సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో కుదుపులు: ‘సీట్లలో నుంచి ఎగిరి సీలింగ్‌కు గుద్దుకున్న ప్రయాణికులు’

లండన్- సింగపూర్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తర్వాత విమానం లోపలి దృశ్యాలు
    • రచయిత, జోయెల్ గ్యుంటో, సిమోన్ ప్రేజర్
    • హోదా, బీబీసీ న్యూస్

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్ విమానం ఆకాశంలో ప్రయాణిస్తుండగా తీవ్ర కుదుపులకు గురైంది.

మియన్మార్ మీదుగా వెళ్తున్న సమయంలో సుమారు 37,000 అడుగుల ఎత్తులో ఉండగా విమానంలో తీవ్ర స్థాయిలో కుదుపులు వచ్చాయని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది.

కొందరు ప్రయాణికులు సీట్లలో నుంచి కింద పడిపోయారు. సామాన్లు చెల్లాచెదురుగా పడిపోయాయి.

విమానంలో ప్రయాణిస్తున్న బ్రిటన్‌కు చెందిన 73 ఏళ్ళ వ్యక్తి మరణించారు. మరో 30 మందికిపైగా గాయపడ్డారు.

బ్రిటన్‌కు చెందిన ప్రయాణికుడు హార్ట్ ఎటాక్‌ కారణంగా చనిపోయి ఉంటారని బ్యాంకాక్‌లోని అధికార వర్గాలు తెలిపాయి.

లండన్ నుంచి సింగపూర్‌కు వెళ్తున్న బోయింగ్ 777-300 ఈఆర్ విమానంలో మొత్తం 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బంది ఉన్నట్టు సింగపూర్ ఎయిర్ లైన్స్ తెలిపింది.

కుదుపులకు గురవడంతో విమానాన్ని బ్యాంకాక్‌కు మళ్ళించి స్థానిక కాలమాన ప్రకారం 3 గంటల 45 నిమిషాల సమయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

సింగపూర్ ఎయిర్‌లైన్స్
బోయింగ్7777

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బ్యాంకాక్‌లో సురక్షితంగా దిగిన బోయింగ్ 777 విమానం

‘‘భయంకరమైన శబ్దాలు’’

లండన్‌కు చెందిన ఆండ్రూ బీబీసీ రేడియో 5తో మాట్లాడుతూ ‘విమానం కుదుపులకు గురైన మొదటి కొన్ని సెకన్లు భయంకరమైన శబ్దాలు వినిపించాయని’ చెప్పారు.

కుదుపులు తగ్గిన తర్వాత తలపై గాయంతో ఉన్న ఓ మహిళకు సహాయం చేయగలిగానని తెలిపారు.

బ్యాంకాక్ విమానాశ్రయంలోని ప్రత్యేక ప్రాంతంలో ప్రయాణికులను ఉంచుతున్నట్టు ఆండ్రూ చెప్పారు.

‘‘ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. నేను వేరే విమానంలో వెళతాను’’ అని ఆయన చెప్పారు.

‘‘విమానం హఠాత్తుగా ఊగడం మొదలైందని’’ మరో ప్రయాణికుడు రాయిటర్స్ వార్తా సంస్థకు చెప్పారు.

‘‘కొంతమంది ప్రయాణికుల తలలు బ్యాగేజీ క్యాబిన్లకు గుద్దుకున్నాయి. లైట్లు, మాస్క్‌లు పగిలిపోయాయి’’ అని చెప్పారు.

‘‘ఏం జరుగుతుందో కనుక్కోవడం మొదలుపెట్టాను. హఠాత్తుగా విమానం ఎగురుతున్న ఎత్తు తగ్గిపోవడంతో సీటు బెల్టు పెట్టుకోకుండా కూర్చున్నవారంతా ఎగిరి విమానం సీలింగ్‌కు గుద్దుకున్నారు’’ అని 28 ఏళ్ళ జఫ్రాన్ అజ్మీర్ చెప్పారు.

సింగపూర్ విమానం

ఫొటో సోర్స్, Reuters

‘‘హఠాత్తుగా ఎగిరి పైకప్పుకు గుద్దుకున్నా’’

విమానంలో కుదుపులు ఎలా మొదలయ్యాయో ఒక బ్రిటిష్ ప్రయాణికుడు బీబీసీ బ్యాంకాక్ ప్రతినిధికి చెప్పారు.

ఆయన తన కుటుంబంతో పాటూ ఆ విమానంలోనే ప్రయాణిస్తున్నారు.

“బహుశా విమానం ఎక్కి పది గంటలై ఉంటుంది. జనాలు తిరుగుతున్నారు. అక్కడ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని ఎలాంటి సూచనా లేదు.

అంతకు ముందు కుదుపులేవీ లేవు. అసలు కుదుపులే లేని స్థితి నుంచి పరిస్థితి ఇంత తీవ్రమైన కుదుపుల వరకు వచ్చింది.

మొదట విమానం అసలు ఊగలేదు. ఆ తర్వాత నేను హఠాత్తుగా ఎగిరి పైకప్పుకు గుద్దుకున్నాను. నా కొడుకు ఎగిరి నా వెనుక రెండు వరుసల తర్వాత ఫ్లోర్ మీద పడ్డాడు.

టాయిలెట్‌లో ఉన్న ఒక వ్యక్తి తన తల పైకప్పుకు గుద్దుకోవడంతో అరవడం నాకు వినిపించింది. అతను చాలా తీవ్రంగా గాయపడ్డాడు’’ అని ఆయన వివరించారు.

బోయింగ్ 777

ఫొటో సోర్స్, Reuters

‘‘ఐ లవ్ యూ ఆల్’’ అంటూ సందేశం

తన కుమారుడు జోష్ చేసిన మెసేజ్‌ గురించి అలీసన్ బార్కర్ వివరించారు.

‘‘నువ్వు భయపడొద్దు. కానీ, మా విమానం పరిస్థితి గందరగోళంగా ఉంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు. ఐ లవ్ యూ ఆల్’’ అంటూ జోష్ తనకు మెసేజ్ చేశారని అలీసన్ చెప్పారు.

అతను బాలికి వెళ్తున్నాడు. ఆ మెసేజ్ చదివాక రెండు గంటల పాటు సమయం భయానకంగా గడిచింది. మళ్లీ జోష్ అంతా బాగున్నట్లు చెప్పాక మనసు కుదుటపడిందని ఆమె అన్నారు.

జోష్‌కు స్వల్ప గాయాలయ్యాయని ఆమె చెప్పారు. అయితే, చావు అంచుల వరకు వెళ్లడం అతనికి దీర్ఘకాలం గుర్తుంటుందని, ఆ భయం నుంచి బయటపడటం అంత సులభం కాదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

గాయపడిన 31 మందిని ఆసుపత్రికి తరలించినట్లు ఆ విమానయాన సంస్థ చెప్పింది.

‘‘మిగతా ప్రయాణికులకు, విమాన సిబ్బందికి బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో అవసరమైన వైద్యసహాయం అందిస్తున్నాం’’ అని తెలిపింది.

ప్రయాణికులకు వైద్య సహాయం అందించేందుకు థాయ్ అధికారులతో కలిసి పని చేస్తున్నామని, మరో బృందాన్ని బ్యాంకాక్‌కు పంపిస్తున్నట్లు వెల్లడించింది.

థాయ్ అధికారులు అంబులెన్సులు, అత్యవసర బృందాలను సువర్ణభూమి విమానాశ్రయానికి పంపించారు.

తమ ప్రభుత్వం ప్రయాణికులకు, వారి కుటుంబాలకు తగిన సాయం అందిస్తుందని సింగపూర్ రవాణా మంత్రి చీ హాంగ్ టాట్ చెప్పారు.

‘‘లండన్ హీత్రూ నుంచి సింగపూర్ వస్తున్న సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానం SQ321లో జరిగిన ఘటన గురించి తెలిసి నేను చాలా బాధపడ్డాను” అని ఆయన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేశారు.

వీడియో క్యాప్షన్, విమానం 37,000 అడుగుల ఎత్తులో వెళ్తుండగా తీవ్రమైన కుదుపులు, ఆ క్షణాల్లో ఏమైందంటే..

ఎందుకిలా జరిగింది?

ఈ ఘటన ఎలా జరిగిందన్నది ఇంకా స్పష్టంగా తెలీడం లేదు.

విమానాలు మేఘాల్లోంచి ప్రయాణిస్తున్నప్పుడు సాధారణంగా ఎక్కువ టర్బులెన్స్‌ ఉంటుంది. కానీ క్లియర్ ఎయిర్ టర్బులెన్స్ కూడా ఉంటుంది. అది విమానంలోని వాతావరణం రాడార్ మీద కనిపించదు.

లక్షల విమానాలు ప్రయాణిస్తున్న విషయానికి వస్తే, ఇలా తీవ్రంగా కుదుపులు రావడం వల్ల గాయపడటం అనేది చాలా అరుదైన విషయం అని ఏవియేషన్ ఎక్స్‌పర్ట్ జాన్ స్ట్రిక్‌లాండ్ బీబీసీకి చెప్పారు.

అయితే తీవ్రమైన కుదుపులు నాటకీయతకు దారితీసి, తీవ్ర గాయాలకు, ఇలాంటి ఘటనల్లో మరణానికి కారణమవుతుంటాయని ఆయన అన్నారు.

కుదుపులు వచ్చినపుడు ఎలా స్పందించాలనేదానిపై విమాన సిబ్బంది శిక్షణ కూడా తీసుకుంటారని ఆయన చెప్పారు.

ప్రయాణం చిన్నదైనా, పెద్దదైనా విమానం లోపల ఉన్నప్పుడు సీట్ బెల్ట్ వదులుగా అయినా పెట్టుకోవాలని ఎయిర్ లైన్స్ కారణం లేకుండా సూచించవని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)