చైనా: ‘పనిష్మెంట్ డ్రిల్స్’తో తైవాన్‌ను బెదిరిస్తోందా, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎలా మొదలయ్యాయి?

ఫొటో సోర్స్, Reuters
చైనా, తైవాన్‌ల మధ్య ఘర్షణ వాతావరణం మరింత పెరిగింది. తైవాన్ నూతన అధ్యక్షుడిగా విలియం లై బాధ్యతలు స్వీకరించిన కొద్దిరోజులకే, పూర్తి స్థాయి సైనిక దాడి చేస్తున్న రీతిలో ఆ దేశం చుట్టూ చైనా మిలిటరీ డ్రిల్స్ (సైనిక విన్యాసాలు) ప్రారంభించింది.
ఈ సైనిక విన్యాసాలను "వేర్పాటువాద చర్యలకు బలమైన శిక్ష"గా చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) ప్రతినిధి అభివర్ణించారు.
ఇదీ స్వయం పాలిత తైవాన్ గురించి చైనా వాదన.
ఈ ద్వీప దేశాన్ని తమ నుంచి విడిపోయిన ప్రావిన్స్‌గా చైనా చూస్తోంది. అది చివరికి దేశంలో తిరిగి భాగమవుతుందని భావిస్తోంది. అందుకోసం బలప్రదర్శనకు కూడా వెనకాడడం లేదు.
కానీ, చాలా మంది తైవానీయులు తమను తాము ప్రత్యేక దేశంలో ఉన్నట్లుగా భావిస్తారు. చైనా నుంచి స్వతంత్రం ప్రకటించడం, లేదా చైనాలో విలీనం వంటివి కాకుండా యథాతథ స్థితిని కొనసాగించడానికే చాలా మంది అనుకూలంగా ఉన్నారు.

చైనా - తైవాన్ చరిత్రేంటి?
తైవాన్‌లో మొట్టమొదట స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న వారు ఆస్ట్రేనిషియన్ గిరిజనులు. ఇప్పటి దక్షిణ చైనా ప్రాంతం నుంచి వారు ఇక్కడికి వచ్చినట్లు విశ్వసిస్తారు.
క్రీస్తుశకం 239లో తొలిసారి ఒక చక్రవర్తి ఈ ద్వీప అన్వేషణ కోసం దళాలను పంపినట్లు చైనీస్ రికార్డులు ప్రస్తావిస్తున్నాయి. ఆ భూభాగం తమదేనన్న వాదనను సమర్థించుకునేందుకు చైనా దీనిని ఉపయోగిస్తుంది.
తైవాన్ కొద్దికాలం డచ్ కాలనీగా కొనసాగిన అనంతరం, చైనాకి చెందిన క్వింగ్ రాజవంశం పాలనలోకి వెళ్లింది. ఆ తర్వాత ఇది మొదటి చైనా - జపాన్ యుద్ధంలో జపాన్ గెలిచిన తర్వాత టోక్యో పరమైంది.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ లొంగిపోయింది. అలాగే, చైనా నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగంపై నియంత్రణను వదులుకుంది. ఆ తర్వాత తైవాన్ అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్వోసీ) ఆక్రమణకు గురైనట్లు చెబుతారు. మిత్రదేశాలు అమెరికా, యూకే మద్దతుతో ఆర్వోసీ పాలన సాగించింది.
కానీ, కొన్నేళ్ల తర్వాత చైనాలో అంతర్యుద్ధం జరిగింది. దానికి నాయకత్వం వహించిన చియాంగ్ కై - షేక్ దళాలు మావో జెడాంగ్ సారథ్యంలోని కమ్యూనిస్ట్ సైన్యం చేతిలో ఓడిపోయాయి.
చియాంగ్, ఆయన కుమింటాంగ్ (కేఎంటీ) ప్రభుత్వంలో మిగిలిన వ్యక్తులు, వారి మద్దతుదారులు దాదాపు 15 లక్షల మంది 1949లో తైవాన్‌కు పారిపోయారు.
1980ల వరకూ చియాంగ్ నియంతృత్వ పాలన కొనసాగింది. ఆయన మరణానంతరం తైవాన్ ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేసింది. 1996లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి.

ఫొటో సోర్స్, CENTRAL PRESS
తైవాన్‌కు గుర్తింపు ఉందా?
తైవాన్ హోదాపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
తైవాన్‌కి సొంత రాజ్యాంగం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నేతలు, సుమారు 3,00,000 సాయుధ బలగాలు ఉన్నాయి.
ప్రవాసంలో ఉన్న చియాంగ్ నేతృత్వంలోని ఆర్వోసీ ప్రభుత్వం మొదట మొత్తం చైనాకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ప్రకటించింది. అది తిరిగి చైనాను ఆక్రమించుకోవాలని భావించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా అధికారిక స్థానంతో పాటు అనేక పాశ్చాత్య దేశాల గుర్గింపు కూడా పొందింది.
అయితే, 1970ల నాటికి కొన్ని దేశాల నుంచి తైపీ కేంద్రంగా కొనసాగుతున్న ప్రభుత్వాన్ని చైనా ప్రధాన భూభాగంలో నివసిస్తున్న ప్రజల నిజమైన ప్రతినిధిగా పరిగణించలేమన్న వాదనలు ప్రారంభమయ్యాయి.
1971లో ఐక్యరాజ్యసమితి బీజింగ్‌కు దౌత్యపరమైన గుర్తింపునిచ్చింది. 1978లో చైనా ఆర్థిక వ్యవస్థ ప్రారంభమైన తర్వాత వాణిజ్య అవకాశాలు, సంబంధాల అవసరాన్ని అమెరికా గుర్తించింది. 1979లో అమెరికా అధికారికంగా చైనాతో దౌత్య సంబంధాలను ఏర్పరచుకుంది.
అప్పటి నుంచి ఆర్వోసీ ప్రభుత్వాన్ని గుర్తించే దేశాల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం 12 దేశాలు మాత్రమే ఈ ద్వీపాన్ని గుర్తిస్తున్నాయి. తైవాన్‌ను గుర్తించకుండా ఇతర దేశాలపై దౌత్యపరంగా చైనా విపరీతమైన ఒత్తిడి తెస్తుంది.

ఫొటో సోర్స్, REUTERS
చైనా - తైవాన్ మధ్య సంబంధాలెలా ఉన్నాయి?
1980లలో చైనాలో పెట్టుబడులు, పర్యటనలపై తైవాన్ నిబంధనలు సడలించడంతో సంబంధాలు మెరుగుపడడం మొదలైంది. 1991లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో యుద్ధం ముగిసిందని ఆర్వోసీ ప్రకటించింది.
''ఒక దేశం, రెండు వ్యవస్థలు''గా పిలిచే విధానాన్ని చైనా ప్రతిపాదించింది. దీని ప్రకారం, బీజింగ్ నియంత్రణలోకి రావడానికి అంగీకరిస్తే, తైవాన్ స్వయం ప్రతిపత్తిని చైనా అనుమతిస్తుంది.
ఇది 1997లో హాంకాంగ్ చైనా నియంత్రణలోకి తిరిగి రావడం దగ్గరి నుంచి.. ఇటీవలి కాలం వరకూ చైనా తన ప్రాభవాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించడం వరకూ జరిగిన పాలనను సూచిస్తుంది.
తైవాన్ ఆ ప్రతిపాదనను తిరస్కరించడంతో, తైవాన్‌లోని ఆర్వోసీ ప్రభుత్వం చట్టవిరుద్ధమని చైనా చెప్పింది. అయితే, చైనా, తైవాన్ అనధికారిక ప్రతినిధులు ఇప్పటికీ పరిమిత స్థాయిలో చర్చలు జరిపారు.
అనంతరం, 2000 సంవత్సరంలో చెన్ షుయ్ బియాన్‌ను తైవాన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం బీజింగ్‌కు హెచ్చరికగా మారింది.
చెన్, ఆయన డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (డీపీపీ) తైవాన్ ''స్వాతంత్య్రానికి'' బాహాటంగానే మద్దతు ప్రకటించాయి.
2004లో చెన్ తిరిగి ఎన్నికైన ఏడాది తర్వాత, 'చైనా విభజన నిరోధక చట్టం'గా పిలుస్తున్న చట్టాన్ని చైనా తీసుకొచ్చింది. చైనా నుంచి విడిపోవడానికి ప్రయత్నిస్తే, ''శాంతియుత మార్గాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు'' అనే హక్కు చైనాకు ఉంటుందని ప్రకటించుకుంది.
చెన్ తర్వాత పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అనుకూల విధానాన్ని అనుసరించే కేఎంటీ విజయం సాధించింది.
2016లో డీపీపీ నుంచి త్సాయ్ ఇంగ్ - వెన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె హయాంలో చైనా - తైవాన్ సంబంధాలు దెబ్బతిన్నాయి. త్సాయ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తైవాన్‌తో అధికారిక సంబంధాలను చైనా నిలిపేసింది. ఒకే చైనీస్ దేశమనే భావనకు అంగీకారం తెలిపేందుకు ఆమె నిరాకరించడమే అందుకు కారణమని చైనా పేర్కొంది.
తైవాన్‌కు అధికారికంగా స్వాతంత్య్రం ప్రకటిస్తానని తానెప్పుడూ చెప్పలేదని, ఎందుకంటే, ఇప్పటికే తైవాన్ స్వతంత్రంగా ఉందని త్సాయ్ స్పష్టం చేశారు.
చైనా వాదనలు మరింత దూకుడుగా మారిన షీ జిన్‌పింగ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే, త్సాయ్ కూడా అధ్యక్షురాలిగా ఉన్నారు. ''తైవాన్ చైనాతో కచ్చితంగా కలిసిపోతుంది'' అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. 2049లోపు ఈ ''చైనీస్ కల''ను నెరవేర్చుతామని పేర్కొన్నారు.
చైనా వేర్పాటువాది అని ముద్రవేసిన విలియం లై 2024 జనవరిలో తైవాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు త్సాయ్ హయాంలో ఆయన ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.
విలియం లై బాధ్యతలు చేపట్టిన మొదటి వారంలోనే గురువారం సైనిక విన్యాసాలు జరిగాయి. దీనిని ''వేర్పాటువాద చర్యలకు కఠిన శిక్ష''గా బీజింగ్ పేర్కొంది. అలాగే, డీపీపీ నుంచి అధ్యక్షులుగా ఎన్నికైన వారిలో ''అత్యంత చెత్త వ్యక్తి'' లై అని అభివర్ణించింది.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాకు ఏం సంబంధం..
అమెరికా చైనాతో అధికారిక సంబంధాలను కొనసాగిస్తోంది. అలాగే, ''వన్ చైనా పాలసీ'' కింద చైనా ప్రభుత్వాన్ని గుర్తించింది. కానీ, అంతర్జాతీయంగా తైవాన్‌కు అత్యంత కీలక మద్దతుదారు కూడా.
తైవాన్ రక్షణకు ఆయుధాలు అందించేందుకు వాషింగ్టన్ చట్టబద్దంగా కట్టుబడి ఉంది. ''తైవాన్‌కు సైనికపరంగా అమెరికా మద్దతు ఉంటుంది. వ్యూహాత్మక సందిగ్ధ వైఖరిని విచ్ఛిన్నం చేస్తుంది'' అని జో బైడెన్ చెప్పారు.
ఈ ద్వీపం అమెరికా - చైనా సంబంధాల నడుమ అత్యంత వివాదాస్పదంగా ఉంది. తైపీకి వాషింగ్టన్ మద్దతును చైనా ఖండిస్తూ వచ్చింది. 2022లో యూఎస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ సందర్శన అనంతరం, చైనా బలప్రదర్శనకు దిగింది. తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలు నిర్వహించింది.
జిన్‌పింగ్ హయాంలో చైనా ఈ ''గ్రే జోన్ వార్‌ఫేర్''ను వేగవంతం చేసింది. తైవాన్ సమీపంలోకి భారీగా యుద్ధ విమానాలను పంపడం, తైవాన్ - అమెరికా రాజకీయ సంబంధాలకు ప్రతిస్పందనగా సైనిక విన్యాసాలు, 2022లో తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ఏడీఐజెడ్)లోకి చైనా యుద్ధ విమానాల చొరబాట్లు దాదాపు రెట్టింపయ్యాయి.
తైవాన్ ఎన్నికల ఫలితాలు అమెరికా - చైనా సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఎన్నికల్లో ఎవరు గెలిచినా, అది అమెరికా, చైనా, తైవాన్ సంబంధాలపై ప్రభావం చూపుతుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














