మొసలి‌తో పోరాడి చెల్లిని కాపాడుకున్న అక్క, అసలేం జరిగిందంటే...

మెలిస్సా, జార్జియా లోరీ ఫోటో

ఫొటో సోర్స్, Georgia Laurie

ఫొటో క్యాప్షన్, కింగ్స్ మెడల్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు జార్జియా లోరీ (కుడి)
    • రచయిత, ఇండీ అల్మర్త్ రైట్, పీఏ మీడియా
    • హోదా, బీబీసీ న్యూస్

మొసలితో పోరాడి తన సోదరిని కాపాడుకున్నారు ఒక మహిళ.

బ్రిటన్‌లోని శాండ్‌హస్ట్‌కు చెందిన 31 ఏళ్ల జార్జియా లోరీ, తన సోదరితో కలిసి మెక్సికోలోని ఓ నదిలో ఈతకు వెళ్లారు.

ఇంతలో ఓ మొసలి ఆమె సోదరి మెలిస్సాపై దాడి చేసింది.

ఆ సమయంలో జార్జియా ఆ మొసలితో పోరాడి, అనేకసార్లు దాని ముఖం మీద కొట్టి, మెలిస్సాను దాని బారి నుంచి విడిపించింది.

2021 జూన్‌లో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఆ కవలలకు ఆసుపత్రిలో చికిత్స అందించారు.

మొసలి బారి నుంచి తన సోదరిని రక్షించిన జార్జియాకు కింగ్స్ గ్యాలంట్రీ మెడల్ ప్రకటించారు.

"నిజంగా ఇది నాకు దక్కిన అపురూపమైన గౌరవం. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి బయటపడిన మాకు, ఈ మెడల్ మరింత ఆనందాన్ని ఇస్తుంది" అని జార్జియా అన్నారు.

"ఇదొక గౌరవం. ఆ ఉత్తరం అందుకున్నప్పుడు నాకు నోటమాటరాలేదు. ఆ ఉత్తరం వస్తుందని నేనెన్నడూ ఊహించలేదు’’ అని కింగ్స్ ఫస్ట్ సివిలియన్ గ్యాలంట్రీ లిస్ట్‌లో తన పేరు ఉందని తెలిసిన తర్వాత జార్జియా చెప్పారు.

"మెలిస్సా ధైర్యమే నాకు పోరాడే శక్తిని ఇచ్చింది. ఆమె చాలా ధృఢమైనది. ఆమె లేకుంటే నేను లేను" అని అన్నారు.

మెలిస్సా, జార్జియా ఫోటో

ఫొటో సోర్స్, Hana Laurie

ఫొటో క్యాప్షన్, మెలిస్సాను జార్జియా(కుడి) మొసలిబారి నుంచి కాపాడారు

అసలు ఏం జరిగిందంటే..

మెలిస్సా బీబీసీతో మాట్లాడుతూ "అదంతా చాలా వేగంగా జరిగిపోయింది. ఆ మొసలి నన్ను పళ్లతో పట్టుకుని, నీళ్ళ కిందికి లాక్కుపోతున్నప్పుడు, నా పని అయిపోయిందనుకున్నాను’’ అన్నారు.

"పడవలో వెళుతున్నప్పుడు నేను చనిపోతానేమో అనుకున్నాను.

'నన్ను గట్టిగా కౌగిలించుకో, నన్ను కౌగిలించుకో నేను చనిపోతున్నాను'అని జార్జియాతో అంటున్నాను. ఆమె భుజాన్ని గట్టిగా పట్టేసుకున్నాను’’

"కానీ జార్జియా ‘స్టాండ్ బై మీ అండ్ డోంట్ వరీ ఎబౌట్ ఎ థింగ్’ అనే పాట పాడుతూ నాకు ధైర్యాన్ని ఇచ్చింది.

నన్ను ప్రశాంతంగా ఉంచడానికి ఆమె మళ్ళీ మళ్ళీ ఆ పాటను పాడింది. ఆమె చాలా ధైర్యవంతురాలు" అన్నారు మెలిస్సా.

దాదాపు మూడు సంవత్సరాల క్రితం మొసలి దాడి జరిగినప్పుడు, మెలిస్సా మణికట్టు ఫ్రాక్చర్ అయింది. పొత్తికడుపు, కాలు, పాదాల మీద మొసలి గాట్లు పడ్డాయి. అదే సమయంలో మొసలి జార్జియా చేతిని కొరికింది.

"కాలం గడుస్తూ పోయే కొద్దీ, అది అంతా కలలా అనిపిస్తోంది. కానీ ఇలాంటిదేదో సంఘటన జరుగుతుంది, అది మళ్లీ ఆనాటి సంఘటనను గుర్తుకు తెస్తుంది. అప్పుడు, వావ్, ఇది నిజంగా జరిగింది కదా అనిపిస్తుంది’’ అన్నారు.

“దాని గురించి ఆలోచించినప్పుడు, అదొక భయానకమైన సినిమాలా అనిపిస్తుంది. కానీ అది మా జీవితంలో ఒక భాగం’’

"మొసలి దాడి జరిగాకా మేము ఒకరికొకరం మరింత దగ్గరయ్యాం. ఆమె చనిపోయిందని అనుకున్నప్పుడు నాలో ఒక భాగం తెగిపోయినట్లు అనిపించింది" అని జార్జియా చెప్పారు.

మొసలి

ఫొటో సోర్స్, Getty Images

బెర్క్‌షైర్‌కు చెందిన ఈ కవలలు, మొసలి దాడి చేసినప్పుడు ఓ గైడెడ్ రివర్ టూర్‌లో ఉన్నారు.

బయోల్యూమినిసెన్స్‌తో మెరుస్తున్న నీటిని చూడటానికి వాళ్లు ప్యూర్టో ఎస్కాండిడో సమీపంలోని ఓ సరస్సులో ఈత కొడుతున్నారు.

బయోల్యూమినిసెన్స్ అనేది పాచి వంటి కొన్ని జీవులు తమ కణాల నుంచి విడుదల చేసే కాంతి పుంజాలు.

జంతు సంరక్షణ కేంద్రాలలో స్వచ్ఛంద సేవకులుగా పని చేయడానికి జూన్ 2021లో వారిద్దరు మెక్సికోకు వెళ్లారు.

ఆగష్టు 11న ఈ కవలలు థేమ్స్ మారథాన్‌లో ఈదడానికి సిద్ధమవుతున్నారు.

వీరిద్దరూ రెండు కారణాల కోసం డబ్బును సేకరిస్తున్నారు.

వీటిల్లో యూకేలో పీటీఎస్‌డీ (పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్) కోసం ఒకటి, మెక్సికోకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘కంపానెరోస్ ఎన్ సలుడ్’ కోసం మరొకటి.

ఈ సంస్థ చియాపాస్‌లోని కమ్యూనిటీలకు అవసరమైన సహాయం, వైద్య శిక్షణను అందిస్తుంది.

హెన్లీ-ఆన్-థేమ్స్, మార్లో మధ్య ఈత కొట్టడం ద్వారా 4 లక్షల రూపాయలకు పైగా సేకరించాలనేది వీరి లక్ష్యం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)