భార్య మీద అనుమానంతో మాటలలో చెప్పలేనంత క్రూరత్వానికి పాల్పడ్డ భర్త...

మహిళలపై అఘాయిత్యాలు

ఫొటో సోర్స్, Getty Images

భార్యపై అనుమానంతో భర్తలు చేస్తున్న నేరాల్లో తీవ్రత పెరుగుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మహిళల మీద గృహ హింస కేసుల్లోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది.

తాజాగా పింప్రి చించ్‌వాడ్‌లో జరిగిన సంఘటన క్రూరత్వంలో అన్ని రకాల హద్దుల్ని దాటేసింది. ఈ సంఘటనపై ఆ నగరం మాత్రమే కాదు.. మొత్తం సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది.

భార్యకు మరో పురుషుడితో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భర్త ఆమె జననావయానికి తాళం వేశారు.

ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన వాకడ్ పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

నేపాల్ నుంచి వచ్చి, సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న 30 ఏళ్ల ఉపేంద్ర భార్యతో కలిసి పింప్రి చించ్‌వాడ్‌లోని తత్వాడే ప్రాంతంలో నివశిస్తున్నారు

28 ఏళ్ల భార్య మరో పురుషుడితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతో నిరంతరం ఆమెను కొట్టి హింసించేవారు.

ఒకరోజు మద్యం తాగి వచ్చి భార్య చేతుల్ని చున్నీతో కట్టేసి, బ్లేడుతో ఆమె జననావయవానికి అటు ఇటు రంధ్రాలు చేసి, అందులో ఇనుప సీలలు గుచ్చి దానికి తాళం వేశాడు. ఈ తాళం చెవిని బయటపారేశారు.

తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె నొప్పిని భరించలేక స్థానిక ఆసుపత్రికి వెళ్లారు. దీంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహారంలో మహిళ ప్రైవేటు అవయవాలకు ఆమె భర్త తాళం వేసి 24 గంటలు గడిచినా తాళం చెవి లేదనే కారణంతో డాక్టర్లు ఆ తాళాన్ని తియ్యలేదు. దీంతో ఆ మహిళ విపరీతమైన బాధ భరించలేక ఏడుస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.

అతనిపై ఐపీసీ 323,326, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతని నుంచి కత్తి, బ్లేడుని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

ఈ కేసులో నిందితుడు ఉపేంద్రను కఠినంగా శిక్షించాలని అన్ని వైపుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.

గృహ హింస, పింప్రీ చించ్‌వాడ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, దేశంలో పెరుగుతున్న గృహ హింస కేసుల సంఖ్య

గృహ హింసపై ఫిర్యాదు చేయడం ఎలా?

మహిళలు ఇళ్లలో ఎదుర్కొనే హింస నుంచి వారిని రక్షించేందుకు 'గృహ హింస నిరోధక చట్టం 2005' అమలులోకొచ్చింది.

ఈ చట్ట ప్రకారం, భార్య, తల్లి, సోదరి, కుమార్తె, లివ్-ఇన్ భాగస్వామి...ఇలా ఎవరిపై హింసకు పాల్పడినా దాన్ని గృహ హింస కింద గుర్తిస్తారు.

మహిళల ఆరోగ్యం, భద్రత, జీవితం, ఆమె శరీర భాగాలు, మానసిక స్థితికి హాని తలపెడితే నేరం అవుతుంది.

మహిళల పట్ల శారీరక, మానసిక, లైంగిక హింసలతో పాటు ఆర్థిక హింస కూడా నేరమే.

ఆర్థిక హింస అంటే ఇంటి ఖర్చులకు ఆమెకు డబ్బులు ఇవ్వకపోవడం, చట్టప్రకారం ఆమెకు దక్కాల్సిన ఆస్తి దక్కకుండా చేయడం, స్త్రీధనం, నగలు వంటివి ఆమె నుంచి లాక్కోవడం, ఆమె ఆదాయాన్ని లాక్కోవడం, అదనపు కట్నం కోసం వేధించడం, డబ్బులు ఇవ్వకుండా ఆమెను ఇంటి నుంచి గెంటివేయడం మొదలైనవి.

గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలు ఏపీలో స్పెషల్ హెల్ప్‌లైన్ 181, తెలంగాణలో 1091కి కాల్ చెయ్యడం లేదా కలెక్టరేట్‌లో భద్రతాధికారుల్ని సంప్రదించవచ్చు.

గృహ హింస నేరాల కింద నమోదైన కేసుల్లో బాధిత మహిళలకు 60 రోజుల్లోగా సాయం అందాలి.

బాధితురాలికి వైద్య సాయం అవసరమైతే అది కూడా అందించాలి.

భర్త ఇంట్లో ఆమెకు ఇబ్బందులు ఏవైనా ఉన్నాయా అనే దానిపై విచారణ జరగాలి. అలాంటి పరిస్థితి లేకుంటే వారికి భద్రత కల్పించేందుకు పునరావాసానికి పంపించవచ్చు అని మహారాష్ట్ర సోషల్ వెల్ఫేర్ కమిషనర్ అముదవల్లి చెప్పారు.

అలాగే, బాధితురాలికి 60 రోజుల్లో తక్షణ సహాయం అందించాలి.

గృహ హింస కేసుల్లో గరిష్టంగా ఒక నెల జైలు శిక్ష ఉంటుందని మద్రాసు హైకోర్టు న్యాయవాది శాంతకుమారి తెలిపారు.

అయితే భారతీయ శిక్షాస్మృతిలోని ఇతర సెక్షన్లను అమలు చేయడం ద్వారా గరిష్ట శిక్ష విధించవచ్చు.

గృహ హింస కేసులు, భారతదేశం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

చట్టం ఉద్దేశమేంటి?

భార్యలపై హింస, వరకట్న సంబంధిత మరణాల కేసులు పెరగడంతో 1983లో 498 ఏ సెక్షన్ భారతీయ శిక్షాస్మృతిలో చేర్చారు.

భర్త, అతని కుటుంబ సభ్యులు భార్యను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడితే ఈ చట్టం ప్రకారం మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తారు.

ఈ సెక్షన్ నాన్‌బెయిలబుల్. అలాగే వారెంట్ లేకుండానే పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేయొచ్చు.

ఈ చట్టం కేవలం వరకట్నం వేధింపుల నుంచే కాకుండా క్రూరమైన హింస నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.

క్రూరత్వం అంటే వరకట్నం తీసుకురావాలని మహిళను వేధించడం, లేదా మానసిక, శారీరక వేధింపులు, మహిళను ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పడం వంటివి వస్తాయి.

గత కొన్నేళ్లుగా ఈ సెక్షన్ దుర్వినియోగాన్ని నివారించేందుకు కోర్టులు అనేక ఆదేశాలిచ్చాయి.

వివాహ సంబంధమైన, లేదా కుటుంబ వ్యహారాలకు సంబంధించి కేసు నమోదు చేసే ముందు పోలీసులు ప్రాథమిక విచారణ జరపాలని సుప్రీం కోర్టు 2008లో ఆదేశించింది.

2014లో ఒక 498ఏ కేసులో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.

ఆ సందర్భంలో, అరెస్టు చేసే ముందు పోలీసులు ఆయనకు నోటీసులు ఇవ్వాలని, ఆ తర్వాత మేజిస్ట్రేట్ అనుమతించాకే అరెస్టు చేయాలని సుప్రీం కోర్టు చెప్పింది.

ఇలాంటి కేసులను పరిశీలించి, పరిష్కారం చూపేందుకు ప్రతి జిల్లాలో కుటుంబ సంక్షేమ కమిటీ (ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ) ఉండాలని సుప్రీం కోర్టు 2017లో ఆదేశాలు జారీ చేసింది.

499ఏ, గృహహింస, ఐపీసీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహిళలకు రక్షణగా గృహహింస నిరోధక చట్టం

చట్టపరమైన సంరక్షణ

గృహ హింస కేసుల్లో భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498 ఏ ప్రకారం గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష పడుతుంది.

గృహహింస నిరోధక చట్టం కింద నమోదైన ఫిర్యాదు కేసుకు బలం చేకూరుస్తుందని న్యాయవాది శాంతకుమారి చెబుతున్నారు.

గృహ హింస నిరోధక చట్టం 2005 కింద మహిళలకు తక్షణం అందే న్యాయపరమైన సంరక్షణ గురించి శాంతకుమారి వివరించారు.

సెక్షన్లు 18,19: మహిళ తాను నివసిస్తున్నఇంట్లో సురక్షితంగా ఉండేందుకు కోర్టు ఆదేశాలు పొందవచ్చు.

సెక్షన్ 20: బాధితురాలి పిల్లల నిర్వహణ కోసం భరణం కోరవచ్చు.

సెక్షన్ 21: తాను, తన పిల్లల కోసం బాధితురాలు తాత్కాలిక ఆశ్రయం కోరవచ్చు.

సెక్షన్ 22: బాధిత మహిళ తనకు జరిగిన నష్టానికి పరిహారం క్లెయిమ్ చేయవచ్చు.

మహిళలు శారీరకంగా లేదా మానసికంగా ఎలాంటి క్రూరత్వం ఎదుర్కొన్నా తక్షణమే తమకు తెలియజేయాలని మహిళా హక్కుల కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)