన్నదంతా నమ్మవద్దని తాను తన చెల్లెలుకు చెప్పాని ఎబెక్ చెప్పారు.

వాళ్లిద్దరు కలుసుకున్న కొన్ని నెలల తర్వాత, పెళ్లి చేసుకున్నారు. వారి మధ్య సమస్యలు రావడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

బిషింబయేవ్ కొట్టిన దెబ్బలకు సంబంధించిన ఫోటోలను ఆమె అనేక సార్లు తన అన్నకు పంపించారు. కొన్ని సందర్భాల్లో భర్తను వదిలేయాలని అనుకుంది. సల్తనత్ తాను ఎంతో ఇష్టపడే ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత బషింబయేవ్ ఆమెను ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఆమె ఉద్యోగం చెయ్యడం అతనికి ఇష్టం లేదని ఆమెకు ఎబెక్ చెప్పారు.

బిషింబయేవ్ ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించి, ఆపై హత్య చేసినట్లు కోర్టులో న్యాయమూర్తి చెప్పారు.

అయినప్పటికీ బిషింబయేవ్ తాను చేసిన దానికి ఎలాంటి పశ్చాత్తాపం ప్రకటించలేదు. తాను కొట్టడం వల్లే ఆమె చనిపోయిందని కోర్టులో అంగీకరించారు. అయితే అది కావాలని చేసిందికాదని మాత్రం అన్నారు.

కోర్టు ‘నిష్పక్షపాతంగా, నిజాయితీగా’ వ్యవహరించాలని ఆయన కోరారు.

“నీ సోదరి రిలేషన్ షిప్‌లో పురుషుల ఆధిపత్యం ఉండాలని భావించేదా లేక మహిళల ఆధిపత్యం ఉండాలని భావించేదా” అని బిషింబయేవ్ తరపు న్యాయవాది ఎబెక్‌ను ప్రశ్నించారు.

“మీరు సీరియస్‌గానే ఈ ప్రశ్న అడుగుతున్నారా” అని అతను న్యాయవాదిని ఎదురు ప్రశ్నించారు.

సల్తనత్, బిషింబయేవ్

ఫొటో సోర్స్, Family handout

ఫొటో క్యాప్షన్, గృహహింస బాధితులకు అండగా 'సల్తనత్ చట్టం' తీసుకొచ్చిన కజకిస్తాన్

ధైర్యంగా పోరాటం

న్యాయవాది అలాంటి ప్రశ్న అడగడం డెనిస్ క్రివొషీవ్‌ను ఆశ్చర్యపరచలేదు. ఆయన తూర్పు యూరప్, మధ్య ఏషియాల్లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్నారు.

“బాధితుల ప్రవర్తన నేరస్తులను రెచ్చ గొట్టిందని ఆరోపించడం; ఆమె కుటుంబాన్ని నాశనం చేసినట్లు చెప్పడం, ఆమె భర్తను లేదా అత్తమామలను గౌరవించడం లేదనడం...ఇలా ఏదైనా ఆరోపించవచ్చు.” అని ఆయన బీబీసీతో చెప్పారు.

“గృహ హింసపై ఫిర్యాదు చెయ్యాలంటే ధైర్యం కావాలి. అలాంటి కేసులకు సంబంధించిన ఫిర్యాదులు చాలా తక్కువగా ఉన్నాయని నమ్మేందుకు అనేక కారణాలు ఉన్నాయి" అని డెనిస్ అన్నారు.

కజకిస్తాన్‌లో ప్రతీ ఏటా గృహ హింస కారణంగా 4 వందల మంది కజక్ మహిళలు చనిపోతున్నారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. కజకిస్తాన్ జనాభాతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ఉన్న ఇంగ్లండ్, వేల్స్‌లో గృహ హింస వల్ల గతేడాది 70 మంది చనిపోయారు.

2018-2022 మధ్య గృహ హింస బాధితుల కోసం ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లకు వచ్చే కాల్స్ 141.8 శాతం పెరిగాయని కజక్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.

అయినప్పటికీ, “గృహ హింసను ఇప్పటికీ భరిస్తూనే ఉన్నారు. అయితే అది తగ్గుతోంది” అని క్రివోషీవ్ చెప్పారు.

కోర్టులో ఈ కేసు విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడం వల్ల సల్తనత్ చివరి ఘడియల గురించి దేశం మొత్తానికి తెలిసింది. దీంతో గృహహింసకు వ్యతిరేకంగా ప్రభుత్వం స్పందించాలనే ఒత్తిడి పెరిగింది. ప్రజలు సోషల్ మీడియా వేదికలైన టిక్ టాక్ లాంటి వాటిలో ఈ కేసుపై తీవ్రంగా స్పందించారు. గృహహింస చట్టంలో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేస్తూ రూపొందించిన పిటిషన్‌పై లక్షన్నర మందికి పైగా సంతకం చేశారు.

దీంతో గృహహింస చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ ఏప్రిల్ 15న అధ్యక్షుడు కాస్సిమ్ జొమార్ట్ టొకయేవ్ బిల్లుపై సంతకం చేశారు. 2017 వరకూ గృహహింసకు పాల్పడిన వారికి శిక్షలు లేవు.

“సల్తనత్ లా ” పేరుతో వచ్చిన ఈ చట్టంలో గృహహింసకు పాల్పడటం నేరపూరితమని పేర్కొన్నారు. అంతకు ముందు అది సివిల్ అఫెన్స్‌గా గుర్తించేవారు. కొత్త చట్టం ప్రకారం గృహహింస వ్యవహారంలో ప్రస్తుతం కజకిస్తాన్‌లో బాధితుల ఫిర్యాదులు లేకున్నా కేసు నమోదు చేయవచ్చు.

సోషల్ మీడియా, సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Family handout

ఫొటో క్యాప్షన్, సల్తనత్‌కు అండగా నిలిచిన కజకిస్తాన్ మహిళలు

చట్టం చేస్తే సరిపోతుందా?

వాస్తవంలో ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అని దినారా స్మైలోవా చెప్పారు. గృహహింస, అత్యాచార బాధితుల కోసం ఆమె నెమోచికే ఫౌండేషన్ స్థాపించారు.

ఉదాహరణకు “బాధితులకు జరిగే హానిని తక్కువ చేసి చూపడం. ”గృహ హింస బాధితులు 21 రోజుల కంటే తక్కువ రోజులు ఆసుపత్రిలో ఉంటే ఎముకలు విరగడం, ముక్కు పగలడం, దవడ దెబ్బతినడంలాంటి వాటిని కూడా ఆరోగ్యానికి జరిగిన పెద్ద హాని కింద పరిగణించరు.

స్మైలోవా యవ్వనంలో ఉన్నప్పుడు ఆమె మీద అత్యాచారం, లైంగిక దాడి జరిగాయి. 2016లో జరిగిన ఈ సంఘటనపై సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసినప్పుడు వచ్చిన స్పందన చూసిన తర్వాత ఆమె ఫౌండేషన్ స్థాపించారు.

ఈ కొన్ని రోజుల్లోనే “ వందల మంది మహిళలు తాము ఎదుర్కొంటున్న లైంగిక హింస గురించి బయటకు చెప్పకుండా ఎలా అణచివేస్తున్నారో, ఈ హింసకు పాల్పడుతున్న పురుషులు ఎలా తప్పించుకుంటున్నారో ఆమెకు మెసేజ్‌లు పెట్టారు”

“ఎనిమిదేళ్లుగాహింసకు సంబంధించిన షాకింగ్ కేసులు” అనే పేరుతో ఆమె ఫౌండేషన్ కొన్ని కథనాలను ప్రచురిస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆమె చెప్పారు.

ప్రస్తుతం ఆమె కజకిస్తాన్‌లో ఉండాలని అనుకోవడం లేదు. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నారనీ, కొంతమంది ప్రైవసీని ఉల్లంఘిస్తున్నారనీ, మోసం చేశారనీ ఆరోపిస్తూ కజక్ అధికారులు ఆమెను వాంటెడ్ లిస్టులో చేర్చారు.

అయితే, చిత్రమైన విషయం ఏంటంటే, ఆమె రాసిన కథనాలే సల్తనత్ పట్ల ప్రజల్లో ఆదరణ పెంచాయి.

“ఆమె ఎప్పుడూ న్యాయం కోసం పోరాడుతుంటుంది” అని ఎబెక్ చెప్పారు. “అది ఏమైనా కావచ్చు, న్యాయం కోసం గట్టిగా పోరాడతారు. ఎవరైనా గాయపడి ఉంటే, వారికి రక్షణ అవసరమైనప్పుడు ఆమె కచ్చితంగా అక్కడ ఉంటారు” అని చెప్పారు.

కొత్తగా తెచ్చిన చట్టం అవసరమైనంత మేరకు సరిపోదని ఆయన కూడా అభిప్రాయపడ్డారు.

అయినప్పటికీ, ఇదొక ప్రారంభమని, వ్యవస్థలో బలవంతులైన వ్యక్తులను కూడా శిక్షించవచ్చని ఇది నిరూపించిందని ఎబెక్ అన్నారు.

“కజకిస్తాన్‌లో ఓ చట్టం అందరికీ సమానం, విచారణ జరిగేటప్పుడు చట్టం ముందర అందరూ ఒకటే” అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)