మొహమ్మద్ మోఖ్బర్: ‘సముద్రంలో దిగినా తడవకుండా ఉండే’ నేత ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు అయ్యారు, ఆయన ఎవరంటే..

ఇరాన్

ఫొటో సోర్స్, FARS

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లు ధ్రువీకరించిన అనంతరం ఉపాధ్యక్షుడు మొహమ్మద్ మోఖ్బర్ దెజాఫులీకి ఎన్నికలు జరిగే వరకూ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

ఇరాన్ ఉపాధ్యక్ష పదవికి ప్రత్యక్ష ఎన్నికలు లేవు. అధ్యక్షుడిగా ఎన్నికైన వారు ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. దాదాపు ప్రతి దేశ ప్రధాని నిర్వర్తించే బాధ్యతలను ఉపాధ్యక్షుడు నిర్వహిస్తారు.

1989లో ఇరాన్‌లో ప్రధాన మంత్రి పదవిని రద్దు చేశారు.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం, అధ్యక్షుడు మరణిస్తే "నాయకత్వ ఆమోదంతో, అధ్యక్షుడి అధికారాలు, బాధ్యతలను'' ఉపాధ్యక్షుడు స్వీకరిస్తారు.

రాజ్యాంగం ప్రకారం, ఉపాధ్యక్షుడు గరిష్ఠంగా 50 రోజుల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నికకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.

ఉపాధ్యక్షుడు కాకముందు, మొహమ్మద్ మోఖ్బర్ 15 ఏళ్ల పాటు ఫర్మాన్ ఇమామ్ అనే సంస్థ చీఫ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్‌గా ఉన్నారు.

ఈ సంస్థను ఆర్గనైజేషన్ ఆఫ్ ఇమామ్ ఖొమెనెయి ఆర్డర్ లేదా సెతాద్ అంటారు.

ఫర్మాన్ ఇమామ్ ఇరాన్‌లో చాలా శక్తివంతమైన సంస్థ. ఇది ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమెనెయి నియంత్రణలో ఉంటుంది.

దేశంలోని అత్యంత సంపన్న సంస్థల్లో ఒకటైన ఫర్మాన్ ఇమామ్ సుప్రీం లీడర్‌కు మినహా మరెవరికీ జవాబుదారీ కాదు.

ఇరాన్‌కు చెందిన ప్రముఖ రాడికల్స్‌ను ఓడించి మోఖ్బర్ ఉపాధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు "రెసిస్టెన్స్ ఎకానమీ హెడ్‌క్వార్టర్స్" అధిపతిగా నియమితులయ్యారు.

అయితే, అందులో ఆయన చెప్పుకోదగ్గ స్ఠాయిలో రాణించలేకపోయారు.

ఇరాన్

ఫొటో సోర్స్, TASNIM

ఖుజెస్తాన్ నుంచి టెహ్రాన్ వరకు..

మొహమ్మద్ మోఖ్బర్ 1955లో ఇరాన్‌లోని ఖుజెస్తాన్ ప్రావిన్స్‌లోని దెజ్‌ఫుల్ నగరంలో జన్మించారు. ఈ కారణంగానే ఆయన పేరు ముందు ఆయన పుట్టిన ఊరి పేరు కూడా చేరుస్తుంటారు.

మోఖ్బర్ మతపరమైన కుటుంబంలో పుట్టారు. ఆయన తండ్రి షేక్ అబ్బాస్ మోఖ్బర్ మత ప్రబోధకులు, మౌల్వీ. ఆయన కొంతకాలం దెజ్‌ఫుల్‌కి తాత్కాలిక ఇమామ్‌గా కూడా ఉన్నారు.

మొహమ్మద్ మోఖ్బర్ తన ప్రాథమిక విద్యను దెజ్‌ఫుల్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అహవాజ్ వెళ్లారు.

ఇరాన్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ చేశారు.

మీడియా కథనాల ప్రకారం, మోఖ్బర్ మేనేజ్‌మెంట్, ఎకనమిక్ డెవలప్‌మెంట్‌లో డాక్టరేట్ కూడా చేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు.

1979 ఇరాన్ రివల్యూషన్‌కు ముందు ఆయన ఏం చేసేవారనే విషయం కచ్చితంగా తెలియదు. కానీ, హమామిహాన్ వార్తాపత్రికలో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, మొహమ్మద్ జహాన్‌ఆరా, అలీ షాంఖానీ, మోసిన్ రెజాయీ, మొహమ్మద్ ఫరుజాందేహ్, మొహమ్మద్ బాకర్ జుల్కాదర్ వంటి వారితో కలిసి మన్సూరున్ సమూహంలో సభ్యులు.

ఖుజెస్తాన్‌లో ఏర్పడిన ఈ సమూహం ఇరాన్ మొదటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చురుగ్గా పనిచేసేది.

ఖుజెస్తాన్‌లో ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) స్థాపించిన తర్వాత, ఆయన దెజ్‌ఫుల్‌లో ఐఆర్‌జీసీ హెల్త్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.

1980లలో జరిగిన ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో మోఖ్బర్ అదే పోస్టులో ఉన్నారు.

ఇరాన్ - ఇరాక్ యుద్ధం ముగిసిన తరువాత, దెజ్‌ఫుల్ టెలీకమ్యూనికేషన్ కంపెనీకి మోఖ్బర్ సీఈవో అయ్యారు. ఆ తర్వాత ఖుజెస్తాన్ ప్రావిన్స్ టెలీకమ్యూనికేషన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఆ తర్వాత అదే కంపెనీకి సీఈవో అయ్యారు.

ఆయన కొంతకాలం ఖుజెస్తాన్ డెప్యూటీ గవర్నర్‌గా కూడా పనిచేశారు.

ఆ తర్వాతి కాలంలో ఆయన టెహ్రాన్‌కి మారారు. తన సొంత ప్రావిన్స్ ఖుజెస్తాన్‌కి చెందిన మొహమ్మద్ ఫరుజాందేహ్ దేశానికి అధ్యక్షుడైన తర్వాత ట్రాన్స్‌పోర్ట్ అండ్ కామర్స్ ఆఫ్ ముస్తఫాన్ ఫౌండేషన్‌ డెప్యూటీగా కీలక పదవిలో మోఖ్బర్ నియమితులయ్యారు.

ఆ పదవిలో ఉండగా, ఇరాన్ సెల్ కన్సార్షియంలో మొబైల్ ఫోన్ కంపెనీ తుర్క్‌సెల్‌కి బదులు దక్షిణాఫ్రికాకి చెందిన ఎంటీఎన్ కంపెనీని చేర్చడంలో మోఖ్బర్ కీలకపాత్ర పోషించారని చెబుతారు. ఇది వివాదాస్పదమైంది.

తర్వాత ఆయన అదే ఇరాన్ సెల్ కన్సార్షియం డైరెక్టర్ల బోర్డు వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు.

అంతేకాకుండా, మొహమ్మద్ మోఖ్బర్ సినా బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్‌గానూ ఉన్నారు. ఈ బ్యాంక్ ముస్తఫాన్ ఫౌండేషన్ పరిధిలో పనిచేసేది.

ఇరాన్

ఫొటో సోర్స్, TASNIM

శక్తివంతమైన సంస్థకు ఎగ్జిక్యూటివ్ హెడ్

2006లో ఇరాన్ ప్రభుత్వ పరిధిలోని ఫర్మాన్ ఇమామ్ ఎగ్జిక్యూటివ్ హెడ్‌క్వార్టర్స్‌కు అధిపతిగా నియమితులు కావడం మోఖ్బర్ కెరీర్‌లో నిర్ణయాత్మక మలుపుగా చెబుతారు.

1989లో అప్పటి సుప్రీం లీడర్ అయతొల్లా రుహొల్లా ఖొమెనెయి ఆదేశాలతో, ఆయన మరణానికి నెల రోజుల ముందు ఈ ఫర్మాన్ ఇమామ్‌ ఏర్పాటైంది.

ఇస్లామిక రివల్యూషన్ అనంతరం జప్తు చేసిన వేలాది ఆస్తుల నిర్వహణ బాధ్యతలను ఈ సంస్థ చూస్తుంది.

అయతొల్లా నియంత్రణలో, ఆయన సూచనల మేరకు పనిచేసే ఫర్మాన్ ఇమామ్ సంస్థ ఇరాన్ ప్రభుత్వంలోని ఏ విభాగానికీ జవాబుదారీ కాదు.

ఇప్పుడిదొక అపార సంపద కలిగిన భారీ ఆర్థిక సంస్థగా అవతరించింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాల్లోకి ఈ సంస్థ విస్తరించింది.

అమెరికా విదేశాంగ శాఖ జనవరి 2021లో ఫర్మాన్ ఇమామ్, దాని అప్పటి చీఫ్ మొహమ్మద్ మోఖ్బర్‌పై ఆంక్షలు విధించింది.

ఈ సంస్థను ''వ్యాపార దిగ్గజం''గా విదేశాంగ శాఖ అభివర్ణించింది. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఇంధనం, టెలీకమ్యూనికేషన్ సహా అన్ని రంగాలకూ విస్తరించింది.

ఎగ్జిక్యూటివ్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్ ఆస్తులపై ఎన్నో అంచనాలున్నాయి. 2013లో రాయిటర్స్ వార్తా సంస్థ తన పరిశోధనాత్మక కథనంలో ఎగ్జిక్యూటివ్ హెడ్‌క్వార్టర్స్‌ను ఒక ''విస్తృత ఆర్ధిక సామ్రాజ్యం''గా పేర్కొంది. దాని సంపదను 95 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది.

ఫర్మాన్ ఇమామ్ ఎగ్జిక్యూటివ్ హెడ్‌క్వార్టర్స్ ఒక మాఫియా తరహాలో నడుస్తుందని విమర్శకులు అంటున్నారు.

ప్రస్తుతం ఈ సంస్థకు చమురు, గ్యాస్, పెట్రోకెమికల్, వ్యవసాయం, పరిశ్రమలు, మైనింగ్, వైద్యం, నిర్మాణ రంగాలతో పాటు ఎన్నో రంగాల్లో డజన్ల కొద్దీ కంపెనీలున్నాయి.

అంతేకాకుండా, బర్కత్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ కూడా ఎగ్జిక్యూటివ్ హెడ్ క్వార్టర్స్ పరిధిలోకి వస్తుంది.

బర్కత్ నాలెడ్జ్ ఫౌండేషన్ అండ్ ఇన్‌స్టిట్యూట్‌‌ను మోఖ్బర్ హయాంలో స్థాపించారు.

అమెరికా విదేశాంగ శాఖ బర్కత్‌ను నిషేధించింది. దీనిని ఫర్మాన్ ఇమామ్‌ పెట్టుబడులకు పిల్లర్‌గా అభివర్ణించింది.

కోవిడ్ - 19 మహమ్మారి ప్రబలిన సమయంలో, బర్కత్ ఫౌండేషన్ దేశీయ వ్యాక్సీన్‌ తయారీ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్ట్‌ కారణంగా మోఖ్బర్ వార్తల్లో ప్రముఖంగా నిలిచారు.

ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన సంస్థకు అధిపతిగా ఉన్నప్పటికీ, కోవిడ్ వ్యాక్సీన్‌కు ముందు మోఖ్బర్‌ గురించి దేశంలో పెద్దగా తెలియదు.

ఇరాన్ సుప్రీం లీడర్ మద్దతుతో నిర్వహించిన వ్యాక్సీన్ డెవెలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కి మంచి ఆదరణ లభించింది. ఈ ప్రాజెక్ట్‌పై కొన్ని వివాదాలు కూడా వచ్చాయి.

ఏదేమైనా చివరికి, దేశానికి వ్యాక్సీన్ అందింది. మొహమ్మద్ మోఖ్బర్ కూతురికి ఈ వ్యాక్సీన్ మొదటి డోస్ వేశారు.

ఇరాన్

ఫొటో సోర్స్, MASLAHAT.IR

'తెరవెనుక ఆటగాళ్లు'

సయీద్ జలీలీ వంటి ప్రముఖులను వెనక్కి నెట్టి మొహమ్మద్ మోఖ్బర్ ఉపాధ్యాక్షుడు అయ్యారు. ఇబ్రహీం రైసీ అధికార బాధ్యతలు చేపట్టిన అనంతరం 2021 ఆగస్టులో మోఖ్బర్‌ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.

ఫర్మాన్ ఇమామ్‌లో వ్యాపార మెళకువలు సంపాదించుకున్న మోఖ్బర్ ప్రభుత్వంలో చేరిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థకు సహకారం అందించడం ప్రారంభించారు. అనంతరం ఇరాన్ రెసిస్టెన్స్ ఎకానమీకి అధిపతి అయ్యారు.

పదవి చేపట్టిన కొన్ని నెలల్లోనే ఆయన ఇబ్రహీం రైసీ ప్రత్యర్థి మోసిన్ రెజాయీని పదవి నుంచి తొలగించారు.

రైసీపై రెజాయీ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఎకనమిక్ డెప్యూటీగా కొత్త అధ్యక్షుడు ఆయన్ను నియమించారు. రెజాయీ తొలగింపు తర్వాత ఆ పోస్టును రద్దు చేశారు.

దీనితో పాటు ఇలాంటి సంఘటనలను తెరవెనక మొహమ్మద్ మోఖ్బర్ లాబీయింగ్‌గా చాలా మంది భావించేవారు.

ఫర్మాన్ ఇమామ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఉన్న సమయంలో అధికార వర్గాల్లో మోఖ్బర్ సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నారు. ఆయన వాటిని ఇప్పుడు వాడుతున్నట్లు భావిస్తున్నారు.

అయితే, ఇబ్రహీం రైసీ పాలన ఏడాది కూడా పూర్తి కాకముందే, దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారుతుండడం, రాజకీయ పోటీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఫండమెంటలిస్టులు తమ గళం విప్పడం ప్రారంభించారు.

2022 జులైలో స్టెబిలిటీ ఫ్రంట్ సభ్యుడైన జవాద్ కరీమీ-ఖుద్దూసి సోషల్ మీడియా సైట్ ఎక్స్‌లో ఈ పదవికి తగిన అర్హత మోఖ్బర్‌కి లేదు అని రాశారు.

ఆయన ఇక్కడ ఒక్క క్షణం ఉన్నా దేశానికి నష్టం వస్తుంది అని కరీమీ-ఖుద్దూసి హెచ్చరించారు.

అంతకు ముందు ఒక సంప్రదాయ మీడియా యాక్టివిస్ట్ మొహమ్మద్ మొహజెరీ ఎతెమాద్ వార్తాపత్రికలో రైసీ ప్రభుత్వంలో మొహమ్మద్ మోఖ్బర్ తెరవెనుక పోషిస్తున్న పాత్ర గురించి రాశారు.

ఆయన తన రాజకీయ నైపుణ్యంతో రైసీ ప్రభుత్వం అసమర్థతను కప్పిపుచ్చే పనులు చేస్తారని, అది అచ్చం సముద్రంలో దిగి తడవకుండా ఉండే వ్యక్తిలాగే ఉంటుందని మొహజెరీ చెప్పారు.

కానీ, మోఖ్బర్ కెరియర్ మీద ఈ విమర్శల ప్రభావం పడలేదు. 2022లోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయన్ను ఒక ప్రత్యేక పరిషత్ సభ్యుడిని చేశారు.

అంతేకాదు, రైసీ కూడా తన డిప్యూటీని విమర్శిస్తున్నవారి గురించి పట్టించుకోలేదు.

అదే ఏడాది ఒక కార్యక్రమంలో మొహమ్మద్ మోఖ్బర్ దేశంలోని బలమైన వారితో ఉన్న ఫోటోలు ప్రచురితమయ్యాయి.

చాలా మంది ఈ సమావేశం తర్వాత ఆయన ఆ ఫొటోలతో తన విమర్శకులకు ఒక సందేశం ఇచ్చారని భావించారు. అప్పటి నుంచి ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, వార్తల్లో రాకుండానే ఉపాధ్యక్షుడిగా మోఖ్బర్ తన పదవిలో కొనసాగారు.

ఇరాన్ అధ్యక్షుడి మరణం తర్వాత మొహమ్మద్ మోఖ్బర్‌కు ఒక కొత్త, ఊహించని మిషన్ లభించింది. అది తర్వాత అధ్యక్షుడి నియామకం వరకూ కొనసాగుతుంది.

వీడియో క్యాప్షన్, మొహమ్మద్ మోఖ్బర్: ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు ఎలా అయ్యారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)