25 వేల మంది టీచర్లు, బోధనేతర సిబ్బంది రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేసిన కోల్‌కతా హైకోర్టు, తీసుకున్న జీతాన్ని 12 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశం... అసలేం జరిగింది?

టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కామ్, కోల్‌కతా, హైకోర్టు

ఫొటో సోర్స్, SANJAY DAS

ఫొటో క్యాప్షన్, తాము మెరిట్‌తోనే ఉద్యోగం సంపాదించామని ఓఎంఆర్ షీట్లు చూపిస్తున్న టీచర్లు
    • రచయిత, ప్రభాకర్ మణి తివారి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

"మేం ఎలాంటి తప్పు చెయ్యలేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా నేను ఎంపికయ్యాను. ఉద్యోగం సాధించడంలో నేను నిజాయతీగా వ్యవహరించినప్పుడు నాకు ఎందుకు శిక్ష పడాలి? మమ్మల్ని పురుగుల మాదిరిగా నలిపేశారు." సాగర్ మండల్ వ్యాఖ్యలివి. కోల్‌కతా హైకోర్టు నిర్ణయంతో ఆయన టీచర్ ఉద్యోగాన్ని కోల్పోయారు.

2016లో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చేపట్టిన టీచర్స్ రిక్రూట్‌మెంట్‌లో కుంభకోణం జరిగినట్లు కేసు నమోదైంది.

ఈ కేసును విచారించిన కోల్‌కతా హైకోర్టు డివిజన్ బెంచ్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 25 వేల మందికి పైగా టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్‌ను తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

ఆ ఏడాదిలో జరిగిన నియామక ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. దీంతో ఆ ఏడాదిలో మెరిట్ ఆధారంగా ఉద్యోగం సాధించిన వారిలోనూ నిరాశ, నిస్పృహలు అలముకున్నాయి.

2016లో అపాయింట్‌మెంట్ ప్యానెల్ ద్వారా ఉద్యోగం పొందిన వారు ఇన్నాళ్లూ తాము తీసుకున్న జీతానికి 12 శాతం వడ్డీ కలిపి తిరిగి చెల్లించాలని కోర్టు తన ఆదేశాల్లో తెలిపింది.

దీంతో కోర్టు తీర్పుని వ్యతిరేకిస్తున్న కొంతమంది అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది కోల్‌కతాలోని షహీద్ మినార్ గ్రౌండ్‌లో ఆందోళనకు దిగారు.

హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని చెబుతున్నారు.

కలకత్తా హైకోర్టు, టీచర్లు, బోధనేతర సిబ్బంది

ఫొటో సోర్స్, SANJAY DAS

ఫొటో క్యాప్షన్, ఉద్యోగం పోయిందన్న బాధలో కన్నీరు పెట్టుకుంటున్న ఓ టీచర్

షహీద్ మినార్ గ్రౌండ్‌లో టీచర్ల ఆందోళన

షహీద్ మినార్ గ్రౌండ్‌లో ఆందోళనకు దిగిన ఉపాధ్యాయుల్లో ఎవరిని పలకరించినా వాళ్లు మాట్లాడటానికి ముందే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కోర్టు తీర్పు వచ్చిన రోజు రాత్రి తమకు నిద్ర పట్టలేదని, రాత్రంతా అటు ఇటు తిరుగుతూనే ఉన్నామని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. తమ కలలన్నీ చెల్లాచెదరు అయ్యాయని, భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

చాలా ఏళ్ల కష్టం తర్వాత తాను పరీక్ష పాసయ్యానని, మెరిట్ జాబితాలో ఉద్యోగం సంపాదించానని ఆందోళనలో పాల్గొంటున్న శుభ్ర ఘోష్ చెప్పారు.

“మేము 2019 ఫిబ్రవరిలో ఉద్యోగంలో చేరాము. జీవితంలో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్నాం. అయితే కోర్టు తీర్పుతో మా కాళ్ల కింద నేల కదిలిపోయింది” అని ఆమె అన్నారు.

కొంతమంది చేసిన తప్పు లేదా నేరానికి తాము ఎందుకు శిక్ష అనుభవించాలని వాళ్లు ఆడుగుతున్నారు.

హైస్కూలులో టీచర్‌గా పన చేస్తున్న అజారుద్దీన్ కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. ఆయన తాను మెరిట్‌లో ఉద్యోగం సాధించినట్లు ఆయన తన ఓఎంఆర్ షీట్‌లతో పాటు మెరిట్ జాబితాలో ఉద్యోగం సాధించిన వారి జాబితాలో తన పేరును చూపించారు.

“నేను అక్రమంగా ఉద్యోగం సంపాదించలేదు. అలాంటప్పుడు నేనేందుకు శిక్ష అనుభవించాలి?” అని ఆయన ప్రశ్నించారు.

2016లో పశ్చిమబెంగాల్‌లో నిర్వహించిన ఉపాధ్యాయుల నియామక పరీక్షల్లో 25,753 మందిని ఎంపిక చేశారు. వీరిలో 4,500 మంది అక్రమంగా ఉద్యోగం సంపాదించినట్లు తేలింది. వీరంతా ఆన్సర్ పేపర్ల మీద ఏమీ రాయకుండా ఖాళీ పేపర్లు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.

2016 టీచర్ల నియామక ప్రక్రియలో అక్రమాలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు పూర్తి కావడానికి ఇంత కాలం ఎందుకు పట్టిందని ఆందోళనకు దిగిన వారు ప్రశ్నిస్తున్నారు.

కోర్టు తీర్పు ప్రకారం తాను ఉద్యోగం కోల్పోవడంతో తన కుటుంబం రోడ్డున పడాల్సి వచ్చిందని ఆందోళనలో పాల్గొనేందుకు వచ్చిన సైకత్ ఘోష్ చెప్పారు.

తన గుర్తింపు వెల్లడించడానికి ఇష్టపడని మహిళ ఒకరు “ క్లాసులో ఒకరు ఫెయిల్ అయితే అందరూ ఫెయిలైనట్లేనా” అని ప్రశ్నించారు.

ప్రదీప్ మండల్ కుటుంబానికి ఆయన ఒక్కరి సంపాదనే దిక్కు. జబ్బున పడిన తల్లిదండ్రులతో పాటు అక్క, చెల్లెలు బాధ్యత తనపైనే ఉందని ఆయన చెప్పారు.

“నా జీవితం రాత్రికి రాత్రి మారిపోయింది. ఇప్పుడు నేను నా కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగువారికి మొహం ఎలా చూపించేది? కోర్టు నిర్ణయం నా జీవితాన్ని సందేహాల చట్రంలోకి నెట్టేసింది” అని ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

 స్కూల్ సర్వీస్ కమిషన్, టీచర్ల రిక్రూట్‌మెంట్

ఫొటో సోర్స్, SANJAY DAS

ఫొటో క్యాప్షన్, సాగర్ మండల్

అంత డబ్బు ఎక్కడ నుంచి తేగలం?

ఉద్యోగం చేసినప్పుడు వచ్చిన జీతం కుటుంబ నిర్వహణ కోసం ఖర్చు పెట్టాం. ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం నెల రోజుల్లోగా అంత పెద్దమొత్తాన్ని ఎక్కడ నుంచి తెచ్చి కట్టగలమని ఆయన ప్రశ్నించారు.

2016లో నిర్వహించిన టీచర్ల నియామక పరీక్షల్లోనే మహమ్మద్ ఇల్యాస్ కూడా టీచర్ ఉద్యోగం సంపాదించారు. ఆయన నార్త్ బెంగాల్‌లోని అలిపుర్‌దువార్‌ స్కూలులో పని చేస్తున్నారు.

స్కూలుకు వేసవి సెలవులు ఇవ్వడంతో ఆయన సోమవారం సాయంత్రం ఇంటికి బయల్దేరేందుకు రైలు ఎక్కారు. అయితే ఆయన ఇంటికి చేరక ముందే కోర్టు నిర్ణయం గురించి సమాచారం తెలిసింది.

“కోర్టు నిర్ణయం గురించి తెలిసిన తర్వాత నాకు నిద్ర పట్టలేదు. రాత్రంతా నిద్ర లేకుండానే గడిచింది. ఇంటికి కూడా వెళ్లాలనిపించలేదు. నేరుగా కోల్‌కతాలోని షాహిద్ మినార్ గ్రౌండ్‌కు వచ్చాను” అని చెప్పారాయన.

“నేను అక్రమ మార్గాలను పాటించకపోతే, మళ్లీ నియామక ప్రక్రియ ప్రారంభమైనప్పుడు నన్ను నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారా” అని ఆయన ప్రశ్నించారు.

ఉద్యోగాలు కోల్పోయిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిలో కొంతమంది ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. తాము ఇన్నాళ్లు జీతంగా తీసుకున్న లక్షల రూపాయలు చెల్లించడం ఎలా అని ఆలోచిస్తున్నారు.

ప్రస్తుతం ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వారిది. 2016లో టీచర్ల నియామక ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన ప్యానల్ రద్దైంది. దీంతో ఈ ప్యానల్ నియమించిన ఉద్యోగులందర్నీ విధుల నుంచి తొలగించడంతో పాటు వారు జీతంగా తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

“నాకు కోర్టు ఆదేశాల ప్రకారమే 2022లో ఉద్యోగం వచ్చింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు” అని ఆందోళనలో పాల్గొన్న ఓ అభ్యర్థి అన్నారు

ఉద్యోగాలు కోల్పోయిన 25,753 మందిలో ఎంతమంది జీతాల్ని తిరిగి చెల్లించాలనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే ఈ సంఖ్య నాలుగు లేదా ఐదు వేలు ఉండవచ్చని భావిస్తున్నారు.

వీరిలో 9,10 తరగతుల విద్యార్ధులకు బోధించే హైస్కూలు టీచర్లు దాదాపు 22 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. 11,12 తరగతులకు బోధించే హయ్యర్ సెకండరీ టీచర్లు సరాసరిన 28 నుంచి 30 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాల్సి రావచ్చు.

సీబీఐ, హైకోర్టు డివిజన్ బెంచ్, తృణమూల్ కాంగ్రెస్

ఫొటో సోర్స్, SANJAY DAS

ఫొటో క్యాప్షన్, అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారించాలని సీబీఐని ఆదేశించిన న్యాయస్థానం

హైకోర్టు నిర్ణయం

25 వేల మందికి పైగా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసిన కోల్‌కతా హైకోర్టు బెంచ్ తమకు మరో మార్గం లేదని తెలిపింది.

లోక్‌సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత స్కూల్ సర్వీస్ కమిషన్ ఈ ఉద్యోగాలకు సంబంధించి కొత్తగా నియామకాలు చేపట్టవచ్చని సూచించింది.

2016లో స్కూల్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్ష ద్వారానే 25,754 మందికి ఉద్యోగాలు దక్కాయి. అయితే, వీరిలో కొందరు అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు సంపాదించారు.

తొలగించిన ఉద్యోగుల్లో ఓ మహిళ విషయంలో కోర్టు సానుకూలంగా స్పందించింది. సోమదాస్ అనే మహిళ క్యాన్సర్‌తో బాధ పడుతున్నారు. దీంతో మానవీయ కోణంలో ఆమెను ఉద్యోగంలో కొనసాగించవచ్చని కోర్టు ఆదేశించింది.

282 పేజీల తీర్పులో భాగంగా, స్కూల్ సర్వీస్ కమిషన్ నియామక ప్రక్రియలో భాగంగా అదనపు పోస్టులను అనుమతించిన ప్రభుత్వ అధికారులను అవసరమైతే అదుపులోకి తీసుకుని విచారించాలని కోర్టు సీబీఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కొంతమందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించేందుకు అదనపు పోస్టులను సృష్టించినట్లు సీబీఐ ఆరోపించింది. ఈ స్కామ్‌లో దర్యాప్తు కొనసాగించాలని సీబీకి సూచించింది న్యాయస్థానం.

టీచర్ల ఆందోళన, సుప్రీంకోర్టు, మమతా బెనర్జీ

ఫొటో సోర్స్, SANJAY DAS

ఫొటో క్యాప్షన్, కలకత్తా హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న అధ్యాపకులు

ఆరోపణలు - ప్రత్యారోపణలు

ఉద్యోగాలు కోల్పోయిన వారికి తాము అండగా ఉంటామని, హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. నాలుగు నెలల్లోగా వీరంతా లక్షల రూపాయలు ఎక్కడ నుంచి తెచ్చి కడతారని ఆమె ప్రశ్నించారు. స్కూలు సర్వీస్ కమిషన్ ఛైర్మన్ సిద్ధార్ధ్ మజుందార్ కూడా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు.

మమతా బెనర్జీ ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్తావిస్తున్నారు. దీనంతటికీ బీజేపీనే కారణం అని ఆరోపిస్తున్నారు.

తమ ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒక్క దెబ్బతో వాటన్నింటినీ తొలగిస్తోందని ఆమె ఎన్నికల బహిరంగ సభల్లో ఆరోపిస్తున్నారు. టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ముందే తెలిసినట్లైతే వాటిని సరిదిద్ది ఉండే వారమని ఆమె చెప్పారు.

కొన్ని అక్రమాలు జరిగిన మాట వాస్తవమేనని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినఇధి కునాల్ ఘోష్ అంగీకరించారు. మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ దృష్టికి వచ్చిన తర్వాత అక్రమార్కులపై చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

కోర్టు తీర్పు వల్ల కొంతమంది చేసిన పనుల వల్ల వేల మంది జీవితాల్లో అయోమయం ఏర్పడిందని, అందరూ ఇబ్బంది పడుతన్నారని ఆయన అన్నారు.

ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు తృణమూల్ కాంగ్రెస్‌ను దోషిగా ఆరోపిస్తుననాయి. ఇది బెంగాల్‌ చరిత్రలోనే అతి పెద్ద కుంభకోణమని అన్నారు బీజేపీ ఎంపీ షామిక్ భట్టాచార్య. తృణమూల్ అక్రమాలకు ప్రజలు ఎన్నికల్లో ఓటుతో శిక్షిస్తారని చెప్పారు.

టీచర్ రిక్రూట్‌మెంట్ స్కామ్ విషయంలో కోర్టు తీర్పుని గౌరవిస్తూ మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

తృణమూల్ కాంగ్రెస్ చేసిన తప్పుల వల్ల 25వేల మందికి పైగా ఉద్యోగుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ చెప్పారు.

సమాజంలో గౌరవప్రదమైన ఉపాధ్యాయ ఉద్యోగాలను తృణమూల్ కాంగ్రెస్ సంతలో పశువులు, గొర్రెలు, కోళ్లలా అమ్మేసిందని కోర్టు తీర్పు రుజువు చేసిందని ఆయన అన్నారు.

తృణమూల్ కాంగ్రెస్‌లో అన్ని స్థాయిల్లోని నేతలకీ ఈ స్కామ్‌లో భాగం ఉందన్నారు సీపీఎం నాయకుడు సుజన్ చక్రవర్తి.

“దీని ప్రభావం సమాజం మొత్తంపై ప్రతిబింబిస్తుంది. ఉద్యోగాలు పోయిన వాళ్లంతా తాము జీతంగా తీసుకున్న సొమ్మును ఎలా చెల్లించగలరు?. అంత పెద్ద మొత్తాలను వాళ్లు ఎక్కడ నుంచి తీసుకు వస్తారు. ఈ సొమ్మంతా తృణమూల్ కాంగ్రెస్ చెల్లించాలి” అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)