ఇజ్రాయెల్‌పై పెట్టిన మారణహోమం కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం వ్యాఖ్యల అర్ధమేంటి, ఎవరు పొరపాటుపడ్డారు?

- రచయిత, డొమినిక్ కాస్సియాని
- హోదా, హోం అండ్ లీగల్ కరస్పాండెంట్
గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడిందని, రఫాలో ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ దక్షిణాఫ్రికా దాఖలు చేసిన కేసులో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయస్ధానం విచారణను పున:ప్రారంభించింది.
దక్షిణాఫ్రికా వేసిన ఈ కేసును ‘పూర్తిగా నిరాధారం’, ‘నైతికంగా అభ్యంతరకరం’గా పేర్కొంది ఇజ్రాయెల్.
దక్షిణాఫ్రికా కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఉత్తర్వుల్లో ప్రస్తావించిన పదాలను లోతుగా పరిశీలించాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆ తీర్పులో వాడిన ''ఆమోదయోగ్యమైన(ప్లాజిబుల్)'' అనే పదం చుట్టూ సందిగ్ధత నెలకొంది.
అంతర్జాతీయ న్యాయస్థానం జనవరిలో ఒక మధ్యంతర తీర్పును వెలువరించింది. తీర్పు ప్రతుల్లోని ఒక ముఖ్యమైన పేరా అందరి దృష్టినీ ఆకర్షించింది.
''కోర్టు దృష్టిలో, దక్షిణాఫ్రికా వాదిస్తున్న వాటిలో కనీసం కొన్ని హక్కులకు రక్షణ కల్పించడం ఆమోదయోగ్యమేనని నిర్ధరించేందుకు ఆధారాలు, అక్కడి పరిస్థితులు సరిపోతాయి'' అని పేర్కొంది.
ఈ పేరాను కొందరు న్యాయ నిపుణులతో పాటు చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడిందన్న వాదన ''ఆమోదించదగినదే'' అని కోర్టు నిర్ధరించినట్లుగా అపార్థం చేసుకున్నారు.
ఈ అపార్థం త్వరగా వ్యాప్తి చెందింది. ఐక్యరాజ్యసమితి పత్రికా ప్రకటనలు, ఆందోళనకారుల ప్రకటనలు, బీబీసీ సహా అనేక మీడియా సంస్థల్లోనూ అలాగే వచ్చింది.
అయితే, ఆ తీర్పు వెలువరించే సమయంలో అంతర్జాతీయ న్యాయస్థానం ప్రెసిడెంట్‌గా ఉన్న జస్టిస్ జాన్ డోనోహ్యు ఏప్రిల్‌లో బీబీసీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోర్టు తీర్పు ఉద్దేశం అదికాదని చెప్పారు.
ఇజ్రాయెల్‌పై కేసు వేసేందుకు దక్షిణాఫ్రికాకు హక్కు ఉండడంతో పాటు, ''మారణ హోమం నుంచి రక్షణ పొందేందుకు పాలస్తీనియన్లకు ఆమోదయోగ్యమైన హక్కులు '' ఉంటాయని ప్రకటించడమే ఆ తీర్పు ఉద్దేశమని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
మారణ హోమం జరిగిందో లేదో ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అయితే, దక్షిణాఫ్రికా ఫిర్యాదులోని కొన్ని విషయాలను నిరూపించగలిగితే, అవి మారణ హోమంపై ప్రపంచ దేశాలు చేసుకున్న ఐక్యరాజ్యసమితి ఒప్పందం పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు.
ఇప్పుడు, ఈ కేసు పూర్వాపరాలు, దీనిపై చట్టపరమైన వివాదం ఎలా మొదలైందో తెలుసుకుందాం.
అంతర్జాతీయ చట్టాలకు సంబంధించి ప్రపంచ దేశాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు ఐసీజే(ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ - అంతర్జాతీయ న్యాయస్థానం) ఏర్పాటైంది.
అంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అలాంటి సామూహిక హత్యలను నిరోధించేందుకు ప్రపంచ దేశాలు అంగీకరించిన మారణ హోమంపై ఒప్పందం (జెనోసైడ్ కన్వెన్షన్) వంటి చట్టాలకు సంబంధించి తలెత్తే వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానం పరిష్కరిస్తుంది.
తమ దృష్టిలో, గాజా స్ట్రిప్‌లో హమాస్‌కి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధంతో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా గత డిసెంబర్‌లో అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేసింది.
ఈ కేసు సందర్భంగా, ఇజ్రాయెల్ యుద్థానికి ''మారణ హోమం స్వభావం'' ఉందని, ''గాజాలో పాలస్తీనియన్ల నిర్మూలనే'' దాని ఉద్దేశమని దక్షిణాఫ్రికా ఆరోపణలు చేసింది. అయితే, ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ తిరస్కరించింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఈ కేసు పూర్తిగా విరుద్ధమని ఇజ్రాయెల్ పేర్కొంది.
ఈ కేసులో మారణ హోమానికి ప్రణాళికలు రచించారన్న ఆరోపణలకు సంబంధించి స్పష్టమైన, కచ్చితమైన ఆధారాలను అంతర్జాతీయ న్యాయస్థానానికి దక్షిణాఫ్రికా సమర్పించాల్సి ఉంటుంది.
అయితే, ఈ ఆరోపణలను అంశాల వారీగా పరిశీలించి, ఈ భయంకర యుద్ధంలో తమ చర్యలు హమాస్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న చట్టబద్ధమైన ఆత్మరక్షణగా వాదించే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంటుంది. డజన్ల కొద్దీ దేశాలు హమాస్‌ను టెర్రరిస్టు గ్రూపుగా గుర్తించాయి. ఈ కేసు పూర్తి వివరాలు సిద్ధం చేయడానికి, వాదనలు వినిపించడానికి కొన్నేళ్లు పట్టవచ్చు.
అందువల్ల ''తాత్కాలిక చర్యలు'' చేపట్టాల్సిందిగా ఐసీజే న్యాయమూర్తులను దక్షిణాఫ్రికా కోరింది.
కోర్టు తుది నిర్ధరణకు వచ్చేలోపు ఎలాంటి హాని జరగకుండా, పరిస్థితులను అదుపులో ఉంచేందుకు న్యాయమూర్తి ఇచ్చే ఉత్తర్వులను, ఐసీజే పరిభాషలో 'కోర్టు ఇంజక్షన్'గా వ్యవహరిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
''పాలస్తీనియన్ల హక్కుల రక్షణ కోసం, కోలుకోలేని రీతిలో వారి హక్కులకు హాని జరగకుండా'' తగు చర్యలు చేపట్టేలా ఇజ్రాయెల్‌ను ఆదేశించాలని కోర్టును కోరింది.
గాజాలోని పాలస్తీనియన్ల హక్కులకు న్యాయస్థానం రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందా? లేదా? అనే విషయంపై ఇరుదేశాల న్యాయవాదులు రెండు రోజులపాటు వాదనలు వినిపించారు.
దీనిపై జనవరి 26న 17 మంది న్యాయమూర్తుల (వీరిలో కొందరు ఏకీభవించలేదు) ప్యానెల్ తీర్పు వెలువరించింది.
''వాదనలు ఈ దశలో ఉండగా, రక్షణ కల్పించాలని దక్షిణాఫ్రికా కోరుతున్న హక్కులు వారికి ఉన్నాయో లేవో నిర్ధరించేందుకు కోర్టు సిద్ధంగా లేదు'' అని ఐసీజే తెలిపింది.
'' రక్షణ కల్పించాలని దక్షిణాఫ్రికా కోరుతున్న ఆ హక్కులు ఆమోదయోగ్యమైనవేనా, కావా అనేది తేల్చాల్సి ఉంటుంది.
కోర్టు దృష్టిలో, దక్షిణాఫ్రికా వాదిస్తున్న వాటిలో కనీసం కొన్ని హక్కులకు రక్షణ కల్పించడం ఆమోదయోగ్యమేనని నిర్ధరించేందుకు ఆధారాలు, అక్కడి పరిస్థితులు సరిపోతాయి'' అని పేర్కొంది.
జెనోసైడ్ కన్వెన్షన్ ప్రకారం, గాజాలోని పాలస్తీనియన్లకు ఆమోదయోగ్యమైన హక్కులు ఉన్నాయని నిర్ణయించిన అనంతరం, వారికి కోలుకోలేని విధంగా నష్టం జరిగే ప్రమాదం ఉందని నిర్ధారించారు. ఇలాంటి క్లిష్టతరమైన సమస్యలు తలెత్తుతున్న ఈ సమయంలోనే, అది మారణ హోమానికి దారితీయకుండా ఇజ్రాయెల్ చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది.
న్యాయస్థానం ఇచ్చిన తీర్పులో, ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడిందా, లేదా అనే ప్రస్తావన ఎక్కడా లేదు. కానీ, అలా జరిగే ప్రమాదం ఉందని కోర్టు విశ్వసిస్తోందా, ఆ పదాలకు అర్థమదేనా? సరిగ్గా ఇక్కడే కోర్టు అసలు అర్థమేంటనే దానిపై వివాదం మొదలైంది.
గాజా యుద్ధం మారణ హోమానికి దారితీసే ప్రమాదం ఉందని, ఇజ్రాయెల్‌కు ఆయుధాల క్రయవిక్రయాలు నిలిపివేయాలంటూ యూకే ప్రధాన మంత్రికి ఏప్రిల్‌లో రాసిన లేఖలో నలుగురు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో పాటు దాదాపు 600 మంది బ్రిటిష్ న్యాయవాదులు సంతకాలు చేశారు.

ఫొటో సోర్స్, Reuters
దానికి ప్రతిగా ఇజ్రాయెల్ అనుకూల యూకే న్యాయవాదులు (యూకే లాయర్స్ ఫర్ ఇజ్రాయెల్ - యూకేఎల్‌ఎఫ్‌ఐ) లేఖ రాశారు. గాజాలోని పాలస్తీనియన్లకు మారణ హోమం నుంచి రక్షణ పొందే హక్కు ఆమోదయోగ్యమైనదేనని మాత్రమే అంతర్జాతీయ న్యాయస్థానం పేర్కొందని 1300 మందితో కూడిన బలమైన ఈ గ్రూప్ ఆ లేఖలో ప్రస్తావించింది. మరోమాటలో చెప్పాలంటే, ఇది సంక్లిష్టమైన, సంక్షిప్త చట్టంలో పేర్కొన్న అంశాలతో ముడిపడి ఉంది.
మొదటి గ్రూపులోని న్యాయవాదుల్లో చాలా మంది యూకేఎల్ఎఫ్‌ఐ వివరణను ''పస లేని వాదన''గా అభివర్ణించారు. ఇది కేవలం సైద్ధాంతిక అంశాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, ఇప్పటికే పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయని వాదించారు.
ఇజ్రాయెల్‌కు ఆయుధాల ఎగుమతి ప్రశ్నపై చర్చ సందర్భంగా, అన్ని ప్రాంతాల్లోనూ యూకే పార్లమెంటరీ కమిటీ ఎదుట చట్టపరంగా తీవ్ర వాదోపవాదాలు నడిచాయి.
''సంక్షిప్త చట్టం ప్రకారం, గాజా వాసులకు మారణ హోమానికి గురికాకుండా ఉండే హక్కు ఉందని ఐసీజే చెబుతున్నట్లు యూకేఎల్‌ఎఫ్‌ఐ లేఖ సూచిస్తున్నట్లు నేను భావిస్తున్నా. ఆ ప్రతిపాదనను కేవలం వాదించదగినదిగా భావిస్తున్నా'' అని యూకే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి లార్డ్ సంప్షన్ కమిటీతో అన్నారు.
అలా కాదు అని యూకేఎల్‌ఎఫ్‌ఐ తరఫున నటాషా హౌస్‌డార్ఫ్ స్పందించారు.
''ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడే ప్రమాదముందని భావించడమంటే, కోర్టు ఇచ్చిన స్పష్టమైన తీర్పు కాపీని విస్మరించడమేనని చెబుతున్నా'' అని ఆమె బదులిచ్చారు.
ఆ మరుసటి రోజు, జస్టిస్ జాన్ డోనోహ్యు బీబీసీ హార్డ్‌టాక్ కార్యక్రమంలో కనిపించారు. ఆమె ప్రస్తుతం ఐసీజే నుంచి పదవీ విరమణ పొందారు. ఆ తీర్పులో కోర్టు ఏం చెప్పిందో స్పష్టం చేయడం ద్వారా, దానిపై జరుగుతున్న చర్చకు ముగింపు పలికేందుకు ఆమె ప్రయత్నించారు.
''ఆ తీర్పులో అలా చెప్పలేదు. మారణ హోమం వాదన ఆమోదయోగ్యమైనదేనని కోర్టు పేర్కొన్నట్లు మీడియాలో తరచూ చెబుతున్న విషయాన్ని సరిదిద్దుతున్నా'' అని ఈ జడ్జి చెప్పారు.
''మారణ హోమం నుంచి రక్షణ పొందే పాలస్తీనియన్ల హక్కుకు తీరని నష్టం జరిగే ప్రమాదం ఉంది. కానీ, మారణ హోమం వాదన ఆమోదించదగినదే అనే విషయం కోర్టు చెప్పలేదు.''
అలాంటి భయంకరమైన హాని జరిగే అవకాశం ఉందని చెప్పేందుకు ఏవైనా ఆధారాలు ఉన్నాయా? అనేది కోర్టు నిర్ధరించలేని ప్రశ్న.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










