ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం తర్వాత ఇప్పుడు అక్కడ ఏం జరగబోతోంది?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, లీస్ డూసెట్
- హోదా, చీఫ్ ఇంటర్నేషనల్ కరెస్పాండెంట్
ఇరాన్ సుప్రీం లీడర్‌గా అధికారం చేపట్టడానికి అడుగు దూరంలో నిలిచారు ఇబ్రహీం రైసీ. ఆ స్థానానికి ఆయనే తగిన వారనే సిఫార్సులు కూడా ఉన్నాయి.
కానీ, ఒక నాటకీయ పరిణామం ఈ పరిస్థితిని మార్చేసింది.
ఆదివారం (మే 19) హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ చనిపోయారు.
దీంతో ఇరాన్ సుప్రీం లీడర్, 85 ఏళ్ల అయతొల్లా అలీ ఖమెనేయి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే చర్చ తెరపైకి వచ్చింది. అయతొల్లా ఆరోగ్యంపై చాలా కాలంగా చాలామందిలో ఆసక్తి నెలకొంది.
రైసీ మరణం ఇరాన్ దేశ విధానాలకు భంగం కలిగిస్తుందని, దీని పర్యవసానాలు దేశాన్ని కుదిపేస్తాయని ఎవరూ అనుకోవట్లేదు.
కానీ, సంప్రదాయవాదులు ఆధిపత్యం వహించే ఇరాన్ దేశ అధికార వ్యవస్థకు ఇది పరీక్షగా నిలుస్తుంది.
‘‘ఈ వ్యవస్థ తన ఉనికిని చాటుకోవడానికి రైసీ మరణాన్ని భారీగా ప్రదర్శిస్తుంది. రాజ్యాంగబద్ధ ప్రక్రియలకు కట్టుబడి ఉంటుంది. అయితే, సంప్రదాయవాదుల ఐక్యతను కాపాడే, అయతొల్లా అలీ ఖమెనేయికి విధేయంగా ఉండే కొత్త వ్యక్తిని నియమించాలని కోరుకుంటుంది’’ అని చాథమ్ హౌజ్ థింక్ ట్యాంక్‌కు చెందిన మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా ప్రోగ్రామ్ డైరెక్టర్ డాక్టర్ సనమ్ వకీల్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, AFP
మాజీ ప్రాసిక్యూటర్ అయిన రైసీ నిష్క్రమణను ఆయన ప్రత్యర్థులు హర్షిస్తారు.1980లలో రాజకీయ ఖైదీలను సామూహికంగా ఉరితీయడంలో రైసీ నిర్ణయాత్మక పాత్ర ఉందని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తారు.
ఈ ఆరోపణల్ని ఆయన గతంలో ఖండించారు.
ఇప్పుడు రైసీ పాలన ముగియడం అనేది ఆయన ప్రభుత్వ అంతాన్ని వేగవంతం చేస్తుందని ఆయన ప్రత్యర్థులంతా నమ్ముతున్నారు.
రైసీ అధికారిక అంత్యక్రియలు, ఇరాన్ పాలక సంప్రదాయవాదులకు భావోద్వేగాలతో కూడిన కార్యక్రమం.
తమ పాలన కొనసాగుతుందనే సంకేతాలను పంపడానికి కూడా ఇదొక అవకాశం.
కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే అధికారం కలిగిన ‘‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’’ లో రైసీ సభ్యుడు. ఇది చాలా కీలక స్థానం. ఇప్పుడు ఈ స్థానాన్ని కూడా కచ్చితంగా భర్తీ చేయాల్సి ఉంటుంది.
‘‘ఖమెనేయికి రైసీని అసలైన వారసుడిలా భావించారు. ఎందుకంటే సుప్రీం లీడర్ అయినప్పుడు ఖమెనేయి యువకుడు, చాలా నిజాయతీపరుడు, పేరు, గుర్తింపు ఉన్న ఒక వ్యవస్థకు కట్టుబడిన సిద్ధాంతకర్త’’ అని డాక్టర్ వకీల్ చెప్పారు.

ఫొటో సోర్స్, REUTERS
రైసీ మరణాన్ని అధికారికంగా ధ్రువీకరించక ముందే సుప్రీం లీడర్ అయతొల్లా సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ, ‘‘ఇరాన్ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దేశ వ్యవహారాల్లో ఎలాంటి అంతరాయం ఉండదు’’ అని పేర్కొన్నారు.
ఇప్పటికిప్పుడు ఇరాన్‌లో ఎదురయ్యే రాజకీయ సవాలు ఏంటంటే ముందస్తు అధ్యక్ష ఎన్నికలను నిర్వహించడం.
ప్రస్తుతానికి ఉపాధ్యక్షుడు మొహమ్మద్ మొఖ్బీర్ తాత్కాలిక అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నారు.
అయితే, 50 రోజుల్లోగా అధ్యక్ష ఎన్నికల్ని కచ్చితంగా నిర్వహించాలి.
మార్చిలో జరిగిన ఇరాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో తక్కువ ఓటింగ్ శాతం నమోదైనట్లు వెల్లడైంది. ఇప్పుడు మళ్లీ అక్కడ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలి.
‘‘ముందస్తు అధ్యక్ష ఎన్నికలు మునుపటి రాజకీయ ప్రక్రియలో ఓటర్లు భాగమయ్యేందుకు అవకాశం కల్పించగలవు. కానీ, దురదృష్టవశాత్తు అక్కడి ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదు’’ అని లండన్‌కు చెందిన అమ్వాజ్.మీడియా ఎడిటర్ మొహమ్మద్ అలీ షాబానీ అన్నారు.

ఫొటో సోర్స్, REUTERS
కానీ, రైసీ ర్యాంకు స్థాయిలోనూ కచ్చితమైన వారసుడు కనిపించడం లేదు.
‘‘ఈ సంప్రదాయవాదుల గ్రూపులోనే వివిధ వర్గాలు ఉన్నాయి. ఈ గ్రూపులో కఠిన సంప్రదాయవాదులతో పాటు, వాస్తవీయవాదులు (ప్రాగ్మాటిక్) అనే వర్గాలు ఉంటాయి’’ అని బెర్లిన్‌కు చెందిన థింక్ ట్యాంక్ ఎస్‌డబ్ల్యూపీ విజిటింగ్ ఫెలో హమిద్రాజ్ అజీజీ అన్నారు.
రైసీ స్థానంలోకి ఎవరు వచ్చినా ఒక నిషిద్ధ ఎజెండాతో పాటు పరిమిత అధికారాలను వారసత్వంగా పొందుతారు.
ఇస్లామిక్ రిపబ్లిక్‌లో అంతిమ నిర్ణయాధికారం సుప్రీం లీడర్‌కు ఉంటుంది.
ముఖ్యంగా ఈ రీజియన్‌లో విదేశాంగ విధానం అనేది ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ)కి రక్షణ వ్యవస్థ లాంటిది.
రైసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్‌లో ద్రవ్యోల్బణం 40 శాతానికి పైగా పెరిగింది. రియాల్ కరెన్సీ విలువ పడిపోయింది.
దీనికంటే ముందు, 2022 సెప్టెంబర్‌లో 22 ఏళ్ల మహసా అమీన్, పోలీసు కస్టడీలో మరణించడంతో తలెత్తిన నిరసనలతో ఇరాన్ అట్టుడికిపోయింది.
ఇరాన్ డ్రెస్ కోడ్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలతో మొరాలిటీ పోలీసులు మహసా అమీన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు.
ఈ నిరసనలకు కొన్ని వారాల ముందు, ఇరాన్‌లో హిజాబ్, పవిత్ర చట్టాన్ని కఠినతరం చేయాలంటూ రైసీ ఆదేశాలు జారీ చేశారు.
ఈ చట్టం మహిళల ప్రవర్తన, దుస్తులు ధరించే విధానాలను నియంత్రిస్తుంది.

ఫొటో సోర్స్, EPA
తమ జీవితాలపై విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్, దేశ పాలనా వ్యవస్థపై అక్కడి యువతులు ఈ నిరసనలను తీవ్రతరం చేశారు.
ఈ నిరసనల అణచివేతలో వందలాది మంది మృత్యువాత పడ్డారని, వేలాది మందిని నిర్బంధించారని మానవ హక్కుల గ్రూపులు చెబుతున్నాయి.
‘‘ఇరాన్ అధ్యక్ష ఎన్నికల చరిత్రలో రికార్డు స్థాయిలో తక్కువ ఓటింగ్ నమోదైన ఎన్నికల్లో గెలుపొందిన రైసీకి ప్రజాదరణ లేదు. అంతకుముందు అధ్యక్షుడు రౌహానికి ఎక్కువ ప్రజాదరణ ఉండేది’’ అని షాబానీ అన్నారు.
ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ విదేశాంగ మంత్రి హొస్సేన్ అమిర్ అబ్దొల్లాహియాన్ కూడా మరణించారు. ఇరాన్ పరిస్థితిని ప్రపంచానికి చూపిస్తూ తమ దేశంపై ఆంక్షల ప్రభావాన్ని తగ్గించడానికి మార్గాలను కనుగొనడంలో హొస్సేన్ కీలక పాత్ర పోషించారు.
ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి సంబంధించిన దౌత్య విషయాల్లో ఇరాన్ మిత్రపక్షాలతో పాటు అరబ్, పశ్చిమ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశాల్లో, ఫోన్ చర్చల్లో ఆయనే పాల్గొనేవారు.
‘‘సందేశాలను పంపడానికి ఆయన ఒక కీలక వ్యక్తి. కానీ, విదేశాంగ మంత్రి చేతిలో ఎలాంటి అధికారం లేనందున ఆయన సూత్రప్రాయంగా వ్యవహరించేవారు’’ అని ఒక సీనియర్ దౌత్యవేత్త అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ రాజశేఖరరెడ్డి: హెలికాప్టర్ అదృశ్యమైన తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది... ఆచూకీ ఎలా తెలిసింది?
- బ్యాంకు పరీక్షల కోచింగ్‌కు నంద్యాల ఎందుకింత ప్రత్యేకం?
- వంటకు ఏ పాత్రలు వాడాలి? పోషకాలు కోల్పోకుండా ఆహారం ఎలా వండాలి?
- దుబాయ్ రియల్ ఎస్టేట్ : భారత్, పాకిస్తాన్లకు చెందిన నేతలు, నేరగాళ్లు ఇక్కడ ఎలా ఆస్తులు కొంటున్నారంటే...
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














