అఫ్జల్ ఖాన్: తన 63 మంది భార్యలను శివాజీతో యుద్ధానికి ముందే చంపేశారా?

63 సమాధుల ఫోటో

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, అఫ్జల్ ఖాన్ భార్యల సమాధులు
    • రచయిత, వకార్ ముస్తాఫా
    • హోదా, పరిశోధకులు

కర్ణాటకలోని బీజాపూర్‌లో ఒకచోట ఏడు వరుసల సమాధులు ఉన్నాయి.

మొదటి నాలుగు వరుసలలో ఒక్కో వరుసలో 11 చొప్పున, ఐదో వరుసలో ఐదు, ఆరు, ఏడు లైన్లలో ఏడేసి సమాధులు చొప్పున మొత్తం 63 సమాధులు ఉన్నాయి.

వాటిని పాతిపెట్టిన విధానం, సమాధుల మధ్య ఖాళీ స్థలం, సమాధుల సారూప్యతను గమనిస్తే వారందరూ బహుశా ఒకే సమయంలో చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.

సమాధులపై చదునుగా ఉన్న పై భాగం, అవి మహిళల సమాధులనే విషయం చెబుతోంది.

కర్ణాటకలోని బీజాపూర్ పేరును 2014లో విజయ్‌పుర్‌గా మార్చారు.

ఈ నగరంలో ఓ మూలన ఉన్న ఈ పర్యటక స్థలం '60 సమాధులు' పేరుతో ప్రసిద్ధిగాంచింది.

1668 వరకు ఆదిల్ షాహి పాలకులకు ఈ నగరం రాజధానిగా ఉండేది.

బీజాపూర్ సామ్రాజ్యం దక్షిణాన విస్తరించడంలో బీజాపూర్ సుల్తానుల సేనాధిపతి అఫ్జల్ ఖాన్ కీలకపాత్ర పోషించారు.

ఛత్రపతి శివాజీ తన పులిగోళ్ళ ఆయుధంతో అఫ్జల్ ఖాన్‌ను చంపేశారు.

బీజాపూర్ సుల్తాన్ రెండో అలీ అదిల్ షా 1659లో అఫ్జల్ ఖాన్‌ను శివాజీపై యుద్దానికి పంపారు.

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేసిన హెన్రీ కౌసెన్స్ ప్రకారం, యుద్ధం నుంచి ప్రాణాలతో తిరిగి రావని ఈ యుద్ధానికి వెళ్లే ముందు ఒక జ్యోతిష్యుడు అఫ్జల్‌ ఖాన్‌కు చెప్పారు.

అప్ఝల్ ఖాన్‌కు జ్యోతిష్యంపై గట్టి నమ్మకం ఉండేదని, తాను చేసే ప్రతి పని జ్యోతిష్యులు చెప్పినట్టుగానే చేసేవారని తను రాసిన ‘బీజాపుర్: ది ఓల్డ్ కాపిటల్ ఆఫ్ ది ఆదిల్ షాహీ కింగ్స్’ అనే పుస్తకంలో కౌసెన్స్ రాశారు.

హెన్రీ కౌసెన్స్ రాసిన పుస్తకం కవర్ పేజీ

ఫొటో సోర్స్, BAIJAPUR/ BOOK TITLE

ఫొటో క్యాప్షన్, హెన్రీ కౌసెన్స్ రాసిన పుస్తకం కవర్ పేజీ

ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పశ్చిమ విభాగానికి 1891 నుంచి 1910 వరకు హెన్రీ కౌసెన్స్ సూపరింటెండెంట్‌గా ఉన్నారు.

కౌసెన్స్ రాసిన పుస్తకం 1905లో ప్రచురితమైంది.

సంప్రదాయం ప్రకారం అఫ్జల్ ఖాన్ ఓ సమాధిని, మసీదును నిర్మించుకున్నారని అందులో రాశారు.

రెండంతస్తుల ఈ మసీదు 1653లో పూర్తయింది.

అయితే ఇందులో పై భాగం మహిళల కోసమని నమ్మేవారు.

ఈ తేదీ మసీదు ఆర్చిపై అఫ్జల్ ఖాన్ పేరుతోపాటుగా రాసి ఉందని ఆ పుస్తకంలో తెలిపారు.

అఫ్జల్ ఖాన్ శివాజీకి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టే సమయానికి సమాధి నిర్మాణం పూర్తి కాలేదు.

జ్యోతిష్యుల మాటలను పూర్తిగా విశ్వసించే అఫ్జల్ ఖాన్, తాను యుద్ధానికి వెళుతున్న సంవత్సరాన్నే తాను చనిపోయే సంవత్సరంగా సమాధిపై రాయించుకున్నారని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.

అఫ్జల్ ఖాన్ , ఆయన సహచరులు తాము ఇక తిరిగిరామనే నమ్మకంతోనే బీజాపూర్‌ను విడిచారు. ‘‘అందుకే వారు తమ భార్యలను నీళ్ళలో ముంచి చంపేయాలని నిర్ణయించుకున్నారు’’ అని ఆ పుస్తకంలో రాశారు.

అఫ్జల్ ఖాన్ తాను యుద్ధంలో చనిపోతే తన భార్యలు ఎవరూ పరాయివాళ్ళ చేతుల్లో పడకూడదనే ఉద్దేశంతో వారందరినీ ఒకరి తరువాత ఒకరిని నూతిలోకి తోసి చంపేపినట్టు చరిత్రకారిణి లక్ష్మీ శరత్ ‘ది హిందూ’లో రాశారు.

’’వీరిలో ఒకరు తప్పించుకున్నారు. కానీ తరువాత ఆమెను కూడా పట్టుకుని చంపేశారు’’ అని రాశారు.

అయితే ఈ 63 సమాధులతోపాటు మరో సమాధి కూడా ఉందని, కానీ అది ఖాళీగా ఉందని హెన్రీ కౌసెన్స్ రాశారు.

బహుశా ఒకరిద్దరు మహిళలు బతికి ఉంటారు. ఈ ఖాళీ సమాధి దానినే సూచిస్తోంది అని హెన్రీ రాశారు.

‘‘దీనిపై అనేక ప్రచారాల కారణంగా అఫ్జల్ ఖాన్ తరువాత కాలంలో చాలా ప్రసిద్ధి చెందాడు’’ అని చరిత్రకారుడు జాదునాథ్ సర్కార్ రాశారు.

‘‘శివాజీపై యుద్ధానికి సిద్ధమవుతున్న వేళ ఓ జ్యోతిష్యుడు, యుద్దం నుంచి అఫ్జల్ ఖాన్ ప్రాణాలతో వెనక్కి రారని చెప్పారు. దీంతో తను లేకపోతే తన 63 మంది భార్యలను మరే ఇతర పురుషుడు చూడకూడదనే ఉద్దేశంతో వారిని బీజాపూర్ సమీపంలోని అఫ్జల్‌పురా వద్ద హతమార్చారు’’ అని జాదునాథ్ సర్కార్ కూడా రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

60 కాదు 64 సమాధులు

కర్ణాటకలోని బీజాపూర్‌లో ఉన్న అల్మీన్ మెడికల్ కాలేజీ సమీపంలో ఓ పాతభవనం మధ్యలోని ఓ వేదికపై ఒకే విధమైన సమాధులు ఏడు వరుసలు ఉన్నాయని పరిశోధకుడు మహ్మద్ అన్సుర్ రహ్మాన్ ఖాన్ రాశారు.

స్థానికులు వీటిని 60 సమాధులు అంటుంటారని చెప్పారు.

‘‘ఈ సమాధులన్నీ అఫ్జల్ ఖాన్ భార్యలవే. శివాజీతో యుద్ధానికి ముందు వారిని చంపారు. తాను చనిపోతే తన భార్యలను ఎవరూ పెళ్ళి చేసుకోకూడదనే ఉద్దేశంతోనే వారిని చంపారు’’ అని రహ్మాన్ ఖాన్ తెలిపారు.

అఫ్జల్ ఖాన్ కూడా తన సమాధి వీటి పక్కనే ఉండాలని భావించారు కానీ, ఆయన యుద్ధం నుంచి తిరిగిరాలేదు.

‘‘స్థానికంగా ఈ ప్రాంతం 60 సమాధులుగా ప్రసిద్ధి చెందింది. కానీ ఇది నిజం కాదు. ఇక్కడ 64 సమాధులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఖాళీగా ఉంది’’ అని మహ్మద్ షేక్ ఇక్బాల్ చిస్తీ చెప్పినట్టు అన్సుర్ రహ్మన్ ఖాన్ తెలిపారు.

‘‘ఈ స్మశానం బహుశా రాజ కుటుంబంలోని మహిళల కోసం కేటాయించినదై ఉంటుంది. ఆ రోజులలో యుద్ధాలు సాధారణం. అయినా ఓ సేనాధిపతి అజ్ఞానంతో అంతటి పిరికిపందచర్య ఎలా తీసుకున్నారో’’ అని అన్సుర్ రహ్మాన్ ఖాన్ అన్నారు.

‘‘ఈ సమాధులను నల్లని రాళ్ళతో నిర్మించారు. అవి అక్కడ భద్రంగా ఉన్నాయి. కాకపోతే వాటిల్లో కొన్ని పగిలిపోయాయి. అక్కడో విచిత్రమైన నిశ్శబ్దం ఉంటుంది. అది చూసి నాకు భయమేసింది’’ అని సమాధులను చూసినప్పుడు తనకు కలిగిన అనుభూతిని లక్ష్మీ శరత్ రాశారు.

‘‘బహుశా అఫ్జల్ ఖాన్ కూడా తన భార్యల పక్కనే సమాధి కావాలని భావించారు. కానీ ఆయన యుద్ధం నుంచి తిరిగి రాలేదు’’ అని లక్ష్మీ శరత్ చెప్పారు.

‘‘అఫ్జల్ ఖాన్ శిథిల నివాసానికి ఉత్తరాన ఉన్న ఆయన సమాధి ఖాళీగా ఉంది’’ అని హెన్రీ కజిన్స్ రాశారు.

‘‘అఫ్జల్ ఖాన్‌ను శివాజీ చంపిన తరువాత ఆయనను ప్రతాప్‌గఢ్ సమీపంలో సమాధి చేశారు. బీజాపూర్‌లోని సమాధి వద్దకు అఫ్జల్ ఖాన్ మృతదేహాన్ని తరలించలేదు’’ అని హెన్రీ రాశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)