అన్నం తినడానికి ముందు లేదా తిన్న తర్వాత టీ, కాఫీ తాగొచ్చా? ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే..

టీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కె. శుభం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఉదయం లేవగానే టీ

బ్రేక్‌ఫాస్ట్ తర్వాత టీ

మధ్యాహ్న భోజనం తర్వాత టీ

సాయంత్రం టీ, రాత్రి టీ

నిద్రపోకపోతే అర్ధరాత్రి టీ.

ఇలా చాయ్ తాగడం చాలా మంది జీవితంలో భాగమైపోయింది.

చాయ్‌కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.

టీ గురించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇటీవల కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.

ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత, సభ్య కార్యదర్శి డాక్టర్‌ ఉదయ్‌కుమార్‌, డాక్టర్‌ సుబ్బారావు ఎం గవరవరపు, డాక్టర్‌ కేవీ రాధాకృష్ణ, డాక్టర్‌ అహ్మద్‌ ఇబ్రహీంలతో కూడిన 13 మంది శాస్త్రవేత్తల కమిటీ ఈ మార్గదర్శకాల్ని రూపొందించింది.

టీ, కాఫీలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, అతిగా తాగడం వల్ల కలిగే దుష్పరిణామాలను ఈ మార్గదర్శకాలు వివరిస్తాయని వీటిని రూపొందించిన కమిటీలో సభ్యుడైన ఒక శాస్త్రవేత్త చెప్పారు.

టీ, కాఫీల వల్ల కలిగే ప్రయోజనాలు, ఎన్నిసార్లు తాగాలనే విషయాల గురించి మరింతగా తెలుసుకోవడానికి ఐసీఎంఆర్ మార్గదర్శకాలు రూపొందించిన కమిటీలో ఉన్న శాస్త్రవేత్తలతో బీబీసీ మాట్లాడింది.

టీ

ఫొటో సోర్స్, Getty Images

తినడానికి ముందు టీ లేదా కాఫీ తాగొద్దు - ఐసీఎంఆర్

టీ, కాఫీ రెండింటిలో టానిన్ అనే రసాయనం ఉంటుంది.

ఈ టానిన్ అనే రసాయనం మనం తినే ఆహారంలోని ఐరన్ వంటి సూక్ష్మపోషకాలను శరీరం గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుందని ఈ నివేదికను వెలువరించిన బృందంలోని ఒక శాస్త్రవేత్త అన్నారు.

అందువల్ల, భోజనానికి గంట ముందు లేదా గంట తర్వాత టీ, కాఫీలు తీసుకోకూడదని ఐసీఎంఆర్‌ తన మార్గదర్శకాల్లో పేర్కొంది.

ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగడం సరైనదేనా అనే ప్రశ్నకు సమాధానంగా, అలా అని చెప్పలేమని, కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

ఆయన చెప్పిన వివరాల ప్రకారం, చాలాకాలంగా ఇలాంటి అలవాటు ఉన్న వ్యక్తుల్లో దీని వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు.

కానీ, భోజనానికి గంట ముందు లేదా భోజనం తర్వాత గంట లోపు టీ లేదా కాఫీ తాగితే, ఆ ఆహారం నుంచి మనకు లభించే సూక్ష్మపోషకాలు శరీరానికి అందవు అని అన్నారు.

మామూలు మాటల్లో చెప్పాలంటే, “పోషకాహారం తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగితే, ఆ సూక్ష్మ పోషకాలు ఉన్న ఆహార పదార్థాన్ని తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే టీ, కాఫీలలో ఉండే టానిన్, ఆ ఆహారం అందించే పోషకాలను శరీరానికి అందకుండా చేస్తుంది’’ అని ఆయన చెప్పారు.

టీ

ఫొటో సోర్స్, Getty Images

టీలో పాలు కలిపితే ఏమవుతుంది..?

ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఏదైనా సరే, వాటిలో థియోబ్రోమైన్, థియోఫిలిన్, కెఫీన్‌లాంటి రసాయనాలు ఉంటాయి.

ఇవి శరీరంలోని రక్తనాళాలను సడలించి, రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి.

దానితో పాటు, "టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఇతర యాంటీఆక్సిడెంట్ పాలీఫెనాల్స్ గుండె జబ్బులు, పొట్ట క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి" అని ఐసీఎంఆర్‌ నివేదిక పేర్కొంది.

టీ తాగేటప్పుడు ఒక పని చేయకూడదు - టీలో పాలు కలపకూడదు. అలాగే టీని మితంగా మాత్రమే సేవించాలి. మీరు అలా చేస్తే, వాటి ప్రయోజనాలను పొందవచ్చు.

పాలు ఒక ముఖ్యమైన పోషకాహారం. దానిని టీ, కాఫీలలో ఎందుకు కలపకూడదు అని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్తను ప్రశించగా, "పాలు కచ్చితంగా మన ఆహారంలో చేర్చవలసిందే. కానీ, టీలో పాలను కలిపితే టీ వల్ల కలిగే ప్రయోజనాలు మనకు అందవు" అన్నారు ఆయన.

అంటే పాలు మాత్రమే తాగితే ఇబ్బంది ఉండదు. అయితే, టీలో పాలను కలిపితే, “అందులో టీ నిర్దిష్ట పరిమాణం తగ్గుతుంది. అందువల్ల, మనం టీ వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా పొందలేం” అని ఆయన వివరించారు.

పాలు లేకుండా బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తాగడం మంచిదని ఆయన అన్నారు.

“ఏ రూపంలోనైనా రోజుకు 300 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ పాలు లేదా పాల ఆధారిత ఉత్పత్తులు తీసుకోరాదు. మీరు పాలు తీసుకోండి కానీ టీ, కాఫీతో పాటు తీసుకోవడం మానేస్తే మంచిది. అప్పుడే టీ, కాఫీల ప్రయోజనాలు మీకు అందుతాయి” అని చెప్పారు.

టీ

ఫొటో సోర్స్, Getty Images

రోజుకు ఎన్ని టీ, కాఫీలు తాగొచ్చు?

ఈ ఆహార మార్గదర్శకాల ప్రకారం, సగటు వ్యక్తి రోజుకు 300 మిల్లీగ్రాముల కెఫీన్ కంటే ఎక్కువ తీసుకోకూడదు.

ఐసీఎంఆర్‌ గణాంకాల ప్రకారం, ఒక వ్యక్తి తాగే ఒక కప్పు (150 మిల్లీలీటర్లు) టీలో 30-65 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది.

అదే కప్పు కాఫీలో 80-120 మిల్లీగ్రాముల కెఫీన్, ఇన్‌స్టంట్ కాఫీలో 50-65 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ ఉంటుంది.

ఒక వ్యక్తి రోజుకు 300 మిల్లీగ్రాముల వరకు కెఫీన్ తీసుకోవచ్చు. అంటే ఫిల్టర్ కాఫీ అయితే రెండు కప్పులు, ఇన్‌స్టంట్ కాఫీ అయితే మూడు లేదా మూడున్నర కప్పులు తాగవచ్చు.

కానీ, “కెఫీన్‌ని ప్రజలు టీ, కాఫీల ద్వారా మాత్రమే తీసుకోవడం లేదు. శీతల పానీయాలలోనూ కెఫీన్ ఉంటుంది. అందువల్ల కేవలం మనం తాగే టీ, కాఫీలనే కాకుండా రోజుకు వినియోగించే కెఫీన్‌ను లెక్కించి, దానిని నియంత్రించాలి" అని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త చెప్పారు.

టీ

ఫొటో సోర్స్, Getty Images

ఎక్కువగా కాఫీ తాగితే...?

కాఫీ ఎక్కువగా తాగడం వల్ల అధిక రక్తపోటు, గుండె అసాధారణంగా కొట్టుకోవడం వంటివి ఉంటాయని ఐసీఎంఆర్ నివేదిక హెచ్చరించింది.

కాఫీ ఎక్కువగా తాగితే చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశంతో పాటు గుండె జబ్బు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని ఆ నివేదిక పేర్కొంది.

అదే విధంగా, టీలోనూ కెఫీన్ ఉంటుంది కాబట్టి దీన్ని కూడా ఎక్కువగా తాగకూడదని ఆహార మార్గదర్శకాల నివేదిక హెచ్చరించింది. కాఫీని ఎక్కువగా తీసుకోకూడదని కూడా సూచించింది.

“కాఫీని తాగే కొద్దీ సాధారణంగా దాని మీద మరింత ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. అదే సమయంలో, ఎక్కువ కాఫీ తాగితే, అది ఇతర సమస్యలకూ దారి తీస్తుంది" అని ఐసీఎంఆర్‌ శాస్త్రవేత్త చెప్పారు.

"ఉదాహరణకు, కొన్ని అధ్యయనాలు ఎక్కువగా కాఫీ తాగేవారికి అధిక రక్త కొలెస్ట్రాల్, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాయి"

"కాఫీ ఎక్కువగా తాగితే ఈ సమస్యలు వస్తాయని కచ్చితంగా చెప్పలేం. అయితే, ఈ సమస్యలు ఉన్నవారిలో చాలా మంది కాఫీ తాగేవారు ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది" అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)