యుక్రెయిన్ యుద్ధంతో ఆంక్షల్లో చిక్కుకున్న రష్యాను చైనా ఎలా కాపాడుతోంది?

రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కెల్లీ ఎన్జీ, యి మా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

బీజింగ్‌లో జరిగిన సమావేశంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు ఇరు దేశాల సంబంధాలపై పరస్పరం ప్రశంసించుకున్నారు. 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టిన తర్వాత ఈ ఇద్దరు నేతల మధ్య జరిగిన నాలుగో సమావేశమిది.

ఈ సమయంలో రష్యాకు చైనా ముఖ్యమైన మిత్రదేశంగా మారింది. ఎందుకంటే రష్యాపై అమెరికాతో పాటు పలు దేశాలు విధించిన ఆంక్షల ప్రభావాన్ని తగ్గించాలని చైనా అనుకుంటోంది.

రష్యాకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలను చైనా చాలాసార్లు ఖండించింది.

బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. యుక్రెయిన్‌పై దాడులు చేసేందుకు రష్యాకు చైనా నిజమైన ఆయుధాలను పంపలేదు కానీ, చాలా కీలకమైన పరికరాలను అందించిందని ఆయన ఆరోపించారు.

ఈ పరికరాల సాయంతో ఆయుధాలు, ట్యాంకులు, సాయుధ వాహనాలు, క్షిపణులు తయారు చేయెచ్చన్నారు.

రష్యా, చైనాలు

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా ఆంక్షలు విధించినా ఆగని ఎగుమతులు

రష్యా దిగుమతి చేసుకునే మెషిన్ టూల్స్‌లో 70 శాతం, మైక్రో ఎలక్ట్రానిక్స్‌లో 90 శాతం చైనా నుంచే వస్తున్నాయి.

చైనా, హాంకాంగ్‌లోని 20 కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ కంపెనీలలో ఒకటి రష్యాకు డ్రోన్‌ల తయారీ పరికరాలను ఎగుమతి చేస్తోందని అమెరికా ఆరోపించింది.

మిగతా కంపెనీలు సాంకేతిక పరికరాలను పంపుతున్నాయని, అవి అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షలను పట్టించుకోకుండా రష్యాకు సహాయపడుతున్నాయని అమెరికా అంటోంది.

అయితే, రష్యాకు ప్రాణాంతక ఆయుధాలను విక్రయించడం లేదని, అంతర్జాతీయ నియమ నిబంధనల ప్రకారమే ఎగుమతి చేస్తున్నామని చైనా వాదిస్తోంది.

థింక్ ట్యాంక్ కార్నెగీ ఎండోమెంట్ విశ్లేషించిన చైనా కస్టమ్స్ డేటా ప్రకారం, చైనా ప్రతి నెలా దాదాపు రూ. 2,500 కోట్ల విలువైన పునర్వినియోగ పరికరాలను రష్యాకు పంపుతోంది.

అంటే వాటిని కమర్షియల్ లేదా మిలిటరీ అవసరాలకు ఉపయోగించవచ్చు. ఈ జాబితాలో అమెరికా పేర్కొన్న అధిక ప్రాధాన్యత గల పరికరాలు, డ్రోన్‌ల నుంచి ట్యాంకుల వరకు ఆయుధాలను తయారు చేయడానికి అవసరమైన పరికరాలూ ఉన్నాయని తెలిపింది.

అదే సమయంలో, బ్రిటన్‌కు చెందిన థింక్ ట్యాంక్ ఆర్‌యూఎస్ఐ కూడా యుక్రెయిన్ సరిహద్దులపై సమాచారం సేకరించేందుకు చైనా గూఢచార ఉపగ్రహాలను వాడే అవకాశాలున్నాయని తెలిపింది.

వాణిజ్యం ఎంత శాతం పెరిగింది?

పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన తర్వాత, రష్యాకు చైనా అనేక ఇతర ఉత్పత్తులతో పాటు కార్లు, బట్టలు, ముడి పదార్థాలను ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశంగా మారింది.

2023 సంవత్సరంలో చైనా, రష్యా మధ్య వాణిజ్యం దాదాపు రూ.20 లక్షల కోట్లకు చేరుకుంది. 2021 కంటే ఇది 64 శాతం ఎక్కువ.

చైనా అధికారిక సమాచారం ప్రకారం, యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ఇరు దేశాల మధ్య వాణిజ్యంలో ఈ మార్పు కనిపించింది.

2023లో రష్యా రూ. 9.2 లక్షల కోట్ల విలువైన వస్తువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంది, రూ. 10.7 లక్షల కోట్ల విలువైన వస్తువులను చైనాకు ఎగుమతి చేసింది.

తాజాగా బీజింగ్‌లో జరిగిన సమావేశంలో పుతిన్, జిన్‌పింగ్ ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్యం పట్ల హర్షం వ్యక్తంచేశారు.

ఇరు దేశాల మధ్య 90 శాతం వాణిజ్యం అమెరికా డాలర్లకు బదులుగా సొంత కరెన్సీలోనే జరుగుతోందని ఇరువురు నేతలు తెలిపారు.

రష్యా, చైనా వాణిజ్యం

ఫొటో సోర్స్, REUTERS

అంతేకాదు, చైనా కార్ల తయారీదారులను రష్యాకు స్వాగతిస్తున్నట్లు అధ్యక్షుడు పుతిన్ చెప్పారు.

చైనా ఎలక్ట్రిక్ కార్లపై పన్నును 100 శాతం అంటే నాలుగు రెట్లు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకున్న తర్వాత పుతిన్ ఈ ప్రకటన చేశారు.

2023లో రష్యాకు చైనా చేసిన ఎగుమతులలో దాదాపు రూ. 1.9 లక్షల కోట్ల విలువైన కార్లు, సంబంధిత విడి భాగాలున్నాయి. ఒక సంవత్సరం ముందు, ఈ ఎగుమతుల విలువ దాదాపు రూ. 50 వేల కోట్లు మాత్రమే.

"రష్యన్ సహజ వాయువు పెద్ద మొత్తంలో చైనాలోని ఇళ్లకు చేరుకుంటోంది, చైనా నిర్మిత వాహనాలు రష్యా రోడ్లపై నడుస్తున్నాయి" అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ 2024 మార్చిలో అన్నారు.

అయితే, ఇవి ఏకపక్ష సంబంధాలని, ఇందులో రష్యా ఎక్కువగా చైనాపై ఆధారపడుతోందని చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు.

2023లో రష్యా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా చైనా ఉంది, అదే సమయంలో చైనాకు వాణిజ్యం పరంగా రష్యా ఆరో స్థానంలో ఉంది.

మోదీ, పుతిన్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, భారత ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్

ఒకవైపు భారత్, మరోవైపు చైనా

రష్యా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో దాదాపు సగం చమురు, గ్యాస్ అమ్మకాల ద్వారానే వస్తోంది.

యుక్రెయిన్‌పై దాడి తర్వాత ఆంక్షల కారణంగా బ్రిటన్, అమెరికా, ఈయూ దేశాలకు రష్యా చమురు, గ్యాస్ అమ్మకాలు తగ్గిపోయాయి.

ఆసియా దేశాలకు, ముఖ్యంగా భారత్, చైనాలకు అమ్మకాలను పెంచడం ద్వారా రష్యా ఆ లోటును తీర్చుకుంటోంది.

దీంతో 2023లో చైనాకు చమురు విక్రయిస్తున్న అతిపెద్ద దేశంగా రష్యా నిలిచింది. అంతకుముందు సౌదీ అరేబియా ఆ స్థానంలో ఉండేది.

ఈ ఏడాది రష్యా నుంచి చైనా 107 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుంది. ఇది ఏడాది క్రితం కంటే 24 శాతం ఎక్కువ.

జీ-7 కూటమి, యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియాలు ధరల పరిమితిని విధిస్తూ సముద్రపు చమురు వ్యాపారంతో వచ్చే ఆదాయాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాయి.

అయితే, ఈ పరిమితి కంటే ఎక్కువ ధరకు రష్యా నుంచి చైనా ముడిచమురు కొనుగోలు చేస్తోంది.

భారత్ కూడా రష్యాతో దశాబ్దాలుగా తన సంబంధాలను కొనసాగిస్తోంది.

యుక్రెయిన్‌పై దాడి తర్వాత రష్యా చమురు ప్రధాన కొనుగోలుదారుగా భారత్ ఉంది. అంతేకాదు ఇండియాకు తగ్గింపు ధరకే లభిస్తోంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా డేటా ప్రకారం, 2023 జూన్‌లో భారత్ మొత్తం చమురు దిగుమతుల్లో 44 శాతం రష్యా నుంచే వచ్చింది.

మరోవైపు, 2023లో రష్యా నుంచి చైనా 80 మిలియన్ టన్నుల ఎల్‌పీజీని దిగుమతి చేసుకుంది. ఇది 2021తో పోలిస్తే 77 శాతం ఎక్కువ.

సైబీరియా పవర్ 2 అని పిలిచే కొత్త పైప్‌లైన్‌తో సరఫరా పెంచాలని కూడా రెండు దేశాలు ప్లాన్ చేస్తున్నాయి.

ఈ పైప్‌లైన్ రష్యాలోని పశ్చిమ సైబీరియా ప్రాంతాన్ని ఈశాన్య చైనాకు అనుసంధానం చేస్తుంది, అక్కడ సహజ వాయువును సరఫరా చేయనుంది.

చైనా 2019 నుంచి సైబీరియా పవర్ పైప్‌లైన్ ద్వారా రష్యా నుంచి గ్యాస్ కొనుగోలు చేస్తోంది.

వీడియో క్యాప్షన్, యుద్ధం మధ్య బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారులపై బీబీసీ అందిస్తున్న కథనం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)