అలోక్ శుక్లా: అడవులను కాపాడేందుకు బొగ్గు కంపెనీలతో పోరాడి ఎలా గెలిచారంటే....

ఫొటో సోర్స్, Goldman Environmental Prize
- రచయిత, ఫ్లోరా డ్రూరీ
- హోదా, బీబీసీ న్యూస్
- నుంచి, లండన్
ఛత్తీస్‌గఢ్‌లో తన ముందు విస్తరించిన అటవీ ప్రాంతాన్ని తొలిసారి చూసినప్పుడు అలోక్ శుక్లా మదిలో రెండు అంశాలు మెదిలాయి.
ఒకటి: అది అడవి – ఛత్తీస్‌గఢ్‌కు ఊపిరితిత్తులుగా దీనికి పేరుంది. వేల మంది గిరిజన ప్రజలకు, అంతరించిపోయే ప్రమాదం ఉన్న జంతువులకు, అరుదైన చెట్లకు పుట్టినిల్లు. ఇప్పటి వరకు తాను చూసిన అత్యంత అద్భుతమైన ప్రాంతాల్లో ఈ అడవి ఒకటి.
రెండోది: ఈ అటవీ భూగర్భంలో ఉన్న బొగ్గును వెతికి, వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్న మల్టీ బిలియన్ డాలర్ కంపెనీలను ఆపేందుకు తన జీవితాన్ని ఆయన అంకితం చేయాలి.
కానీ, ఎలా?
12 ఏళ్ల తర్వాత, ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంటే అలోక్ శుక్లా పెదవులపై చిరునవ్వు కనిపిస్తుంది. ఇన్నేళ్లలో అలోక్ శుక్లా సాధించిన విజయం అంతా ఇంతా కాదు.
అలోక్ శుక్లాకు ఇటీవలే గోల్డ్‌మ్యాన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రైజ్ దక్కింది. దీన్నే గ్రీన్ నోబెల్ అని కూడా పిలుస్తారు.
కానీ, ఆయన ఉద్యమం చిన్న అడుగుతోనే ప్రారంభమైంది.
2012లో ఛత్తీస్‌గఢ్‌లోని హస్దియో అటవీ ప్రాంతం, 1071 చదరపు కి.మీలలో విస్తరించి ఉన్న దాని జీవవైవిధ్యం ప్రమాదంలో పడింది.
మొత్తం 5.6 బిలియన్ టన్నులతో భారీ బొగ్గు నిల్వలు ఈ భూగర్భంలో నిక్షేపమై ఉన్న కారణంగా ఈ హస్దియో అటవీ ప్రాంతం ప్రమాదంలో కూరుకుపోయింది.
చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గు వినియోగదారైన భారత్‌కు ఈ బొగ్గు నిల్వలు అత్యంత విలువైన సరుకు.

ఫొటో సోర్స్, Goldman Environmental Prize
కానీ, ఈ అటవీ ప్రాంతంలో నివసించే ఆదివాసీలుగా పేరున్న గిరిజన ప్రజలు, ఏనుగులు, చిరుతలు, తోడేళ్లు, చెట్లపై నివసించే పక్షులకు విలువ కట్టలేమని అలోక్ శుక్లాకు అనిపించింది.
ఈ నేల విలువను గుర్తించింది ఈయన మాత్రమే కాదు. ఎన్నో ఏళ్ల క్రితం నుంచి వీటిని రక్షించాలని స్థానికంగా పని చేసే కొన్ని సంస్థలు, కొందరు అధికారులు ప్రయత్నించారు. కానీ, అవి సాగలేదు.
స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ, ఈ అటవీ ప్రాంతంలోని బొగ్గు బ్లాక్‌లను వేలానికి పెట్టారు.
2010 నుంచి 2015 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో ఐదు బొగ్గు గనులను ఏర్పాటు చేసేందుకు దేశంలోని శక్తిమంతమైన బహుళ జాతి సంస్థ అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. ఆ తర్వాత చాలా కంపెనీలు, మరిన్ని గనుల కోసం వేలంలో పాల్గొనేందుకు ముందుకు వచ్చాయి.
‘‘ఇది అత్యంత అద్భుతమైన అటవీ ప్రాంతం. కానీ, దురదృష్టవశాత్తు ఈ అడవిని బొగ్గు వెలికితీత ద్వారా నాశనం చేయాలనుకున్నారు.’’ అని అలోక్ శుక్లా అన్నారు.
‘‘కానీ, దీనికంటే బాధాకరమైన విషయం ఏంటంటే...శతాబ్దాలుగా ఈ అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తున్న స్థానిక గిరిజన కమ్యూనిటీలకు మైనింగ్ వల్ల తలెత్తే ఇబ్బందులేంటి? ఆ ఇబ్బందుల నుంచి తమల్ని కాపాడేందుకున్న న్యాయపరమైన హక్కులేంటి, సంరక్షణలు ఏమిటి? అన్న విషయాలపై అవగాహన లేదు.’’ అన్నారు అలోక్ శుక్లా.
సంప్రదాయంగా వస్తున్న వారి ఇల్లు నాశనమైపోతుందని అలోక్ శుక్లా భయపడ్డారు.

ఫొటో సోర్స్, Goldman Environmental Prize
‘‘ఎన్నో శతాబ్దాలుగా ఆదివాసీలు ఇక్కడే నివసిస్తున్నారు. ఈ అడవులు కాకుండా, మిగతా విషయాలేం వారికి తెలియవు. ఇది వారి ఐడెంటిటీలో ఇది ఒక భాగం’’ అని అన్నారు.
ఆదివాసీలు అప్పటికే బొగ్గు గనులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. కానీ సమస్యేంటంటే.. ప్రతి గ్రామం ఒంటరిగా పోటీ చేస్తోందని అలోక్ శుక్లా చెప్పారు.
కలిసి పోరాడకపోతే ఈ యుద్ధంలో వారు ఓడిపోతారేమోనని అలోక్ శుక్లాకు అనిపించింది.
ఎందుకంటే, గ్రామాల మధ్య ఒంటరి పోరాటంతో, వారిని ప్రతిఘటించడం ఆదివాసీలకు కష్టమైంది. అప్పటికే రెండు గనులలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించారు.
‘‘ఇది కేవలం ఒక్క గ్రామానికి చెందిన పోరాటం మాత్రమే కాదు. ఈ ప్రాంతం మొత్తానికి చెందినది.’’ అని అలోక్ శుక్లా అన్నారు.
దీని నుంచే, సేవ్ హస్దియో అరణ్య రెసిస్టెన్స్ కమిటీ ఉద్భవించింది. క్షేత్రస్థాయిలో ఉద్యమాలకు ఇదొక కూటమి.
అందుబాటులో ఉన్న స్థానిక చట్టాలు, హక్కుల గురించి ఈ ప్రాంత ప్రజలకు ఈ కమిటీ అవగాహన కల్పించడం ప్రారంభించింది.
తొలిసారి వివిధ గ్రూపులను అనుసంధానించి, బొగ్గు గనులకు వ్యతిరేకంగా పోరాడేలా చేసింది.
అయితే, ఇదంత తేలికగా జరగలేదు. 2020లో మరిన్ని బొగ్గు గనులను ప్రతిపాదించారు.
దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న సమయంలో, అలోక్ శుక్లా మరోసారి దీనిపై ప్రజలపై అవగాహన కల్పించడం ప్రారంభించారు.
స్థానిక ప్రజల ఒత్తిడి కారణంగా అదే ఏడాది సెప్టెంబర్ నెలలో మూడు బొగ్గు గనులు వెనక్కి తగ్గాయి. ఆ తర్వాత నెలలో, పది లక్షల ఎకరాల అటవీ ప్రాంతాన్ని ఏనుగుల అభయారణ్యంగా గుర్తించాలని ఈ కమ్యూనిటీ పోరాడింది.

ఫొటో సోర్స్, Goldman Environmental Prize
#SaveHasdeo హ్యాష్‌ట్యాగ్‌తో ఆన్‌లైన్ క్యాంపెయిన్‌తో ప్రతి ఒక్కరిని ఒకతాటిపైకి తీసుకొచ్చి, రాష్ట్ర రాజధానికి మార్చ్ చేపట్టేలా చేసేందుకు మరో 18 నెలలు పట్టింది. చివరకు ప్రభుత్వం 21 బొగ్గు గనులను రద్దు చేసింది.
అయితే, దీనిలో ఏదీ కూడా అంత తేలికగా సాగలేదు. ఈ 12 ఏళ్ల కాలంలో అటవీ ప్రాంతంలో నివసించే కమ్యూనిటీలతో పాటు తనవంతు ఉక్కు సంకల్పంతో పోరాడారు అశోక్ శుక్లా.
‘‘ప్రజల జీవనం, జీవనోపాధి, అడవులు ఒకవైపు, కార్పొరేట్ లాభాలు మరోవైపు...వీటి మధ్యలో ఈ పోరాటం’’ అని ఆయన అన్నారు.
‘‘సహజంగా ఏదైనా కంపెనీ లాభాలు సాధించడంపై కన్నేస్తే వాటిని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తాయి’’ అని చెప్పారు.
ఇప్పటికి ఇంకా పోరాడాల్సింది చాలా ఉందని, ప్రమాదంలో ఉన్న చెట్లను, నాశనమైన భూములను పునరుద్ధరించాల్సి ఉందని ఆయన చెప్పారు.
ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పోరాటం చేసే వారిని గుర్తించేందుకు ఇచ్చే గోల్డ్‌మ్యాన్ ప్రైజ్‌ను గెలవడం ప్రపంచంలో జరిగే ఇతర ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా నిలవనుందని అలోక్ శుక్లా ఆశిస్తున్నారు.
‘‘హస్దియో అరణ్యంలో ఏ చెట్టును నరికివేసినా అది తప్పే. ప్రతి చెట్టును కాపాడేందుకే మా ఈ ప్రయత్నం’’ అని అలోక్ శుక్లా అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే
- అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం 1967: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే.....
- Northern Lights: ఆకాశంలో ఈ రంగుల తుపాను మీకెప్పుడైనా కనిపించిందా?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














