ప్రధాని మోదీ చెప్పిన పూరీ జగన్నాథ్ ‘రత్నభండార్’ తాళంచెవి వివాదం ఏంటి?

పూరీ జగన్నాథ్ ఆలయం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మురళీధరన్ కాశీవిశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

పూరీ జగన్నాథ్ దేవాలయం నుంచి కనిపించకుండా పోయిన 'రత్న భండార్' తాళం తమిళనాడుకు చేరిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

ఒడిశా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాన మంత్రి నిధి ఉన్న గది తాళం చెవిని తమిళనాడుకి పంపించారని అన్నారు.

అసలు, పూరీ జగన్నాథ్ ఆలయ రత్న భండార్ అంటే ఏంటి, దాని తాళం ఎలా పోయింది?

''జగన్నాథ్ ఆలయ నిధి చుట్టూ జరుగుతున్న ఘటనలపై ఒడిశా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. నిధి ఉన్న గది తాళం చెవి తమిళనాడుకు పోయిందని అంటున్నారు. దానిని తమిళనాడు ఎవరు పంపించారు? ఎవరు తీసుకెళ్లారు? అలాంటి వారిని మీరు క్షమిస్తారా?'' అని ఆయన అన్నారు.

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు సన్నిహితుడైన మాజీ ఐఏఎస్ అధికారి వి.కార్తీక్ పాండియన్‌ ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌లో శక్తివంతమైన వ్యక్తిగా ఎదిగారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలు కార్తీక్ పాండియన్‌ను ఉద్దేశించి చేసినవేనని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.

ప్రధాని ప్రసంగం తర్వాత ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ప్రధాని వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఖండించారు.

సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆయన ఇలా రాశారు. '' ఇది కోట్లాది మంది పూజించే ఆ పూరీ జగన్నాథుడికి, ఒడిశాతో సత్సంబంధాలు, సాన్నిహిత్యం కలిగివున్న తమిళనాడు ప్రజలకు జరిగిన అవమానం. ఇది తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుంది'' అన్నారు.

‘‘ఇది జగన్నాథుడిపై అమితమైన భక్తిశ్రద్ధలున్న తమిళ ప్రజలపైకి ఒడిశా ప్రజలను రెచ్చగొట్టడం కాదా? ఆలయ నిధిని దోచుకున్న దొంగలని తమిళ ప్రజలను ప్రధాని మోదీ నిందిస్తున్నారా? తమిళ ప్రజలు నిజాయితీపరులు కాదనడం వారిని అవమానించడం కాదా?.’’ అని ఆయన ప్రశ్నించారు.

పూరీ జగన్నాథ్ ఆలయం

ఫొటో సోర్స్, Getty Images

ఏమిటీ వివాదం?

ఒడిశాలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసన సభకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు జరగ్గా, మరో రెండు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో ప్రధాని చేసిన ప్రసంగం వివాదాస్పదంగా మారింది.

ప్రధాన మంత్రి వివాదాస్పద ప్రసంగం వెనక నేపథ్యం ఉందని ఒడిశా రాష్ట్ర రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఒడిశాలోని పూరీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సంబిత్ పాత్రా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ''మోదీని చూసేందుకు లక్షల మంది వస్తుంటారు. ఆ జగన్నాథుడే మోదీకి భక్తుడు. మనమంతా మోదీ కుటుంబ సభ్యులం'' అన్నారు. జగన్నాథుడు మోదీ భక్తుడంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

ఆ తర్వాత తన ఎక్స్‌ ఖాతా ద్వారా సంబిత్ పాత్రా వివరణ ఇస్తూ, ''మోదీ జగన్నాథుడి భక్తులు అనబోయి, జగన్నాథుడు మోదీ భక్తుడని అన్నా. అందుకు మూడు రోజుల పాటు ఉపవాసం ఉంటున్నా'' అని రాశారు.

అయితే, అప్పటికే ఈ వ్యాఖ్యలపై ఒడిశాలో దుమారం రేగింది. సంబిత్ వ్యాఖ్యలకు స్పందిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ''ఈ అనంత విశ్వానికి దేవుడు జగన్నాథుడు. ఆ మహాప్రభువుని ఒక మనిషికి భక్తుడిగా పేర్కొనడం దేవుడిని అవమానించినట్లే. ఇది ఒడియా ప్రజలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జగన్నాథుడి భక్తులను అవమానించడమే. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా'' అని తన ఎక్స్ ఖతాలో రాశారు.

సంబిత్ పాత్రా వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతుండగానే పూరీ జగన్నాథుడి ఆలయంలో సంపద ఉన్న గది తాళం చెవి గురించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఆయన ప్రసంగం తర్వాత, పూరీ జగన్నాథ్ ఆలయంలోని నిధి తాళం కనిపించకుండా పోయిన విషయం మళ్లీ తెరపైకి వచ్చింది.

పూరీ జగన్నాథ్ ఆలయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పూరీ జగన్నాథుడి రథయాత్ర (ఫైల్ ఫోటో)

రత్న భండార్‌లో రెండు గదులు

ఒడిశాలోని తీరప్రాంత జిల్లా అయిన పూరీలో జగన్నాథ ఆలయం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. 11వ శతాబ్దంలో పూర్తయిన ఈ ఆలయంలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి.

సుమారు వెయ్యేళ్లుగా ఎంతోమంది రాజులు ఇక్కడి దేవుడి విగ్రహాలకు బంగారు ఆభరణాలు, విలువైన రాళ్లను కానుకలుగా సమర్పించారు. భక్తులు కూడా ఎన్నో ఆభరణాలను అందజేశారు. ఈ సంపద అంతా ఆలయంలోని 'రత్న భండార్' అనే గదిలో భద్రపరిచారు.

ఈ నిధి ఉంచిన రత్న భండార్‌లో రెండు గదులు ఉన్నాయి. ఒకటి బిత్తర్ భండార్ (లోపలి గది), మరోటి బాహర్ భండార్ (బయటి గది). వాటిలో బాహర్ భండార్‌ను అవసరమైనప్పుడు తెరుస్తుంటారు.

ప్రతి సంవత్సరం జరిగే రథయాత్ర సందర్భంగా ''సునా బేష'' అనే బంగారు కవచంతో దేవతలను అలంకరిస్తారు. ఉత్సవాల సందర్భంగా దేవతామూర్తుల అలంకరణకు ఉపయోగించే ఆభరణాలను తిరిగి ఇక్కడ భద్రపరుస్తారు. అయితే, లోపలి గదిని గత 38 ఏళ్లుగా తెరవలేదు.

పూరి జగన్నాథ్ ఆలయం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1884 నాటి పూరీ జగన్నాథుడి ఆలయ పెయింటింగ్

చివరిసారి ఎప్పుడు తెరిచారు?

అధికారిక రికార్డుల ప్రకారం, నిధి ఉన్న గదిని 1978 మే 13 నుంచి జూలై 23 మధ్య ఒకసారి తెరిచారు. ఆ తర్వాత 1985లో భారత పురావస్తు శాఖ ఆ గదిని మరోసారి తెరిచింది.

2018లో ఒడిశా అసెంబ్లీలో రత్న భండార్ లోపలి గదిలో ఎన్ని ఆభరణాలున్నాయనే ప్రశ్న తలెత్తింది. దీనికి అప్పటి న్యాయ శాఖ మంత్రి ప్రతాప్ జెనా సమాధానమిస్తూ, 1978లో నిర్వహించిన సర్వేలో 12,381 బారీల/తులాల బంగారు ఆభరణాలు, 22,153 బారీల/తులాల వెండి పాత్రలు ఉన్నట్లు చెప్పారు. ఒక బారీ లేదా తులం అంటే 11.66 గ్రాములు. అందువల్ల 149.609 కేజీల బంగారు ఆభరణాలు, 258 కిలోల వెండి పాత్రలు ఉన్నట్లు భావించవచ్చు.

ఆ తర్వాత సుప్రీం కోర్టులో దాఖలైన కేసు సందర్భంగా, 2018 ఏప్రిల్ 4న రత్న భండార్ లోపలి గదిని తెరిచేందుకు ప్రయత్నించారు. కానీ, దాని తాళం లేకపోవడంతో గది తెరవలేదు. లోపలి గది తాళంచెవి పూరీ జిల్లా కలెక్టర్ వద్ద ఉండాలి. అయితే, ఆ తాళం చెవి ఏమైందో తెలియదు.

దీనిపై పెద్ద దుమారం రేగడంతో జూన్ 4న రాష్ట్ర ప్రభుత్వం న్యాయ శాఖను విచారణకు ఆదేశించింది. ఆ తర్వాత 'రత్న భండార్ లోపలి గది మరోతాళం' జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఆర్కైవ్స్‌లో కనిపించినట్లు ఒక లేఖ వచ్చిందని గవర్నర్ తెలిపారు.

ఆ తర్వాత కూడా న్యాయ శాఖ విచారణ కొనసాగింది. అదే ఏడాది నవంబర్‌లో 300 పేజీల నివేదికను న్యాయ శాఖ విచారణ కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. ఆ నివేదిక ఇప్పటి వరకూ బయటికి రాలేదు.

ఆ తర్వాత కూడా ఈ వివాదం కొనసాగుతూనే ఉన్నప్పటికీ, 2024 రథయాత్ర కోసం రత్న భండార్‌ను తెరవాలని జగన్నాథ ఆలయ నిర్వహణ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనికి సంబంధించి దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఒడిశా హైకోర్టు రత్న భండార్‌లోని వస్తువుల జాబితా నిర్ధరణకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి అరిజిత్ పసాయత్ నేతృత్వంలో 12 మంది సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది.

ఇలాంటి పరిస్థితిలో, ఎన్నికల వేళ ఒడిశా ఎన్నికల ప్రచార సభల్లో కనిపించకుండాపోయిన రత్న భండార్ తాళం చెవి గురించి ప్రధాన మంత్రి మోదీ ప్రశ్నించారు.

ఒడిశా‌లో పూరీ జగన్నాథుడంటే ఎనలేని భక్తి. అందువల్ల ఈ రత్న భండార్ వ్యవహారం వివాదం అవుతోంది.

ఒడిశా

ఫొటో సోర్స్, @NAVEEN_ODISHA

ఫొటో క్యాప్షన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కార్తీక్ పాండియన్

కార్తీక్ పాండియన్ సమాధానం

రత్న భండార్ తాళం తమిళనాడు పంపించారని ఒడిశాకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి, బిజూ జనతా దళ్ నేత, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు సన్నిహితులైన వి.కార్తీక్ పాండియన్‌ను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు.

పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పాండియన్ ప్రధాని ఆరోపణలపై స్పందిస్తూ, ''ప్రధాన మంత్రికి ఆ విషయం తెలిస్తే తాళం ఎక్కడుందో కనుక్కోవాలి. ఆయన కింద చాలా మంది అధికారులు పనిచేస్తున్నారు. అది ఆయన తెలుసుకోవాలి. దాని గురించి ఒడియా ప్రజలకు కూడా తెలియజేయాలి'' అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)