ఆవుపేడ: భారతదేశ ఇంధనపు ఖర్చును తగ్గించే సత్తా ఉందా?

ఫొటో సోర్స్, Rukmini Kumbhar
- రచయిత, ప్రీతి గుప్తా
- హోదా, టెక్నాలజీ రిపోర్టర్
- నుంచి, ముంబయి
రుక్మిణి బాబూరావు కుంభార్ ప్రతిరోజు, ఒట్టి చేతులతో దాదాపు 50 కిలోల తాజా ఆవు పేడను సేకరిస్తారు.
ఆమె మహారాష్ట్రలోని ఒక గ్రామంలో చిన్న ఆశ్రమాన్ని నడుపుతున్న ఆధ్యాత్మిక సంస్థలో భాగస్వామి.
ఆవు పేడను సేకరించేది ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచడానికి కాదు, దాని నుంచి బయోమీథేన్ తయారు చేయడానికి.
"ఇంధనం ధర చాలా పెరిగిపోయింది. దానికి బయోగ్యాస్ ఒక మంచి ప్రత్యామ్నాయం. దీనికి కొంచెం స్థలం, ఆవులు ఉంటే సరిపోతుంది. మాకు ఆ రెండూ ఉన్నాయి" అని కుంభార్ అన్నారు.
సేకరించిన ఆవు పేడను నీటిలో కలిపి బయో రియాక్టర్‌లో వేస్తారు. అక్కడ అది ఆశ్రమంలోని కిచెన్‌కు అవసరమైన మీథేన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
మార్చిలో నెలకొల్పిన ఈ బయోమీథేన్ రియాక్టర్, కుంభార్ ప్రతి నెలా కొనుగోలు చేసే 20 లీటర్ల వంట గ్యాస్ స్థానాన్ని భర్తీ చేసింది.
అయితే, ఈ ప్రక్రియలో ఆవు పేడను సేకరించడం అనే పెద్ద పని ఉంటుంది. కానీ, ఆమె దీనికి పెద్దగా ఇబ్బంది పడరు.
"భారతదేశంలోని చాలా గ్రామీణ ప్రాంతాల్లో, వ్యవసాయం ప్రధాన వృత్తి. కాబట్టి, ఆవు పేడను ముట్టుకోవడం పెద్ద విషయం కాదు" అని ఆమె అన్నారు.
ఆశ్రమానికి వచ్చే అతిథులలో కొందరు మాత్రం దీనిపై ఎక్కువ ఉత్సాహం చూపరు.
‘‘నగరం నుంచి మాతో కలిసి ఉండేందుకు వచ్చే కొందరు మహిళలు ఆ వాసన చూసి దూరంగా పోతారు. వాళ్లకు ఆవుపేడను ముట్టుకోవాలంటే కంపరం. మేం వాళ్లను బలవంతం చేయం. వాళ్లే దానికి అలవాటుపడి మాకు సాయం చేయడం మొదలుపెడతారు. ఇక్కడి ఆవులు మంచి నాణ్యమైనవి కాబట్టి ఆవు పేడ వాసన అంతగా రాదు" అని కుంభార్ వివరించారు.
భారత ప్రభుత్వ విధాన సంస్థ నీతి ఆయోగ్ గణాంకాల ప్రకారం, భారతీయ పశువులు రోజుకు మూడు మిలియన్ టన్నుల ఆవు పేడను ఉత్పత్తి చేస్తున్నాయి.
ఆ పేడను, ఇతర వ్యవసాయ వ్యర్థాలను మీథేన్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఫొటో సోర్స్, Haibowal Dairy Complex
బయోగ్యాస్ ప్లాంట్‌లో అనరోబిక్ డైజెశ్చన్ అనే ఒక ప్రక్రియ ద్వారా పని చేస్తాయి. దీనిలో వ్యర్థాలను గాలి చొరబడని ట్యాంకుల్లోకి పంపితే, సహజమైన బ్యాక్టీరియా సేంద్రీయ పదార్థాలను విచ్ఛిన్నం చేస్తుంది.
ఈ ప్రక్రియ వాయువుల మిశ్రమాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ వాయువులు ప్రధానంగా మీథేన్ (సుమారు 60%), కార్బన్ డయాక్సైడ్.
ప్రస్తుతానికి, భారతదేశం తన సహజ వాయువు అవసరాలలో దాదాపు సగభాగాన్ని దిగుమతి చేసుకుంటోంది.
విదేశాలకు వెళ్లే ఆ డబ్బును ప్రభుత్వం స్వదేశంలో ఖర్చు చేయాలని భావిస్తోంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న సందర్భంలో, భారతదేశం ఇంధన అవసరాలు పెరుగుతాయే కానీ తగ్గే అవకాశం లేదు.
బయోగ్యాస్ పరిశ్రమను ప్రోత్సహించడానికి, 2025 నుండి ప్రభుత్వం సహజ వాయువులో 1% బయోమీథేన్‌ను కలపాలని, 2028 నాటికి దీనిని 5%కి పెంచాలని గ్యాస్ సరఫరాదారులను ఆదేశించింది.
ఇది భారతదేశ గ్యాస్ దిగుమతులను తగ్గించడంతోపాటు, వాయు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే గతంలో వ్యర్థాలను కాలుస్తుండగా, ఇప్పుడు వాటిని బయోరియాక్టర్‌లలో ఉపయోగించుకోవచ్చు.
దానికి తోడు, బయోరియాక్టర్ పని పూర్తయ్యాక మిగిలిన దానిని ఎరువుగా ఉపయోగించవచ్చు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పుడు భారీ బయోరియాక్టర్లను నిర్మిస్తున్నారు.
అటువంటి వాణిజ్య కేంద్రాలలో ఉత్పత్తి చేసిన గ్యాస్‌ను కంప్రెస్ చేయడం వల్ల దానిని రవాణా చేయడం లేదా వాహనాల్లో ఇంధనంగా ఉపయోగించడం సులభం అవుతుంది.
ఆసియాలో అతిపెద్ద కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్ ఉత్తర భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలోని లెహ్రాగాగాలో ఉంది.
2022లో ప్రారంభించిన ఈ ప్లాంట్, ప్రతిరోజూ 300 టన్నుల వరిగడ్డిని 33 టన్నుల బయోగ్యాస్‌గా మారుస్తుంది. ఇంధనానికి తగినంత డిమాండ్ లేనందున ప్రస్తుతం ఇది రోజుకు ఎనిమిది టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది.
ఈ ప్లాంట్ పెద్ద పట్టణాలు, ప్రధాన రహదారులకు దూరంగా ఉండటం కూడా దీనికి గల మరో కారణం.
ఆవు పేడ ప్రధాన సమస్యగా ఉన్న పంజాబ్‌లోని లూధియానా మరో సమస్యను ఎదుర్కొంటోంది.
చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు 6,000 ఆవులున్న లూధియానా నగరం పాల ఉత్పత్తికి కేంద్రంగా ఉంది. అయితే, డెయిరీ యజమానులు వ్యర్థాలను నేరుగా మురుగు కాలువల్లోకి వదులుతున్నారు. దీనివల్ల నదుల్లో కాలుష్యం పెరిగిపోతోంది.
హైబోవాల్ డెయిరీ కాంప్లెక్స్‌లో రోజుకు 225 టన్నుల పేడను ప్రాసెస్ చేయగల పెద్ద బయోగ్యాస్ రియాక్టర్‌కు పేడను మళ్లించకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
ఈ రియాక్టర్‌ను 2004లో నిర్మించారు. అయితే డిమాండ్ కారణంగా బయోగ్యాస్ అవుట్‌పుట్‌ను రెట్టింపు చేయడానికి అధికారులు ప్రణాళికలు తయారు చేస్తున్నారు.
ఈ ప్లాంట్‌కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆవు పేడ సేకరించే బాధ్యత రాజీవ్ కుమార్‌పై ఉంది. తొలిరోజుల్లో రైతులు ఎవరూ తనకు వ్యర్థాలు ఎందుకు కావాలో అర్థం చేసుకోలేదని ఆయన తెలిపారు.
"ఆవు పేడను మాకు అమ్మాలని వారిని ఒప్పించడం చాలా కష్టమైంది. వాళ్లు మమ్మల్ని అనుమానంగా చూసేవాళ్లు. కానీ ఇప్పుడు వ్యర్థాలు వారికి ఆదాయ వనరుగా మారాయి. దీనికోసం వాళ్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇరువర్గాలకూ లాభదాయకం" అని ఆయన చెప్పారు.
ఈ పని కష్టమైనదే కానీ స్థానిక ప్రజలకు దాని వల్ల కొంత ఆదాయం సమకూరుతోంది.
"ఈ పేడ ఆవులు, గేదెలు - రెండింటిదీ. దాని వాసనను భరించలేం. కానీ మనందరం బతకాలంటే రోజూ డబ్బు అవసరమే కదా" అన్నారు రాజీవ్ కుమార్.
బయోగ్యాస్‌లో అవకాశాలను అందిపుచ్చుకున్న వారిలో బల్జీత్ సింగ్ ఒకరు.
ఆయన గోధుమలు, బియ్యం పండించే పంజాబ్‌లోని రైతు కుటుంబం నుండి వచ్చారు. బయోగ్యాస్ ప్లాంట్‌లను నిర్మించడం చూసినప్పుడు, దానిలో ఉన్న లాభాలను చూసారు. అప్పటి నుంచి పంటకోత తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలను ప్లాంట్‌కు విక్రయించడం ప్రారంభించారు.
ఆ తర్వాత ఆయన వెళ్లి ఇతర రైతులు తనకు పొట్టు విక్రయించేలా వాళ్లను ఒప్పించే ప్రయత్నం చేశారు.
"కానీ ఇది అంత సులభం కాలేదు. నేలలో విత్తడం కోసం భూమిని చదునుగా చేయాలని రైతులపై ఒత్తిడి ఉంటుంది. అందువల్ల వాళ్లు పొట్టును కాల్చడం వైపే మొగ్గు చూపుతారు. కానీ, వ్యర్థాలను ప్లాంట్‌కు విక్రయించడం వల్ల డబ్బు సంపాదించే అవకాశం ఉందని నేను వాళ్లను ఒప్పించాను" అని బల్జీత్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ రోజు బల్జీత్ సింగ్ 10 గ్రామాల నుండి వ్యవసాయ వ్యర్థాలను సేకరిస్తుండగా, దీనిలో దాదాపు 200 మంది పని చేస్తున్నారు.
"ఇది శ్రమతో కూడుకున్న పని. పంట ప్రారంభమయ్యే ముందు, రైతులు వాళ్ల వ్యవసాయంలో మిగిలిపోయిన పంట వ్యర్థాలను విక్రయించమని ఒప్పించడానికి చాలా గ్రామాలను సందర్శిస్తాను’’
“బయోగ్యాస్ ప్లాంట్‌లో మంటను బాగా మండించడానికి పంట వ్యర్థాలను ఒక నిర్దిష్ట పరిమాణంలో కత్తిరిస్తాం లేదా ముక్కలుగా చేస్తాం. సేకరణ సమయంలో తేమ శాతం, కలుషితాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని బల్జీత్ వివరించారు.
బయోగ్యాస్ విజయవంతమైనా, అది ఎన్నటికైనా ముఖ్యమైన ఇంధనంగా మారగలదా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
పట్టణ ప్రాంతాల్లో స్థలం కొరత, పేడ వాసన కలిసి బయోగ్యాస్‌ను ఆచరణలో కష్టమైన పనిగా మారుస్తాయని పునరుత్పాదక ఇంధనంపై పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ఎస్‌కేజీ సంఘ కార్యదర్శి కిరణ్ కుమార్ కుదరవల్లి చెప్పారు.
అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లో దీనికి అయ్యే ఖర్చును సాధారణ ప్రజలు భరించలేరు.
"గ్రామీణ ప్రజలకు అడవులు లేదా వ్యవసాయ భూమి నుండి ఇంధనం లభిస్తుంది. అదీ ఉచితంగా. కాబట్టి, వాళ్లు ఇంధననానికి ఎక్కువ చెల్లించడానికి ఇష్టపడరు. అదీ కాకుండా బయోగ్యాస్ ప్లాంట్‌లను స్థాపించడానికి వాళ్ల నుంచి డబ్బును వసూలు చేయలేం" అని కిరణ్ కుమార్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- వేరే అభ్యర్థికి ఓటేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఏం జరిగిందంటే...
- ‘మా నాన్న సీఎం’
- ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లకు చేరాక ఏం జరుగుతుంది, భద్రత ఎలా ఉంటుంది? లోపలికి ఎవరెవరు వెళ్లొచ్చు?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: కొట్లాటలు, గాలిలోకి కాల్పులు, పెట్రోలు బాంబులు, ఈవీఎం ధ్వంసాలు, కిడ్నాపులు, సస్పెన్షన్లు.. పోలింగ్ రోజు ఏం జరిగిందంటే..
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














