ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే పోలీసులు పాటించాల్సిన నిబంధనలేంటి?

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమృత దుర్వే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

న్యూస్‌క్లిక్ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు ప్రబిర్ పుర్కాయస్థను విడుదల చేయాలని ఈ నెల 15న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ప్రబిర్‌ అరెస్ట్, ఆయన నిర్బంధం చట్టవిరుద్ధమని జస్టిస్ బీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది.

ప్రబిర్‌ను అదుపులోకి తీసుకొనే సమయంలో ఆయన్ను అరెస్టు చేయడానికి కారణమేమిటో పోలీసులు చెప్పలేదని, అందుకే ఈ అరెస్ట్‌ను రద్దు చేస్తున్నట్టు కోర్టు తెలిపింది.

ఇంతకూ ఒక వ్యక్తిని అరెస్టు చేయడానికి పోలీసులు ఎలాంటి నిబంధనలు పాటించాలి? అరెస్టు అయినవారికి చట్టం ఎలాంటి హక్కులు కల్పిస్తోంది?

ప్రబిర్ అరెస్టు

ఫొటో సోర్స్, Getty Images

ప్రబిర్ కేసుతో మరోసారి చర్చ..

చైనా నుంచి అక్రమంగా నిధులు పొందారనే అభియోగాలతో ప్రబిర్‌ను 2023 అక్టోబర్‌లో ఉపా చట్టం కింద అరెస్టు చేశారు.

ప్రబిర్‌ను అదుపులోకి తీసుకొనే సమయంలో ఆయన అరెస్టుకు గల కారణాలేమిటో పోలీసులు చెప్పలేదని, వాస్తవానికి ఈ సమాచారం లిఖితపూర్వకంగా ఇవ్వాల్సి ఉందని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదించారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పులో ప్రబిర్ అరెస్టు సమయం కూడా కీలకంగా మారింది. ప్రబిర్‌ను ఆయన ఇంటి వద్ద ఉదయం 6:30 గంటలకు ఉపా చట్టం కింద దిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అరెస్టు చేసింది.

అయితే, తనకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, రిమాండ్ విచారణ నిమిత్తం ప్రత్యేక న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లారని ప్రబిర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అంతేకాదు, ప్రబిర్ లాయర్‌కు వాట్సాప్ ద్వారా పంపిన రిమాండ్ కాపీలో సంతకం కూడా లేదని, ఆయన అరెస్టుకు ఎటువంటి కారణం చెప్పలేదని కోర్టుకు తెలిపారు.

ప్రబిర్ అరెస్టు కేసులో ఆయన తరఫు లాయర్లు రిమాండ్ ఆర్డర్‌పై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. అధికారిక రికార్డుల ప్రకారం, రిమాండ్ ఆర్డర్‌పై ఉదయం 6 గంటలకు సంతకం చేశారు.

అంటే నిందితుడిని న్యాయమూర్తి ముందు హాజరుపరచడానికి లేదా నిందితుడి న్యాయవాదులకు తెలియజేయడానికి ముందే ఇది జరిగింది.

దీన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ప్రబిర్ అరెస్టు, నిర్బంధ ప్రక్రియ చట్టవిరుద్ధమని ప్రకటించింది.

చట్టం

ఫొటో సోర్స్, Getty Images

అరెస్టు ప్రక్రియ ఎలా ఉండాలి?

నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రకారం.. పోలీసులు ఎవరినీ ప్రశ్నించడానికి నేరుగా అరెస్టు చేయకూడదు.

ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలంటే 'వారెంట్‌' ఉండాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు.

అరెస్ట్ వారెంట్ అనేది నిందితుడిని అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడానికి పోలీసులకు కోర్టు జారీ చేసిన రాతపూర్వక ఉత్తర్వు. ఈ వారెంట్ తనిఖీల కోసం కూడా తీసుకోవచ్చు.

ఈ వారెంట్ రాతపూర్వకంగా ఉండాలి, ప్రిసైడింగ్ అధికారి సంతకం, కోర్టు సంతకం చేయాలి. అందులో నిందితుడి పేరు, చిరునామా, అతనిపై మోపిన అభియోగాల వివరాలు కూడా ఉండాలి.

వీటిలో ఏ ఒక్కటైనా వారెంట్‌లో లేకుంటే, అది చెల్లదు. అలాంటి వారెంట్ ఉపయోగించి చేసిన అరెస్టు చట్టవిరుద్ధం.

వారెంట్లు రెండు రకాలు

  • బెయిలబుల్
  • నాన్ -బెయిలబుల్
న్యాయస్థానం

ఫొటో సోర్స్, Getty Images

వారెంట్ లేకుండా అరెస్టు ఎప్పుడు చేయవచ్చు?

ఒక వ్యక్తి కాగ్నిజబుల్ నేరానికి పాల్పడినట్లు అనుమానముంటే, పోలీసులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు.

హత్య, అత్యాచారం, దోపిడీ, దొంగతనం, దేశంపై కుట్ర వంటి తీవ్రమైన నేరాలన్నీ కాగ్నిజబుల్ క్రైమ్ కిందకు వస్తాయి.

ఇది కాకుండా దొంగిలించిన సొత్తును దగ్గరుంచుకోవడం, పోలీసుల విధులను అడ్డుకోవడం, చట్టపరమైన కస్టడీ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడం, కాగ్నిజబుల్ నేరం చేయడానికి సిద్ధపడటం వంటి కొన్ని ఇతర కేసులలో ఒక వ్యక్తిని వారెంట్ లేకుండా అరెస్టు చేయవచ్చు.

అరెస్ట్ చేయడం ఎలా?

సీఆర్పీసీలోని సెక్షన్ 46 ప్రకారం, ఒక వ్యక్తి చుట్టూ పోలీసులు ఉన్నంత మాత్రాన, అది అరెస్టు కిందకు రాదు.

వ్యక్తిని మాట లేదా చర్యతో అరెస్టు చేయవచ్చు. అయితే, అరెస్టయిన వ్యక్తిని తాకడం లేదా పట్టుకోవడం అవసరం లేదు.

అదే సమయంలో నిందితుడు బలాన్ని ఉపయోగించి అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే, పోలీసులు బల ప్రయోగం చేయవచ్చు.

అయితే అందులో కూడా పోలీసులు అవసరమైనంత బలాన్నే ఉపయోగించాలి. అవసరమైతే తప్ప పోలీసులు ఆ వ్యక్తి చేతులు, కాళ్లు కట్టడానికి వీలులేదు.

నిర్బంధంలో ఉన్న వ్యక్తి హింసాత్మకంగా ప్రవర్తించకుంటే లేదా పారిపోయే ప్రయత్నం చేయకున్నా, తనకు తాను హాని చేసుకోని సమయంలో ఆ వ్యక్తి చేతికి పోలీసులు సంకెళ్లు వేయాల్సిన అవసరం కూడా లేదు. పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాత మాత్రమే వారిని తనిఖీ చేయాలి.

ఈ తనిఖీలో పోలీసులు స్వాధీనం చేసుకున్న అన్ని వస్తువులను భద్రంగా ఉంచాలి, రసీదును అరెస్టైన వ్యక్తికి ఇవ్వాలి.

ఒకవేళ మహిళలను అరెస్టు చేయవలసి వస్తే మహిళా అధికారులు మాత్రమే ఆ డ్యూటీ మర్యాదతో నిర్వహించాలి.

న్యాయస్థానం

ఫొటో సోర్స్, Getty Images

అరెస్టయిన వ్యక్తులకు ఉండే హక్కులు ఏమిటి?

అరెస్టయిన వ్యక్తికి చట్టం ప్రకారం కొన్ని ముఖ్యమైన హక్కులు ఉంటాయి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో వారికి పోలీసులు చెప్పాలి.

మీరు వారెంట్‌పై అరెస్టయితే, వారెంట్‌ను చూసే హక్కు మీకు ఉంది. మీకు నచ్చిన న్యాయవాదిని సంప్రదించే హక్కు మీకు ఉంది.

మిమ్మల్ని అరెస్టు చేసిన తర్వాత మీరు చెప్పిన వ్యక్తికి, బంధువు లేదా స్నేహితుడికి మీ అరెస్టు గురించి పోలీసులు తెలియజేయాలి. మిమ్మల్ని ఎక్కడ ఉంచారో వారికి చెప్పాలి.

అరెస్టు చేసిన 24 గంటల్లోగా మిమ్మల్ని సమీప మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. మీరు బెయిల్ పొందేందుకు అర్హులో కాదో మీకు తెలియజేయాలి.

మహిళను అరెస్టు చేయడానికి నియమాలు ఏమిటి?

మహిళను అరెస్టు చేసేటపుడు పోలీసు అధికారులు కొన్ని నిబంధనలు పాటించాలి. సీఆర్పీసీ సెక్షన్ 46 ప్రకారం మహిళను అరెస్టు చేయాలంటే మహిళా పోలీసు అధికారి ఉండాలి.

ఒకవేళ మహిళా పోలీసు లేకపోతే, పురుష పోలీసులు మహిళా నిందితులను అరెస్ట్ చేయాల్సి వస్తే, మహిళను అధికారులు తాకరాదు.

అరెస్టు చేసిన తర్వాత మహిళా పోలీసులు మాత్రమే నిందితురాలిని తనిఖీ చేయాలి. ఇందులో కూడా మర్యాద పాటించాలి.

సాయంత్రం 6 గంటల తర్వాత, ఉదయం 6 గంటలలోపు మహిళను అరెస్టు చేయరాదు. అత్యవసరమైతేనే ఈ సమయంలో మహిళను అరెస్టు చేయవచ్చు.

అందుకు ముందుగా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39A ప్రకారం, సొంతంగా లాయర్‌ను సమకూర్చుకోలేని వ్యక్తులకు ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు ఉంటుంది. వారికి న్యాయ సహాయం అందించడం వ్యవస్థ బాధ్యత.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)