మల్లికార్జున్ ఖర్గే: ‘ముస్లింలు, మటన్, మంగళసూత్రాల గురించి మోదీ ఎందుకు మాట్లాడుతున్నారంటే....’

ఫొటో సోర్స్, Indian National Congress/Facebook
- రచయిత, ఇక్బాల్ అహ్మద్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 'ఎం‘ అనే పదమంటే చాలా ఇష్టమని, అందుకే ఆయన ముస్లింలు, మటన్, మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.
బీబీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ''మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలే పోరాడుతున్నారు. అందువల్ల ఇండియా కూటమి కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది'' అని అన్నారు.
'ప్రజలే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు'
ఇప్పటివరకు లోక్ సభకు నాలుగు దశల్లో పోలింగ్ జరిగింది. నాలుగో దశ ఓటింగ్‌కు ఒక్కరోజు ముందు, ఆదివారం మల్లికార్జున్ ఖర్గేతో ఈ సంభాషణ జరిగింది.
ఇప్పటి వరకు ఎన్నికల వాతావరణం చూస్తుంటే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఈసారి ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని భావిస్తున్నట్లు ఖర్గే చెబుతున్నారు.
''ఈ ఎన్నికల్లో ప్రజలే మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మేం ప్రజలకు మద్దతు ఇస్తున్నాం'' అన్నారు ఖర్గే. తమ కూటమికి ఎక్కువ సీట్లు రాబోతున్నాయని, మోదీ ప్రభుత్వాన్ని నిలువరిస్తామన్నారు.
మరోవైపు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సహా బీజేపీ బడానేతలు దాదాపు ప్రతి ఎన్నికల సభలో 400 సీట్లు గెలుస్తామని చెబుతున్నారు.
బీజేపీ వాదనలపై ఆయన స్పందిస్తూ, ''ఇప్పటికే 400 సీట్లు వస్తాయంటూ నినాదం ఇస్తున్నారు, 600 దాటుతాయని చెప్పకపోవడం మన అదృష్టం'' అని ఖర్గే అన్నారు.
లోక్ సభ స్థానాల సంఖ్య 543.
బీజేపీ వాదనలను తిప్పికొట్టడం ఒకటైతే, అసలు ఇండియా కూటమి విజయంపై ఎందుకంత విశ్వాసం వ్యక్తం చేస్తున్నారనే విషయంపై ఆయన స్పందిస్తూ.. ''నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలు, పేదల ఆదాయం తగ్గిపోవడం వంటి విషయాలపై ప్రజల్లో ఆగ్రహం ఉంది. బీజేపీ ఓటమికి అదే కారణమవుతుంది'' అన్నారాయన.

ఫొటో సోర్స్, ANI
ఎన్నికల సంఘం గురించి ఖర్గే ఏమన్నారు?
ఇటీవల జరిగిన రెండు దశల ఓటింగ్ గణాంకాలను విడుదల చేయడంలో ఎలక్షన్ కమిషన్ జాప్యం చేయడం హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈ ఆలస్యం ఆమోదయోగ్యమైనది కాదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
ఇదే అంశంపై ఇండియా కూటమి నేతలకు ఖర్గే లేఖ రాశారు. ఖర్గే లేఖను 'ఎన్నికల నిర్వహణ ప్రక్రియపై దాడి' గా ఎలక్షన్ కమిషన్ అభివర్ణించింది.
దీనిపై ఖర్గే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి మిత్రపక్షాలకు రాసిన లేఖపై ఎన్నికల సంఘం స్పందించిందని, కానీ తాను ఎన్నికల కమిషన్‌కి చేసిన ఫిర్యాదులపై స్పందించాల్సిన అవసరం ఉందని కూడా కమిషన్ భావించలేదని ఖర్గే అన్నారు.
ఖర్గే బీబీసీతో మాట్లాడుతూ, ఎన్నికల రోజు డేటా విడుదల చేయడంలో సమస్య ఏంటని ప్రశ్నించారు.
''మేం సీఈసీని సమర్థిస్తున్నాం, అయితే ఎక్కడైనా తప్పులు జరిగినా, అలాంటివి మా దృష్టికి వచ్చినా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సలహాలు ఇవ్వడం మా కర్తవ్యం. కానీ, వాళ్లు మమ్మల్ని మాత్రమే నిందిస్తారు'' అన్నారాయన.
డేటాను వీలైనంత త్వరగా బహిర్గతం చేస్తే ప్రజలకు నిజం తెలుస్తుందన్నారు.

'చేసింది చెప్పుకుని మోదీ ఓట్లు అడగడం లేదు'
ప్రధాన మంత్రి మోదీ ఈ ఎన్నికలను రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోదీగా మారుస్తున్నారా?
ఈ ప్రశ్నకు ఖర్గే సమాధానమిస్తూ, ''మోదీ తన హయాంలో అభివృద్ధి జరిగిందని కానీ, తాను ఈ పనులు చేశానని కానీ చెబుతూ ఓట్లు అడగడం లేదు. వ్యక్తిగత విమర్శలు మాత్రమే చేస్తున్నారు'' అన్నారు.
ఒకవైపు కాంగ్రెస్ తాము చేసిన అభివృద్ధి గురించి చెబుతూ ఓట్లు అడుగుతుంటే, బీజేపీ మాత్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఖర్గే అన్నారు.
''మేం ఏదైతే చెబుతున్నామో, అదే అజెండాతో ఓట్లు అడుతున్నాం'' అన్నారాయన.
''మీ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తాం, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తాం, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం, అహ్మదాబాద్ నుంచి ముంబయికి బుల్లెట్ ట్రైన్ తెస్తామంటూ ఆయన చెప్పినదంతా డొల్లేనని తేలిపోయింది'' అన్నారు ఖర్గే.
మోదీ వర్సెస్ రాహుల్ గాంధీగా చూపడం ద్వారా బీజేపీకి ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని, మోదీతో పోలిస్తే రాహుల్ క్షేత్రస్థాయిలో అంత బలంగా లేరనేది చాలామంది రాజకీయ విశ్లేషకుల భావన.
రాజకీయ విమర్శకులతో పాటు కాంగ్రెస్‌ను వీడిన చాలా మంది నేతలు కూడా రాహుల్ గాంధీ రాజకీయాలపై అంత సీరియస్‌గా లేరని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయన్ను కలవడం చాలా కష్టమని ఆరోపిస్తుంటారు.
మోదీ వర్సెస్ రాహుల్ విషయంలో, రాహుల్ గాంధీని సమర్థిస్తూ ఖర్గే ఇలా అన్నారు.
''అలా మాట్లాడేవారు మీడియాలోనే కాకుండా బయట కూడా ఉన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేసి లక్షలాది మందిని కలిసిన మా నాయకుడు ప్రజలకు తెలియదా? మణిపుర్ నుంచి ముంబయి వరకూ యాత్ర చేసి అన్ని వర్గాల ప్రజలనూ కలిశారు. ఇంత చేస్తున్నా, రాహుల్ వర్సెస్ మోదీ అని ప్రచారం చేస్తూనే ఉన్నారు.''
హిట్లర్ కాలంలో జరిగిన ప్రచారంతో దీన్ని పోల్చుతూ, ''హిట్లర్ కాలంలో ప్రచార శాఖ మంత్రిగా ఉన్న గోబెల్స్ కూడా ఇలాగే చేసేవారు' అని ఖర్గే అన్నారు.
''పని తక్కువ, మాటలెక్కువ. జనాన్ని ఆకర్షించే తప్పుడు వాగ్దానాలు ఆపి మీరు చేసిన పని చెప్పి ఓట్లు అడగండి.''

ఫొటో సోర్స్, TWITTER/MALLIKARJUNA KHARGE
ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఉపయోగిస్తున్న భాషపై ఖర్గే మాట్లాడుతూ, ''ఆయనకు ఎం అనే పదం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన నోటి నుంచి ముస్లిం, మటన్, మంగళ సూత్రం అనే మాటలు వస్తుంటాయి.''
కాంగ్రెస్ పార్టీ దళితులు, బీసీల రిజర్వేషన్లను దొంగిలించి ముస్లింలకు ఇస్తుందని ఎన్నికల ర్యాలీల్లో మోదీ ప్రతినిత్యం చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మంగళసూత్రం కూడా లాక్కుంటారని మోదీ అంటున్నారు.
మోదీ వ్యాఖ్యలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడుతూ, ''విశ్వగురువుగా మారుతున్నారని చెబుతున్న ప్రధాని మటన్, చికెన్, మంగళసూత్రాల గురించి మాట్లాడితే విశ్వగురువు అవుతారా? ముందు దేశం, దేశ ప్రజల బాగోగులు చూడండి. పేదల కోసం ఏదైనా చేయండి'' అన్నారు.
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ఎవరి నుంచో ఏదో లాక్కొని ఇతరులకు ఇచ్చే ఉద్దేశం తమకు లేదని ఖర్గే స్పష్టం చేశారు.
తాము రాజ్యాంగాన్ని అనుసరిస్తామని, మతప్రాతిపదకన ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమేఠీ - రాయ్‌బరేలీపై ఖర్గే ఏం చెప్పారు?
అమేఠీని స్మృతి ఇరానీకి అప్పగించి కాంగ్రెస్ పార్టీ తప్పుకుందా? రాహుల్ గాంధీ కేవలం రాయ్‌బరేలీ నుంచే ఎందుకు పోటీ చేస్తున్నారు?
ఈ ప్రశ్నకు ఖర్గే సమాధానమిస్తూ, అమేఠీని వదిలేసినట్లు బీజేపీ భావిస్తోందా, అలా అయితే బీజేపీ ఇంట్లో కూర్చోవాలి కదా అన్నారు.
అమేఠీ - రాయ్‌బరేలీ కాంగ్రెస్‌కు కంచుకోటలని, అక్కడ కాంగ్రెస్‌కి బలమైన మద్దతుదారులు ఉన్నారని చెప్పారు.
''సోనియా గాంధీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక ఎన్నికల్లో పోటీ వద్దు, రాజ్యసభకు వెళ్లాలని మేమే సూచించాం. రాయ్ బరేలీ అనేది గాంధీ కుటుంబ సభ్యులు పోటీ చేస్తూ వస్తున్న నియోజకవర్గం కాబట్టి రాహుల్ గాంధీనీ అక్కడి నుంచి పోటీ చేయాలని ఆదేశించాం. ఇప్పటి వరకూ రెండు నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న ఓ కార్యకర్తకు అమేఠీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాం.''
అమేఠీ ఎన్నికల కార్యకలాపాలను స్వయంగా ప్రియాంక గాంధీ దగ్గరుండి చూసుకుంటున్నారని ఖర్గే అన్నారు.

ఫొటో సోర్స్, ANI
గత కొద్దిరోజులుగా రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు, 1990లలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో ప్రతిపాదించిన ఎకనమిక్ లిబరైజేషన్ పాలసీని కాంగ్రెస్ పున:సమీక్షిస్తోందా?
ఈ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, ఎప్పటికప్పుడు పార్టీ తన విధివిధానాలను రూపొందిస్తుందని అన్నారు.
సామాజిక న్యాయం గురించి మాట్లాడటం ద్వారా కాంగ్రెస్ పార్టీ మరోసారి ఉత్తర భారతదేశంలో, మరీముఖ్యంగా హిందీ బెల్టులో పట్టుకోసం ప్రయత్నిస్తోందా?
అందుకు మల్లికార్జున్ ఖర్గే బదులిస్తూ, కాంగ్రెస్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అనుకుంటోందని, అందుకే పేదలు, యువత, రైతులు, మహిళలు, కార్మికుల కోసం 'ఫైవ్ జస్టిస్' తీసుకొచ్చిందని చెప్పారు.
''ఒకవైపు పరిశ్రమలను కాపాడుకోవాలి. మరోవైపు కార్మికులను కూడా కాపాడాలి'' అన్నారాయన. అందుకు తగినట్లుగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లే పాలసీని ఎంచుకుంటామన్నారు.
రాహుల్ గాంధీ వ్యాపారవర్గాలకు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని కొందరు అంటున్నారు, దీనిని కాంగ్రెస్ ఎలా చూస్తుంది?
దీనికి స్పందిస్తూ, కాంగ్రెస్ అమలు చేసిన విధానాల వల్ల ఏ పరిశ్రమ అయినా మూతపడిందా? అని ప్రశ్నించారు.
''ఏదైనా కొత్త నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా తీసుకోవాలి. సంపన్నులపై ఎక్కువ పన్నులు వేయాలనుకున్నాం, వాళ్లొచ్చి వాటిని మరింత తగ్గించారు. రైతులకు జీఎస్టీ వర్తించకూడదని అనుకున్నాం, వాళ్లపై కూడా జీఎస్టీ విధించారు'' అన్నారు ఖర్గే.
కేజ్రీవాల్ ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేస్తారా?
దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదలై ఎన్నికల ప్రచారం కూడా చేస్తున్నారు. కేజ్రీవాల్‌ను దిల్లీ, పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఇండియా కూటమి తరఫున ప్రచారానికి పంపుతారా?
దీనిపై ఖర్గే మాట్లాడుతూ, ఇండియా కూటమికి చెందిన నాయకుడిని ఎక్కడ అవసరమనుకుంటే అక్కడికి పంపుతామన్నారు.
బీజేపీకి సీట్లు తగ్గితే ప్రస్తుతం ఎన్డీయేలో కానీ, ఇండియా కూటమిలో కానీ చేరని పార్టీల ప్రాధాన్యం మరింత పెరుగుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
బీజేడీ, వైఎస్సార్‌సీపీ, బీఆర్ఎస్ వంటి ఇండియా కూటమి, ఎన్డీయే కూటముల్లో లేని పార్టీలతో కాంగ్రెస్ పార్టీ ఏమైనా సంప్రదింపులు జరుపుతోందా? అని అడిగినప్పుడు...
దానిపై, ఎన్నికల తర్వాత ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంటుందని ఖర్గే చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అర్ధశతాబ్దం తర్వాత చంద్రుడిపై కాలుమోపేదెవరు, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి?
- చాంద్ బీబీ: అక్బర్ సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ఈ బీజాపూర్ రాణి ఎవరు?
- జిడ్డు కృష్ణమూర్తితో అరుదైన ఇంటర్వ్యూ: ‘‘నీలో జ్యోతిని నువ్వే వెలిగించుకోవాలి’’
- విశాఖ స్టీల్ ప్లాంట్ అధికారులు గంగవరం పోర్టు కార్మికులను చేతులెత్తి వేడుకొంటున్నారు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















