మాధవీలత: ఓటర్ల బురఖా తొలగించి, తనిఖీ చేసే అధికారం అభ్యర్థులకు ఉంటుందా?

నరేంద్ర మోదీతో మాధవీలత

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్ర మోదీతో మాధవీలత (పాత ఫొటో)
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

పోలింగ్ సందర్భంగా బీజేపీ అభ్యర్థి కొంపల్లి మాధవీలత, మహిళా ఓటరు గుర్తింపు కార్డులను పరిశీలిస్తూ బురఖా తొలగించడం చర్చకు దారితీసింది.

హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో జరిగిన ఈ ఘటనపై ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో మాధవీలతపై కేసు నమోదైంది.

ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించారంటూ ఐపీసీ సెక్షన్ 171సీ, 186, 505(1)(సీ)తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 ప్రకారం కేసు పెట్టారు.

తనపై కేసు నమోదు కావడంపై మాధవీలత స్పందించారు.

‘‘నేనొక అభ్యర్థిని. చట్టప్రకారం ఫేస్‌మాస్క్ లేకుండా ఓటరును తనిఖీ చేసే హక్కు నాకుంది. నేను మహిళను. పురుషుడిని కాదు. మీ గుర్తింపు కార్డు ఆధారంగా మిమ్మల్ని గుర్తించవచ్చా అని ఎంతో మర్యాదగా అడిగాను. ఎవరైనా దీన్ని ఓ పెద్ద సమస్యగా చిత్రీకరించాలనుకుంటే వారు భయపడుతున్నారని అర్థం’’ అని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాధవీలత చెప్పారు.

అటు నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కూడా ఫేస్ ఐడెంటిఫికేషన్‌ను పోలింగ్ సిబ్బంది సరిగా చేయడం లేదని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల హక్కులు, విధులు ఏమిటి, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? ఈ అంశంలో ఎన్నికల సంఘం నిబంధనలు, ప్రజాప్రాతినిధ్య చట్టం ఏం చెబుతుందో చూద్దాం.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

అసలేం జరిగింది?

మలక్‌పేట పోలీసులు మాధవీలతపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. పోలింగ్ రోజు ఉదయం 10.45 గంటల ప్రాంతంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత హైదరాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఆస్మాన్‌గడ్ హోలీ మదర్ హైస్కూల్‌లో 64వ నెంబర్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు.

ఒక మహిళ సమ్మతి లేకుండా ఐడీ కార్డులోని ఫోటోను సరిపోల్చేందుకు మాధవీలత ఆ మహిళ బురఖాను తొలగించారు.

ఐడీ కార్డులోని వివరాల ప్రకారం సదరు మహిళ ముఖం, వయసు సరిపోలడం లేదని, ఇంటికి తిరిగి వెళ్లిపోవాలని సూచించారు.

ఆ తర్వాత సదరు ఓటరు ఓటు వేయకుండానే పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.

పోలింగ్ కేంద్రంలో జరిగిన ఘటనపై అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బూత్ లెవెల్ ఆఫీసర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ (186/2024) నమోదు చేశారు.

తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లలో సిబ్బంది

ఫొటో సోర్స్, I &PR RANAGAREDDY

ఎన్నికల ప్రవర్తన నియమావళి

స్థానిక సంస్థలు మొదలు పార్లమెంట్ వరకు ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికార యంత్రాంగం ఎలా నడుచుకోవాలన్న అంశంపై ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు రూపొందించింది. కాలానికి అనుగుణంగా ఇందులో మార్పులు చేస్తోంది.

రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పోలింగ్ కేంద్రం లోపల, బయట పాటించాల్సిన ప్రవర్తనా నియమావళి, పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల గుర్తింపు ఎలా చేపట్టాలన్న దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి.

పోలింగ్ కేంద్రాల వద్ద ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు?

‘ది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్-1951’లోని పార్ట్ -4లో పోలింగ్ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు.

ఇందులో 46వ నిబంధన ప్రకారం పోటీలో ఉన్న అభ్యర్థి పోలింగ్ కేంద్రాల్లో తమ ప్రతినిధులుగా పోలింగ్ ఏజెంట్లను నియమించవచ్చు.

50వ నిబంధన ప్రకారం అభ్యర్థులు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించడంతో పాటు అక్కడ జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను పరిశీలించవచ్చు.

అదే సందర్భంలో 129-132 వరకు ఉన్న నిబంధనలు పోలింగ్ కేంద్రం లోపల, బయట పాటించాల్సిన నియమాలను తెలుపుతున్నాయి.

సిరా వేయడం

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఓటరు గుర్తింపు ఇలా

‘పోలింగ్ ఏజెంట్ హ్యాండ్ బుక్’లో పొందుపరిచిన వివరాల ప్రకారం.. పోలింగ్ కేంద్రంలో అడుగుపెట్టిన ఓటరు గుర్తింపును ఎన్నికల సిబ్బందితో పాటూ పోలింగ్ ఏజెంట్ ధృవీకరించిన తర్వాత ఓటరు జాబితాలో వారి పేరు ఎదురుగా టిక్ చేస్తారు.

ఆ తర్వాత ఎడమ చేతి చూపుడు వేలికి గుర్తింపు సిరా వేస్తారు.

ఆ వ్యక్తి(ఓటరు) క్రమసంఖ్య, ఎన్నికల సంఘం అనుమతించిన ఏ గుర్తింపు కార్డు ఆధారంగా ధృవీకరణ జరిగిందన్న వివరాలను ఓటర్ రిజిస్టర్‌లో నమోదు చేసి సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు.

ఆ తర్వాత జారీ చేసిన స్లిప్ ఆధారంగా ఓటరు తన ఓటును ఈవీఎంలో నమోదు చేసేందుకు ప్రిసైడింగ్ /పోలింగ్ అధికారి అవకాశం కల్పిస్తారు.

ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి నకిలీ ఓటరుగా పోలింగ్ ఏజెంట్ భావిస్తే ఈ విషయాన్ని ‘ఛాలెంజ్ ఓటు’ రూపంలో రెండు రూపాయల ఫీజు చెల్లించి ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

సదరు ఓటరు ఛాలెంజ్‌ను అంగీకరిస్తే, ప్రిసైడింగ్ అధికారి ఆ వ్యక్తి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేసి సంతకం లేదా వేలిముద్ర తీసుకుంటారు.

దీనికి నిరాకరిస్తే ఓటు వేసేందుకు అవకాశం కల్పించరు.

ఛాలెంజ్ ఓటుపై విచారణలో భాగంగా పోలింగ్ ఏజెంట్, సదరు ఓటరు తమ వాదనలు బలపరుస్తూ ప్రాథమిక ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఈ విషయంలో ప్రిసైడింగ్ అధికారి స్థానిక అధికారులు, గ్రామస్తుల సహకారం కోరవచ్చు.

పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ వీగిపోతే సదరు వ్యక్తికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించి, ఫీజుగా వసూలు చేసిన 2 రూపాయలను జప్తు చేస్తారు.

సదరు వ్యక్తి నకిలీ అని తేలితే పోలీసులకు అప్పగించే అధికారం ప్రిసైడింగ్ అధికారికి ఉంటుంది.

ఎన్నికల కోడ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

'అభ్యర్థులు స్వయంగా ఎలాంటి చర్యలు చేపట్టకూడదు..'

ఈ అంశంపై బీబీసీ కొందరు మాజీ ఐఏఎస్ అధికారులతో మాట్లాడింది.

‘’పోలింగ్ కేంద్రంలో ఓటర్లను స్వయంగా విచారించే, వ్యక్తిగతంగా తనిఖీ చేసే హక్కు పోటీ చేసే అభ్యర్థులకు, వాళ్లు పెట్టిన పోలింగ్ ఏజంట్లకు ఉండదు.

సందేహాస్పద ఓటర్లున్నారని భావిస్తే ఆ విషయం ప్రిసైడింగ్ అధికారి ద్వారా నిర్ధారించుకోవాలి. ముసుగులు, హిజాబ్ తీసి తనిఖీ చేయాలా వద్దా అనే అధికారం ప్రిసైడింగ్ అధికారిదే. అలా చేయాల్సి వస్తే మహిళా సిబ్బంది సాయం తీసుకుంటారు’’ అని మాజీ ఐఎఎస్ అధికారి, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరు మురళీ బీబీసీతో చెప్పారు

ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి బాబూరావు నాయుడు తన కెరీర్‌లో 16 సార్లు వివిధ హోదాల్లో ఎన్నికల నిర్వహణ అధికారి బాధ్యతలు నిర్వహించారు.

"పోలింగ్ కేంద్రానికి నలువైపులా 200 మీటర్ల దూరాన్ని కూడా పోలింగ్ బూత్‌గానే పరిగణిస్తారు. ఈ పరిధిలో పోటీ అభ్యర్థులకు ఏవైనా అనుమానాలు ఉంటే పోలింగ్ ఆఫీసర్‌కు చెప్పాలే తప్ప స్వయంగా ఎలాంటి చర్యలు చేపట్టే అధికారం ఉండదు. పోలింగ్ కేంద్రాన్ని అంత పవిత్రంగా చూడాలి. అభ్యర్థుల చర్యల వల్ల అనుకోని సంఘటనలతో శాంతిభద్రతలకు విఘాతం అనుకుంటే పోలింగ్ అధికారి కాల్పులకు ఆదేశించే అధికారం ఉంది" అని మాజీ ఐఏఎస్ అధికారి బాబూరావు నాయుడు బీబీసీతో అన్నారు.

ఇదే అంశంపై ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’కు చెందిన పద్మనాభ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.

‘‘సాధారణంగా పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల గుర్తింపు తేలికగా ఉంటుంది. పోలింగ్ ఏజంట్ అభ్యంతరం వ్యక్తం చేస్తే మహిళా అధికారి సమక్షంలో ముసుగు/హిజాబ్ తీసి, ఆధార్ కార్డ్‌తో వెరిఫై చేయవచ్చు. కానీ, పార్టీ అభ్యర్థులు చేయడానికి వీలులేదు. ఇలా చేస్తే చట్టం చేతుల్లోకి తీసుకోవడమే. దీనిపై కేసు నమోదవుతుంది. గతంలో టీనేజీ యువకులు హిజాబ్ ధరించి ఓటువేసేందుకు వచ్చి దొరికిపోయిన ఉదంతాలు ఉన్నాయి. కేసులు కూడా నమోదయ్యాయి’’ అని తెలిపారు.

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక కేసులు పెద్దగా పట్టించుకునే వారే ఉండరు. గత ఎన్నికల్లో డబ్బులతో పట్టుబడ్డ కేసులు ఎన్నో ఇప్పటికీ తేలలేదన్నారు పద్మనాభ రెడ్డి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)