80 ఏళ్ల తర్వాత బయటపడిన జలాంతర్గామి శిథిలాలు

ఫొటో సోర్స్, The Lost 52 Project/US Navy
- రచయిత, జోయెల్ గునిటో
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికన్ నేవీకి చెందిన జలాంతర్గామి శిథిలాలను దక్షిణ చైనా సముద్రంలో కనుక్కున్నారు.
యూఎస్ఎస్ హార్డర్ జలాంతర్గామి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌కు చెందిన చాలా యుద్ధ నౌకలను ముంచేసింది.
ఆ తర్వాత 1944 ఆగస్టు 29న హార్డర్ మునిగిపోయింది. అప్పుడు అందులో 79 మంది సిబ్బంది ఉన్నారు.
ఫిలిప్పీన్స్‌లోని లుజోన్ సమీపంలో 3 వేల అడుగుల లోతులో యూఎస్ఎస్ హార్డర్‌ను గుర్తించారు.
శత్రు దేశాలు ముంచి వేసిన 80 ఏళ్ల తర్వాత ఈ జలాంతర్గామి శిథిలాలు బయటపడ్డాయి.
గస్తీలో భాగంగా చివరిసారిగా ఈ అమెరికన్ యుద్ధ నౌక నాలుగు రోజుల్లో మూడు జపాన్ నౌకలను ముంచివేసింది. మరో రెండింటిని ధ్వంసం చేసిందని అమెరికన్ నేవీ హిస్టరీ అండ్ హెరిటేజ్ కమాండ్ చెబుతోంది.
దీని వల్ల జపాన్ తన యుద్ధ తంత్రాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. బలగాలను తీసుకెళ్లడం ఆలస్యమైంది. జపాన్ ఓడిపోవడానికి ఇదొక కారణం అని అమెరికన్ నేవీ పేర్కొంది.
“అమెరికా విజయం సాధించే క్రమంలో హార్డర్ జలాంతర్గామిని కోల్పోయింది. విజయానికి, స్వేచ్ఛకు కొంత మూల్యం చెల్లించాల్సి ఉంటుందనే విషయం మనం మర్చిపోకూడదు” అని ఎన్‌హెచ్‌హెచ్‌సీ రిటైర్డ్ యూఎస్ అడ్మిరల్ శామ్యూల్ జె. కాక్స్ చెప్పారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఫిలిప్పీన్స్ ప్రధాన యుద్ధ క్షేత్రాలలో ఒకటిగా ఉంది. ఒకప్పటి అమెరికన్ వలసగా ఉన్న ఈ ప్రాంతాన్ని జపాన్ సైన్యం ఆక్రమించుకుంది. దీన్ని స్వాధీనం చేసుకునేందుకే అమెరికా ఈ ప్రాంతంలో పోరాడింది.
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ధ్వంసమైన యుద్ధ నౌకలకు ఈ ద్వీప సమూహం చుట్టూ ఉన్న సముద్రపు జలాలు ఆవాసంగా మారాయి.
2015లో అమెరికన్ బిలియనీర్ పాల్ అల్లెన్ ఫిలిప్పీన్స్ దగ్గర్లోని సిబుయాన్ సముద్రంలో జపనీస్ యుద్ధ నౌక ముసాషి శిథిలాలను కనుగొన్నారు. జపాన్ నిర్మించిన అతి పెద్ధ యుద్ధ నౌకల్లో ముసాషి ఒకటి.
“ప్రత్యర్ధులను గట్టిగా ఎదుర్కొందాం” అనే లక్ష్యంతో హార్డర్ జలాంతర్గామి ప్రయాణించింది. ఈ యుద్ధనౌక శిథిలాలను లాస్ట్ 52 ప్రాజెక్టు కనుక్కుంది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా 52 జలాంతర్గాములను కోల్పోయింది'' అని అమెరికన్ నేవీ తెలిపింది.
యుద్ధ సమయంలో అందించిన సేవలకు గాను ఇచ్చే ప్రెసిడెన్షియల్ యూనిట్ సైటేషన్ అవార్డును ఈ సబ్‌మెరీన్‌తో పాటు దాని సిబ్బందికి ఇచ్చారు. యుద్ధంలో వీరోచితంగా పోరాడిన వారికి ప్రత్యేక గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నారు.
హార్డర్ కెప్టెన్ కమాండర్ డీలేకు మరణం తర్వాత అమెరికన్ అత్యున్నత సైనిక పురస్కారం లభించింది.
ఇవి కూడా చదవండి:
- షుగర్ ఉన్న వాళ్లు మామిడి పండ్లు తినొచ్చా, తినకూడదా? డాక్టర్లు ఏం చెప్పారంటే..
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం, ఎవరికి అనుకూలం?
- పెద్దక్కగా పుట్టడం శాపమా, అది ఒక మానసిక సమస్యగా మారుతోందా?
- ‘మా నాన్న సీఎం’
- ఏపీలో మే 13న ఎన్నికలు పూర్తయితే జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఇవ్వకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














