పుణె: ఇద్దరి మృతికి కారణమైన మైనర్‌కు గంటల వ్యవధిలో బెయిల్, అసలేం జరిగింది?

- రచయిత, ప్రాచీ కులకర్ణి
- హోదా, బీబీసీ ప్రతినిధి
పుణెలో ఒక బాలుడు కారు నడుపుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. శనివారం (మే 18) రాత్రి పుణెలోని కళ్యాణి నగర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న అనీష్ అవధియా, అశ్విని కోస్టా అనే ఇద్దరు చనిపోయారు.
పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, షరతులతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ షరతులపై విమర్శలు వస్తున్నాయి.
ఈ ఘటనలో బాలుడి తండ్రితోపాటు అతడు మద్యం సేవించిన పబ్ మేనేజర్, ఉద్యోగులపైనా కేసు నమోదు చేశారు.
వయసును నిర్ధరించుకోకుండా మద్యం ఇచ్చినందుకు పబ్ సిబ్బందిపై, మైనర్‌ను కారు నడపడానికి అనుమతించినందుకు తండ్రిపై కేసు పెట్టారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఏముంది?
పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లోని వివరాల ప్రకారం.. ఈ బాలుడు కల్యాణినగర్ సమీపంలోని రెండు పబ్‌లకు వెళ్లి మద్యం సేవించాడు.
ఆ తర్వాత లైసెన్స్ లేకుండా నిర్లక్ష్యంగా వాహనం నడుపుతూ, పల్సర్‌పై వెళ్తున్న ఇద్దరిని ఢీకొట్టాడు.
బాలుడు తన గ్రే కలర్ కారుతో బైక్‌ను ఢీకొట్టాడు. ప్రమాద సమయంలో బాలుడితో పాటు అతని స్నేహితులు కొందరు కారులో ఉన్నారు.
శనివారం (మే 18) అర్ధరాత్రి 10 నుంచి 12 గంటల వరకు వీరంతా పుణెలోని ముండ్వా ప్రాంతంలో ఓ హోటల్‌లో జరుగుతున్న పార్టీకి వెళ్లి, అక్కడ మద్యం సేవించారు.
ఆ తర్వాత, వీళ్లంతా రాత్రి 12 నుంచి 1 గంట మధ్య ముండ్వా ప్రాంతంలో మరొక హోటల్‌కు వెళ్లారు. అక్కడ మళ్లీ మద్యం సేవించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఆ తర్వాత తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో తమ ఖరీదైన గ్రే రంగు కారులో వెళ్తూ, ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు.
ఈ కారుకు ముందు, వెనుక నంబర్ ప్లేట్ లేదని, కారు నడుపుతున్న మైనర్ నిందితుడి వయసు 17 ఏళ్ల 8 నెలలు అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
5 షరతులతో బెయిల్ మంజూరు
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇద్దరి మృతికి కారణమైన మైనర్‌కు కొన్ని గంటల వ్యవధిలోనే జువెనైల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసింది.
అయితే, బెయిల్ మంజూరు చేసే సమయంలో కోర్టు విధించిన షరతులపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కోర్టు విధించిన షరతులు:
1) నిందితుడు 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో కలిసి ఏదైనా జంక్షన్‌లో నిలబడి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలి. ట్రాఫిక్ నిబంధనలను అర్థం చేసుకున్న తర్వాత ఒక నివేదికను తయారు చేసి ఆర్టీఓకు సమర్పించాలి.
2) రోడ్డు ప్రమాదాలు, వాటి పరిష్కారాలపై 300 పదాల వ్యాసం రాయాలి.
3) మద్యపానాన్ని విడిచిపెట్టడానికి మానసిక నిపుణుల ద్వారా చికిత్స తీసుకోవాలి.
4) మద్యపానం నుంచి బయటపడటానికి ముక్తాంగన్ మద్యపాన విముక్తి కేంద్రం సహాయం తీసుకోవాలి.
5) భవిష్యత్తులో ప్రమాదాలు జరిగినప్పుడు ఈ మైనర్ అక్కడ ఉంటే, ప్రమాద బాధితులకు సహాయం చేయాలి.

నిందితుడు మైనరా, కాదా?
నిందితుడు మైనర్ కావడంతో బెయిల్ వచ్చిందని పుణె పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ చెప్పారు. అయితే, దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని అన్నారు.
‘‘ఆ బాలుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు స్పష్టంగా వెల్లడైంది. ఈ కేసులో ఎవరినీ విడిచిపెట్టేది లేదు. అతను నిజంగా మైనరా కాదా అనేది కూడా విచారణ జరుపుతాం. అతను స్కూల్‌కి వెళుతున్నట్లు చెప్పిన విషయం నిజమో కాదో విచారిస్తాం. నంబర్ ప్లేట్ లేని కారు ఇచ్చిన డీలర్‌పైనా చర్యలు తీసుకుంటాం" అని అమితేష్ కుమార్ చెప్పారు.
ఈ కేసులో మైనర్ బాలుడి తండ్రి మీద, పబ్ యజమానిపైనా అభియోగాలు మోపామని, దీంతో పాటు కళ్యాణి నగర్, కోరేగావ్ పార్క్ ప్రాంతంలోని పబ్‌లు, బార్‌లపై చర్యలు తీసుకునేందుకు ఎక్సైజ్ శాఖతో కలిసి పనిచేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ కేసు విచారణలో భాగంగా, పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తారు. దీని వల్ల ఎవరైనా రాజకీయ ఒత్తిళ్లు తెచ్చారా అన్న విషయం కూడా తెలిసిపోతుంది.
కఠిన చర్యలకు ఆదేశం - ఫడ్నవీస్
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఇద్దరి మృతికి కారణమైన ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులను ఆదేశించారు.
పుణె పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి విషయం అడిగి తెలుసుకున్న ఆయన, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిందితుడికి బెయిల్ వచ్చినప్పటికీ, దానిపై అప్పీల్ దాఖలు చేయాలని సూచించినట్లు ఫడ్నవీస్ తెలిపారు.
పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజిని పరిశీలించాక, నిందితులను రక్షించే ప్రయత్నం ఏదైనా జరిగినట్లు తమ దృష్టికి వస్తే, సంబంధిత వ్యక్తులపై తక్షణం చర్యలు తీసుకుంటామని ఫడ్నవీస్ చెప్పారు.

ఫొటో సోర్స్, X/RAVINDRA DHANGEKAR
వేగంగా రాజకీయ పరిణామాలు
ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ సోమవారం (మే 20) పుణె పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది.
ఇలాంటి ఘటనలకు ‘నైట్ లైఫ్ కల్చర్’ కారణమని ఈ లేఖలో బీజేపీ ఆరోపించింది. ఇలాంటి సంస్కృతిని పెంచి పోషిస్తున్న పబ్‌లపై చర్యలు తీసుకోవాలని, పబ్‌లలో డీజేల పాటలు, నగరంలోని కూడళ్లలో అల్లరి చేయడం ఆపాలని బీజేపీ డిమాండ్ చేసింది.
మరోవైపు, కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర ధంగేకర్ ఈ హిట్ అండ్ రన్ కేసుపై నిరసన వ్యక్తం చేశారు. పబ్‌లు, బార్‌లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన యెరవాడ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
చట్టం ఏం చెబుతోంది?
ఈ మొత్తం సంఘటనపై చట్టం ఏం చెబుతోంది? అనే దానిపై సీనియర్ న్యాయవాది అసిమ్ సరోదేతో బీబీసీ మాట్లాడింది.
ఆయన చెప్పిన వివరాల ప్రకారం, మైనర్‌కు వాహనం ఇచ్చిన తండ్రితో పాటు మైనర్‌కు మద్యం అందించిన పబ్ యజమానిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
పుణె పోలీసులు మోటర్ వెహికల్ యాక్ట్, సెక్షన్199ఏ కింద కేసు నమోదు చేశారు.
బాలుడు నడుపుతున్న కారుకు నంబర్ ప్లేట్ లేదు. అందువల్ల, మోటార్ వెహికల్ చట్టంలోని నూతన నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు.
ఈ నిబంధన ప్రకారం మైనర్ వల్ల ప్రమాదం జరిగితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడంతోపాటు, వారికి శిక్ష విధించవచ్చు.
ఈ చట్టం కింద నేరం మైనర్ చేసినట్లయితే, ఆ నేరంలో ఉపయోగించిన వాహనం రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేస్తారు.
నేరం చేసినట్లు రుజువైతే, అతనికి 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లెర్నర్ లైసెన్స్‌కు అర్హత ఉండదు.
నేరం చేసినట్లు రుజువైతే బాల నేరస్థునికి చట్టప్రకారం శిక్షతో పాటు జరిమానా విధిస్తారు.
అదే విధంగా జువెనైల్ జస్టిస్ యాక్ట్, 2000లోని నిబంధనల ప్రకారం అతనికి శిక్ష విధించవచ్చు. భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఈ శిక్షను ఇటీవల మరింత పెంచారు'' అని అసిమ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అకస్మాత్తుగా మద్యం తాగడం మానేస్తే ఏమవుతుంది?
- రాజీవ్ గాంధీ మరణానికి కొన్ని గంటల ముందు విశాఖలో ఏం జరిగింది?
- మొహమ్మద్ మోఖ్బర్: ‘సముద్రంలో దిగినా తడవకుండా ఉండే’ నేత ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడు అయ్యారు, ఆయన ఎవరంటే..
- హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మృతి, అసలేం జరిగిందంటే..
- వైఎస్ రాజశేఖరరెడ్డి: హెలికాప్టర్ అదృశ్యమైన తర్వాత 25 గంటల్లో ఏం జరిగింది... ఆచూకీ ఎలా తెలిసింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














