మతం అనే గోడను కూల్చేసి విద్యార్థుల మధ్య చిగురించిన స్నేహం

- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి, వారణాసి
ముస్లిం యువతితో స్నేహం చేయడం కావ్యకు మొదటిసారి. ఉత్తర్ ప్రదేశ్‌లోని బనారస్ హిందూ యూనివర్శిటీ (బీహెచ్‌యూ)లో నూర్ ఫాతిమా ఖాన్, కావ్య చదువుకుంటున్నారు. వర్సిటీలో రూమ్‌మేట్స్‌గా మారిన తర్వాత ఇరువురి మధ్య స్నేహం చిగురించింది.
''ఇద్దరం నాన్ వెజ్ తింటాం. ఆహారం, పాటలు లాంటి అభిరుచులు ఇద్దరికీ ఒకేలా ఉంటే కలిసుండటం సులువు’’ అని తెలిపారు కావ్య.
కావ్య తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలుసుకున్న నూర్, ఇద్దరి మధ్య సఖ్యత ఎలా ఉంటుందోనని మొదట సందేహించారు.
కావ్యతో ఇంగ్లీషులో మాట్లాడాలేమో అనుకున్నారు నూర్. కాని కావ్య హిందీలో మాట్లాడటం ప్రారంభించగానే నూర్ హమ్మయ్య అనుకున్నారు.
కావ్య చాలాకాలంగా ఉత్తరాధి రాష్ట్రాల్లో ఉంటున్నారు, కాబట్టి హిందీ కూడా నేర్చుకున్నారు.
"ఒకే రకమైన ఆహారం తింటాం. మేమిద్దరం ఒకే రకమైన పాటలు వింటాం అని తెలుసుకున్నాం. తర్వాత మా మధ్య స్నేహం పెరిగింది" అని కావ్య చెప్పారు.
మొదట నచ్చలేదు..
బీహెచ్‌యూ క్యాంపస్‌లోని హాస్టల్‌లో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన నూర్, తమిళనాడుకు చెందిన కావ్య రూమ్‌మేట్స్‌గా మారడం యాదృచ్ఛికం.
కావ్యకు మొదట తన గది నచ్చలేదు. చివరికి కావ్య, నూర్ ఇద్దరూ ఇష్టమైన గదిని చూసుకొని, రూమ్ మేట్స్ అయ్యారు.
ఇద్దరూ ఫైన్ ఆర్ట్స్‌లో మాస్టర్ చదువుతున్నారు.
ఇన్నిరోజులుగా ఇద్దరం కలిసి ఉంటున్నా.. ఒకటి, రెండు రోజులు మాత్రమే గడిచినట్లు అనిపిస్తోందని నూర్ అంటున్నారు.

కావ్య తల్లికి ఫిర్యాదు చేస్తోందని..
కావ్య తన తల్లితో ఫోన్‌లో తరుచుగా తమిళంలో మాట్లాడేవారు. ఈ సంభాషణలో కావ్య పదే పదే 'నూర్' అని చెప్పేవారు.
కావ్య సంభాషణలో తన పేరు వినగానే నూర్ చెవులు రిక్కించి వినేవారు.
హాస్టల్‌కు వచ్చాక రెండు రోజులకే తన గురించి కావ్య తల్లికి ఫిర్యాదు చేస్తోందని నూర్ అనుమానపడ్డారు.
నూర్ ఆపుకోలేక కావ్య దగ్గరికెళ్లి "మీ అమ్మతో మాట్లాడుతూ పదే పదే నా పేరు ఎందుకు చెబుతున్నావు?" అని అడిగారు.
దీంతో కావ్య బిగ్గరగా నవ్వేశారు. నూర్‌లో అసహనం పెరిగింది. అప్పుడు కావ్య 'నూర్' అంటే తమిళంలో 100 అని బదులిచ్చారు.
ఈ రోజు 500 రూపాయలు, మొన్న 300 రూపాయలు ఖర్చయ్యాయని అమ్మతో చెబుతున్నానని కావ్య చెప్పారు.
అంటే వంద అని చెప్పాల్సిన చోట తమిళంలో కావ్య 'నూర్' అంటున్నారు. దీంతో నూర్ నవ్వేశారు. అలా నవ్వుతూనే ఉన్నారు. అనంతరం ఇద్దరూ నవ్వడం మొదలుపెట్టారు.
వారి స్నేహం ఈ నవ్వుతో మొదలైంది. అయితే, వారి స్నేహంలో ఏడుపు, ఆగ్రహం, కోపం అన్నీ ఉన్నాయి.
అంతకంటే ముందు మనం మొహమ్మద్ షాహిద్, మనీష్‌ల దగ్గరికి వెళదాం.
షాహిద్, మనీష్‌లు ఉంటున్న గదిలోకి వెళ్లగానే మన కళ్లు గోడల మీదున్న పెయింటింగ్స్‌పై పడతాయి. ఈ గదిని చూస్తుంటే ఇద్దరూ తమ బాధలను, కోపాన్ని, ఆనందాన్ని, కలలను కాన్వాస్‌పై నింపుకున్నట్లు అనిపిస్తుంది. ఇద్దరూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు.
షాహిద్ తండ్రి తాపీ మేస్త్రీ కాగా, మనీష్ తండ్రి టైలర్. షాహిద్, మనీష్‌లు కూడా కష్ట సమయాల్లో కూలీలుగా పనిచేశారు. కానీ ఇప్పుడు వారు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటున్నారు.

పక్కపక్కనే ఖురాన్, సరస్వతీ దేవి పటం
షాహిద్, మనీష్‌ల గదిలోని బుక్ షెల్ఫ్ ఒక్కసారిగా మన దృష్టిని ఆకర్షిస్తుంది. బుక్ షెల్ఫ్ ఒక మూలన ఖురాన్, ప్రార్థన చేసేటపుడు ఉపయోగించే టోపీ పెట్టారు.
దాని పై భాగంలో సరస్వతీ దేవి విగ్రహం, చిత్రం ఉంచారు. ఈ గదిలో నమాజ్ చేస్తానని షాహిద్ అన్నారు. అతని రూమ్‌మేట్స్ పూజ చేస్తారని కూడా చెప్పారు.
అక్కడి ఖురాన్, సరస్వతీ దేవి విగ్రహాన్ని చూపిస్తూ "సర్, భారతదేశం ఇలా ఉండాలి, అవును కదా?" అని షాహీద్ అన్నారు.
ఇది అతని కోరికా లేక మనల్ని అడుగుతున్న ప్రశ్నా అనేది అర్థం చేసుకోవడం కష్టం.
కావ్య, నూర్, షాహిద్, మనీష్.. ఈ యువత జీవితాల్లో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో కలలు, ఎన్నో చిక్కులు. అయితే వారు ఇంత చిన్న వయసులో కూడా జీవితంలోని రంగులను కొట్టుకుపోనివ్వలేదు.

ఉత్తర్ ప్రదేశ్‌లో మత విద్వేష సంఘటనలు జరిగినప్పుడల్లా వారి బంధం ఎలా ప్రభావితమవుతుందనే విషయంపై కావ్య , నూర్‌లను అడిగాం.
"మేమిద్దరం దీని గురించి మాట్లాడుకుంటాం. నూర్ ఒకసారి నాతో ఆమె ముస్లిం అయినందున, బనారస్‌లో గది అద్దెకు తీసుకోలేకపోయానని చెప్పారు. నూర్ అది చెప్పగానే కాసేపు మౌనంగా ఉన్నాను. ఆమె మరోలా అనుకోకుండా, ఎలా సమాధానం చెప్పాలో ఆలోచించాను'' అని కావ్య చెప్పారు.
"నేను కూడా నాన్ వెజ్ తింటాను, కాబట్టి దిల్లీలో నాకు గది దొరకలేదని చెప్పాను. దక్షిణ భారతదేశంలో చాలావరకు హిందువులు నాన్ వెజ్ తింటారు. ఇక్కడ మాత్రమే పరిస్థితి మరోలా ఉందని నూర్‌కు చెప్పాను. ఆహార అలవాట్ల ఆధారంగా కూడా హిందువులు ఈ వివక్షకు గురవుతారని చెప్పాను'' అని కావ్య గుర్తుచేసుకున్నారు.
షాహిద్ మాట్లాడుతూ.. "నేను ముస్లిం కావడంతో నా చుట్టుపక్కల నుంచి చాలా వ్యతిరేకత ఎదుర్కొన్నాను. మనీష్ ఆలోచన కూడా వారిలాగే ఉండేది. ఇపుడు మనీష్‌లో చాలా మార్పు వచ్చింది" అని చెప్పారు.
మనీష్ కూడా షాహిద్ మాటలతో ఏకీభవిస్తూ.. "షాహిద్ నన్ను కలవకుంటే నేను మంచి వ్యక్తిగా ఉండలేకపోయేవాడిని. నా మనసులో ముస్లింల గురించి చాలా ఆలోచనలు ఉండేవి. దాన్ని ద్వేషం అని కూడా అనొచ్చు" అని చెప్పారు.
"ముస్లింలు ఇక్కడ ఎందుకు ఉన్నారనుకునే వాడిని. పాకిస్తాన్ ఏర్పడినప్పుడే ముస్లింలను ఇండియా నుంచి తరిమేసి ఉండాల్సింది అనుకునేవాడిని. దేశంలో ఎప్పుడు ఉగ్రవాద దాడి జరిగినా ముస్లింలపై నాలో ద్వేషం నిండిపోయేది" అని మనీష్ గుర్తుచేసుకున్నారు.

మనీష్‌లో ఎందుకు అంత ద్వేషం ఉండేది?
ఇంతకూ మనీష్ మనసులో అంత ద్వేషం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్నకు మనీష్, షాహిద్ ఇద్దరూ సమాధానం ఇచ్చారు.
"మనీష్ చదవడం కంటే మొబైల్‌లో ముస్లిం వ్యతిరేక కంటెంట్‌ను ఎక్కువగా చూసేవారు. అతను ఎప్పుడూ ముస్లింలతో మాట్లాడలేదు. నా పక్కనే కూర్చుని, ముస్లింలను విమర్శించే వీడియోలు చూడటం చాలాసార్లు చూశాను. అందుకే తనతో మాట్లాడాలనుకున్నా'' అని షాహిద్ అన్నారు.
"మనీష్ చాలా పేదవాడు. దళిత కుటుంబం నుంచి వచ్చాడు. తండ్రి ఎలాగోలా ఇంటిని నడుపుతున్నారు. అయితే, చదువు మానేసి, ఉద్యోగం చేయాలంటూ మనీష్‌పై ఒత్తిడి ఉండేది. మనీష్‌కు అప్పుడప్పుడు అద్దె చెల్లించడానికి కూడా డబ్బు సర్దుబాటు అయ్యేది కాదు" అని షాహిద్ తెలిపారు.
"నేను మనీష్‌ని పెయింటింగ్ వర్క్ చేయమని అడిగాను. ప్రతిఫలంగా అతను డబ్బు సంపాదించేవాడు. దీంతో అతను అద్దె, తిండి ఖర్చుల గురించి చింతించాల్సిన అవసరం లేకుండా పోయింది. నేను అతన్ని మా ఇంటికి తీసుకెళ్లా. మా వాళ్లను కలిసి మాట్లాడాడు. ముస్లింల పట్ల ద్వేషం సరికాదని క్రమంగా మనీష్ గ్రహించారు'' అని షాహిద్ చెప్పారు.
కావ్య, నూర్‌ల విషయంలో పరిస్థితి భిన్నం. తాను ముస్లిం అయినందున వివక్షను ఎదుర్కొంటున్నట్లు నూర్ భావించినప్పుడు, కావ్య ఆమెను ఓదార్చేవారు.
''నూర్ చాలాసార్లు కోపంతో గదిలోని వస్తువులను పడేసేది. ఎందుకంత కోపం అని అడిగితే.. ఎవరి మాటలకు ఆమె బాధపడిందో అప్పుడు చెబుతుంది’’ అని తెలిపారు కావ్య.
"నూర్ ముస్లిం కావడంతో ఎక్కడో ఒకచోట అవహేళనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను కూడా హిందువునే, నేను నీతో ప్రేమగానే ఉంటున్నా అని చెప్పేదాన్ని'' అని కావ్య గుర్తుచేసుకున్నారు.
క్యాంపస్‌లో జరిగిన ఒక సంఘటనను నూర్ వివరిస్తూ.. "నేను క్యాంపస్‌లో ఉన్న ఒక గుడి వద్ద చదువుతుండగా, కొంతమంది వచ్చి హిజాబ్‌తో గుడిలో ఉండకూడదని చెప్పారు. హిజాబ్‌లో రాకూడదని రూల్ లేదని నేను వారికి చెప్పాను" అని అన్నారు.
“అప్పుడు బురఖా ధరించి గుడికి రావడం నిషిద్ధమని గోడపై రాసి ఉన్న దానిని చూపించారు. నేను నిశ్శబ్దంగా బయటకు వెళ్లాను. కానీ నా హిందూ ఫ్రెండ్స్ నాకు మద్దతుగా నిలిచారు. హిజాబ్ ధరించి గుడికి ఎందుకు రాకూడదని వారిని ప్రశ్నించారు. హిందూ మిత్రులు నన్ను సపోర్ట్ చేయడం నాకు నచ్చింది'' అని అన్నారు నూర్.

చుట్టుపక్కల సంఘటనలు ఎలాంటి ప్రభావం చూపించేవి?
దేశంలో మతపరమైన ఉద్రిక్తతలు జరిగినప్పుడు వారి సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనేదానిపై వారు సమాధానమిచ్చారు.
‘‘మా ఇద్దరి ఇళ్ల నుంచి కాల్స్ వస్తాయి. మీరిద్దరూ బాగుండాలి అని పేరెంట్స్ అనేవారు. బయటికి వెళ్లొద్దు. నూర్‌ని మంచిగ చూసుకో, నీ దగ్గరే ఉంచుకో అని మా అమ్మ చెప్పేవారు" అని కావ్య వివరించారు.
“బయటకు వెళ్లొద్దని నూర్ తల్లి కూడా ఫోన్‌లో చెబుతారు. కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతారు" అని ఆమె అన్నారు.
షాహిద్ మాట్లాడుతూ.. “నాది ఘాజీపూర్ జిల్లాలోని గహ్మర్ గ్రామం. అది ఠాకూర్ ఆధిపత్య గ్రామం. ఒకరోజు నేను నా హిందూ మిత్రులతో కలిసి కూర్చున్నా. ఆ సమయంలో నా స్నేహితుడి తండ్రి ఒకాయన కోపంగా నా వైపు చూశారు, తన కొడుకును తిట్టారు. నేను జరిగిందంతా మా నాన్నకు చెప్పాను, చదువుకుని సమాధానం చెప్పాలని సూచించారు. అప్పటి నుంచి కష్టపడి చదవాలని నిర్ణయించుకున్నా. బాగా చదువుకుంటున్నాను'' అని అన్నారు.

వీరి స్నేహం ఏం చెబుతోంది?
షాహిద్ ఇంత చిన్న వయస్సులో తెలివిగా మాట్లాడటంపై బీహెచ్‌యూలో హిందీ లిటరేచర్ ప్రొఫెసర్ ఆశిష్ త్రిపాఠి స్పందించారు.
ఇది నిస్సహాయత నుంచి పుట్టిన జ్ఞానమని ఆయన అభిప్రాయపడ్డారు.
"ఉత్తర భారతదేశంలోని హిందువులు దూకుడుగా మారిపోయారు. వారి మతపరమైన చిహ్నాలు, గుర్తింపులను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. హిందువుల ఈ బహిరంగ ప్రదర్శన వారి మానసిక స్థితిని కూడా మార్చింది. ఇది బాహ్య మార్పు అనుకున్నాం, కానీ క్రమంగా అంతర్గతంగా కూడా మార్పు జరుగుతోంది'' అని అన్నారు.
"హిందువులు బహిరంగంగా హిందువులుగా మారితే, ముస్లింలు అంతర్గతంగా ముస్లింలుగా మారుతున్నారు. ఈ మార్పు రాజకీయాల్లోనే కాదు సమాజంలో కూడా జరిగింది" అని ఆయన అన్నారు.
షాహిద్ తెలివితేటలు అంతర్గత మార్పులో భాగమని త్రిపాఠి అభిప్రాయపడ్డారు.
“గతంలో హిందువులు, ముస్లింల మధ్య తరచుగా అల్లర్లు జరిగేవి. సహజంగానే ఇది అపనమ్మకం, ద్వేషం కారణంగా జరిగింది. రెండు వర్గాలకు చెందిన దూకుడు వ్యక్తులు ఒకరిపై ఒకరు తమ కోపాన్ని బయటపెట్టుకునేవారు. కానీ ఇప్పుడు ముస్లింలలో ఆ కోపం తగ్గిపోయింది. ఇప్పుడు దాని స్థానంలో ఒక నిశ్శబ్దం వచ్చింది'' అని త్రిపాఠి అన్నారు.
అయితే వీటన్నింటి నడుమ కావ్య-నూర్, షాహిద్-మనీష్‌ల స్నేహం ఎలాంటి కల్మషాలు లేకుండా కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి:
- పెద్దక్కగా పుట్టడం శాపమా, అది ఒక మానసిక సమస్యగా మారుతోందా?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం, ఎవరికి అనుకూలం?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024: మీరు ఎవరికి ఓటేశారో తెలుసుకోవడమెలా?
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే.....
- ‘మా నాన్న సీఎం’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














