నీలేశ్ కుంభానీ: నామినేషన్ తిరస్కరణతో అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిన ఈ కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ తనను మోసం చేసిందని ఎందుకు అంటున్నారు?

ఫొటో సోర్స్, BBC/ SHEETAL PATEL
- రచయిత, షీతల్ పటేల్, రూపేశ్ సోన్వానే
- హోదా, బీబీసీ ప్రతినిధులు
సూరత్ లోక్‌సభ స్థానానికి తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రం తిరస్కరణకు గురయ్యాక అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ తనను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆరోపించారు.
అజ్ఞాతం నుంచి బయటకు వచ్చిన ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ‘‘నా నామినేషన్ పత్రం తిరస్కరణకు గురయ్యాక దానిపై పిటిషన్ వేయడానికి గుజరాత్ హైకోర్టుకు వెళ్లాను. నేను తిరిగొచ్చేసరికి కాంగ్రెస్ కార్యకర్తలు నా ఇంటి దగ్గర నిరసనలు చేయడానికి వచ్చినట్లు నాకు తెలిసింది. ఇక కాంగ్రెస్‌తో కలిసి ఉండకూడదని నిర్ణయించుకున్నా” అని ఆయన చెప్పారు.
మీడియాతో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్‌పై కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతకుముందు కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
సూరత్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా నీలేశ్ కుంభానీకి టికెట్ ఇచ్చింది. ఆ తర్వాత, నామినేషన్ పత్రంలో మద్దతుదారుల సంతకాలపై చెలరేగిన వివాదం తర్వాత ఆయన నామినేషన్ పత్రాన్ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
ఆ స్థానంలో పోటీ చేస్తోన్న బీఎస్పీ అభ్యర్థితో సహా స్వతంత్ర అభ్యర్థులు కూడా చివరి నిమిషంలో తమ నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

కాంగ్రెస్‌పై ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ, నామినేషన్ పత్రం తిరస్కరణ గురించి నీలేశ్ కుంభానీ వివరించారు.
2017లో కాంగ్రెస్ ఒక ‘టికెట్ డీల్’ చేసుకుందని మీడియాతో మాట్లాడుతూ నీలేశ్ కుంభానీ అన్నారు.
‘‘నాకు టికెట్ ఇస్తానని చెప్పి, బీజేపీ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి టికెట్ ఇచ్చి నన్ను మోసం చేసింది. నా మద్దతుదారులు, కార్యకర్తలు ఈ నమ్మకద్రోహానికి ప్రతీకారం తీర్చుకున్నారు. నేను కూడా నా మద్దతుదారుల పక్షానే నిలిచాను. మద్దతుదారులందరిలో కేవలం ఒకరు మాత్రమే నాకు బంధువు అవుతారు. మిగతా వారంతా కాంగ్రెస్‌కు చెందినవారే’’ అని ఆయన వెల్లడించారు.
బీబీసీతో ఆయన మరిన్ని విషయాలు పంచుకున్నారు. ‘‘మనం ఎన్నికల్లో పోటీచేయొద్దని మద్దతుదారులు నాతో చెబుతూనే ఉన్నారు. వారంతా కాంగ్రెస్ కార్యకర్తలతో విసిగిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత మాతో కలిసి పని చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చలేదు. అందుకే నా మద్దతుదారులు నాతో ఎన్నికల్లో పోటీ చేయొద్దని చెబుతూ వస్తున్నారు.
మాకు ఎన్నికను రద్దు చేయాలనే ఉద్దేశం లేదు. నాతో పాటు దాదాపు 15 మంది ఇతర అభ్యర్థులు కూడా నామినేషన్ పత్రాలు నింపారు. వీరిలో కాంగ్రెస్ నుంచి విడిపోయిన స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. వారంతా నామినేషన్లను ఎందుకు వెనక్కు తీసుకున్నారో వెళ్లి వారినే అడగండి’’ అని బీబీసీతో మాట్లాడుతూ నీలేశ్ అన్నారు.
ఎన్నికల ప్రచారాల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తనకు సహకరించలేదని ఆయన ఆరోపించారు.
పరేశ్ ధనానీలాంటి కాంగ్రెస్ పెద్దలు ప్రచారానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడి సీనియర్ నేతలు తనకు ప్రచారంలో సహకరించలేదని అన్నారు నీలేశ్
‘‘సూరత్‌కు పరేశ్ ధనాని వచ్చినప్పుడు వేదిక మీద ఆయనతో పాటు ఒక్క సీనియర్ కాంగ్రెస్ లీడర్ లేరు. నాతో ప్రచారానికి ఎవరూ రాలేదు. ఓటర్లు మాత్రమే నా వెంట ఉన్నారు’’ అని ఆయన అన్నారు.
ఎన్నికలు ముగిసిన తర్వాత అకస్మాత్తుగా మీడియా ముందుకు ఎందుకు వచ్చారని బీబీసీ ప్రశ్నించగా ‘‘ ఎందుకంటే నేను చేసే వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం జరుగకూడదని అనుకున్నా. పరేశ్ ధనాని, శక్తిసింగ్ గోహిల్ వంటి సీనియర్ల మర్యాదను నేను కాపాడాలి. అందుకే ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను’’ అన్నారు.

ఫొటో సోర్స్, @NILESHKUMBHAN10
బీజేపీలో చేరతారా?
నీలేశ్ కుంభానీ, బీజేపీలో చేరతారని గుజరాత్ మీడియాలో చర్చ నడిచింది. అయితే, అలాంటిదేమీ లేదని ఆయన బీబీసీతో అన్నారు.
‘‘ కాంగ్రెస్‌లో నాపై సస్పెన్షన్ ఉంది. అంటే నేను ఏ పార్టీలో లేను. రాబోయే రోజుల్లో మా కార్యకర్తలతో చర్చిస్తా. నేను బీజేపీలో ఎవరితోనూ సంప్రదింపులు జరపట్లేదు. ఆ పార్టీ వారెవరూ నన్ను సంప్రదించలేదు’’ అని వెల్లడించారు.
మద్దతుదారుల కిడ్నాప్ గురించి ఆయన మాట్లాడుతూ, ‘‘నా మద్దతుదారుల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదు. వారు నాతో సంబంధాల్ని (కాంటాక్ట్) కోల్పోయారు. తర్వాత వారంతా సురక్షితంగానే ఉన్నట్లు నా మద్దతుదారుడు ఒకరు నాతో చెప్పారు’’ అని ఆయన అన్నారు.
నీలేశ్ కుంభానీ ఆరోపణలపై కాంగ్రెస్ ఏం చెప్పింది?
నీలేశ్ కుంభానీని రక్షించేందుకు బీజేపీ కృషి చేస్తోందని బీబీసీతో మాట్లాడుతూ గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నాయకుడు ప్రతాప్ దుధాత్ అన్నారు. కాంగ్రెస్‌పై నీలేశ్ చేసిన ఆరోపణల గురించి ఆయన మాట్లాడుతూ, ‘‘బీజేపీ కనుసన్నల్లో నీలేశ్ ఈ మొత్తం కుట్ర పన్నారనే విషయం అందరికీ అర్థం అవుతోంది. కాంగ్రెస్ ఆయన్ను మోసం చేసి ఉంటే, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనెలా పోటీ చేశారు. ఇవన్నీ అర్థం లేని ఆరోపణలు. ఆయన సూరత్ ప్రజల్ని మోసం చేశారు’’ అని అన్నారు.
సూరత్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధన్‌సుఖ్ రాజ్‌పుత్ మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరువు తీసేందుకు ఆయన ప్రయత్నించారని అన్నారు. ఆయన ఇచ్చిన ప్రకటనల బట్టి చూస్తే, ఇదంతా ముందస్తు వ్యూహంతో చేసినట్లు రుజువు అవుతుందని చెప్పారు.

ఫొటో సోర్స్, BJP4GUJARAT
అసలేమైంది?
గుజరాత్‌లో లోక్‌సభ ఎన్నికలకు ముందు సూరత్‌కు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్ తిరస్కరణకు గురైంది. బీజేపీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అంతకుముందు నీలేశ్ కుంభానీ నామినేషన్ గురించి బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆ తర్వాత, ఆయనకు మద్దతు ఇస్తున్నవారు కనిపించకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరించారు.
నీలేశ్ కుంభానీ నామినేషన్ పత్రంలో మద్దతుదారులుగా సంతకం పెట్టిన నలుగురిలో ముగ్గురు తాము ఆ సంతకం చేయలేదంటూ ప్రమాణం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా నీలేశ్‌ను కలెక్టర్ కోరారు.
తన మద్దతుదారులు హాజరు అవుతారని ఎన్నికల అధికారికి నీలేశ్ కుంభానీ చెప్పారు. కానీ, వారు రాలేదు. కాంగ్రెస్, బీజేపీ వర్గాలు రిటర్నింగ్ అధికారికి తమ వాదనలను వినిపించాయి. చివరకు ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్‌ను తిరస్కరించినట్లు ప్రకటించారు.
నీలేశ్ కుంభానీ ఎవరు?
నీలేశ్ కుంభానీ 20 ఏళ్లకు పైగా కాంగ్రెస్ కార్యకర్త. ఆయన గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రెండుసార్లు, అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి పోటీచేశారు. కార్పొరేటర్‌గా కూడా పనిచేశారు.
2022 అసెంబ్లీ ఎన్నికల్లో సూరత్‌లోని కామ్రెజ్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున ఆయన బరిలో నిలిచారు. కానీ, మూడో స్థానంలో నిలిచారు.
ఇవి కూడా చదవండి:
- పాముల సెక్స్: సంభోగం తరువాత ఆడ అనకొండ మగపామును ఎందుకు చంపుతుంది?
- బ్లూ కార్నర్: ప్రజ్వల్ రేవణ్ణ కోసం ఈ నోటీస్ ఎందుకు జారీ చేశారు, దీనివల్ల ఏమవుతుంది?
- పెనైల్ క్యాన్సర్: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
- శామ్ పిట్రోడా: ‘ఆఫ్రికన్’ కామెంట్లపై సొంత పార్టీ ఎలా స్పందించింది... ప్రధాని చేసిన విమర్శలేంటి?
- గుడ్డు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














