ఈజిప్ట్ పిరమిడ్ల రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించినట్టేనా?

ఈజిప్ట్ పిరమిడ్ ఫోటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈజిప్ట్ పిరమిడ్లు
    • రచయిత, మలు కర్సినో
    • హోదా, బీబీసీ న్యూస్

ఈజిప్టులో ప్రపంచ ప్రసిద్ధ గిజా కాంప్లెక్స్‌ సహా 31 పిరమిడ్లను 4,000 సంవత్సరాల క్రితం ఎలా నిర్మించారనే రహస్యాన్ని ఛేదించినట్టేనని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఒక పురాతన నైలు నదీ పాయ పక్కనే ఈ పిరమిడ్లను నిర్మించి ఉండవచ్చని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్‌టన్‌కి చెందిన ఓ పరిశోధకుల బృందం అంచనా వేస్తోంది.

ఈ నదీ పాయ క్రమంగా కనుమరుగైపోయిందని, ప్రస్తుతం అది వ్యవసాయ భూములు, ఎడారి అడుగున ఉండి ఉంటుందని వాళ్లు భావిస్తున్నారు.

పిరమిడ్ల నిర్మాణానికి అవసరమైన రాతి దిమ్మెలు, ఇతర సామాగ్రిని రవాణా చేయడానికి సమీపంలోని జలమార్గాన్ని ఈజిప్షియన్లు ఉపయోగించుకుని ఉంటారని చాలా ఏళ్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

''కానీ పిరమిడ్లు ఉన్న ప్రదేశానికి ఆ నదీ పాయ ఎంత దూరంలో ఉంది, అసలు అది ఎక్కడుంది, ఎలా ఉంటుందనే విషయంపై ఇప్పటి వరకు ఎవరికీ కచ్చితంగా తెలియదు" అని ఈ అధ్యయనం చేసిన వారిలో ఒకరైన ప్రొఫెసర్ ఎమాన్ ఘోనిమ్ చెప్పారు.

ఎమాన్ ఘోనిమ్ ఫోటో

ఫొటో సోర్స్, Eman Ghoneim/UNCW

ఫొటో క్యాప్షన్, పరిశోధనా బృందానికి ప్రొఫెసర్ ఘెనిమ్ నేతృత్వం వహించారు.

నదీపాయ ఎలా మాయమైంది?

ఈ నదీ పాయను మ్యాప్ చేయడానికి రాడార్ ఉపగ్రహ చిత్రాలు, చారిత్రక పటాలు, జియోఫిజికల్ సర్వేలు, సెడిమెంట్ కోరింగ్‌ను (నమూనాల నుంచి రుజువులు పొందేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు ఉపయోగించే సాంకేతికత)ను ఈ పరిశోధకుల బృందం ఉపయోగించింది.

కరువు, ఇసుక తుపానుల కారణంగా వేల సంవత్సరాల కిందట ఈ నదీ పాయ పూడుకుపోయిందని కొందరు పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

''పురాతన ఈజిప్షియన్ పిరమిడ్‌ల పర్వత పాదాల వద్ద పూడుకుపోయిన నది ఆనవాళ్లు, పురాతన నిర్మాణాల గుర్తుల వంటివి రాడార్‌ టెక్నాలజీతో చేసిన పరిశోధనలో గుర్తించా''మని ప్రొఫెసర్ ఘోనిమ్ చెప్పారు.

"ఒకవైపు ఆ నదీ పాయ ఎక్కడుందో గుర్తించడం, మరోవైపు ఒక జలమార్గంలో బండరాళ్లు, పరికరాలు, కూలీలను తరలించారన్న సమాచారం ఈ పిరమిడ్లను ఎలా కట్టారో తెలుసుకోవడానికి తమకు ఎంతో సహాయపడ్డాయి'' అని ఈ పరిశోధకులలో ఒకరైన డాక్టర్ సుజానే ఆన్‌స్టైన్ బీబీసీతో చెప్పారు.

వివిధ దేశాల పరిశోధకుల ఫోటో

ఫొటో సోర్స్, Suzanne Onstine

ఫొటో క్యాప్షన్, అమెరికా, ఈజిస్ట్, ఆస్ట్రేలియా నుంచి పరిశోధకులు ఇందులో పాల్గొన్నారు.

అహ్రమత్ (అరబిక్‌లో "అహ్రమత్" అంటే పిరమిడ్‌లు) అనే పేరున్న ఈ నదీ పాయ - దాదాపు 64 కిలోమీటర్ల (39 మైళ్ళు) పొడవు, 200-700 మీటర్ల (656-2,296 అడుగులు) వెడల్పు ఉందని పరిశోధకుల బృందం గుర్తించింది.

ఇది 4,700 నుంచి 3,700 సంవత్సరాల క్రితం నిర్మించిన 31 పిరమిడ్‌లకు ఆనుకుని ప్రవహించినట్లు భావిస్తున్నారు.

అంతరించిపోయిన ఈ నదీ పాయను కనిపెట్టడం వల్ల గిజా, లిష్ట్ (మిడిల్ కింగ్‌డమ్‌లో ఖననాలు చేసిన ప్రదేశం) మధ్య ఉన్న ప్రాంతంలో పిరమిడ్లు ఎందుకు ఎక్కువగా ఉన్నాయో వివరించడం సులభమవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సహారా ఎడారిలోని ఈ ప్రాంతం ఇప్పుడు నివాసయోగ్యంగా లేదు.

"పిరమిడ్ సముదాయాలకు సమీపంలోనే ఈ నదీ పాయ ఉండడం చూస్తుంటే ఈ పిరమిడ్ల నిర్మాణ దశలో ఈ నదీపాయ ప్రవహిస్తూ, రవాణాకు ఉపయోగపడేది" అని ఆ పరిశోధనా పత్రం పేర్కొంది.

"ఈ బండరాళ్లను మోసేందుకు అప్పటి ఈజిప్షియన్లు మానవ శ్రమ కంటే, జలప్రవాహ శక్తిని ఉపయోగించుకొని ఉండవచ్చు, దీని వల్ల తక్కువ శ్రమ అవసరం అవుతుంది" అని డాక్టర్ ఆన్‌స్టైన్ తెలిపారు.

పురాతన ఈజిప్ట్‌కు, నైలు నది ప్రధాన జీవనాధారంగా ఉండేది. ఇప్పటికి కూడా.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)