బాగా పనిచేస్తున్నట్లు మీకు అనిపించట్లేదా? ఈ ఆరు చిట్కాలు మీ కోసమే..

ఫొటో సోర్స్, Getty Images
పని ప్రదేశంలో చాలామంది తాము బాగా పనిచేయడం లేదని భావిస్తుంటారు. చెప్పినంత చేయలేకపోతున్నామని మదనపడుతుంటారు. మహిళలు ఈ సమస్యను కాస్త ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అయితే, ఇలాంటి ఆలోచనల నుంచి బయటపడేందుకు నిపుణులు ఆరు చిట్కాలను సూచిస్తున్నారు.
అలాంటి సమస్యను ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’ అంటారు. దాని గురించి తెలుసుకుందాం.
‘‘వాళ్లెందుకు నన్ను ఇంకా తీసేయ లేదో అర్థం కావడం లేదు. ఈ ఉద్యోగానికి పనికిరానని ఒకరోజు వారు గుర్తిస్తారు. కేవలం అదృష్టవశాత్తే నేనిక్కడ పనిచేస్తున్నాను’’ ఇలా కొందరు అనుకుంటూ ఉంటారు.
పని ప్రదేశంలో ఒకానొక సమయంలో మీరు కూడా ఇలాంటి ఆలోచనలు చేసి ఉండొచ్చు. మీ వృత్తిపరమైన జీవితంలో ఇలాంటి రోజంటూ ఒకటి కచ్చితంగా వచ్చి ఉండొచ్చు.
దీని వల్ల ఆందోళన చెందొద్దు. ఇది ఇంపోస్టర్ సిండ్రోమ్ కావొచ్చు. దాని వల్లనే మీరు ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇది సర్వసాధారణమని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు.
‘‘ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది ఒక వ్యక్తి తన నైపుణ్యాలను, ప్రతిభను గుర్తించడంలో ఇబ్బందులు పడటం అన్నమాట. వారు అసమర్థులని అందరూ గుర్తిస్తారేమోనని భయపడుతుంటారు. ఇతరుల అంచనాలకు తగ్గట్టు జీవించలేకపోతున్నామని దిగులు చెందుతుంటారు’’ అని అఫిషియల్ కాలేజీ ఆఫ్ సైకాలజీ ఆఫ్ కాటలోనియా వైస్ ప్రెసిడెంట్, సైకియాట్రిస్ట్ డోలర్స్ లిరియా బీబీసీకి వివరించారు.
‘‘మీ నిజమైన గుర్తింపు, మీ ఆలోచనల్లో ఉన్న వ్యక్తిగత అభిప్రాయం ఒకదానికొకటి సరితూగనప్పుడు ఇలా జరుగుతుంటుంది’’ అని న్యూరోసైంటిస్ట్, సైకాలజిస్ట్ మార్ మార్టినెజ్ రికార్ట్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సైకాలజీలో డాక్టరేట్ చేసిన, మాడ్రిడ్ అసోసియేషన్ ఆఫ్ సైకాలజీ సభ్యులు ఇసాబెల్ అరాండా కూడా ఈ పరిస్థితి గురించి వివరించారు.
‘‘ఏదైనా పనిచేయడంలో వారెంత సమర్థులో ఈ సిండ్రోమ్‌తో బాధపడే వారు గుర్తించలేరు. వారు దానికి అర్హులని ఆలోచించలేరు. అప్పటి వరకు సాధించిన విజయానికి అర్హులని కూడా గుర్తించరు’’ అని చెప్పారు.
ఈ భావన నుంచి బయటపడేందుకు ఇలాంటి వ్యక్తులు అతిగా పనిచేయడం, కష్టించి పనిచేయడం చేస్తుంటారు. కానీ, దీని వల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ లాంటి మానసిక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.
1978లోనే ప్రజల్లో ఈ పరిస్థితిని గుర్తించిన సైకాలజిస్ట్‌లు పౌలిన్ రోస్ క్లాన్స్, సుజానే ఈమ్స్, ఇదొక మానసిక రుగ్మత లేదా వ్యాధి కాదని, ఇది మనుషుల్లో సహజ విషయమని చెప్పారు.
చిన్నతనంలోనే ఇది ప్రజల్లో ఏర్పడుతుందని అన్నారు. పెద్దయ్యే కొద్ది ఈ భావనల నుంచి మార్పు తీసుకురావొచ్చని తెలిపారు.
ప్రతి ఒక్కరూ దీని నుంచి ఇబ్బంది పడుతున్నప్పటికీ, ఈ సిండ్రోమ్ మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని వెనుకాల చాలా కారణాలున్నాయి.
విద్యా వ్యవస్థలో లోపాలు, పనిచేసే ప్రదేశాల్లో లింగ భేదాలను అనుసరిస్తూ తక్కువ పని బాధ్యతలు వారికి అప్పజెప్పడం, వారు తక్కువ పనిచేస్తారని భావించడం, పని ప్రదేశంలో ఒక నిర్దిష్ట విధానంలో మాత్రమే వారు పనిచేయగలరని భావించడం లేదా వారికి వ్యతిరేకంగా ఉన్న పక్షపాత ధోరణి వంటివి మహిళల్లో ఈ భావనలకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిస్థితికి అడ్జెస్ట్ అవ్వడానికి మనకు కష్టంగా అనిపిస్తే, వెంటనే నిపుణుల సాయం తీసుకోవాలని సైకాలజిస్ట్‌లు సూచించారు. ఇంపోస్టర్ సిండ్రోమ్‌ను అధిగమించేందుకు, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునేందుకు ఆరు టిప్స్‌ను వారు సూచిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
1. అసలు సమస్య ఏంటన్నది గుర్తించాలి
ఇది కొంచెం మీకు అనవసరమైనదిగా అనిపించవచ్చు. కానీ, మనలో ఉన్న చాలా భావోద్వేగమైన అంశాలను మనం గుర్తించలేం. అవి మనల్ని ప్రభావితం చేస్తున్నాయని కనుగొనలేం. వాటి గురించి ఆలోచించం కూడా.
‘‘మనలో మనం ఏ విషయాలపై ఎలా మాట్లాడుకుంటున్నామన్నది చాలా ముఖ్యం. మనల్ని మనం పొగుడుకోవడం లేదని, శుభాకాంక్షలు చెప్పుకోవడం లేదని, ఈ విజయానికి మనం అర్హులమని చెప్పుకోవడం లేదని గుర్తించాలి’’ అని అరాండా చెప్పారు.
‘‘సమస్యను అధిగమించాలంటే మనలో ఉన్న భయాలకు కారణాలను కనుగొనాలి. పరిస్థితులు మీ చేతులోకి తెచ్చుకునేందుకు దానికోసం చర్యలు తీసుకోవాలి’’ అని డోలర్స్ లిరియా సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
2. ఇప్పటి వరకు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవాలి
ఆలోచనలతో సతమవుతూ, ఆందోళనకరంగా లేదా ఒత్తిడిగా భావించినప్పుడు, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఆలోచనల్లో మార్పు మీలో ఉన్న భావోద్వేగాలను అదుపులో పెట్టేందుకు సాయపడతుంది. స్వీయ విశ్లేషణకు, నిర్మాణాత్మక ఆలోచన విధానానికి దోహదపడుతుందని సైకాలజిస్ట్‌లు చెప్పారు.
‘‘నిరంతరంగా ఈ ఆలోచనలు మనలోకి వచ్చినప్పుడు, వైఖరిలో మార్పు ద్వారా వాటిని అధిగమించగలుగుతాం’’ అని డోలర్స్ రిలియా అన్నారు.
‘‘మీకు ఈ విధమైన ఆలోచనలు వచ్చినప్పుడు, ఇప్పటి వరకు మీరు సాగించిన ప్రయాణాన్ని గుర్తుకు తెచ్చుకోండి లేదా సాధించిన విజయాలను ఒక పేపర్‌పై రాసుకోండి. దీన్నే స్వీయ అభివృద్ధిగా చెబుతారు. మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకునేందుకు ఈ విషయాలను ఒక ఫైల్‌లో రాసుకోవాలి’’ అని అరాండా చెప్పారు.
దీన్ని పర్‌ఫార్మెన్స్ ట్రీగా రికార్ట్ అంటున్నారు. ఇప్పటి వరకు సాధించిన విజయాలను మీరు మర్చిపోయినప్పుడు, వాటిని తిరిగి గుర్తుకుతెచ్చుకునేందుకు, వాటితో మన ఆలోచనలను ముడిపెట్టేందుకు ఈ ట్రీ సహకరిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
3. ప్రతి ఘనతను సెలబ్రేట్ చేసుకోండి
‘‘మన విజయాలను సెలబ్రేట్ చేసుకోకుండా, ధన్యవాదాలు తెలియజేసుకోకుండా, మనపట్ల మనకు కృతజ్ఞత లేకుండా మరో పనిలో నిమగ్నమవుతుంటాం. కానీ, ఇది మారాలి. ప్రతి ఘనతను మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అది చిన్నదైనా లేదా పెద్దదైనా..’’ అని రికార్ట్ అన్నారు.
‘‘మనం సాధించిన విజయాలకు సంతృప్తి, స్వీయ ప్రశంసను అందించాలి. నేను ఈరోజు ఇది పూర్తి చేశాను, చాలా సంతోషంగా ఉందని కష్టించి పనిచేసిన తర్వాత తమకు తాము చెప్పుకోవాలి. ఈ విజయానికి, ప్రశంసకు అర్హురాలిని అని భావించాలి’’ అని తెలిపారు.
అరాండా కూడా ఇదే చెబుతున్నారు. ‘‘మనం విలువైన, అర్హత కలిగిన వ్యక్తులమన్న వాస్తవాన్ని గుర్తించడం అత్యంత ముఖ్యం. భావోద్వేగంగా, మానసికంగా దానితో మన మనసును కనెక్ట్ చేసుకోవాలి’’ అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
4. మిమ్మల్ని ఇతరులు ఎలా చూస్తున్నారు?
ఇతరులు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించి మీరేం ఆలోచిస్తున్నారు? అనే వాటి మధ్యలో అంతరాయమే ఈ పరిస్థితికి కారణం.
అందుకే, ఇతరుల కోణం నుంచి, వారి దృష్టి నుంచి మిమ్మల్ని మీరు చూసుకోవాలని అరాండా అన్నారు. మీకు ఇతరులు ఇచ్చిన ప్రశంసలను ఒక దగ్గర రాసుకోవాలని, మీ పని గురించి వారేం చెప్పారో అసలు మర్చిపోవద్దని సైకాలజిస్ట్‌లు సూచిస్తున్నారు.
అంతేకాక, ఎలా పనిచేస్తున్నామోనని మీపై మీకు అనుమానం వచ్చినప్పుడు, సింపుల్‌గా ‘‘ఫీడ్‌బ్యాక్ గురించి అడగండి, వారి సూచన తీసుకోండి’’ అని డోలర్స్ లిరియా చెప్పారు.
‘‘మీరు ఎలా పని చేస్తున్నారో ఇతరులు చెప్పేదాకా వేచిచూడకండి. ఒకవేళ అనుమానం ఉంటే, వారేం చెబుతారా అని వేచిచూడకుండా మీ సీనియర్ల దగ్గర్నుంచి వెంటనే ఫీడ్‌బ్యాక్ అడగండి. మీరు మంచిగానే పనిచేస్తున్నారనే సమాధానం రావొచ్చు. మీరు ఆ స్థానానికి, ఉద్యోగానికి అర్హులని వారు చెబుతారు’’ అని డోలర్స్ లిరియా తెలిపారు.
5. అంచనాలకు తగ్గట్లు..
ఏ బంధంలోనైనా ఇరువైపుల నుంచి కొన్ని అంచనాలుంటాయి. పని ప్రదేశంలో కూడా ఇరు వైపుల నుంచి ఈ అంచనాలు సహజం.
ఉద్యోగుల నుంచి పనిపై కంపెనీలకు కొన్ని అంచనాలుండటం, కంపెనీల నుంచి ఉద్యోగులు కొన్ని ప్రయోజనాలు ఆశించడం చేస్తుంటారు. దీనిలో ప్రశంస, డబ్బు, కృతజ్ఞత, కష్టించి పనిచేయడం వంటివి ఉంటాయి.
ఇంపోస్టర్ సిండ్రోమ్ ఉంటే, కంపెనీల నుంచి కంటే మీపై మీకు ఎక్కువ అంచనాలుండాలి. అవి సామరస్యంగా ఉండాలని సైకాలజిస్ట్‌లు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
6. స్వీయ సంరక్షణ, దయాగుణం ఉండాలి
మనకు మనం ఎలా చూసుకుంటున్నాం, మనపట్ల మనం ఏం ఆలోచిస్తున్నాం, చుట్టూ ఏం జరుగుతుందన్న దానిపై అవగాహన, మొత్తంగా స్వీయ నియంత్రణ అనేవి చాలా ముఖ్యం.
‘‘వ్యాయామం దీనికి సహకరిస్తుంది’’ అని లిరియా చెప్పారు.
‘‘భావోద్వేగాలను నియంత్రించుకోవడం అత్యంత ముఖ్యం. దీని కోసం జిమ్‌కే వెళ్లాల్సినవసరం లేదు. వాకింగ్, డ్యాన్సింగ్ వంటి ఏ విధమైన వ్యాయామాన్ని అయినా చేయవచ్చు’’ అని చెప్పారు.
మనల్ని ఏవి శాంతంగా ఉంచుతాయో తెలుసుకోవాలని అన్నారు.
‘‘మనసులో విపరీతమైన భావోద్వేగాలను తగ్గించుకునేందుకు, రిలాక్స్‌గా భావించేందుకు ఏం చేయాలో కనుగొనాలి. ఆ తర్వాత భిన్నమైన కోణంలో పరిస్థితిని చూడాలి. ఆడుకోవడం, వ్యాయామం చేయడం, పాటలు పాడటం వంటి చేయాలి. నమ్మకమైన వ్యక్తితో మాట్లాడటం, ఛాటింగ్ చేయడం చేయాలి’’ అని సూచించారు.
ఒకసారి మీలో ఆత్మవిశ్వాసం పెంచుకున్న తర్వాత, మీ నుంచి మీరు ఎక్కువగా ఆశించడం, డిమాండ్ చేయడమన్నది కనుమరుగవుతుంది.
పని అయిపోయిన తర్వాత, దాని నుంచి బయటికి వచ్చి స్నేహితులతో, కుటుంబంతో సంతోషంగా గడపడం ముఖ్యం. ఇతరులతో ముఖాముఖి సంభాషణలు, మాటలు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.
‘‘జీవితం, పని కష్టమైనవి కావొచ్చు. కానీ, మీ జీవితంలో చిన్నచిన్న విషయాలు ఒత్తిడిని, డిప్రెషన్‌ను దూరం చేసేందుకు సహకరిస్తాయి. సంతోషాన్ని, సంతృప్తి అందిస్తాయి. మీ జీవితంలో ఆ సంతోషకరమైన క్షణాలేంటో గుర్తించడం మొదలుపెట్టాలి’’ అని లిరియా చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
ఇవి కూడా చదవండి:
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?
- కుప్పం నియోజకవర్గానికి నీళ్లొచ్చాయా? రాలేదా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














