లక్షల రూపాయలు పలికిన పక్షి ఈక‌... ఏమిటి దీని ప్రత్యేకత?

హుయా పక్షి ఈక

ఫొటో సోర్స్, Webb’s

ఫొటో క్యాప్షన్, హుయా పక్షి ఈక వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది.
    • రచయిత, ఫాన్ వాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

అంతరించిపోయిన న్యూజిలాండ్ హుయా పక్షికి సంబంధించిన ఓ ఈక రికార్డు ధరకు అమ్ముడుపోయింది. వేలంలో అది ఈక 46,521.50 న్యూజిలాండ్ డాలర్ల రికార్డు స్థాయి ధర పలికింది. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం 23 లక్షల 66 వేల 374 రూపాయలు.

తొలుత ఈ పక్షి ఈక 3వేల డాలర్ల వరకు పలుకుతుందని భావించారు. కానీ గతంలో ఇదే జాతికి చెందిన ఈక ధర కంటే 450 శాతం ఎక్కువ పలికి, ఆ రికార్డును బద్దలు కొట్టింది.

హుయా పక్షిని మావోరి తెగ ప్రజలు పవిత్రంగా భావిస్తారు. వాటి ఈకలను తరచూ తెగ ముఖ్యులు, వారి కుటుంబసభ్యులు తలపై ధరించేవారు. వీటితో వ్యాపారం చేసేవారు. అలాగే బహుమతులుగానూ ఇచ్చేవారు.

హుయా పక్షి చివరిసారిగా 1907లో కనిపించింది. కానీ 20, 30 ఏళ్ళపాటు ఈ పక్షి కనిపించినట్టు నిర్థరణ కాని వార్తలు వెలువడినట్టు మ్యూజియమ్ ఆఫ్ న్యూజిలాండ్ తెలిపింది.

‘హుయా’ న్యూజిలాండ్‌లోని వాటెల్ బర్డ్ కుటుంబానికి చెందిన ఓ చిన్న పక్షి. గెంతే సామర్థ్యంలో ఈ పక్షి పేరుగాంచింది. తెల్లని అంచులు కలిగిన అందమైన ఈకలు ఈ పక్షి సొంతం.

వేలంలో అమ్ముడుపోయిన ఈక ‘‘అద్భుతంగా’’ ఉందని వెబ్స్ ఆక్షన్ హౌస్‌లోని డెకరేటివ్ ఆర్ట్స్ హెడ్ లేహ్ మోరిస్ చెప్పారు.

‘‘అది ఇప్పటికీ దాని మెరుపును కలిగి ఉంది. ఆ ఈకకు కీటకాల వల్ల ఎటువంటి నష్టం జరగలేదు’’ అని చెప్పారు.

ఈ ఈకను అతినీలలోహిత రక్షిత గ్లాసు వెనుక ఆర్కైవల్ పేపర్‌పై ఫ్రేమ్ చేశామని, దీనివల్ల అది దీర్ఘకాలం మన్నుతుందని ఆమె చెప్పారు.

మావోరీ తెగ తయారుచేసే వస్తువులను రక్షించే టాంగో టుటురు వ్యవస్థ కింద ఈ ఈకను నమోదు చేశారు. ఈ వ్యవస్థలో లైసెన్స్ కలిగిన సేకరణకర్తలు మాత్రమే దీనిని కొనుగోలు చేయడానికి అనుమతించారు. సాంస్కృతిక, వారసత్వ మంత్రిత్వశాఖ అనుమతి లేకుండా ఈ ఈకను దేశం బయటకు తీసుకువెళ్ళడానికి వీల్లేదు.

న్యూజిలాండ్ వాసుల అమితాసక్తి, ఉత్సాహం కూడా ఈక ధర పెరేగేందుకు దోహదపడినట్టు మోరిస్ చెప్పారు.

‘‘న్యూజిలాండ్‌లో మేం భూమి, పర్యావరణం, వృక్ష,జంతుజాలం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తాం. ఈ పక్షి అంతరించిపోయి ఉండవచ్చు. కానీ ఇకపై ఇలాంటిది ఇంకెప్పుడు జరగకూడదని కోరుకుంటున్నాం’’ అని ఆమె తెలిపారు.

గతంలో మావోరి ప్రజలు హుయా పక్షి ఈకలను గొప్ప హోదాగా భావించేవారు. యూరోపియన్ల రాకముందే అరుదైన ఈ పక్షి సేకర్తలకు, ఫ్యాషన్ వ్యాపారులకు లక్ష్యంగా మారడంతో అది అంతరించిపోవడానికి దారితీసిందని మ్యూజియం ఆఫ్ న్యూజిలాండ్ తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)