హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి: 7 ప్రశ్నలు - సమాధానాలు

ఫొటో సోర్స్, Reuters
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దొల్లహియన్ చనిపోయారని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ తెలిపింది. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ప్రమాదానికి గురైంది.
సహాయక బృందాలు సోమవారం ఉదయం ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని చేరుకోగలిగాయి.
హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతంలో హీట్ సోర్స్‌ను తుర్కియే పంపించిన డ్రోన్ గుర్తించినట్లు అనడోలు న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ప్రమాద స్థలాన్ని గుర్తించామని, హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయిందని, ఎవరూ ప్రాణాలతో ఉన్నట్లు అనిపించడం లేదని ఇరాన్ అధికారులు మొదట చెప్పారు.
ఆ తర్వాత కొద్ది సేపటికే హెలికాప్టర్ ప్రమాదంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్ చనిపోయారని ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ వెల్లడించింది.
1. హెలికాప్టర్‌లో ఎవరెవరు ఉన్నారు?
ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌లో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో పాటు, ఆ దేశ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీర్-అబ్దొల్లహియన్, ఇరాన్ తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ గవర్నర్ మలేక్ రెహ్‌మతి, పైలట్, సెక్యూరిటీ చీఫ్, సిబ్బంది ఉన్నారు.
ఈ ప్రమాదంలో వీరందరూ ప్రాణాలు కోల్పోయారు.
2. హెలికాప్టర్ క్రాష్ ఎక్కడ జరిగింది?
స్థానిక మీడియా కథనం ప్రకారం.. ఇరాన్, అజర్‌బైజాన్ సరిహద్దుల్లో నిర్మించిన కిజ్ కలాసీ, ఖొదాఫరీన్ అనే రెండు డ్యామ్‌లను ఇబ్రహీం రైసీ ఆదివారం ప్రారంభించారు. ఆ తర్వాత తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది.
తబ్రిజ్ నగరం ఇరాన్‌లోని తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్ రాజధాని.
హెలికాప్టర్ ప్రమాదం జరిగిన ప్రాంతం తబ్రిజ్ నగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది.
3. శకలాలను గుర్తించేందుకు ఎందుకు ఆలస్యమైంది?
హెలికాప్టర్ క్రాష్ అయిన ప్రాంతంలో పెద్ద ఎత్తున పొగ అలుముకుని ఉందని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ప్రమాదం జరిగిన కొండ ప్రాంతంలో దట్టమైన అడవిలో ఐదు మీటర్ల వరకు మాత్రమే విజిబులిటీ ఉందని సహాయక బృందంతో కలిసి వెళ్లిన ఒక రిపోర్టర్ తెలిపారు.

ఫొటో సోర్స్, AA VIDEO - ANADOLU AGENCY
4. సహాయక చర్యల్లో ఏ దేశాలు పాల్గొన్నాయి?
ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో వెంటనే పలు దేశాలు స్పందించి, సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ముందుకు వచ్చాయి.
ప్రమాద స్థలానికి సంబంధించిన సమాచారాన్ని తుర్కియే తన డ్రోన్ ద్వారా సేకరించింది.
రష్యా కూడా తన సహాయక బృందాలను పంపించింది. 47 మంది నిపుణులను, హెలికాప్టర్, ఇతర సహాయక వాహనాలను పంపినట్లు చెప్పింది.
యూఏఈ కూడా తన సాయాన్ని ప్రకటించింది.
5. ఇబ్రహీం రైసీ ఏ హెలికాప్టర్‌లో ప్రయాణించారు?
‘బెల్ 212’ అనే హెలికాప్టర్‌లో ఇబ్రహీం రైసీ ప్రయాణించారని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ తెలిపింది. ఈ మోడల్ హెలికాప్టర్లు అమెరికాలో తయారయ్యాయి. అయితే, 1979 విప్లవం తర్వాత నుంచి ఈ మోడల్ హెలికాప్టర్లను ఇరాన్‌కు అమ్మేందుకు వీలులేదని బీబీసీ పర్షియన్ సీనియర్ రిపోర్టర్ సియావాష్ అర్దలాన్ చెప్పారు.
2009లో ‘బెల్ 430’ మోడల్ హెలికాప్టర్ కూలడంతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు. ఆ ప్రమాదంపై ఆర్‌కె త్యాగి నేతృత్వంలో డీజీసీఏ ఏర్పాటు చేసిన సాంకేతిక కమిటీ 139 పేజీల నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్ట్ ప్రకారం, హెలికాప్టర్ గేర్ బాక్సులో లూబ్రికెంట్ ఆయిల్ సరఫరాలో లోపం తలెత్తిందని, దాన్ని సరిదిద్దే క్రమంలో పైలట్లు చెక్‌లిస్టు కోసం వెతికారని, హెలికాప్టర్‌పై నియంత్రణ కోల్పోయారని, హెలికాప్టర్ అత్యంత వేగంగా కిందికి పడిపోయిందని పేర్కొన్నారు. అలాగే, హెలికాప్టర్ నిర్వహణలోనూ, ఆరోజు హెలికాప్టర్ ప్రయాణానికి సంబంధించిన ఫ్లైట్ ప్లానింగ్‌లోనూ చాలా లోపాలు ఉన్నాయని తెలిపింది.
ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియలేదు. అయితే, ఇరాన్‌లో విమానాలు, హెలికాప్టర్ల భద్రత పేలవంగా ఉంటోందని బీబీసీ పర్షియన్ సీనియర్ రిపోర్టర్ సియావాష్ అర్దలాన్ చెప్పారు. అందుకు దశాబ్దాలుగా అమెరికా నుంచి ఎదుర్కొంటున్న ఆంక్షలు కొంతమేర కారణమని చెప్పొచ్చన్నారు. ఆంక్షల ప్రభావం ఇక్కడి వాయు రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది.
గతంలోనూ ఇరాన్ రక్షణ, రవాణా శాఖల మంత్రులు, సైనిక కమాండర్లు, ఎయిర్‌ఫోర్స్ అధికారులు విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
6. రైసీ చివరిసారి ఎవరితో కనిపించారు?
హెలికాప్టర్ ఎక్కడానికి ముందు, ఇరాన్ అధ్యక్షుడు రైసీ, అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హమ్ అలియేవ్‌తో కలిసి ఇరు దేశాల సరిహద్దులో ఏర్పాటు చేసిన డ్యామ్‌ను ప్రారంభించారు. ఈ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి.
ఈ సంక్షోభ సమయంలో ఇరాన్‌కు కావాల్సిన ప్రతి సాయాన్ని అందించేందుకు అజర్‌బైజాన్ సిద్ధంగా ఉందని ఆ దేశ అధ్యక్షుడు ఇల్హమ్ చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
7. ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా ఖమైనీ ఏమన్నారు?
ఈ ప్రమాదం ఇరాన్ పాలనపై ఎలాంటి ప్రభావం చూపదని అయతొల్లా ఖమైనీ అన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వ పనులపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు.
ప్రమాదం తర్వాత, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌తో ఖమైనీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, ANI
భారత ప్రధాని మోదీ స్పందన..
ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాద వార్తపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ సంక్షోభ సమయంలో ఇరాన్ ప్రజలకు సంఘీభావం తెలుపుతున్నట్టు చెప్పారు.
రైసీ మరణ వార్త తనకు తీవ్ర బాధను, షాక్‌ను కలిగించిందని అన్నారు.
రైసీ మృతి పట్ల సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ రాజశేఖరరెడ్డి: హెలికాప్టర్ అదృశ్యమైన తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది... ఆచూకీ ఎలా తెలిసింది?
- బ్యాంకు పరీక్షల కోచింగ్‌కు నంద్యాల ఎందుకింత ప్రత్యేకం?
- వంటకు ఏ పాత్రలు వాడాలి? పోషకాలు కోల్పోకుండా ఆహారం ఎలా వండాలి?
- దుబాయ్ రియల్ ఎస్టేట్ : భారత్, పాకిస్తాన్లకు చెందిన నేతలు, నేరగాళ్లు ఇక్కడ ఎలా ఆస్తులు కొంటున్నారంటే...
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














