సునీల్ ఛెత్రి: కెప్టెన్ ఫెంటాస్టిక్, లెజెండ్ అంటూ ఫిఫా ప్రశంసలు పొందిన భారత ఫుట్‌బాలర్... ఇంత కీర్తిని ఎలా సాధించారంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మనోజ్ ఛతుర్వేది
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతీయ ఫుట్‌బాల్ పోస్టర్ బాయ్ సునీల్ ఛెత్రి తన అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
వచ్చే నెల 6న కువైట్‌తో జరిగే ఫిఫా ప్రపంచ కప్ అర్హత మ్యాచ్‌నే తన చివరి మ్యాచ్ అని సునీల్ ఛెత్రి వెల్లడించారు.
ప్రస్తుతం ఈ టోర్నీలో భారత జట్టు రెండో రౌండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. భారత జట్టును ఇప్పుడు మూడో రౌండ్‌కు చేర్చితే అతని కెరీర్‌లో ఇది మరో పెద్ద ఘనతగా నిలిచిపోతుంది.
ఛెత్రి సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటన చేస్తూ 10 నిమిషాల వీడియోను విడుదల చేశారు.
దీని గురించి తొలుత తల్లిదండ్రులకు, భార్యకు తెలిపినట్లు చెప్పారు. ఈ వార్త విన్న తర్వాత తన తండ్రి చాలా సంతోషించారని తెలిపారు. అయితే, తన తల్లి, భార్య ఏడ్చారన్నారు.
వాస్తవానికి తాను టీమిండియా తరఫున మ్యాచ్‌లు ఆడుతున్నప్పుడు తన తల్లి, భార్య తీవ్ర ఒత్తిడికి గురవుతారని ఇకపై వారికి అలాంటి ఒత్తిడి ఉండదని అన్నారు.
‘‘నేను చెప్పింది వినగానే మా అమ్మ, నా భార్య కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను ఇక భారత్ తరఫున ఆడనని చెబుతుంటే మీరిద్దరూ ఎందుకు ఏడుస్తున్నారని వారిని అడిగాను’’ అని సునీల్ ఛెత్రి చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, Getty Images
సునీల్ రక్తంలోనే ఫుట్‌బాల్
ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటన తర్వాత, రొనాల్డొ, మెస్సీతో ఆయన కలిసి ఉన్న ఫోటోను ఎక్స్ (ట్విటర్) ప్లాట్‌ఫామ్‌లో ఫిఫా షేర్ చేసింది.
‘‘లెజెండ్‌గా రిటైర్ అవుతున్నారు’’ అంటూ కామెంట్ చేసింది.
భారత్‌లో అత్యుత్తమ ఫుట్‌బాలర్లలో ఒకరిగా సునీల్ ఛెత్రిని భావిస్తారు.
సునీల్ ఛెత్రి 1984 ఆగస్టు 3న సికింద్రాబాద్‌లో పుట్టారు. కానీ, తన చిన్నతనమంతా డార్జిలింగ్‌లో గడిపారు.
ఆయన తండ్రి కె.బి ఛెత్రి భారత ఆర్మీలో ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్ల(ఈఎంఈ) కార్ప్స్‌లో పనిచేసేవారు. ఆయన కూడా ఆర్మీ ఫుట్‌బాల్ టీమ్ తరఫున ఆడారు.
తల్లి సుశీలా తన కవల సోదరితో కలిసి నేపాల్ జాతీయ మహిళా ఫుట్‌బాల్ జట్టులో ఆడారు.
దీంతో, చిన్న వయసులోనే సునీల్ ఛెత్రి ఫుట్‌బాల్ ఆడటం ప్రారంభించారు. డార్జిలింగ్‌లో బెథానీ స్కూల్‌లో చదువుకునేటప్పటి నుంచే పలు టోర్నమెంట్లలో ఆడారు.
కానీ, 2002లో మోహన్ బగాన్ క్లబ్‌లో చేరిన తర్వాత ఆయన ఆటలో మరింత మార్పు వచ్చింది.
తండ్రి సైన్యంలో పనిచేయడంతో, వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యేవారు.
దీంతో, సునీల్ ఛెత్రి కూడా వివిధ క్లబ్‌ల తరఫున ఫుట్‌బాల్ ఆడారు.
అయిదు భాషల్లో సునీల్ ఛెత్రి అనర్గళంగా మాట్లాడగలరు. ఇంగ్లీష్, హిందీ, బెంగాళీ, నేపాలీ, కన్నడ భాషలను బాగా మాట్లాడతారు. అంతేకాక, తెలుగు, మరాఠి, కొంకణి భాషలను అర్థం చేసుకోగలరు.

ఫొటో సోర్స్, ANI
‘నా ఆటను నా కుమారుడు చూడాలనుకున్నా’
‘‘మైదానంలో నేను ఆడటాన్ని నా కొడుకు చూడాలనుకున్నా. తన తండ్రి కెరీర్ ఎలా సాగిందన్నది నా కుమారుడికి తెలియాలి’’ అని సునీల్ ఛెత్రి చెప్పారు.
తాను చాలా అదృష్టవంతుడినని, తనకు కష్టపడే మనస్తత్వం ఉందని సునీల్ భావిస్తారు.
సునీల్ ఛెత్రికి నిరుడు ఆగస్టులో కొడుకు పుట్టాడు. బాబు పేరు ధ్రువ్. ఆయన భార్య సోనమ్ భట్టాచార్య, బాబును తీసుకొని మైదానానికి వెళ్లే వీలుంది. కానీ, ఏడాది చిన్నారికి తన తండ్రి ఆఖరి మ్యాచ్ ఆడిన తీరు గురించి ఏమీ అర్థమయ్యే అవకాశం లేదు.
అంతర్జాతీయ మాజీ ఫుట్‌బాలర్ సుబ్రతా భట్టాచార్య కూతురు సోనమ్ భట్టాచార్యను సునీల్ ఛెత్రి 2017లో పెళ్లి చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ తరఫున అధిక మ్యాచ్‌లు
సునీల్ ఛెత్రి భారత్ తరఫున 150 అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడారు.
అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఆయన కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్. కానీ, ఇది ఆయనకు చిరస్మరణీయ మ్యాచ్‌గా నిలిచిపోలేదు.
ఈ మ్యాచ్‌లో సునీల్ గోల్ చేశారు. కానీ, చివరి క్షణంలో అద్భుతంగా ఆడిన అఫ్గానిస్తాన్, భారత్‌ను ఓడించింది.
సునీల్ ఛెత్రి 150 మ్యాచ్‌ల్లో 98 గోల్స్ చేశారు. ప్రపంచంలో అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఫుట్‌బాలర్ల జాబితాలో సునీల్ ఛెత్రి నాలుగో స్థానంలో నిలిచారు.
ఈ జాబితాలో క్రిస్టియానో రొనాల్డొ, అలీ డెయి, లియోనెల్ మెస్సీ, సునీల్ ఛెత్రి వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.

ఫొటో సోర్స్, ANI
మేజర్ లీగ్ ఆడిన తొలి భారతీయుడు
2010-11 సీజన్ మేజర్ లీగ్ కోసం అమెరికన్ క్లబ్ కాన్సాస్ సిటీ విజార్డ్స్, సునీల్ ఛెత్రితో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ లీగ్‌లో ఆడిన తొలి భారతీయ ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రి. అంతకుముందు, భైచుంగ్ భూటియా ప్రొఫెషనల్ లీగ్ ఆడారు. మేజర్ లీగ్‌లో సునీల్‌కు ఒకే మ్యాచ్ ఆడే అవకాశం దక్కింది.
సునీల్ నేర్పరితనం తనకు చాలా నచ్చుతుందని విజార్డ్స్ హెడ్ కోచ్ పీటర్ వెర్మీ అన్నారు. టెక్నికల్‌గా సునీల్ చాలా బలమైన వ్యక్తి అని, ఆడేటప్పుడు అనుసరించే వ్యూహాలు చాలా బాగుంటాయని చెప్పారు.
కానీ, దురదృష్టవశాత్తు సునీల్ ఇంగ్లీష్ లీగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆడలేకపోయారు. 2009లో, క్వీన్స్ పార్క్ రేంజర్స్ జట్టుతో సునీల్ మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారు.
కానీ, బ్రిటీష్ ప్రభుత్వం వర్క్ పర్మిట్ ఇవ్వకపోవడంతో ఈ లీగ్‌లో సునీల్ ఆడలేకపోయారు.
వర్క్ పర్మిట్ రాకపోవడానికి ఆ సమయంలో ఫిఫా టాప్-70 జట్ల జాబితాలో భారత్ లేకపోవడమే కారణం. కానీ, దాని మూల్యం సునీల్ ఛెత్రి చెల్లించుకోవాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, ANI
ఖేల్ రత్న పొందిన తొలి ఫుట్‌బాల్ ఆటగాడు
ఖేల్ రత్న అవార్డు అందుకున్న తొలి భారత ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రి.
2021లో నీరజ్ చోప్రా, మిథాలీ రాజ్‌తో పాటు ఈ అవార్డును సునీల్ అందుకున్నారు. భారత క్రీడా రంగంలో అత్యున్నత పురస్కారంగా ఖేల్ రత్నను భావిస్తారు.
2019లో పద్మశ్రీ, 2011లో అర్జున్ అవార్డులను కూడా ఆయన అందుకున్నారు.
ఎక్కువ సార్లు ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందిన ఘనత కూడా సునీల్ పేరిటే ఉంది. 2007, 2011, 2013, 2014, 2017, 2019, 2022లలో ఏడుసార్లు సునీల్ ఛెత్రి ఈ పురస్కారాన్ని పొందారు.
ఐఎం విజయన్ మూడుసార్లు, భైచుంగ్ భుటియా, జో పాల్ అంచేరి రెండుసార్ల చొప్పున ఈ అవార్డును అందుకున్నారు.
2007, 2011, 2012లలో మూడుసార్లు నెహ్రూ కప్ గెలుపొందిన భారత జట్టులో ఆయన సభ్యుడు.
2008లో ఏఎఫ్‌సీ ఛాలెంజ్ కప్, 2017 ఇంటర్ కాంటినెంటల్ కప్ గెలవడంలో సునీల్ ఛెత్రి కీలక పాత్ర పోషించారు.

ఫొటో సోర్స్, ANI
సునీల్‌పై ఫిఫా డాక్యుమెంటరీ
సునీల్ ఛెత్రిపై కెప్టెన్ ఫెంటాస్టిక్ పేరుతో 2022 సెప్టెంబర్ 27న ఫిఫా డాక్యుమెంటరీని రూపొందించింది.
ఫుట్‌బాల్ క్రీడకు సునీల్ ఛెత్రి చేసిన కృషి, ఆయన కెరీర్ తొలి నాటి రోజులు, ప్రేమ కథ, సుమారు రెండు దశాబ్దాల కెరీర్ గురించి ఈ డాక్యుమెంటరీలో చెప్పారు.
వెంకటేశ్ ఒక ఫుట్‌బాల్ ప్లేయర్. వెంకటేశ్ కెప్టెన్సీలో సునీల్ ఛెత్రి ఆడారు.
రెండు కాళ్లను నైపుణ్యంగా ఉపయోగిస్తూ చాలా సహజంగా ఆడటమే ఆయన ఆటలోని అందమని వెంకటేశ్ ప్రశంసించారు.
చాలా కాలం తర్వాత ఒక ఆటగాడిలో ఇలాంటి నైపుణ్యాన్ని చూసినట్లు తెలిపారు.
‘‘సునీల్ చాలా కష్టపడే ఆటగాడు. ఆయన గోల్ స్కోర్ చేయడమే కాకుండా, గోల్ అవకాశాలను సృష్టిస్తారు. మూడు పొజిషన్లలో ఆడగలిగే నైపుణ్యం సునీల్ ఛెత్రికి ఉండటం ఆయనకున్న అత్యుత్తమ నైపుణ్యాలలో ఒకటి’’ అని వెంకటేశ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- షుగర్ ఉన్న వాళ్లు మామిడి పండ్లు తినొచ్చా, తినకూడదా? డాక్టర్లు ఏం చెప్పారంటే..
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం, ఎవరికి అనుకూలం?
- పెద్దక్కగా పుట్టడం శాపమా, అది ఒక మానసిక సమస్యగా మారుతోందా?
- ‘మా నాన్న సీఎం’
- ఏపీలో మే 13న ఎన్నికలు పూర్తయితే జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఇవ్వకూడదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














