'సెక్స్ వర్కర్లు వాడిపడేసే వస్తువులు కాదు'

సెక్స్ వర్క్
ఫొటో క్యాప్షన్, తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి అలానా అనే సెక్స్ వర్కర్ బీబీసీతో చెప్పారు
    • రచయిత, హేలీ కాంప్టన్
    • హోదా, బీబీసీ ఇన్వెస్టిగేషన్స్, ఈస్ట్ మిడ్‌ల్యాండ్స్

సెక్స్ వర్కర్లపై జరిగే నేరాలపై నమోదయ్యే కేసులు అనాదిగా తక్కువే. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు తీసుకురావడం కోసం సెక్స్ వర్కర్లు, పరిశోధకులు, స్వచ్చంద సంస్ధలు ఒక్కటయ్యాయి.

మా ఇంటర్వ్యూకి వచ్చేప్పుడు అలానా అనే సెక్స్ వర్కర్ ఒక బ్యాగ్‌తో వచ్చారు. అందులో లేసీ లోదుస్తులు, మోకాలి ఎత్తు బూట్లు, లెదర్ విప్ (కొరడా) ఉన్నాయి.

ఆమె మొదట్లో కొంత ఆందోళనగా కనిపించారు. కానీ, మేం ఆమె వృత్తి గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత కాస్త స్థిమిత పడ్డారు.

'అలానా' అనేది ఆమె తనకు తాను పెట్టుకున్న పేరు. తన వృత్తి వల్ల వచ్చిన గుర్తింపు నుంచి.. ఒక తల్లిగా తన రోజువారీ జీవితాన్ని ఇది వేరుచేస్తుంది.

''రోజూ సాయంత్రానికి మేం మేకప్ తీసేస్తాం. ఆ తర్వాత అస్దా(ఫుడ్)లో షాపింగ్‌కి లేదా స్కూల్‌కి వెళ్తాం'' అని ఆమె చెప్పారు.

డెర్బీషైర్‌కి చెందిన అలానా ఎన్‌హెచ్‌ఎస్, వినోద రంగాల్లో ఉద్యోగాలు చేశారు. కానీ, ఇప్పుడామె సెక్స్‌‌‌ వర్కర్ జీవితాన్ని ఎంచుకున్నారు.

ఈ వృత్తి తనకూ, ఇతరులకు హాని చేస్తుందని ఆమెకు తెలుసు. కానీ, కొందరు సెక్స్ వర్కర్ల పరిస్థితులు అందరి పరిస్థితుల్లా ఉండవు.

అదృష్టవశాత్తూ మూడేళ్లలో ఒక్కసారి మాత్రమే అలానా దాడికి గురైంది. అది తన అనుమతి లేకుండా విటుడు బలవంతంగా డ్రగ్స్ ఎక్కించినప్పుడు.

సెక్స్ వర్క్
ఫొటో క్యాప్షన్, పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే ఆందోళనగా ఉంటున్నట్లు అలానా చెప్పారు

'దూరంగా తీసుకెళ్లి'

ఇంటికి వెళుతున్న సమయంలో ఆ బుకింగ్ వచ్చింది. కానీ, లోపల ఏదో సందేహంగానే అనిపించిందని ఆమె చెప్పారు.

అక్కడికి వెళ్లేప్పటికే ఒక మధ్య వయసు వ్యక్తి, డ్రగ్స్ తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అలానా చెప్పారు.

''అతను బలవంతంగా నెడుతూ వచ్చి, నా తల పట్టుకుని బలంగా తనవైపుకి లాక్కున్నాడు'' అని అలానా తెలిపారు.

''లైంగిక వాంఛతో రెచ్చిపోయాడు, అతన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోవడం కంటే, అతనికి కోపం రాకుండా చూసుకోవడం కోసం బుక్ చేసినన్ని గంటలూ అక్కడే ఉండిపోయా'' అని ఆమె చెప్పారు.

''నేను సురక్షితంగా బయటపడతానని అనుకోలేదు'' అని ఆమె అన్నారు.

ఆ దాడి తర్వాత ఆమె చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. కానీ, సెక్స్ వర్కర్లపై జరిగే ఇతర నేరాల మాదిరిగానే ఆమె దానిపై ఫిర్యాదు చేయలేదు.

''పోలీసులకు ఫిర్యాదు చేసినా ఏదో జరుగుతుందని నేను అనుకోవడం లేదు'' అని ఆమె చెప్పారు.

తన వృత్తి కళంకమనే మచ్చ ఉందని, అందువల్ల ఆ పరిస్థితిని తానే కొనితెచ్చుకున్నానని అందరూ నిందిస్తారని ఆమె అన్నారు.

ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేనని, ''నా నుంచి ఏదో దూరమైనట్లు అనిపించింది'' అని ఆమె అన్నారు.

సెక్స్ వర్క్
ఫొటో క్యాప్షన్, సెక్స్ వర్క్‌ను నేరంగా పరిగణించకూడదని నాటింగ్‌హామ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ లారిస్సా శాండీ అంటున్నారు

ఇది అలానా ఒక్కరి కథ మాత్రమే కాదు.

నేరాలు, ప్రత్యేకించి హింస్మాతక నేరాలు సాధారణ ప్రజల కంటే సెక్స్ వర్కర్లపైనే ఎక్కువగా జరుగుతున్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి.

ఆన్‌లైన్ సెక్స్ వర్కర్లలో 47 శాతం మంది తాము ఏదో ఒక నేరానికి బాధితులుగా మారినట్లు 2016 నుంచి నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. వేధింపులు, దోపిడీ, రేప్, భౌతిక దాడి, కిడ్నాప్ యత్నం వంటివి అందులో ఉన్నాయి.

సెక్స్ వర్కర్ల మరణాల రేటు అదే వయసు కలిగిన మహిళల కంటే 12 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తొమ్మిదేళ్ల కాలంలో 402 మంది సెక్స్ వర్కర్లపై జరిపిన 'రిస్కీ బిజినెస్: హెల్త్ అండ్ సేఫ్టీ ఇన్ ది సెక్స్ ఇండస్ట్రీ'గా పిలిచే 1999 నాటి అధ్యయనంలో తేలింది.

''కళంకం అనే మచ్చ కారణంగా, మేం తీవ్రమైన హింసకు గురువుతున్నాం'' అని అలానా చెప్పారు.

అయితే, ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం కోసం ఆమె సాయం చేస్తున్నారు.

సెక్స్ వర్కర్లకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యంగా జరుగుతున్న పరిశోధన కోసం ఏర్పాటైన సలహా సంఘంలో ఆమె సభ్యురాలిగా ఉన్నారు. ఆ ప్యానెల్‌లో నియమితులైన కొద్దిమంది సెక్స్‌వర్కర్లలో ఆమె ఒకరు.

సెక్స్ వర్కర్లు లైంగిక నేరాలు, లేదా హింసాత్మక నేరాలకు గురైనప్పుడు ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఒక వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు నాటింగ్‌హామ్ యూనివర్సిటీ సాయం చేస్తోంది.

ఇది ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ ఏడాది చివరినాటికి పోలీసులతో సహా ఏజెన్సీలకు ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

క్రిమినాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లారిస్సా శాండీ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. వ్యభిచారాన్ని నేరంగా పరిగణించకూడదనే అంశంపై సొంత దేశం ఆస్ట్రేలియాలోనూ ఆమె పనిచేశారు.

జర్మనీ, న్యూజిలాండ్ వంటి దేశాలు తమ చట్టాలను సవరించాయి కూడా. అయితే, ఇది సెక్స్ టూరిజంను పెంచడంతో పాటు మానవ అక్రమ రవాణాకు ఆజ్యం పోసిందన్న విమర్శలున్నాయి.

''చట్టాన్ని అమలు చేయాల్సింది పోలీసులే. అందువల్ల వ్యభిచారాన్ని నేరంగా పరిగణించడం మానేస్తే, అప్పుడు సెక్స్ వర్కర్లు తమపై జరిగే నేరాల గురించి ఫిర్యాదు చేస్తారు. తద్వారా వారు సురక్షితంగా ఉండగలుగుతారు'' అన్నారు శాండీ.

నేరాలపై ఫిర్యాదు చేసేందుకు వెనకాడడానికి చట్టం గందరగోళంగా ఉండడం కూడా ఒక కారణమని ఆమె చెప్పారు.

సెక్స్ వర్క్
ఫొటో క్యాప్షన్, సెక్స్ వర్కర్లకు మరింత భద్రత కల్పించడమే లక్ష్యంగా జరుగుతున్న పరిశోధన కోసం ఏర్పాటైన అడ్వైజరీ ప్యానెల్‌లో అలానా సభ్యురాలు

'జనం జడ్జ్ చేస్తారు'

మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, డబ్బులు తీసుకుని సెక్స్ అందించడం యూకేలో చట్టబద్ధం. కానీ, ఉత్తర ఐర్లాండ్‌లో అది చట్టవిరుద్ధం.

అయితే, లైంగిక సేవల గురించి ప్రకటనలు ఇవ్వడం, వ్యభిచార గృహాన్ని నడపడం వంటివి మాత్రం యూకేలో చట్టవిరుద్ధమే.

తమ పని సెక్స్ వర్కర్లను నేరుగా ప్రాసిక్యూట్ చేయడం కాదని, ఇతరులను బలవంతంగా లేదా దోపిడీ చేసేవారిని ప్రాసిక్యూట్ చేయడమని 'ది క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్)' కూడా చెబుతోంది.

నేరస్తులు కావాలనే సెక్స్ వర్కర్లని లక్ష్యంగా చేసుకుంటారని సీపీఎస్ చెబుతోంది. ''వారు నేరంపై ఫిర్యాదు చేసేందుకు, లేదా ప్రాసిక్యూషన్‌కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు రారనేది వారి నమ్మకం.''

అయితే, ఇలాంటి విషయాల్లో చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అలానా చెప్పారు.

''చాలా మంది సెక్స్ చేస్తారు. అలాంటప్పుడు, డబ్బులు తీసుకుని సెక్స్ చేసే వారిని జనం ఎందుకు జడ్జ్ చేస్తారు'' అని ఆమె ప్రశ్నించారు.

సెక్స్ వర్క్
ఫొటో క్యాప్షన్, జెస్సికా బ్రానన్

'సెక్స్ వర్క్‌ని ఒక పనిలాగే చూస్తాం'

నాటింగ్‌హామ్‌లో ప్రాస్టిట్యూట్ అవుట్‌రీచ్ సర్వీస్ (పీవోడబ్ల్యూ)ని నడుపుతున్న జెస్సికా బ్రానన్ మాట్లాడుతూ, '' అది (సెక్స్ వర్క్) చట్ట విరుద్ధం కాదు, కానీ అనైతికమని తీర్పులిచ్చేస్తారు'' అని అన్నారు.

సెక్స్ వర్కర్లు తమపై జరిగే నేరాల గురించి ఫిర్యాదు చేయకుండా అవమానం, శిక్ష పడుతుందనే భయం, నమ్మకం లేకపోవడం వంటివి ఆపుతున్నాయని ఆమె చెప్పారు.

పీవోడబ్ల్యూ 1990ల నుంచి సెక్స్ వర్కర్లకి మద్దతుగా పనిచేస్తోంది. నేరస్తులకు శిక్షలు వేయించడం కోసం కృషి చేస్తోంది.

''సెక్స్ వర్కర్లలో(మహిళలు, లేదా పురుషులు) ఒక్కరిపై అయినా హింసాత్మక దాడి జరగకుండా ఒక్క వారం కూడా గడవదు. కానీ, ఆ కేసులు కోర్టు వరకూ వెళ్లడం లేదు'' అని ఆమె చెప్పారు.

''సెక్స్ వర్క్‌ను మేం పనిగా, కష్టమైన పనిగా చూస్తాం. మా క్లయింట్లు వారికి ఎదురవుతున్న అనుభవాల గురించి నిజాయితీగా మాట్లాడాలని మేం కోరుకుంటున్నాం'' అన్నారు.

శ్రామిక శక్తిలో ఒక విలువైన సభ్యురాలిగా తనను చూడాలని, సెక్స్‌ విక్రయించే వారిని తక్కువగా చూసే నైజాన్ని సమాజం మార్చుకోవాలని అలానా కోరుకుంటున్నారు.

''నేనూ పన్ను కడుతున్నా, జాతీయ బీమా చెల్లిస్తున్నా'' అని ఆమె అన్నారు.

''సెక్స్ వర్కర్లు వాడిపడేసే వస్తువులు కాదు. దీన్ని కూడా సాధారణ ఉద్యోగంగా పరిగణిస్తే బావుంటుంది'' అన్నారామె.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)