పల్నాడులో హింస, ఘర్షణలకు కారణం ఎవరు? సిట్ నివేదికలో ఏముంది?

- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
తగలబడిన కార్లు, దగ్దమైన బైకులు, ధ్వంసమైన సామాన్లు.. పల్నాడు ప్రాంతంలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస మిగిల్చిన దృశ్యాలు ఇవి. దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం (మే 20) నివేదిక సమర్పించింది.
ఆంధప్రదేశ్‌లోని పల్నాడు ప్రాంతంలో పోలింగ్ నాడు, మరుసటి రోజు కూడా హింస చెలరేగింది. అల్లర్లు జరిగాయి.
పరిస్థితులు ఇప్పటికీ చల్లారలేదు. 144 సెక్షన్ అమల్లో ఉంది. పల్నాడులో కేంద్ర బలగాలు పహారా కాస్తున్నాయి. అనేక చోట్ల కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది.
పల్నాడు ప్రాంతంలో గత కొంతకాలంగా మళ్లీ అలజడి రేగుతోంది. దాడులు, హత్యలు, అల్లర్లు జరుగుతున్నాయి.
మే 13న పోలింగ్ రోజున మాచర్ల, గురజాల, నరసారావుపేట నియోజకవర్గాల్లో హింస చెలరేగింది.
వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. వాహనాలను తగులబెట్టారు. ఇళ్ల మీద దాడులు చేశారు. భౌతిక దాడుల్లో కొందరికి గాయాలయ్యాయి.
పోలింగ్ ముగిసిన మరుసటి రోజు మే 14న కూడా హింస కొనసాగింది. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి మండల కేంద్రంలో ఇళ్లపై దాడులతోపాటు వ్యాపార సంస్థలు, పార్టీ కార్యాలయాలను ధ్వంసం చేశారు.

కారంపూడిలో రేగిన చిచ్చు
పోలింగ్ ముగిసే సమయంలో కారంపూడిలో తొలుత వివాదం మొదలైంది. రెండు వర్గాలు కవ్వింపు చర్యలకు దిగాయి.
వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వర్గీయులు కారంపూడి వచ్చి కర్రలు, రాడ్లతో చెలరేగిపోయారు. టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. స్థానిక టీడీపీ నాయకుడి కారు మంటల్లో చిక్కుకుంది. కొన్ని టూ వీలర్లను తగులబెట్టారు. వారిని నిలువరించే ప్రయత్నం చేసిన పోలీసు ఇన్‌స్పెక్టర్ గాయపడ్డారు.
ప్రతీకారంగా టీడీపీ వర్గం కూడా దాడులకు దిగింది. కారంపూడికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీ వేముల లింగయ్యకు చెందిన టూ వీలర్ షాప్‌ను తగులబెట్టారు. పదుల సంఖ్యలో వాహనాలు కాలిపోయాయి. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన కొందరి ఇళ్లపై రాళ్లు రువ్వడంతో పాక్షికంగా ఆస్తి నష్టం జరిగింది.
మరోపక్క గురజాల నియోజకవర్గం తంగెడలోనూ టీడీపీ మద్దతుదారుల షాపులను ప్రత్యర్థులు తగులబెట్టారు.
నరసరావుపేటలో టీడీపీ శ్రేణులు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై దాడి చేశాయి. పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ రెండు కార్లు తగులబెట్టారు.
ప్రస్తుతం కాలిపోయిన వాహనాలు, పోలీసులు వేసిన ముళ్లకంచెలు, ధ్వంసమైన వ్యాపార సంస్థల భవనాలు హింసకు ఆనవాళ్లుగా కనిపిస్తున్నాయి.

'దాడి చేసి గ్యాస్ సిలిండర్ కూడా ఎత్తుకెళ్లారు..'
కారంపూడికి చెందిన పమిడిమల్ల పుల్లమ్మ.. ఆమె కొడుకు, కోడలితో కలిసి ఓ చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతోంది.
ఎన్నికల ప్రచారంలో తన కుమారుడు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాడనే కారణంతో వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన కార్యకర్తలు తమ హోటల్‌పై దాడి చేశారని పుల్లమ్మ చెప్పారు.
అద్దె ఇంట్లో ఉంటూ హోటల్ నడుపుతూ జీవిస్తున్న తమ జీవనోపాధి మీద దెబ్బకొట్టారని ఆమె బీబీసీ వద్ద కన్నీరు పెట్టుకున్నారు.
"రజక వృత్తిదారులం. నాకు భర్త లేడు. కొడుకు, కోడలితో కలిసి రెండు నెలల క్రితం హోటల్ పెట్టుకున్నాం. లక్ష రూపాయలు ఖర్చు అయింది. మాచర్ల నుంచి వచ్చి మా హోటల్ మీద దాడి చేశారు. అన్నీ ధ్వంసం చేశారు. చివరకు గ్యాస్ సిలిండర్ కూడా ఎత్తుకుపోయారు. అన్నం వండుకోవడానికి గ్యాస్ కూడా లేదు" అని పుల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎందుకింత హింస?
పేదరికం, పగలు, ప్రతీకారాలకు పల్నాడు గతంలో పేరుమోసినప్పటికీ గడిచిన నాలుగు ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు తక్కువే నమోదయ్యాయి.
కానీ గత ఐదేళ్లుగా హింసాత్మక వాతావరణం పెరుగుతూ వస్తోంది. దానికి కుల కోణం కూడా జత కలిసింది.
పల్నాడులో రెండు దశాబ్దాల క్రితం వరకు ఫ్యాక్షన్ కలహాలుండేవి. ప్రత్యర్థుల మీద దాడులు, హత్యలు చాలా జరిగాయి.
ఏడు హత్యల కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ప్రస్తుతం మాచర్ల నుంచి టీడీపీ తరుపున బరిలో ఉన్న జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
కోడెల శివప్రసాద్ ఇంట్లో బాంబులు పేలిన ఘటనలో ఆయన అనుచరులు ప్రాణాలు కోల్పోవడం కూడా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
కోడెల హయాంలో ప్రత్యర్థుల నోరు నొక్కారని, కోడెల కుటుంబం ఇష్టారాజ్యంగా పెత్తనం చెలాయించిందనే ఆరోపణలు చాలాసార్లు వచ్చాయి.
అయితే 2019 ఎన్నికలతో దృశ్యం మారింది. ఆధిపత్యం చేతులు మారింది.
2019 ఎన్నికల సందర్భంగా కోడెలపై దాడి చేశారు. 2021 మునిసిపల్ ఎన్నికల సమయంలోనూ టీడీపీ నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్న మీద మాచర్లలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారు.
ఇలాంటి అనేక ఘటనలతో పల్నాడు సమస్యాత్మక ప్రాంతంగా మారింది. అందుకు తగినట్లుగా భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించినట్టు ఎన్నికల కమిషన్ చెప్పింది.
కానీ పోలింగ్ నాడు, ఆ తర్వాత కూడా దాడులు జరిగాయి. మాచర్లలో టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల మీద దాడులు జరిగిన రెండు పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సంఖ్యలో పోలీసులు కనిపించలేదు. దాడులు నివారించే ప్రయత్నమూ కనిపించలేదు.
దాడులను నివారించడంలో విఫలమయ్యారంటూ పల్నాడు జిల్లా ఎస్పీ గరికపాటి బిందు మాధవ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేసింది. ఇతర కింది స్థాయి అధికారుల మీద చర్యలు తీసుకుంది. విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం( సిట్)ను ఏర్పాటు చేశారు.

'ఎన్నడూ చూడలేదు.. '
"పల్నాడులో పూర్వం కత్తులు, నాటు బాంబులతో దాడులు చేసుకోవడం గురించి తెలుసు. కానీ ఈసారి దారుణంగా రెచ్చిపోయారు. ఇష్టారాజ్యంగా సాగింది. మూకలు పోలీస్ స్టేషన్‌కి సమీపంలోని ఇళ్లకు నిప్పు పెట్టాయి. ఇది మంచిది కాదు. ఇరు పార్టీల నాయకులు బాగానే ఉన్నారు. కార్యకర్తలే ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు" అని కారంపూడికి చెందిన ఈదరి చినమంగయ్య అన్నారు.
పల్నాడులో ఈ పరిస్థితికి రాజకీయ పార్టీల నేతలే కారణమని గురజాలకు చెందిన అధ్యాపకుడు మక్కెన రాంబాబు అన్నారు.
"రాజకీయ నేతలు తమ ప్రయోజనాల కోసం జనాన్ని రెచ్చగొడుతున్నారు. పెట్రోల్ బాంబులు వంటివి అందిస్తున్నారు. ఇందుకు రెండు పార్టీల నాయకులదే బాధ్యత. ప్రజలు శాంతియుతంగానే ఉంటారు. అల్లర్లకు కారకులైన వారిపై చర్యలు తీసుకుంటే ఇతరులు ఇలాంటి విధ్వంసంలో తలదూర్చరు" అని రాంబాబు అభిప్రాయపడ్డారు.
భద్రతా వైఫల్యమే హింసకు కారణమంటూ వస్తున్న విమర్శలపై స్పందన కోసం పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించింది.
విచారణ కొనసాగుతున్నందున ప్రస్తుతం ఆ వ్యవహారంపై మాట్లాడలేమని ఎస్పీ కార్యాలయం తెలిపింది.
అయితే హింసాత్మక చర్యలను నియంత్రించామని, అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని అడ్మిన్ ఎస్పీ తెలిపారు.

22 కేసులు.. 19 మంది అరెస్ట్
పోలింగ్‌కి ముందు, ఆ తర్వాత జరిగిన పల్నాడు హింసపై ఈసీ ఆదేశాలతో యంత్రాంగం అప్రమత్తమైంది. దాడులకు కారకులపై కేసులు నమోదయ్యాయి.
మే 19 నాటికి జిల్లావ్యాప్తంగా 22 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో మూడు నియోజక వర్గాల పరిధిలోని వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ నేతలు నిందితులుగా ఉన్నారు. వారిలో 19 మందిని అరెస్ట్ చేశారు.
మరోవైపు మాచర్ల వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ అభ్యర్ధి జూలకంటి బ్రహ్మరెడ్డిని మూడు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు.
బదిలీ అయిన కలెక్టర్, ఎస్పీల స్ధానంలో కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరించారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంచేందుకు జూన్ 5 వరకు 144 సెక్షన్ కొనసాగుతుందని, అదనపు బలగాల పహారా ఉంటుందని పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ శ్రీకేశ్ తెలిపారు.
ఇక పిన్నెల్లి సోదరులు హైదరాబాద్ వెళ్ళిపోయారు. వివిధ పార్టీల నాయకుల పర్యటనలపై ఆంక్షలు విధించారు.

ఫొటో సోర్స్, AP police
సిట్ నివేదికలో ఏముంది?
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం - సిట్ ఏర్పాటు చేసింది.
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో 13 మంది సభ్యులతో సిట్ ఏర్పాటైంది.
పల్నాడు, తాడిపత్రి, మాచర్ల, నరసరావుపేట, తిరుపతి, చంద్రగిరిలో హింసాత్మక ఘటనలు, అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్‌లను సిట్ పరిశీలించింది. వీటిపై 18, 19 తేదీల్లో సిట్ విచారణ చేసింది.
22 కేసుల్లో 581 మందిని నిందితులుగా సిట్ రిపోర్టులో పేర్కొన్నారు. రిపోర్టును డీజీపీకి సమర్పించే నాటికి 274 మందిని గుర్తించినట్టు సిట్ తెలిపింది. మరో 307 మందిని గుర్తించాల్సి ఉండగా, 19 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. 91మందికి 41ఏ కింద నోటీసులు జారీ అయ్యాయి.
సిట్ రిపోర్టును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. కొందరు పోలీసు అధికారుల పాత్రను కూడా సిట్ తప్పుబట్టింది.
దాంతో ఈ నివేదిక ఆధారంగా ఈసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ రాజశేఖరరెడ్డి: హెలికాప్టర్ అదృశ్యమైన తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది... ఆచూకీ ఎలా తెలిసింది?
- బ్యాంకు పరీక్షల కోచింగ్‌కు నంద్యాల ఎందుకింత ప్రత్యేకం?
- వంటకు ఏ పాత్రలు వాడాలి? పోషకాలు కోల్పోకుండా ఆహారం ఎలా వండాలి?
- దుబాయ్ రియల్ ఎస్టేట్ : భారత్, పాకిస్తాన్లకు చెందిన నేతలు, నేరగాళ్లు ఇక్కడ ఎలా ఆస్తులు కొంటున్నారంటే...
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














