రాజీవ్ గాంధీ మరణానికి కొన్ని గంటల ముందు విశాఖలో ఏం జరిగింది?

ఫొటో సోర్స్, KEYSTONE/GETTY IMAGES
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
‘జనార్దన్ జీ.. నేను విశాఖపట్నం నుంచి దిల్లీ వెళ్లాలి. కానీ అత్యవసరంగా శ్రీ పెరంబుదూర్ వెళ్లాల్సి వస్తోంది. అయితే నాకు మరో జత ఉతికిన దుస్తులు లేవు. దుస్తులు ఏర్పాటు చేయగలరా? అని అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని రాజీవ్ గాంధీ కోరారు” అని అప్పటి యూత్ కాంగ్రెస్ స్టేట్ పబ్లిసిటీ సెక్రటరీ పీఎస్ఎన్ రాజు (రవి) గుర్తుచేసుకున్నారు.
“విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆశీల్ మెట్ట, జగదాంబ జంక్షన్, కోట వీధుల్లో సాయంత్రం 4 గంటల వరకు తిరిగిన మాజీ ప్రధాని రాత్రి 11 గంటల సమయానికి బాంబు దాడిలో మరణించారంటే నమ్మలేకపోయాం” అని అప్పటి సిటీ కాంగ్రెస్ యూత్ వింగ్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ అన్నారు.
“రాజీవ్ గాంధీ ఒక 10 నిమిషాలు ఆలస్యంగా విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకొని ఉంటే.. అసలు ఆయన ఫ్లైట్ ఎగిరేది కాదు, రాజీవ్ గాంధీ ఇవాళ బతికి ఉండేవారేమో” అని అప్పుడు రాజీవ్ గాంధీ సభను రిపోర్టు చేసిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బ్యూరో చీఫ్ బి. ప్రభాకర శర్మ చెప్పారు.
1991 మే 21న రాజీవ్ గాంధీ మరణానికి కొన్నిగంటల ముందు విశాఖలో అసలేం జరిగింది? ఆయన అసలు ఆ రోజు తమిళనాడుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?
స్టేడియంలోనే దుస్తులు మార్చుకున్న రాజీవ్ గాంధీ..
1991లో పదో లోక్‌సభ ఎన్నికల కోసం రాజీవ్ గాంధీ ఒడిశాలో ప్రచారం ముగించుకుని శ్రీకాకుళం చేరుకున్నారు. ఆయనకు శ్రీకాకుళంలో స్వాగతం పలికేందుకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి విశాఖపట్నం చేరుకున్నారు.
ఆయనతో పాటు తాను కూడా శ్రీకాకుళంకు బయలుదేరానని అప్పటి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ రవి బీబీసీతో చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఆయన వివరించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే..
శ్రీకాకుళంలో రాజీవ్ గాంధీని కలిశాం. రాజీవ్‌కు నన్ను జనార్దన్ రెడ్డి పరిచయం చేశారు. ‘నేను విశాఖపట్నం నుంచి దిల్లీకి వెళ్లాలి, కానీ అత్యవసరంగా శ్రీపెరంబుదూర్ వెళ్లాల్సి వచ్చింది. కానీ నాకు ఉతికిన దుస్తులు లేవు. నా బట్టలను క్లీన్ చేయించగలరా?’ అని జనార్దన్ రెడ్డిని రాజీవ్ గాంధీ అడిగారు. వెంటనే జనార్దన్ రెడ్డి నాకు ఆ పని అప్పగించారు.
రాజీవ్ గాంధీ దుస్తులు తీసుకొని కారులో వైజాగ్‌కు వచ్చాను. విశాఖలోని సర్క్యూట్ హౌస్‌లో దుస్తులు ఉతికించి, బ్లోయర్స్ కింద ఆరబెట్టి, వాటిని ఇస్త్రీ చేయించాను. ఎందుకంటే ఆయనకు విశాఖలో ఆ రోజు సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ ఉంది.
రాజీవ్ గాంధీ సరిగ్గా 4.45 నిమిషాలకు విశాఖ చేరుకున్నారు. సర్క్యూట్ హౌస్‌కు వస్తారనుకుంటే ఆయన నగరంలో ఊరేగింపుగా తిరుగుతూ.. బహిరంగ సభ జరిగే ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి వెళ్లిపోయారు.
దీంతో ఆయన దుస్తులు పట్టుకుని మేం అక్కడికే వెళ్లాం. సభ ముగిసిన తర్వాత స్డేడియంలోనే సెక్యూరిటీ వాళ్లు ఒక కర్రని పట్టుకుంటే దానిపై బెట్ షీట్ అడ్డంగా వేశారు. అక్కడే ఆయన దుస్తులు మార్చుకున్నారు. థ్యాంక్యూ రాజు జీ అని నాతో అన్నారు. అక్కడి నుంచి విమానాశ్రయానికి బయలుదేరిపోయాం.

ఫొటో సోర్స్, lakkojusrinivas
జనార్దన్ రెడ్డిని రమ్మని చెప్పిన రాజీవ్
శ్రీపెరంబుదూర్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు రాజీవ్ గాంధీ. అయితే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తిందని, టేకాఫ్ అవ్వడం లేదని పైలట్ చెప్పారు. స్వయంగా పైలట్ అయిన రాజీవ్ గాంధీ కూడా ఆ సమస్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక, టేకాఫ్ అయ్యే అవకాశం ఉందో లేదో కూడా పైలట్ చెప్పలేకపోవడంతో రాజీవ్ గాంధీ తిరిగి సర్క్యూట్ హౌస్‌కు బయలుదేరారు.
ఆ రోజు రాత్రికి విశాఖలో రాజీవ్ గాంధీ ఉండేందుకు సర్క్యూట్ హౌస్‌లో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి ఆదేశించారు.
రాజీవ్ గాంధీతో పాటు ఉన్న వి. హనుమంతరావు, పి. జనార్దన్ రెడ్డి, ఇద్దరు రాజీవ్ సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఒక కారులో సర్క్యూట్ హౌస్‌కు బయలుదేరారు. మరో కారులో మిగతా సెక్యూరిటీతో రాజీవ్ గాంధీ బయలుదేరారు. నేను కూడా మరో వాహనంలో సర్క్యూట్ హౌస్‌కు బయలుదేరాను.
మేము విశాఖ ఎయిర్ పోర్టుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్ఎస్టీఎల్ (NSTL) దాటగానే.. ఎయిర్ పోర్టు సిబ్బంది వచ్చి విమానం రెడీ అయింది, తిరిగి రమ్మంటున్నారని చెప్పారు. దాంతో మేం తిరిగి ఎయిర్ పోర్టుకు చేరుకున్నాం. రాజీవ్ గాంధీ కూడా అదే సమయానికి వచ్చారు.
రాజీవ్ గాంధీ విమానం ఎక్కి ‘కమ్ ఇన్.. కమ్ ఇన్” అంటూ నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని పిలుస్తున్నారు. జనార్దన్ రెడ్డి అది చూడలేదు. రాజీవ్ మరింత గట్టిగా పిలిచారు. వెంటనే అలర్ట్ అయిన జనార్దన్ రెడ్డి.. రాజీవ్ వైపు చూశారు. అయితే, కారు వచ్చాక తిరుపతికి పంపించు అని చెప్పి రాజీవ్ గాంధీ విమానం డోర్ లాక్ చేశారు. ఫ్లైట్ టేకాఫ్ అయ్యింది. అప్పుడు సమయం సాయంత్రం సుమారు 6.30 గంటలు అవుతోంది.

ఫొటో సోర్స్, lakkojusrinivas
ఆ పది నిమిషాలు ఆగి ఉంటే..
అది నడి వేసవి కాలం కావడంతో రాజీవ్ గాంధీ విమానం ఎక్కే సమయానికి విశాఖలో ఇంకా వెలుతురు ఉంది. అప్పటికి సమయం 6.15 నుంచి 6.30 అవుతోంది. అదే ఒక ఐదు, పది నిమిషాలు ఆగితే చీకటి పడిపోయేది.
1991 నాటికి విశాఖ విమానాశ్రయంలో నైట్ టేకాఫ్, ల్యాండింగ్ సౌకర్యం లేదు. అంటే చీకటిపడిన తర్వాత విశాఖ నుంచి విమానాలు వెళ్లడం లేదా విమానాలు రావడానికి అనుమతి ఉండేది కాదు.
''రాజీవ్ గాంధీ శ్రీపెరంబుదూర్‌కు బయలుదేరే సమయానికి ఇంకా వెలుతురు ఉండటంతో విమానం టేకాఫ్ అయ్యింది. అదే కొద్ది సేపు గడిచిపోయి ఉంటే.. విశాఖ నుంచి అది టేకాఫ్ అయ్యేదే కాదు. అప్పుడు రాజీవ్ గాంధీ విశాఖలోనే ఉండిపోయేవారు'' అని అప్పటి రాజీవ్ గాంధీ విశాఖ పర్యటనను కవర్ చేసిన ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చీఫ్ రిపోర్టర్ ప్రభాకర్ శర్మ బీబీసీతో చెప్పారు.
“విశాఖలో బహిరంగ సభ సాయంత్రం 5 గంటలకు జరిగింది. సభకు జనాలు ఎక్కువగా వచ్చారు. జనాలు ఎక్కువగా రావడంతో సెక్యూరిటీని కాదని కూడా వాళ్లని తన దగ్గరకు రాజీవ్ రానిచ్చారు. ఉత్సాహంలో తన కండువాను జనాలపైకి విసిరారు. అలా విశాఖలో ఎంతో ఉల్లాసంగా కనిపించిన రాజీవ్ గాంధీ రాత్రి 11 గంటల సమయానికి కనీసం శరీరం కూడా గుర్తుపట్టలేని విధంగా బాంబు దాడిలో ముక్కలైపోయారనే సమాచారం అందింది. విమానం మరో 10 నిమిషాలు అలస్యం అయ్యుంటే విశాఖ నుంచి రాజీవ్ శ్రీపెరంబుదూర్ వెళ్లలేకపోయేవారు. కానీ, ఆ సంఘటనలన్నీ చాలా చిత్రంగా జరిగిపోయాయి. రాజీవ్ గాంధీ మరణం కోసమే వెళ్లినట్లుగా అనిపించింది” అని బి. ప్రభాకరశర్మ వివరించారు.

ఫొటో సోర్స్, lakkojusrinivas
విశాఖ అంతా రాజీవ్ నినాదాలే..
విశాఖ బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చిన రాజీవ్ గాంధీ నగరంలో విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఉమాగజపతి రాజు కోసం ప్రచారం చేశారు. ఏయూ, బీచ్ రోడ్డు, ఆశీల్ మెట్ట, ఆర్టీసీ కాంప్లెక్స్, జగదాంబ జంక్షన్, కోటవీధి అన్ని తిరుగుతూ అందర్ని చిరునవ్వుతో పలకరించారు. ఆయన్ని చూసేందుకు వేలాది మంది ప్రజలు రోడ్డుకు ఇరువైపులా గంటల తరబడి నిలబడే ఉన్నారు.
ఆయన సభ ప్రాంగణానికి చేరుకునే వరకు జనం 'రాజీవ్ గాంధీ జిందాబాద్' అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారని రాజీవ్ గాంధీ ప్రచారంలో పాల్గొన్న అప్పటీ సిటీ కాంగ్రెస్ యూత్ సభ్యులు తైనాల విజయ్ కుమార్ అనాటి జ్ఞాపకాలను బీబీసీతో పంచుకున్నారు.
‘‘ఎయిర్ పోర్టులో ఫ్లైట్ స్టార్ట్ అవ్వడం లేదని రాజీవ్ గాంధీకి చెప్పినప్పుడు కాసేపు ఆయన అసహనానికి గురయ్యారు. అప్పుడు పక్కనే ఉన్న ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తన దగ్గర ఉన్న డ్రై ఫూట్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి రాజీవ్ గాంధీకి ఇచ్చారు. రాజీవ్ ఆ డ్రై ప్రూట్ తినకుండా అందులో ఉన్న రెండు చిన్నచిన్న పటిక బెల్లం ముక్కల్ని మాత్రం నోట్లో వేసుకున్నారు. డ్రై ఫ్రూట్స్‌ని పక్కన పెట్టి కేవలం పటిక బెల్లాన్ని తినడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది” అని రవి చెప్పారు.

ఫొటో సోర్స్, VT FREEZE FRAME
రాజీవ్ నో మోర్ అనడంతో..
విమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య క్లియర్ కావడంతో రాజీవ్ గాంధీ విశాఖ నుంచి శ్రీపెరంబుదూర్‌కు బయలుదేరారు.
‘‘మేం అప్పటికి విశాఖ కాంగ్రెస్ ఎమ్మెల్యే సూర్రెడ్డి ఇంటికి వెళ్లిపోయాం. అక్కడికి వచ్చిన కొద్దిసేపటికే రాజీవ్ సెక్యూరిటీ నుంచి మాకు ఫోన్ వచ్చింది. ఎక్కడున్నారు మీరు? అని అడిగారు. మేం సూర్రెడ్డి ఇంట్లో ఉన్నామని చెప్పాను. మీరు వెంటనే సర్క్యూట్ హౌస్‌కు వెళ్లండి. వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. రాజీవ్ గాంధీ నో మోర్ అని చెప్పారు. నో మోర్ అంటే అర్థం కాలేదు. విశాఖ నుంచి బయలు దేరి మూడు, నాలుగు గంటలే అయింది. నో మోర్ అంటే ఏంటో అర్థం కాలేదు. వెంటనే సర్క్యూట్ హౌస్‌కు బయలుదేరాం. అక్కడ మెట్లపై పి. జనార్దన్ రెడ్డి ఏడుస్తూ కనిపించారు. కొన్ని గంటల క్రితం ఆయనను దగ్గరగా చూసి, మాట్లాడిన మాకు ఏం చేయాలో తెలియలేదు. అందరం ఏడుస్తూనే కూర్చున్నాం” అని రవి ఆనాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
రాజీవ్ గాంధీ బట్టల సూట్ కేసు ఒకటి వి. హనుమంతరావు దగ్గరే ఉండిపోయింది. రాజీవ్ గాంధీ హడావిడిగా శ్రీపెరంబుదూర్ బయలుదేరడంతో ఆ సూట్ కేసు ఇవ్వలేకపోయానని హనుమంతరావు బాధపడ్డారు.
అయితే, కొన్ని గంటలకే రాజీవ్ గాంధీ మరణించారనే విషయం తెలియగానే వి. హనుమంతరావు బోరున విలపించారు. ఆయనను ఆపడం ఎవరికీ సాధ్యం కాలేదు. ఏడుస్తూనే ఉన్నారు. సర్క్యూట్ హౌస్ అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
రాజీవ్ గాంధీ ఆ రోజు రాత్రి విశాఖలోనే ఉండి ఉంటే.. ఇవాళ ఆయన జ్ఞాపకాలు కాకుండా ఆయనే ఉండేవారని తైనాల విజయ్ కుమార్ అన్నారు.
రాజీవ్ గాంధీ విశాఖలో తన చివరి పర్యటన చేశారు. ఆయనకు గుర్తుగా బీచ్ రోడ్డులో విగ్రహాంతో పాటు రాజీవ్ స్మృతివనం నిర్మించారు.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్‌పై పెట్టిన మారణహోమం కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం వ్యాఖ్యల అర్ధమేంటి, ఎవరు పొరపాటుపడ్డారు?
- పెద్దక్కగా పుట్టడం శాపమా, అది ఒక మానసిక సమస్యగా మారుతోందా?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం, ఎవరికి అనుకూలం?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024: మీరు ఎవరికి ఓటేశారో తెలుసుకోవడమెలా?
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే.....
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















