గాజాలో చనిపోయిన భారత రిటైర్డ్ సైనికాధికారి వైభవ్ కాలే ఎవరు? ఆయన అక్కడికి ఎందుకు వెళ్లారు?

ఫొటో సోర్స్, CHINMAY KALE
- రచయిత, జాహ్నవి మూలే
- హోదా, బీబీసీ
''నా సోదరుడు గాజాకు వెళుతున్నప్పుడు ‘గాజాలో శాంతి నెలకొల్పి, తిరిగిరండి’ అని వాట్సాప్‌లో మెసేజ్ చేశాను. నేను ఆయనకు పంపిన చివరి సందేశం అదే.
గాజాలో ఎప్పటికైనా శాంతి నెలకొనచ్చు. కానీ మా సోదరుడు మాత్రం ఇక ఎప్పటికీ తిరిగిరాడు''
గాజాలో చనిపోయిన భారత సైనిక మాజీ అధికారి, ఐక్యరాజ్య సమితి స్టాఫ్ మెంబర్ వైభవ్ అనిల్ కాలే సోదరుడు చిన్మయ్ కాలే చెప్పారు.
46 సంవత్సరాల వైభవ్ కాలే ఐక్యరాజ్యసమితి రక్షణ, భద్రతా విభాగం (యుఎన్‌డిఎస్ఎస్)లో పనిచేసేవారు.
మే 13న రఫా సమీపంలోని యూరోపియన్ హాస్పిటల్‌కు వెళుతుండగా, వారి వాహనంపై కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో వైభవ్ మృతి చెందగా, ఆయన సహచరుడు తీవ్రంగా గాయపడ్డారు.
న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం వైభవ్ మృతిని ధృవీకరించింది.
భారత విదేశీ వ్యవహారాల శాఖ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది.
వైభవ్ కాలే మృతదేహాన్ని భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇప్పటిదాకా ఈ దాడికి ఎవరూ బాధ్యత తీసుకోలేదు.
కానీ, ఇజ్రాయెలీ రక్షణ దళాలు మాత్రం ఈ సంఘటనను సమీక్షిస్తున్నట్టు చెప్పాయి.
ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణ మొదలైనప్పటి నుంచి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉద్యోగి ఒకరు గాజాలో చనిపోవడం ఇదే మొదటిదని ఐక్యరాజ్యసమితి పేర్కొంది.

ఫొటో సోర్స్, SATHAYE COLLEGE NCC
ఎవరీ వైభవ్ కాలే?
వైభవ్‌కు భార్య అమృత, ఇద్దరు పిల్లలు రాధిక (16), వేదాంత్ (14) ఉన్నారు.
వైభవ్ మహారాష్ట్రకు చెందినవారు. ఆయన కుటుంబంలో ఎక్కువ మంది సైన్యంలో పనిచేసేవారే.
ఆయన బాల్యం నాగ్‌పూర్‌లో గడిచినట్టు ఆయన బంధువులు మీడియా చెప్పారు. ఆయన సోమ్లవార్, భవన్స్ స్కూళ్ళలో చదువుకున్నారు.
ఇంటర్మీడియట్ తరువాత ఆయన పూణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లో చేరారు.
వైభవ్‌తోపాటు ఆయన కుటుంబం కూడా పూణేకు చేరుకుంది. దీని తరువాత వైభవ్ భారత సైన్యంలో జమ్ము కశ్మీర్ రైఫిల్స్ దళంలో చేరారు.
వైభవ్ సైన్యంలో చేరాలనేది ఆయన తండ్రి, అంకుల్ కల అని చెప్పారు వైవవ్ సోదరుడు చిన్మయ్ కాలే. ఆయన ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడారు.
‘‘ఒక అధికారిగా యూనిఫామ్‌లో ఉన్నప్పుడు వైభవ్ చాలా కఠినంగా ఉండేవారు. ఎవరూ ఆయనను కనీసం ప్రశ్నించడానికి కూడా సాహసించేవారు కాదు. కానీ అదే వైభవ్ కుటుంబంతో, మాతోనూ చాలా సరదాగా గడిపేవారు. వయసుతో సంబంధం లేకుండా ఆయన అందరినీ మర్యాదగా చూసేవారు. ప్రతి ఒక్కరు చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవారు. ఎవరైనా మంచి పనిచేస్తే అభినందించేవారు’’ అని చిన్మయ్ చెప్పారు.

ఫొటో సోర్స్, SATHAYE COLLEGE NCC
గడ్డకట్టించే చలిలో సియాచిన్‌లో పని చేశారు..
వైభవ్ ఆఫీసర్ ఇన్ కమాండర్‌గా ప్రపంచంలో అత్యంత ఎత్తైన యుద్ధక్షేత్రం అయిన కశ్మీర్‌లోని సియాచిన్ గ్లేసియర్‌లో విధులు నిర్వహించారు.
ఆయన కాంగోలో విధులు నిర్వర్తించినప్పుడు 2009-10లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ దళంలో పనిచేశారు.
పదాతిదళంలో 22 ఏళ్ళు పనిచేసిన తరువాత వైభవ్ ముందుగానే ఉద్యోగ విరమణ చేసి ఓ ప్రైవేటు కంపెనీలో చేరారు.
కానీ ఆయనకు కూర్చుని చేసే ఉద్యోగం నచ్చక తిరిగి తన పాత ఉద్యోగానికి రావాలని నిర్ణయించుకున్నారు.
2024 ఏప్రిల్‌లో వైభవ్ ఐక్యరాజ్యసమితి రక్షణ, భద్రత విభాగంలో చేరారు. వెంటనే ఆయనకు గాజాలో డ్యూటీ పడింది.
ఐక్యరాజ్యసమితి రక్షణ, భద్రతా విభాగం అండర్ సెక్రటరీ జనరల్ గిల్లెస్ మిచౌడ్ వైభవ్ గురించి గుర్తు చేసుకున్నారు.
'మార్పు తీసుకురావడానికి ఇది ఉత్తమ మార్గంగా అనిపించినందునే తాను ఐక్యరాజ్యసమితిలో చేరానని ఆయన నాతో చెప్పారు.
వైభవ్ కూడా ఒక మార్పు తెచ్చారు. సహాయం అత్యవసరమైన వారికి బాసటగా నిలిచేందుకు ఆయన సంతకం చేశారు. అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంలో, ఏ సమయంలో ఏం జరుగుతుందో ఊహించలేని సంక్షోభంలో పని చేసేందుకు ఆయన ముందుకొచ్చారు. ఆయన సహకారం మరువలేనిది' అని పేర్కొన్నారు.
గాజాలో ఇప్పటికైనా శాంతి నెలకొంటుందని వైభవ్ సోదరుడు చిన్మయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
‘‘వైభవ్ కాలే. భారతీయుడు. ఆయనకు హమాస్, ఇజ్రాయెల్ యుద్దంతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ఆయన తన జీవితాన్ని శాంతి కోసం త్యాగం చేశారు. ఇప్పుడు గాజాలో కచ్చితంగా శాంతి నెలకొనాలి’’ అని చెప్పారు.
‘‘ఈ త్యాగం యుద్ధానికి ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నాను. నిష్కారణంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇప్పుడు జరుగుతున్నది మంచిది కాదని ప్రజలు అర్థం చేసుకుంటారు’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, ALI JADALLAH/ANADOLU VIA GETTY IMAGES
శాంతి కోసం వెళ్లి...
- ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సిబ్బంది ఒకరు గాజా యుద్ధంలో చనిపోవడం ఇదే మొదటిసారి.
- ఘర్షణలు మొదలైనప్పటి నుంచి తమ 190 మంది కార్యకర్తలు చనిపోయారని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి చెప్పారు.
- ఏప్రిల్‌లో ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడులలో వరల్డ్ సెంట్రల్ కిచెన్ సంస్థకు చెందిన ఏడుగురు చనిపోయారు.
- ఏప్రిల్ 30 దాకా 250మందికిపైగా సహాయక సిబ్బంది చనిపోయినట్టు యునైటెడ్ నేషన్స్ విడుదల చేసిన ప్రకటన చెబుతోంది.
- చనిపోయినవారిలో ఎక్కువమంది ఎంఎస్ఎఫ్( డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్), యుఎన్ శరణార్థి సంస్థ (యూఎన్ఆర్‌డబ్ల్యుఏ), రెడ్‌క్రీసెంట్, ఇతర వైద్యసిబ్బంది ఉన్నారని హ్యూమన్ రైట్స్ వాచ్ చెప్పింది.
- ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో మే 14న ఇజ్రాయెలీ నిరసనకారులు సాయం అందించడానికి వచ్చిన ట్రక్కులను అడ్డుకున్నారు. ధాన్యం బస్తాలను చీల్చిపడేశారు. ఆహార పొట్లాలను రోడ్డుపైకి విసిరేశారు.
- అక్టోబర్ 7, 2023న హమాస్ ఇజ్రాయెల్‌పై దాడిచేసింది. సుమారు 1200 మంది చనిపోయారు. 252 మందిని హమాస్ బందీలుగా తీసుకువెళ్లింది.
- యుద్దం మొదలైనప్పటి నుంచి గాజాలో 35,090కి పైగా మరణించారని హమాస్ నేతృత్వంలోని ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- వేరే అభ్యర్థికి ఓటేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఏం జరిగిందంటే...
- ఏపీలో మే 13న ఎన్నికలు పూర్తయితే జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఇవ్వకూడదు?
- వాటర్ బాటిళ్లలో బియ్యం నింపి సముద్రంలోకి విసురుతున్నారు... పదేళ్లుగా ఎందుకిలా చేస్తున్నారు?
- ఇస్లామిక్ దేశాల్లో ఉంటున్న హిందువుల దృష్టిలో ‘హిందుత్వ’ అంటే ఏమిటి?
- ‘మా నాన్న సీఎం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














