ఆంధ్రప్రదేశ్: సాయంత్రం 6 గం.లకు ముగియాల్సిన పోలింగ్ కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటేదాకా ఎందుకు సాగింది?

ఎన్నికలు

ఫొటో సోర్స్, Laxman

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి.

పోలింగ్ శాతాలను ఎన్నికల సంఘం వెల్లడించడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎవరి లెక్కల్లో వారు మునిగిపోయారు.

అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అర్ధరాత్రి వరకు ఓటింగ్ జరిగింది.

మరి, అసలు అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడానికి కారణమేంటి? సాయంత్రం ఆరు గంటలకే ముగియాల్సిన పోలింగ్ అర్ధరాత్రి దాటి 2 గంటల వరకు ఎందుకు జరిగింది? దీని వెనుక ఏం జరిగింది? ఎన్నికల సంఘం సరైన చర్యలు తీసుకుందా? అనే చర్చకు దారి తీసింది.

సార్వత్రిక ఎన్నికలు

ఫొటో సోర్స్, FB/CEO Telangana

సమయం ఆరు గంటల వరకు పెంచినా

పోలింగ్ రోజు ఉదయాన ఓటర్లు పోలింగ్ సమయం (7గంటలు) కంటే ముందుగానే కేంద్రాల వద్ద బారులు తీరారు.

సాధారణంగా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. ఎండ తీవ్రత కారణంగా ఈసారి పోలింగ్ సమయాన్ని(మావోయిస్టు ప్రాభావిత ప్రాంతాలు కాకుండా) ఎన్నికల సంఘం మరో గంట అంటే సాయంత్రం 6 గంటల వరకు పెంచింది.

అంటే ఆరు గంటల్లోపు పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్‌లో ఉన్న వారంతా ఓటు వేసేందుకు అర్హులు. దానికి తగ్గట్టుగానే సాయంత్రం ఆరు గంటల్లోగా క్యూ లైన్లో ఉన్న ఓటర్లందరికీ స్లిప్పులు ఇచ్చి ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్లు ఎన్నికల సం‌‍ఘం ప్రకటించింది.

వీరిలో కొందరు మూడు, నాలుగు గంటలు క్యూ లైనులో నిల్చొని ఓటు వేయగా, మరికొందరు స్లిప్పులు తీసుకుని జనం తాకిడి కాస్త తగ్గాక వచ్చి ఓటు వేసినట్లు అ‌‍ధికారులు చెబుతున్నారు.

ఉదయం పెద్దసంఖ్యలో ఓటర్లు వచ్చినప్పటికీ, మధ్యాహ్నం కాస్త పల్చబడ్డారు. సాయంత్రం 4 గంటల తర్వాత తిరిగి జనం తాకిడి పెరిగిందని, అందుకే నిర్దేశిత సమయం కంటే ఎక్కువ సేపు పోలింగ్ జరిగిందని ఏపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముకేశ్ కుమార్ మీనా చెప్పారు.

‘‘మామూలుగా సాయంత్రం ఆరు గంటలకే అయిపోవాలి. కానీ, సాయంత్రం పెద్దసంఖ్యలో ఓటర్లు ఓటు వేయడానికి వచ్చారు. 3,500 పోలింగ్ కేంద్రాలలో సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్ ప్రక్రియ నడిచింది. ఒకచోట అర్ధరాత్రి 2 గంటల వరకు సాగింది’’ అని చెప్పారు ముకేశ్ కుమార్ మీనా.

సార్వత్రిక ఎన్నికలు

ఫొటో సోర్స్, FB/CEC

వేలాది పోలింగ్ కేంద్రాల్లో నిర్ధిష్ట సంఖ్యకు మించి ఓట్లు

సాధారణంగా ఎన్నికల సంఘం చెబుతున్న సూచనల ప్రకారం 1000-1200 ఓట్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉంటుంది.

కొన్నిసార్లు స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల సంఖ్యను పెంచుతుంటారు.

ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలున్నాయి. ‌‍ఇందులో 5,600 పోలింగ్ కేంద్రాలలో 1,200 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం చెబుతోంది. ఇది ఓటు వేసే సమయంపై ప్రభావం చూపింది.

సార్వత్రిక ఎన్నికలు

ఫొటో సోర్స్, FB/CEO Telangana

కొందరికి ఓటు వేయడానికి 2, 3 నిమిషాలు

ఏపీలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీకి పోలింగ్ జరిగింది. ముందుగా లోక్‌సభ అభ్యర్థికి ఓటు వేయాలి. తర్వాత అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఈవీఎంలు ఏర్పాటు చేశారు.

ఒక ఓటరు ఓటు వేసేందుకు సగటున 30 సెకన్లకు మించదని కేంద్ర ఎన్నికల సంఘం చెబుతున్న మాట.

దీనివల్ల గంటకు 100-120 మంది ఓటు వేసేందుకు వీలవుతుందని చెబుతున్నారు.

ఏపీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు చాలా మందికి సగటున ఒకటిన్నర నుంచి 2 నిమిషాలు పట్టిందని అనకాపల్లి జిల్లాకు చెందిన అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

‘‘మా వద్ద పోలింగ్ కేంద్రంలో 1,560 ఓట్లు ఉన్నాయి. యువతతోపాటు కొంచెం అవగాహన ఉన్న వ్యక్తులకు ఓటు వేసేందుకు కనీసం నిమిషం సమయం పట్టింది. ముసలివా‌ళ్లు వచ్చినప్పుడు రెండు నుంచి మూడు నిమిషాలు పట్టింది. సాయంత్రం వరకు కనీసం రెండు వందల మంది క్యూ లైన్లో ఉన్నారని అనుకుందాం. రెండు నిమిషాల చొప్పున నాలుగు వందల నిమిషాలు. అంటే ఆరున్నర గంటల సమయం.

సాయంత్రం నాలుగు గంటల నుంచి లెక్క వేసుకున్నా.. అందరూ పూర్తయ్యేసరికి పది గంటలకుపైగానే అయ్యింది. వేరే ప్రాంతాల నుంచి ఉదయం బయల్దేరి సాయంత్రానికి సొంతూళ్లకు వచ్చారు.

వారు సాయంత్రం ఆరు గంటలకు కాస్త ముందు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. దీనివల్ల అప్పటికే క్యూ లైన్లో ఉన్న ఓటర్లతోపాటు కొత్తగా వచ్చిన వారిని కలుపుకొని అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగించాల్సి వచ్చింది’’ అని ఆ అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి తెలిపారు.

ఓటు వేసినప్పుడు ఈవీఎంలో బటన్ నొక్కడం, తర్వాత వీవీ ప్యాట్ స్లిప్ బయటకు రావడం, దాన్ని సరిచూసుకోవడం ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టిందనేది వారు చెప్పేమాట.

ఇలా ఎక్కువ మంది ఓటర్లు ఉండటంతో సమయం దాటిపోయిన తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది.

సార్వత్రిక ఎన్నికలు

ఫొటో సోర్స్, FB/CEC AP

వర్షం పడటంతో ఇబ్బందులు

కోనసీమ జిల్లాలో దాదాపు 50 కేంద్రాల్లో రాత్రి పది గంటల తర్వాత కూడా ఓటింగ్ జరిగింది.

కాకినాడ నగరంలోని దుమ్ములపేటలో రాత్రి పదిన్నర వరకు ఓటింగ్ కొనసాగింది.

కర్నూలు జిల్లా గూడూరు మండలం పోలింగ్ కేంద్రం 134తోపాటు ఆలూరు మండలంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 11.30 వరకు పోలింగ్ జరిగింది.

దీనికి గల కారణాలపై బీబీసీతో కర్నూలు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సృజన మాట్లాడారు.

‘‘పోలింగ్ ఆలస్యం కావడానికి ముఖ్యంగా కొన్ని కారణాలున్నాయి. వాతావరణం అనుకూలించలేదు. వర్షం పడేసరికి పోలింగ్ నెమ్మదించింది. వివిధ కారణాలతో ఈవీఎంలు మార్చాల్సి వచ్చింది. ప్రజలు ఎక్కువమంది ఓటు వేయడానికి ముందుకు వచ్చారు. రద్దీ పెరగడంతో వారిని కొంతమేర నియంత్రించి లోపలికి పంపాల్సి వచ్చింది. చాలావరకు రాత్రి 10:45, 11:30 వరకల్లా పోలింగ్ పూర్తయింది. సీళ్లు వేయడం, రిపోర్టు రాయడం వంటి వాటికి 45 నిమిషాలు పట్టింది’’ అని ఆమె చెప్పారు.

‘‘ఓటింగ్ చివరి దశలో ఉన్న సమయంలో వర్షం కురవడంతో ఆలస్యమైంది. ఉదయగిరిలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వర్షం కారణంగా కూలిపోయింది. కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల్లోనూ వర్షం కారణంగా పోలింగ్ ప్రక్రియ ఆలస్యమైనట్లు సమాచారం ఉంది’’ అని చెప్పారు ముకేశ్ కుమార్ మీనా.

వర్షం కారణంగా పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలు- బ్యాలెట్ యూనిట్లను డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, అక్కడి నుంచి స్ట్రాంగ్ రూములకు తరలించే క్రమంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని ముకేష్ కుమార్ మీనా చెప్పారు.

రాష్ట్రంలో మొత్తం 33 ప్రాంతాల్లో స్ట్రాంగ్ రూములను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.

సార్వత్రిక ఎన్నికలు

ఫొటో సోర్స్, FB/CEC Ap

దూరప్రాంతాల నుంచి సాయంత్రానికి రాక

సాయంత్రం ఆరు గంటలకు ముందు క్యూ లైనులో ఉన్న వారందరికీ స్లిప్పులు ఇచ్చి ఓటు వేసేలా చూశామని చెప్పారు కర్నూలు కలెక్టర్ సృజన.

మధ్యాహ్నం ఎండ, ఉక్కపోత కారణంగా ఓటర్లు రాకపోవడంతో సాయంత్రం ఒక్కసారిగా పోటెత్తారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు కొందరు సాయంత్రానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం ఎక్కువ మంది రావడానికి ఇది ఒక కారణమని పోలింగ్ అధికారులు చెప్పారు.

పోలింగ్ రోజున ఆలస్యంగా నడిచిన నాందేడ్- విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు, ఎన్నికల సంఘం సీఈవో ముకేశ్ కుమార్ మీనా చొరవతో సాయంత్రం 5.15 గంటలకల్లా విశాఖపట్నం చేరుకుంది. అందులో సుమారు 800 మంది ఓటర్లు ఉండటంతో వారంతా అప్పటికప్పుడు హడావుడిగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు.

సార్వత్రిక ఎన్నికలు

ఫొటో సోర్స్, Laxman

ఈవీఎంలు మార్చడం వల్ల ఆలస్యం

పల్నాడు, కడప జిల్లా రైల్వే‌కోడూరులో ఈవీఎంలను దుండగులు పగలగొట్టారని, వాటిని తనిఖీ చేసి కొత్తవి ఏర్పాటు చేసేసరికి రెండు, మూడు గంటలపాటు పోలింగ్ నిలిచిపోయిందని బూత్ లెవల్ అధికారులు చెబుతున్నారు.

ఓటింగ్ మీద ఈ ప్రభావం కూడా పడిందని అన్నారు.

‘‘ఉదయం ఏడు గంటలకు ముందు మాక్ పోలింగ్ జరపాలి. ఆ తర్వాత ఆ ఓట్లను తొలగించి ఈవీఎంలను అసలైన పోలింగ్‌కు సిద్ధం చేయాలి. కొన్నిచోట్ల ఓట్లు తొలగించే క్రమంలో సాంకేతిక సమస్యలు వచ్చాయి. వాటిని సరిచేసి పోలింగ్ ప్రారం‌‍భించడానికి గంట నుంచి రెండు గంటల సమయం పట్టింది. అలా జరిగిన ఆలస్యంతో పోలింగ్ ప్రక్రియ ఆలస్యం అయ్యింది’’ అని పల్నాడు జిల్లాకు చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రిసైడింగ్ అధికారి ఒకరు బీబీసీతో అన్నారు.

సార్వత్రిక ఎన్నికలు

ఫొటో సోర్స్, FB/CEO AP

అసెంబ్లీ కంటే లోక్‌సభకు 227 ఓట్లు ఎక్కువ

ఏపీలో మే 13న జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో మొత్తం 4,13,33,702 మంది ఓటర్లకుగాను 3,33,40,333 మంది ఓటు వేశారు. అంటే 80.66శాతం ఓటింగ్ నమోదైంది.

ఇది కాకుండా పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ కలిపితే పోలింగ్ 81.86శాతానికి పెరిగింది.

2014లో 78.41శాతం, 2019లో 79.77శాతంతో పోల్చితే ఇది ఎక్కువ.

ఈ ఎన్నికల్లో లోక్‌సభ అభ్యర్థులకు కొంచెం ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.

లోక్‌సభకు 3,33,40,560 మంది ఓటు వేశారు.

అసెంబ్లీకి వచ్చేసరికి 3,33,40,333 ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్‌సభతో పోల్చితే 227 ఓట్లు అసెంబ్లీ ఎన్నికలకు తక్కువగా పోలయ్యాయి.

ఓటర్లు కొందరు లోక్‌సభ అభ్యర్థికి ఓటు వేసి అసెంబ్లీ అభ్యర్థికి ఓటు వేయకుండా వెళ్లిపోయి ఉండవచ్చని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముకేశ్ కుమార్ మీనా అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)