అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్, ఈ కేసులో జైల్లో ఉన్న కవిత పరిస్థితేంటి? కేజ్రీవాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపనున్నారు?

అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, అరవింద్ కేజ్రీవాల్
    • రచయిత, ఉమంగ్ పోద్దార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జైలు నుంచి విడుదలైన తర్వాత రోజు దిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ తన రాజకీయ కార్యక్రమాలను ప్రారంభించారు.

దిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఆయనతో పాటు ఆయన భార్య సునీత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీసుకు చేరుకుని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేశారు.

“75 ఏళ్లలో దేశంలో ఏ ఇతర పార్టీ కూడా ఇంతలా వేధించలేదు. ప్రధానమంత్రి తాను అవినీతిపై పోరాడుతున్నానని చెబుతున్నారు. కానీ దొంగలంతా ఆయన పార్టీలోనే ఉన్నారు. నరేంద్ర మోదీ “వన్ నేషన్ వన్ లీడర్” అనే మిషన్‌ను అమలు చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు.

దిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ 50 రోజుల తర్వాత సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వండంతో మే 10న జైలు నుంచి బయటకు వచ్చారు.

సుప్రీంకోర్టులో ఇద్దరు సభ్యుల బెంచ్ ఆయనకు జూన్ 1వరకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

ఆయన ఎన్నికల్లో ప్రచారం చేసుకోవచ్చు. తిరిగి జూన్ 2న ఆయన జైలులో లొంగిపోవాల్సి ఉంటుంది.

సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ వరకు కేజ్రీవాల్ బయటే ఉంటారు.

కేజ్రీవాల్ అరెస్ట్ ఎన్నికల సమయంలో అందరికీ సమాన అవకాశాలు ఉండాలనే దానిపై దాడి చెయ్యడమే అని ప్రతిపక్షం ఆరోపించింది.

సుప్రీంకోర్టు, దిల్లీ, పంజాబ్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, షాదన్ ఫరాసత్, కేజ్రీవాల్ తరపు న్యాయవాది (మధ్యలో ఉన్న వ్యక్తి)

కోర్టు ఆదేశాలలో ఏముంది?

ఐదేళ్లకోసారి జరిగే సార్వత్రిక ఎన్నికలు ముఖ్యమైన కార్యక్రమమని కోర్టు తన ఆదేశాలలో తెలిపింది. మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి కోర్టు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంది.

కేజ్రీవాల్‌కు నేర పూరిత చరిత్ర ఏమీ లేదని ఆయన వల్ల సమాజానికి ఎలాంటి హాని లేదని కోర్టు తన ఆదేశాల్లో తెలిపింది.

ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని కేజ్రీవాల్‌కు కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.

కేజ్రీవాల్ బెయిల్ మీద బయటకు వచ్చినప్పటికీ కోర్టు ఆదేశాల ప్రకారం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లడానికి వీల్లేదు. ఆయన అధికారిక ఫైళ్ల మీద సంతకాలు చెయ్యకూడదు.

లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం పొందడానికి ఏదైనా ఫైల్ మీద దిల్లీ ముఖ్యమంత్రి సంతకం అవసరమైతే, అలాంటి వాటిపై ఆయన సంతకం చెయ్యవచ్చు.

కేజ్రీవాల్ ఈ కేసు గురించి ఎక్కడా ఏమీ మాట్లాడకూడదు.

కేసులో సాక్షులతో మాట్లాడేందుకు ప్రయత్నించకూడదు. అయితే, ఆయన తన రాజకీయ కార్యక్రమాలు కొనసాగించవచ్చని కోర్టు తెలిపింది.

కల్వకుంట్ల కవిత, ఢిల్లీ హైకోర్టు

ఫొటో సోర్స్, BRS

ఫొటో క్యాప్షన్, కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ మే 25కి వాయిదా

కవితకు బెయిల్‌పై ఉత్కంఠ

లిక్కర్ కేసులో ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న కల్వకుంట్ల కవిత బెయిల్ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మే 24కి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు తమకు సమయం కావాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరారు.

ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లను మే 6 కోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు.

మహిళగా పీఎంఎల్ సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందే అర్హత ఉందని కవిత తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు.

దిల్లీ, పంజాాబ్, ఆమ్ ఆద్మీ పార్టీ

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌తో కేజ్రీవాల్

దిల్లీ, పంజాబ్‌ ఆమ్ ఆద్మీ పార్టీలో నైతిక స్థైర్యం పెరుగుతుందా?

ప్రస్తుతం, లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికలు పూర్తయ్యియి. ఇంకా నాలుగు దశల్లో ఎన్నికలు జరగాల్సిన ఉంది.

దిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఇంకా ఓటింగ్ జరగాల్సి ఉంది. రెండు రాష్ట్రాలు ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా కీలకమైనవి.

దిల్లీలో ఏడు పార్లమెంట్ స్థానాలకు మే 25న పోలింగ్ జరగనుంది. దిల్లీలో ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీలు ఇండియా కూటమి కింద అభ్యర్థుల్ని రంగంలోకి దించాయి.

ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లోని 13 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తోంది. పంజాబ్‌లో జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. దిల్లీ, పంజాబ్ కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో ఒక స్థానంలో పోటీ చేస్తంది. హర్యానాలో మే 25న పోలింగ్ జరగనుంది.

దేశవ్యాప్తంగా చూస్తే, ఇప్పటి వరకూ 543 లోక్‌సభ స్థానాలకు గాను 285 సీట్లలో పోలింగ్ పూర్తయింది. ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో ఆప్‌ చాలా చోట్ల పోటీలో ఉంది.

ఉదాహరణకు, గుజరాత్‌లో ఆప్ ఇద్దరు అభ్యర్థులను రంగంలోకి దించింది. 2022లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంది. ఆప్‌కు 13 శాతం ఓట్లు వచ్చాయి.

 ఆమ్ ఆద్మీ పాార్టీ, ఇండియా కూటమి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కేజ్రీవాల్ విడుదలతో ఆప్ కార్యకర్తల్లో ఉత్సాహం

కేజ్రీవాల్ విడుదలతో ప్రతిపక్షాలకు ప్రయోజనం ఉంటుందా?

కేజ్రీవాల్ విడుదల కావడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకే కాకుండా ఇండియా కూటమికి కూడా ప్రయోజనం కలుగుతుందంటున్నారు రాజకీయ నిపుణులు.

గతంలో, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఆయన విడుదల పార్టీ వర్గాల్లో ఉత్సాహం నింపింది.

“అరవింద్ కేజ్రీవాల్ బయట ఉండటం వల్ల దిల్లీ, పంజాబ్‌లో గట్టి ప్రభావం చూపుతుంది. ఆయన పార్టీ కోసం ప్రచారం మొదలు పెడితే, తన ప్రసంగాలతో ప్రజలను ప్రభావితం చేస్తారు. ఆయనకు ఆ నైపుణ్యం ఉంది.” అని రాజకీయ విశ్లేషకుడు, ఆప్ మాజీ నేత అశుతోష్ చెప్పారు.

“కేజ్రీవాల్ ఎవరో భారతదేశం మొత్తం తెలుసు. అందువల్ల ఆయన విడుదల దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది” అని అశుతోష్ అన్నారు. ఇది మోదీ ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ. ఆయన దిల్లీ, పంజాబ్‌లోనే కాదు, ఇండియా కూటమి తరపున ఇతర రాష్ట్రాల్లోను ప్రచారం చేస్తారు. ప్రస్తుతం మోదీ, రాహుల్ గాంధీ తర్వాత ఆ స్థాయి నాయకుడిగా కేజ్రీవాల్‌ను చూస్తున్నారు.

“కేజ్రీవాల్ విడుదల బీజేపీకి కచ్చితంగా ఎదురు దెబ్బ. ఆయన అరెస్ట్‌తో బీజేపీ మీద పోరాడుతున్న ఆప్ కార్యకర్తలకు ఆయన విడుదల మరింత నైతిక స్థైర్యాన్ని ఇస్తుంది. ఇప్పుడు వాళ్లు రెట్టించిన ఉత్సాహంతో బీజేపీపై పోరాడుతారు” అని రాజకీయ విశ్లేషకురాలు అదితి ఫడ్నిస్ చెప్పారు.

‘మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉన్నా, కేజ్రీవాల్ అరెస్ట్, విడుదల ప్రభావం దిల్లీ మీద కచ్చితంగా ఉంటుంది’ అని ఆమె అన్నారు.

“పంజాబ్‌లో ఆయన పెద్దగా ప్రభావం చూపలేకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఇండియా కూటమిలో కాంగ్రెస్- ఆప్ మధ్య విబేధాలు ఉన్నాయి. అక్కడ రెండు పార్టీలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు” అని ఫడ్నిస్ తెలిపారు.

కేజ్రీవాల్ ఇండియా కూటమిని బలోపేతం చెయ్యగలరని అయితే అది కూడా కొంత సమయం వరకే అని ఆమె చెప్పారు.

“ఇప్పటి వరకు జరిగిన పోలింగ్‌ను చూస్తే ప్రతిపక్షాలు అందరూ భయపడినట్లు కాకుండా ఇండియా కూటమి పని తీరు బాగానే ఉంది” అని ఫడ్నిస్ చెప్పారు.

జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ తర్వాత అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చెయ్యడాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండించాయి. ఇప్పుడు కేజ్రీవాల్ విడుదలతో ఇండియా కూటమి మరింత బలం పుంజుకుంటుందని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.

అరవింద్ కేజ్రీవాల్. దిల్లీ ముఖ్యమంత్రి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి కేజ్రీవాల్

కేజ్రీవాల్ మళ్లీ జైలుకు వెళతారా?

కేజ్రీవాల్ మీద దాఖలైన కేసు గురించి విచారిస్తామని కోర్టు చెప్పింది. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్టును ఆయన తరపు న్యాయవాదులు సవాలు చేస్తున్నారు. కోర్టు విచారణలో భాగంగా కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమమని తేలితే ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అలా జరగ్గపోతే ఆయన జూన్ 2న ఆయన తిరిగి తిహాడ్ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.

లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ నిందితుల్ని అరెస్టు చేశాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది.

కేజ్రీవాల్ మీద దర్యాప్తు చేయాలని దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్ఐఏకు లేఖ రాశారు.

సిక్కుల నిషేధిత సంస్థ ‘సిక్ ఫర్ జస్టిస్’ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు అందినట్లు లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. ఈ సంస్థ ఖలిస్తాన్‌కు మద్దతిస్తోంది.

ఏదైమైనప్పటికీ, కేజ్రీవాల్‌ను జూన్ 1లోగా మరో దర్యాప్తు సంస్థ అరెస్టు చేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

‘ఇదే కేసులో మరో అంశం మీద ఆయనను అరెస్ట్ చేస్తారని నేను అనుకోవడం లేదు’ అని అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి గోవింద్ మాథూర్ బీబీసీతో చెప్పారు.

“వేరే కేసులో దర్యాప్తు సంస్థలు కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలనుకుంటే, లిక్కర్ స్కామ్‌ను విచారిస్తున్న కోర్టుకు ఆ విషయాన్ని చెప్పి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది” అని ఆయన అన్నారు.

“కోర్టు అదేశాలను ఉల్లంఘించి దర్యాప్తు సంస్థలు ముందుకెళతాయని అనుకోవడం లేదు. ఒక వేళ వాళ్లు అలా చేస్తే అందుకు పరిష్కారాలు కూడా ఉన్నాయి” అని సీనియర్ న్యాయవాది నిత్య రామకృష్ణన్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)