‘బోయింగ్’ సరైన ప్రమాణాలు పాటించడం లేదన్న మాజీ ఉద్యోగి మృతి, అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, JOHN BARNETT
- రచయిత, థియో లెగెట్
- హోదా, బిజినెస్ కరెస్పాండెంట్, బీబీసీ న్యూస్
విమానాలను రూపొందించే బోయింగ్ కంపెనీ సరైన తయారీ ప్రమాణాలను పాటించడం లేదని గతంలో ఆరోపించిన మాజీ ఉద్యోగి జాన్ బర్నెట్ అమెరికాలో మృతి చెందారు.
2017లో పదవీ విరమణ తీసుకునేంత వరకు 32 ఏళ్ల పాటు జాన్ బర్నెట్, బోయింగ్ సంస్థలో పనిచేశారు.
చనిపోవడానికి కొన్ని రోజుల ముందే, కంపెనీకి వ్యతిరేకంగా దాఖలైన ‘విజిల్‌బ్లోవర్’ దావాలో ఆయన ‘సాక్ష్యాధారాలను’ సమర్పించారు.
జాన్ బర్నెట్ మరణ వార్త తమకు చాలా బాధ కలిగించిందని బోయింగ్ తెలిపింది.
చార్లెస్టన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ఆయన మరణాన్ని బీబీసీకి ధ్రువీకరించింది. మార్చి 9న తనకు తాను గాయాలు చేసుకుని 62 ఏళ్ల జాన్ బర్నెట్ చనిపోయినట్లు తెలిపింది. జాన్ బర్నెట్ మృతిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
జాన్ బర్నెట్ అనారోగ్య కారణాలతో 2017లో బోయింగ్‌లో పదవీ విరమణ తీసుకున్నారు.
787 డ్రీమ్‌లైనర్‌ను నార్త్ చార్లెస్టన్ ప్లాంట్‌లో తయారు చేసేటప్పుడు 2010 నుంచి క్వాలిటీ మేనేజర్‌గా జాన్ బర్నెట్ పనిచేశారు. ఈ అధునాతన విమానాన్ని ప్రాథమికంగా సుదూర ప్రాంతాలకు వాడేవారు.
ప్రొడక్షన్ లైన్‌లో పనిచేసే, తీవ్ర ఒత్తిడిలో ఉన్న కార్మికులు ఉద్దేశపూర్వకంగానే తక్కువ ప్రమాణాలున్న విభాగాలను(పార్ట్‌లను) విమానానికి బిగించారని 2019లో బర్నెట్ బీబీసీకి చెప్పారు.
విమానాల ఆక్సిజన్ వ్యవస్థల్లో కూడా తీవ్రమైన లోపాలున్నట్లు ఆయన చెప్పారు. అంటే, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రతి నాలుగు మాస్కులలో ఒకటి పనిచేయదన్నారు.
సౌత్ కరోలినాలో పనిచేయడం ప్రారంభించిన తర్వాత, కొత్త విమానాలను త్వరగా రూపొందించాలనే ఒత్తిడి పెరిగిందని, దీంతో అసెంబ్లీ ప్రాసెస్, భద్రత విషయంలో రాజీ పడినట్లు ఆయన చెప్పారు. ఈ ఆరోపణలను కంపెనీ ఖండించింది.
అంతేకాక, ఫ్యాక్టరీలో విమాన విభాగాలను ట్రాక్ చేసే ప్రక్రియలను కావాలనే కార్మికులు అనుసరించలేదని ఆయన బీబీసీకి చెప్పారు. దీంతో, లోపాలున్న పరికరాలు, విభాగాలు కనిపించకుండా పోయాయని తెలిపారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కొన్నిసార్లు, తక్కువ నాణ్యత ఉన్న విభాగాలను, పరికరాలను స్క్రాప్ బిన్‌లలో నుంచి తీసి, ప్రొడక్షన్ లైన్‌లో ఆలస్యాలను తగ్గించేందుకు కొత్త విమానాలకు అమర్చారు.
అంతేకాక, 787లో అమర్చిన ఎమర్జెన్సీ ఆక్సిజన్ వ్యవస్థలను పరీక్షించినప్పుడు, వాటిలో 25 శాతం విఫలమైనట్లు చెప్పారు. అంటే రియల్ లైఫ్ ఎమర్జెన్సీ పరిస్థితిలో ప్రతి నాలిగింటిలో ఒకటి కచ్చితంగా విఫలమవుతుందన్నారు.
ఈ విషయాలపై తాను మేనేజర్లను హెచ్చరించానని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని బర్నెట్ బీబీసీకి తెలిపారు. అయితే, ఆయన ఆరోపణలను బోయింగ్ కొట్టివేసింది.
అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) చేపట్టిన రివ్యూలో బర్నెట్ ఆరోపణల్లో కొన్నింటిని ధ్రువీకరించింది.
లోపాలున్న సుమారు 53 విభాగాలు, పరికరాలు ఫ్యాక్టరీ నుంచి కనిపించకుండా పోయాయని ఇది తెలిపింది. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని బోయింగ్‌ను ఆదేశించింది.
ఆక్సిజన్ సిలిండర్ల సమస్యపై 2017లో స్పందించిన కంపెనీ, సరఫరాదారు నుంచి వచ్చిన కొన్ని ఆక్సిజన్ బాటిళ్లను సరిగ్గా పంపించలేదని తాము గుర్తించినట్లు తెలిపింది. కానీ, వీటిని విమానాలకు అమర్చామన్న ఆరోపణలను మాత్రం కొట్టేసింది.
కంపెనీపై జాన్ బర్నెట్ సుదీర్ఘ న్యాయపోరాటం
పదవీ విరమణ తర్వాత, బోయింగ్ కంపెనీకి వ్యతిరేకంగా జాన్ బర్నెట్ సుదీర్ఘకాలం న్యాయపోరాటం చేశారు.
తాను ఈ సమస్యలను లేవనెత్తడంతోనే తన గౌరవాన్ని దెబ్బతీశారని, కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించారు.
ఆయన ఆరోపణలను బోయింగ్ తిరస్కరిస్తూ వచ్చింది.
జాన్ బర్నెట్ చనిపోయే సమయంలో కూడా ఈ కేసు విచారణ కోసం చార్లెస్టన్‌లో ఉన్నారు.
గత వారమే బోయింగ్ న్యాయవాదులకు ఆయన అధికారిక వాంగ్మూలం ఇచ్చారు.
శనివారం ఆయన తదుపరి విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ, హాజరు కాలేదు. దీంతో జాన్ బర్నెట్ ఉన్న హోటల్‌లో ఆయన కోసం వెతికారు.
ఆ తర్వాత హోటల్ పార్కింగ్ ప్రాంతంలో ఆయన ట్రక్కులో జాన్ బర్నెట్ మరణించి కనిపించారు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఆయన మరణం ఒక ‘విషాదం’ అని బర్నెట్ న్యాయవాది అన్నారు.
తీవ్ర విచారణను ఎదుర్కొంటున్న బోయింగ్
జాన్ బర్నెట్ మరణం తమకు తీవ్ర బాధను కలగజేసిందని, ఆయన కుటుంబానికి, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు బోయింగ్ ప్రకటన విడుదల చేసింది.
జాన్ బర్నెట్ చనిపోయే సమయానికి బోయింగ్, దాని కీలక సరఫరాదారు స్పిరిట్ ఏరోసిస్టమ్స్ తయారీ ప్రమాణాలపై తీవ్ర ఆరోపణలను, విచారణను ఎదుర్కొంటున్నాయి.
జనవరి ప్రారంభంలో పోర్ట్‌ల్యాండ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఎగిరిన కొద్దిసేపట్లోనే తన సరికొత్త బోయింగ్ 737 మ్యాక్స్ విమానం ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అనూహ్యంగా ఊడి కింద పడింది.
ఆ డోరును సురక్షితంగా విమానానికి పెట్టేందుకు ఉపయోగించే నాలుగు కీ బోల్టులను సరిగ్గా అమర్చలేదని అమెరికా నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ప్రాథమిక నివేదికలో తేలింది.
కంపెనీపై చేపట్టిన ఆరు వారాల ఆడిట్‌లో ఇలాంటి పలు ఘటనలను తాము గుర్తించినట్లు గత వారం ఎఫ్ఏఏ తెలిపింది.
తయారీ, భద్రత ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో కంపెనీ విఫలమవుతోందని బోయింగ్‌పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఆస్కార్ వేదికపైకి జాన్ సీనా నగ్నంగా ఎందుకు వచ్చారు?
- జింకల్లో కొత్త జాతి గుర్తింపు.. ఇది ఎక్కడ ఉంది?
- సీఏఏ: పౌరసత్వ సవరణ చట్టం అమలుకు నిబంధనలను విడుదల చేసిన కేంద్రం, దీనివల్ల ఏం జరుగుతుంది?
- రోజుల వ్యవధిలో అక్కాచెల్లెళ్లకు ఒకే తరహాలో గుండెపోటు, హఠాత్తుగా వచ్చే సమస్య ఎంత ప్రమాదకరం?
- జీఎన్ సాయిబాబా: ‘నేను ఇంతకాలం బతుకుతానని జైలు అధికారులు కూడా అనుకోలేదు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














