చనిపోయిన తన తండ్రిలాగే మాట్లాడే చాట్‌బాట్ తయారు చేసిన కొడుకు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఈగాన్ కోసౌ
- హోదా, బీబీసీ ప్రతినిధి
జేమ్స్ వ్లాహోస్‌కు 2016 లో ఓ భయంకరమైన వార్త తెలిసింది. ఆయన తండ్రి క్యాన్సర్‌తో బాధ పడుతూ చివరి దశలో ఉన్నారని వైద్యులు చెప్పారు.
జేమ్స్ అమెరికాలోని కాలిఫోర్నియా స్టేట్ ఓక్లాండ్ నగరంలో ఉంటున్నారు.
"నేను మా నాన్నను ఎంతో ప్రేమించేవాడిని. అలాంటిది మా నాన్న చనిపోయే దశలో ఉన్నారనే వార్తను విని తట్టుకోలేకపోయాను’’ అని అన్నారు.
ఆయన తన తండ్రికి మిగిలిన కొద్ది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
"నేను ఆయనతో కూర్చుని ఆయన చెప్పే విషయాలన్నీ రికార్డు చేశాను. ఆయన జీవిత కథను ఆడియో రికార్డ్ చేస్తూ గంటల తరబడి గడిపాను" అని జేమ్స్ చెప్పారు.
తండ్రి క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆ సమయంలోనే ఆయన ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)లో తన కెరీర్‌ను అన్వేషిస్తున్నారు. దీంతో ఆ రికార్డింగే ఆయన ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంది.
"దీని నుంచి ఏదైనా ఇంటరాక్టివ్ టెక్నాలజీని తయారు చేయగలనా? అనుకున్నాను. మా నాన్న జ్ఞాపకాలను, ఆయన వ్యక్తిత్వంలో కొంత భాగాన్ని ఎప్పుడూ నా చుట్టూ ఉండేలా చూసుకోవాలన్నది నా ఆలోచన’’ అని ఆయన చెప్పారు.
జేమ్స్ తండ్రి జాన్ 2017లో చనిపోయారు. అయితే ఈ లోపే జేమ్స్ తాను రికార్డు చేసిన ఆడియో సహాయంతో తన తండ్రి జీవితం గురించిన ప్రశ్నలకు, ఆయన గొంతుతోనే సమాధానం చెప్పే ఏఐ ఆధారిత చాట్‌బాట్‌ను తయారు చేశారు.
ఏఐ ద్వారా మనుషులను తిరిగి కృత్రిమంగా జీవింపజేసేందుకు సైన్స్ ఫిక్షన్‌లో చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఏఐ సాంకేతికత అభివృద్ధి చెందడంతో అదిప్పుడు సాధ్యమైంది.
2019లో జేమ్స్ తన చాట్‌బాట్‌ను హియరాఫ్టర్ ఏఐ అనే యాప్‌గా, బిజినెస్‌గా మార్చారు. ఈ యాప్‌తో మరణించిన వాళ్లు మళ్లీ కృత్రిమంగా ‘జీవిస్తారు’.
చాట్‌బాట్ తన తండ్రి మరణించిన బాధను తొలగించలేకపోయినా, దాని వల్ల తనకు చాలా మేలు జరిగిందని జేమ్స్ చెప్పారు.
"ఆయన ఎన్నడూ నా జ్ఞాపకాలలోంచి దూరం కారు. అయితే, ఆయన చెప్పే మాటలను ఇప్పుడు నేను ఆయన గొంతుతోనే వినగలగుతున్నాను" అని జేమ్స్ తెలిపారు.
హియరాఫ్టర్ ఏఐ యూజర్లు ఆ యాప్‌ని ఉపయోగించినప్పుడు వారి స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించేలా తమ ప్రియమైన వారి ఫోటోలను అప్‌లోడ్ చేయవచ్చు.

ఫొటో సోర్స్, James Vlahos
ఏఐ అవతార్
మనుషులను ఏఐ చాట్‌బాట్‌లుగా మార్చే మరొక సంస్థ సాంకేతికంగా మరింత ముందుకు వెళ్లింది. దక్షిణ కొరియాకు చెందిన డీప్‌బ్రెయిన్ ఏఐ మనుషుల వీడియో, ఆడియోలను అనేక గంటల పాటు చిత్రీకరించి, వారి ముఖం, వాయిస్, ప్రవర్తనను క్యాప్చర్ చేసి, ఆ తర్వాత ఆ మనిషి వీడియో-ఆధారిత అవతార్‌ను సృష్టిస్తుంది.
"మేము 96.5% అసలు వ్యక్తిని పోలి ఉండేలా క్లోనింగ్ చేస్తున్నాం" అని డీప్‌బ్రెయిన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మైఖేల్ జంగ్ చెప్పారు. "అది ఏఐ అవతార్ అయినా, మరణించిన వారితో మాట్లాడటానికి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యా ఉండదు" అని మైఖేల్ వివరించారు.
అలాంటి సాంకేతికత "వెల్ డయింగ్" సంస్కృతిని అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన భాగమని ఆ కంపెనీ భావిస్తోంది. దీనిలో మనుషులు మరణానికి ముందుగానే సిద్ధమవుతారు. వారి కుటుంబ చరిత్రను, కథలను, జ్ఞాపకాలను ‘జీవిత వారసత్వం’గా వదిలి వెళతారు.
అయితే ఈ ప్రక్రియ చాలా ఖరీదైనది. అదీ కాకుండా, యూజర్లు అవతార్‌ను స్వయంగా సృష్టించలేరు. చిత్రీకరణ ప్రక్రియ, అవతార్‌ను రూపొందించడం కోసం వారు సంస్థకు సుమారు 40 లక్షల రూపాయలు చెల్లించాలి.
ధర ఎక్కువగానే ఉన్నా, కొంతమంది ఇన్వెస్టర్లు ఇది జనాదరణ పొందుతుందని భావిస్తున్నారు. డీప్‌బ్రెయిన్ గత ఫండింగ్ రౌండ్‌లో 360 కోట్ల రూపాయలకు పైనే సేకరించడమే దీనికి రుజువు.
అయితే, ఉద్వేగాలు ఎక్కువగా ఉండే సమయాల్లో ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని మానసిక నిపుణురాలు లావెర్న్ ఆంట్రోబస్ సూచిస్తున్నారు.
మరణించిన తమ ఆప్తుల చాట్‌బాట్‌ను ఉపయోగించడానికి ప్రజలు తొందరపడకూడదని ఆంట్రోబస్ అంటారు.
"ఇలాంటి వాటిని ఉపయోగించే ముందు మీరు చాలా దృఢంగా ఉండాలి. ఇలాంటి విషయాలపై నిర్ణయాలు చాలా నెమ్మదిగా తీసుకోవాలి’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Deepbrain AI
‘డెత్ టెక్’
ఒక మనిషి మరణించాక అనేక వ్యవహారాలను చక్కబెట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీ ప్రియమైన వ్యక్తి ఉపయోగించిన బ్యాంకులు, వ్యాపారాలు, సోషల్ మీడియా సైట్‌ల ఖాతాలు, సబ్‌స్క్రిప్షన్లు లాంటి వాటిని మూసేయడానికి చాలా పేపర్ వర్క్‌ను పూర్తి చేయాలి.
సౌత్ డెవాన్‌కు చెందిన 41 ఏళ్ల ఎలియనార్ వుడ్ మాట్లాడుతూ.. "నేను రెండు డజన్లకుపైగా కంపెనీలకు ఫోన్ చేసి మరణించిన నా భర్త వివరాలు చెప్పాల్సి వచ్చింది’’ అన్నారు. ఆమె భర్త స్టీఫెన్ గత ఏడాది మార్చిలో మరణించారు.
"కొన్ని సంస్థలు మంచివి, చాలా రకాలుగా సహకరించాయి. కొన్ని చాలా అసమర్థంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. నా మానసిక స్థితి సరిగా లేని సమయంలో అవి మరింత ఒత్తిడిని, మానసిక క్షోభను కలిగించాయి" అని ఎలియనార్ చెప్పారు.
మరణించిన వారికి సంబంధించిన ఇలాంటి వ్యవహారాలను చూడడానికి, బాధలో ఉన్న వారి బంధువుల మీద భారాన్ని తగ్గించడంలో బ్రిటన్‌కు చెందిన సెటిల్డ్ అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ సహాయపడుతోంది. ఇది మరణించిన వారి బంధువుల తరపున ప్రైవేట్ రంగ సంస్థలను సంప్రదిస్తుంది.
దీనిలో యూజర్లు అవసరమైన కాగితాలను, సంప్రదించవలసిన వారి జాబితాను అప్‌లోడ్ చేస్తారు. సెటిల్డ్ వారి తరపున ఈమెయిళ్ళను పంపుతుంది. ఏవైనా సంస్థలు ప్రత్యుత్తరం ఇచ్చాయా, మీ సమస్యలు పరిష్కారమయ్యాయా లేదా అని యూజర్లు మళ్లీ తనిఖీ చేసుకోవచ్చు.
బ్యాంకులు, సోషల్ మీడియా సంస్థలు, యుటిలిటీ కంపెనీలాంటి 950 సంస్థలతో సెటిల్డ్ పని చేస్తుంది. దీనిని 2020లో విక్కీ విల్సన్ తన అమ్మమ్మ మరణానంతరం స్థాపించారు.
"అలాంటి భారాలను తగ్గించుకోవడానికి సాంకేతికతను వీలైనంతగా ఉపయోగించుకుంటే మంచిది’’ అని ఆమె అన్నారు.
‘‘ఎవరైనా మరణించినప్పుడు, సాధారణంగా వారి వ్యవహారాలన్నీ పూర్తి కావడానికి దాదాపు తొమ్మిది నెలల సమయం పడుతుంది. ఆ పనిని 70% ఆటోమేటిక్‌గా చేయవచ్చని మేము భావిస్తున్నాం" అని విక్కీ విల్సన్ వివరించారు.
ఇలా ఎవరైనా మరణించినప్పుడు వారి వ్యవహారాలు చూడటాన్ని ‘డెత్ టెక్’ అని పిలుస్తున్నారు. టెక్ న్యూస్ వెబ్‌సైట్ టెక్‌రౌండ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కంపెనీల మార్కెట్ విలువ 10 వేల కోట్ల రూపాయల పైనే ఉంటుంది.
కోవిడ్ తరువాత..

ఫొటో సోర్స్, Settld
కరోనా వైరస్ మహమ్మారి ఇలాంటి సాంకేతిక వృద్ధికి తోడ్పడిందని టెక్‌రౌండ్ ఎడిటర్-ఇన్-చీఫ్ డేవిడ్ సోఫర్ చెప్పారు.
"కోవిడ్ ప్రజలకు జీవితం ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది" అని ఆయన అన్నారు. దీని వల్ల, ‘మరణం గురించి మాట్లాడుకూడదు’ అనే అభిప్రాయాలు మారాయి. మనుషులు బాధపడుతూనే, మరణించిన సందర్భాలలో సాంకేతికతను మరింత ఎక్కువగా ఉపయోగించుకోవడం ప్రారంభించారు.
"ఒకేసారి చాలా మందికి తెలియజేయగలగడం, వాయిస్ రికార్డింగ్‌లు లేదా దృశ్యపరమైన సందేశాల ద్వారా వ్యక్తులను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం" అని డేవిడ్ అన్నారు.
"మనుషులు దుఃఖించడం లాంటి సాంకేతికేతర సమస్యలను పరిష్కరించడంలో సహాయపడినప్పుడే సాంకేతికతతో నిజమైన ప్రయోజనం ఉంటుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే, దుఃఖాన్ని అధిగమించే విషయంలో మనుషుల సహకారం కన్నా పెద్ద ప్రత్యామ్నాయం లేదని ఆంట్రోబస్ అంటున్నారు.
"మనుషులతో సన్నిహితంగా ఉండడం, వారి పట్ల శ్రద్ధ వహించడం, మనం చేసే పనులను ప్రశంసించడం, ఇలాంటి విషయాలలో సాంకేతికత జోక్యం చేసుకోవడం నేను ఊహించలేను" అని ఆమె అన్నారు.
ఇవి కూడా చదవండి:
- షుగర్ ఉన్న వాళ్లు మామిడి పండ్లు తినొచ్చా, తినకూడదా? డాక్టర్లు ఏం చెప్పారంటే..
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం, ఎవరికి అనుకూలం?
- పెద్దక్కగా పుట్టడం శాపమా, అది ఒక మానసిక సమస్యగా మారుతోందా?
- ‘మా నాన్న సీఎం’
- ఏపీలో మే 13న ఎన్నికలు పూర్తయితే జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఇవ్వకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














