కూలీలను తీసుకెళ్లి మలేసియాలో రూ. 1.4 లక్షల చొప్పున అమ్మేశారు

- రచయిత, తఫ్సీర్ బాబూ
- హోదా, బీబీసీ న్యూస్
బంగ్లాదేశ్‌కు చెందిన మాసూమ్ అలీ 2023 జనవరిలో కూలీ పని కోసం మలేసియాకు వెళ్లారు.
తొలి రెండు నెలల పాటు అక్కడ ఆయనకు ఏ పని దొరకలేదు. బ్రోకర్ల చుట్టూ తిరిగారు. దిక్కు తోచని స్థితిలో దాదాపు ఒక ఖైదీలా జీవితాన్ని వెళ్లదీయాల్సి వచ్చింది.
మూడో నెలలో ఆయనకు ఓ కంపెనీలో పని దొరికింది. కానీ, ఆయన నుంచి పాస్‌పోర్ట్, ఇతర ముఖ్యమైన పత్రాలను వారు తీసుకున్నారు. ఈ విషయాలన్నింటినీ బంగ్లాదేశ్‌లోని కుష్టియాలో నివసించే తన భార్యతో మాసూమ్ రోజూ చెప్పేవారు.
పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, తట్టుకోలేకపోతున్నానని మాసూమ్ చెప్పినట్లు ఆయన భార్య రత్నా బేగమ్ తెలిపారు.
‘‘అక్కడ ఆయన పొద్దున్నుంచి, రాత్రి వరకు పని చేయాల్సి వచ్చేది. ఒక్కోసారి అర్ధరాత్రి కూడా పనికి పిలిచేవారు. సరిగ్గా తిండి కూడా దొరికేది కాదు. చక్కగా పని చేసినప్పటికీ ఆయనను తిట్టేవారు, కొట్టేవారు’’ అని బీబీసీతో రత్నా బేగమ్ చెప్పారు.
కొత్త కంపెనీలో దాదాపు నెల రోజుల పాటు పనిచేసిన తర్వాత అక్కడి నుంచి తన భర్త పారిపోయేందుకు ప్రయత్నించారని, కానీ ఆయన మళ్లీ వాళ్లకు దొరికిపోయారని రత్నా బేగమ్ తెలిపారు.
ఆ తర్వాత నుంచి ఆయనను హింసించడం మొదలుపెట్టారని చెప్పారు. గత నెల రోజులుగా తన భర్త గురించి రత్నకు ఎలాంటి సమాచారం లేదు.

బ్రోకర్ ద్వారా మలేసియాకు వెళ్లిన మాసూమ్ అలీ
మలేసియాలో మాసూమ్ అలీ బాధల గురించి బీబీసీకి రత్నా బేగమ్ వివరించారు.
‘‘ఏప్రిల్‌లో ఈద్‌కు కొన్ని రోజుల ముందు నా భర్త నాకు ఫోన్ చేశారు. తనను బాగా కొడుతున్నారని చెప్పారు. ఆయన చెవి నుంచి రక్తం కారుతూ కనిపించింది. వీడియో కాల్‌లో తనకు తగిలిన దెబ్బలను చూపించారు. వీళ్లు నన్ను చంపేస్తారు, కాపాడు అంటూ ఆయన వేడుకున్నారు. ఇది జరిగి నెల రోజులకు పైగానే గడిచింది. అప్పటి నుంచి మా ఆయన గురించి ఎలాంటి సమాచారం నాకు తెలియలేదు’’ అని ఆమె చెప్పారు.
మసూమ్ అలీని మలేసియా తీసుకెళ్లిన బ్రోకర్ కూడా అక్కడే ఉంటున్నారు. రత్న తన భర్త ప్రాణాలను కాపాడాలంటూ ఆ బ్రోకర్‌ను సంప్రదించారు. కానీ, ఆయన కూడా మాసూమ్ గురించి ఏమీ చెప్పలేదని ఆమె తెలిపారు.
తన భర్తను కాపాడుకునేందుకు ఎవరిని కలవాలో, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు రత్నా బేగమ్.
బంగ్లాదేశ్ నుంచి ఏటా ఎక్కువ మంది పని కోసం వెళ్లే ముఖ్యమైన దేశాల్లో మలేసియా ఒకటి. దాదాపు 14 లక్షల మందికి పైగా బంగ్లాదేశీయులు కూలీ పనుల కోసం అక్కడికి వెళ్లినట్లు అంచనా.
మలేసియాకు వెళ్లిన తర్వాత ఈ కార్మికుల్లో చాలామంది మోసపోవడం, వారిపై మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లు ఆరోపణలు రావడం కొత్త కాదు.
ఇలాంటి అనేక ఘటనలు ఇటీవల వెలుగులోకి రావడంతో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయంతో పాటు వివిధ దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ అంశంపై దృష్టి సారించాయి.
కార్మికుల్ని బ్రోకర్లు ఎలా మోసం చేస్తున్నారు? ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
2 లక్షల టాకాల చొప్పున కార్మికుల అమ్మకం
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి మన్నన్ మియా (పేరు మార్చాం) 8 నెలల క్రితం మలేసియాకు వెళ్లారు. ఆయనతో పాటు ఒకే కంపెనీలో పని చేసేందుకు మరో 35 మంది కూడా అదే విమానంలో వెళ్లారు.
అక్కడికి వెళ్లే ముందు ఎంప్లాయ్‌మెంట్ ఏజెన్సీ కంపెనీ ఒప్పందం మీద ఆయన సంతకం పెట్టారు. ఆ ఒప్పందంలో జీతం, పని ఇచ్చే కంపెనీ పేరును పేర్కొన్నారు.
కానీ, ఆయన మలేసియా చేరుకున్న తర్వాత ఆ ఒప్పందం ప్రకారం ఏదీ జరగలేదు.
ఏజెన్సీ వారు ఒక్కొక్కరిని 2 లక్షల టాకాల (భారత కరెన్సీలో రూ. 1,43,045) చొప్పున వేర్వేరు కంపెనీలకు తమను అమ్మేసినట్లు మన్నన్ మియా గుర్తు చేసుకున్నారు. ముందు చెప్పిన జీతం కంటే చాలా తక్కువ వేతనానికి ఆయా కంపెనీల్లో పనిచేయాల్సి వచ్చిందని చెప్పారు.
మన్నన్ మియా బీబీసీతో మాట్లాడుతూ, ‘‘మా జీతం 25 వేల టాకాలు ( భారత కరెన్సీలో రూ. 17,880). మొదట మాకు నెల జీతం 50 వేల టాకాలకు పైనే ఇస్తామని చెప్పారు. కానీ, అలా ఇవ్వలేదు. మూడు నెలల తర్వాత కంపెనీ సూపర్‌వైజర్‌ను ఓవర్‌టైమ్ (ఓటీ) మనీ ఇవ్వమని అడిగాం. జీతం ఇవ్వమని అడగగానే సూపర్‌వైజర్ మమ్మల్ని ఇనుప రాడ్డుతో కొట్టడం మొదలుపెట్టాడు. మమ్మల్ని తీవ్రంగా కొట్టాడు. కొట్టినట్లు ఎవరికైతే చెబితే చంపేస్తానని, మళ్లీ బంగ్లాదేశ్‌కు వెళ్లలేరంటూ బెదిరించారు’’ అని ఆయన చెప్పారు.
మన్నన్ సహా ఏడుగురు ఆ కంపెనీ నుంచి పారిపోయి, మరో కంపెనీలో పనిలో చేరారు. వారి దగ్గర ఎలాంటి పత్రాలు లేవు. దీంతో వారు రోజూ పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో బతుకుతున్నారు.

ఫొటో సోర్స్, INDRANIL MUKHERJEE/GETTY IMAGES
కార్మికుల్ని ఎలా మోసం చేస్తున్నారు?
మలేసియా చేరుకోగానే బంగ్లాదేశ్ కార్మికులు ఎదుర్కొనే తొలి మోసం అక్కడ వారికి పని ఇవ్వకపోవడం. తర్వాత పని దొరికినా వేతన సమస్య ఎదురవుతుంది. ముందు ఇస్తామని చెప్పిన జీతానికి, అసలు జీతానికి పొంతనే ఉండదు.
ఇక మూడో సమస్య, వారి నుంచి పాస్‌పోర్టులు, వీసాలు లాక్కోవడం. మలేసియా చేరుకున్న తర్వాత వీసా ఫార్మాలిటీలను పూర్తి చేసే నెపంతో కార్మికుల నుంచి ఏజెన్సీల వ్యక్తులు పాస్‌పోర్ట్‌లను తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని తిరిగి ఇవ్వరు.
చాలా సందర్భాల్లో పాస్‌పోర్ట్, వీసాలను పునరుద్ధరించుకునేందుకు అదనంగా 70 వేల నుంచి లక్ష టాకాల చెల్లించాల్సి వస్తుందని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇవే కాకుండా, ఒకే చిన్న గదిలో కిక్కిరిసిపోయి జీవించడం, రోజులో మూడు పూటలకు బదులుగా రెండు పూటలే చాలీచాలకుండా ఆహారం తినడం వంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నింటి తర్వాత శారీరక హింస ఆరోపణలు కూడా ఉన్నాయి.
మలేసియా చేరుకున్నాక చాలామంది కార్మికులు బందీల్లాగా జీవించాల్సిన పరిస్థితి తలెత్తిందని కౌలాలంపూర్‌లో నివసిస్తున్న వలస కార్మికుడు ఖలేక్ మండల్ (పేరు మార్చాం) చెప్పారు.
"అసలు ఇక్కడ పని లేదు. కానీ, పని ఉందంటూ ఇక్కడి వారందరూ కార్మికులను పిలుస్తున్నారు. కార్మికులను తీసుకెళ్లడానికి అనుమతి ఉన్న బంగ్లాదేశ్, మలేసియాలోని కంపెనీలకు ఇది ఒక వ్యాపారంగా మారింది. 50 మందికి మాత్రమే పని ఇవ్వగలిగిన కంపెనీలు కూడా 700 మంది కార్మికుల్ని పిలిపించుకుంటున్నాయి. ఇదెలా సాధ్యం. వారికి ఇలా చేసేందుకు అనుమతులు ఎలా ఇస్తున్నారు. కంపెనీల సామర్థ్యం గురించి ఎందుకు దర్యాప్తు చేయడం లేదు. నిజానికి మేమంతా ఇక్కడ బందీల్లా ఉన్నాం’’ అని ఆయన అన్నారు.
మలేసియా రాకముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం, తనకు సదరు కంపెనీలో ఉద్యోగం ఇవ్వలేదని ఖాలెక్ చెప్పారు. గత్యంతరం లేక మరో కంపెనీలో ఉద్యోగంలో చేరినట్లు తెలిపారు. కానీ, మలేసియా చట్టాల ప్రకారం ఇది నేరం.
"నేను మలేసియా రావడానికి దాదాపు 6 లక్షల టాకాలు ఖర్చు చేశాను. కానీ, ఇప్పుడు నేను పని చేస్తున్న పరిస్థితుల ప్రకారం చూస్తే డబ్బు కూడబెట్టడం కాదు, కనీస ఖర్చులు కూడా వెళ్లదీసుకోలేను. ఇక్కడ నుంచి పారిపోవడం మినహా నాకు ఇంకో మార్గం లేదు. లేదంటే బంగ్లాదేశ్ తిరిగి వెళ్లాలి. కానీ, బంగ్లాదేశ్ తిరిగి వెళ్తే చేసిన అప్పులు ఎలా తీర్చాలి?’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవస్థీకృత నేరాలు
బంగ్లాదేశ్ నుంచి ప్రపంచంలోని వివిధ దేశాలకు కార్మికుల వలసలు 1976లో మొదలయ్యాయి.
బ్యూరో ఆఫ్ మ్యాన్ పవర్, ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్ (బీఎంఈటీ) గణాంకాల ప్రకారం, 1976 నుంచి 2023 వరకు బంగ్లాదేశ్ నుంచి 1.60 కోట్ల మంది వలస కార్మికులు ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్లారు. వీరిలో అత్యధికంగా 57 లక్షల మంది సౌదీ అరేబియాకు వెళ్లారు.
యూఏఈకి 26 లక్షల మంది, ఒమన్‌కు 18 లక్షల మంది కార్మికులు వెళ్లారు. వీటి తర్వాత స్థానంలో మలేసియా ఉంది. ఇప్పటి వరకు 14 లక్షల మందికి పైగా కార్మికులు బంగ్లాదేశ్ నుంచి మలేసియాకు వెళ్లారు. 2023లోనే 3.51 లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి మలేసియాకు పని వెదుక్కుంటూ వెళ్లిపోయారు.
మలేసియా చేరుకున్నప్పటి నుంచే కార్మికులు తమకు అక్కడ పని ఇవ్వలేదంటూ, కొడుతున్నారంటూ ఫిర్యాదులు చేస్తున్నారు. అదృశ్యమైన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.
బంగ్లాదేశ్‌కు చెందిన వేలాది మంది కూలీలు అమానుష జీవితాన్ని గడుపుతున్నారని మలేసియా ప్రధాన మీడియాలో, మానవ హక్కుల సంస్థల నివేదికల్లో పేర్కొన్నారు. తక్కువ వేతనాలు, నిరుద్యోగం, కూలీలపై దౌర్జన్యాలు, అక్రమ పరిస్థితుల్లో ఇరుక్కుపోవడం వంటి అంశాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
బంగ్లాదేశ్ కార్మికుల పరిస్థితి గురించి విడుదల చేసిన ఒక నివేదికలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
‘‘మలేసియాలో ఉంటున్న బంగ్లాదేశ్ కార్మికుల గురించి ఆందోళన చెందడానికి బలమైన కారణాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, మలేసియాలో శక్తిమంతమైన క్రిమినల్ గ్యాంగ్ పుట్టుకొచ్చింది. ప్రజలకు మంచి ఉద్యోగాలు, మంచి జీతాలు ఇస్తామంటూ మలేసియా తీసుకెళ్లి వారిని మోసం చేస్తోంది’’ అని బీబీసీతో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి టోమోయా ఓబోకాటా చెప్పారు.
బంగ్లాదేశ్ హైకమిషన్ ఏం చెప్పింది?
మలేసియాలో ఉద్యోగాలు ఇస్తున్న కంపెనీల వాస్తవ స్థితి గురించి తెలుసుకోవడం మలేసియాలోని బంగ్లాదేశ్ హైకమిషన్ బాధ్యత.
మరి, మోసపూరిత కంపెనీలను బంగ్లాదేశ్ హైకమిషన్ ఎందుకు గుర్తించలేకపోతోంది?
మలేసియాలోని బంగ్లాదేశ్ హైకమిషనర్ షమీమ్ అహ్సన్‌ను ఇదే ప్రశ్న అడగగా ఆయన బదులిచ్చారు. ఆరు నెలల క్రితమే ఆయన పదవిలో నియమితులయ్యారు.
‘‘కార్మికులకు సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఆరోపణలు కొత్తేమీ కాదు. ఇలాంటి కేసుల్ని పరిష్కరిస్తున్నాం. అయితే, కొన్ని కంపెనీలు కార్మికుల్ని మోసం చేస్తున్నాయనేది కూడా నిజం. నకిలీ కంపెనీల వల్ల ప్రజలు మోసపోతున్నారని కాదు. చట్టబద్ధమైన కంపెనీలే అనైతికంగా వ్యవహరించడం వల్ల ప్రజలు మోసపోతున్నారు. మలేసియా కంపెనీ యజమానుల నిజాయతీకి సంబంధించిన సమస్య ఇది’’ అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాముల సెక్స్: సంభోగం తరువాత ఆడ అనకొండ మగపామును ఎందుకు చంపుతుంది?
- బ్లూ కార్నర్: ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఈ నోటీస్ ఎందుకు జారీ చేశారు, దీనివల్ల ఏమవుతుంది?
- పెనైల్ క్యాన్సర్: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
- శామ్ పిట్రోడా: ‘ఆఫ్రికన్’ కామెంట్లపై సొంత పార్టీ ఎలా స్పందించింది... ప్రధాని చేసిన విమర్శలేంటి?
- గుడ్డు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














