పాలస్తీనాను కొన్ని దేశాలు ఎందుకు ప్రత్యేక దేశంగా గుర్తించవు? పరిగణిస్తే ఆ దేశానికి కలిగే ప్రయోజనమేంటి

ఫొటో సోర్స్, Getty Images
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ స్పెయిన్, నార్వే, ఐర్లాండ్ దేశాలు బుధవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ నెల 28 నుంచి తమ ఈ గుర్తింపు నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపాయి.
ఈ మూడు దేశాలు చేసిన ప్రకటనను పాలస్తీనా నేతలు స్వాగతించారు. పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్ఓ) దీన్ని ‘‘చరిత్రాత్మక ప్రకటన’గా అభివర్ణించింది.
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్యలో శాంతి చర్చల పురోగతికి ఉపయోగపడుతుందని ఈ దేశాలు భావిస్తున్నాయి.
అయితే, ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ 7న జరిగిన దాడుల వీడియోను చూడాలంటూ ఆ మూడు దేశాల రాయబారులకు తెలుపుతూ ఇజ్రాయెల్ సమన్లు జారీ చేసింది.
‘‘హమాస్ హంతకులకు, రేపిస్టులకు బంగారు పతకం ఇవ్వాలని స్పెయిన్, నార్వే, ఐర్లాండ్ చేసిన ప్రకటనను చరిత్ర గుర్తుంచుకుంటుంది.’’ అని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ అన్నారు.
పాలస్తీనా ప్రత్యేక హోదాను ఇజ్రాయెల్ గుర్తించడం లేదు. వెస్ట్ బ్యాంకు, గాజాలో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయడాన్ని ప్రస్తుతం ఇజ్రాయెల్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇజ్రాయెల్ ఉనికికి ఇది ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
పాలస్తీనాను ప్రత్యేక దేశంగా ఎవరు గుర్తిస్తున్నారు?
పాలస్తీనా ప్రత్యేక దేశం హోదాను సుమారు 140 దేశాలు గుర్తిస్తున్నాయి. వాటిలో ఐరాసలోని అరబ్ గ్రూప్ దేశాలు, ఇస్లామిక్ కోపరేషన్ ఆర్గనైజేషన్, అలీనోద్యమ సభ్య దేశాలు ఉన్నాయి.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా వంటి చాలా దేశాలు మాత్రం పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం లేదు.
పరిస్థితులు బాగున్నప్పుడు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు కృషి చేస్తామని మార్చిలో జరిగిన ఈయూ దేశాల నేతల శిఖరాగ్ర సమావేశంలో స్పెయిన్, ఐర్లాండ్, మాల్టా, స్లోవెనియా దేశాలు ప్రకటించాయి.
ఈ ప్రకటనకు ముందు, కేవలం తొమ్మిది ఈయూ దేశాలు మాత్రమే పాలస్తీనాకు ప్రత్యేక దేశం హోదాను ఇచ్చేందుకు మద్దతు ఇచ్చాయి. వీటిలో చాలా దేశాలు సోవియట్ బ్లాక్‌లో భాగమైనప్పుడే అంటే 1988లోనే ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్‌సీ)లో పాలస్తీనాకు శాశ్వత సభ్యత్వం ఇచ్చేందుకు ఓటింగ్ నిర్వహించిన నెల తర్వాత స్పెయిన్, నార్లే, ఐర్లాండ్ దేశాలు సంయుక్తంగా ఈ ప్రకటన చేశాయి.
ఇజ్రాయెల్‌కు దీర్ఘకాలంగా మిత్రదేశంగా ఉన్న అమెరికా ఈ తీర్మానాన్ని వీటో చేసింది. ఈ మండలిలోని 12 సభ్య దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేశాయి. వాటిలో అమెరికా మిత్రదేశాలు ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియాలు ఉన్నాయి. బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు ఈ తీర్మాన ఓటింగ్ ప్రక్రియకు గైర్హాజరు అయ్యాయి.
అల్జీరియా ప్రతిపాదించిన ఈ తీర్మానాన్ని ఒకవేళ భద్రతా మండలి ఆమోదించి ఉంటే, పాలస్తీనాకు అవసరమైన మూడింట రెండొంతుల మెజార్టీ ఉందని ఒప్పుకుంటూ జనరల్ అసెంబ్లీ దీనిపై ఓటింగ్ నిర్వహించేది.
అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా లేదా చైనా వంటి ఐదు శాశ్వత సభ్య దేశాలు ఎవరైనా దీన్ని వీటో చేయకపోతే, ఐరాస భద్రతా మండలి ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి ఆమోదం లభించేది.
అమెరికా ఈ తీర్మానాన్ని వీటో చేయడం అనైతికమని పాలస్తీనా అథారిటీ అధ్యక్షులు మహమూద్ అబ్బాస్ అన్నారు. ఈ తీర్మానం ప్రవేశపెట్టడాన్ని సిగ్గుచేటుగా అభివర్ణిస్తూ.. ఇజ్రాయెల్ మండిపడింది.
‘‘ద్విదేశ పరిష్కారానికి అమెరికా బలమైన మద్దతు ఇస్తోంది. మేం వేసిన ఈ వీటో ఓటింగ్ పాలస్తీనాకు ప్రత్యేక హోదా వ్యతిరేకించడాన్ని ప్రతిబింబించదు. కానీ, ఇరు వర్గాల మధ్య నేరుగా చర్చలు జరపడం ద్వారా మాత్రమే దీన్నిప్రత్యేక దేశంగా గుర్తించగలం’’ అని ఐరాసకు అమెరికా డిప్యూటీ అంబాసిడర్ రాబర్ట్ వుడ్ భద్రతామండలికి చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
పాలస్తీనాను కొన్ని దేశాలు ఎందుకు ప్రత్యేక దేశంగా గుర్తించడం లేదు?
ఇజ్రాయెల్‌తో చర్చల ద్వారా ఎలాంటి ఒప్పందానికి రాకపోతుండటంతో కొన్ని దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం లేదు.
‘‘పాలస్తీనాను ఒక దేశంగా ఏర్పాటు చేయాల్సినవసరం ఉన్నప్పటికీ, పాలస్తీనా ప్రజలు ఆశిస్తున్న స్వయం నిర్ణయాధికారంపై ఇజ్రాయెల్‌కు వీటో అధికారమిచ్చేలా ఇజ్రాయెల్-పాలస్తీనాల మధ్య ప్రత్యేక చర్చలకు అమెరికా పట్టుబడుతుంది’’ అని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అంతర్జాతీయ సంబంధాలు, మధ్య ప్రాచ్య రాజకీయాల ప్రొఫెసర్ ఫవాజ్ గెర్జెస్ అన్నారు.
1990ల్లో శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు వేరువేరు దేశాలలో పక్కపక్కనే నివసించేందుకు వీలు కల్పించే ద్విదేశ పరిష్కార లక్ష్యాన్ని నిర్దేశించాయి.
2000 ప్రారంభం నాటి నుంచి ఈ శాంతి చర్చలు పురోగతి నెమ్మదించింది. 2014 ముందు కూడా వాషింగ్టన్‌లో ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్యలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
కీలకమైన విషయాలకు పరిష్కారం లేకుండా పోయింది. వాటిలో సరిహద్దులు, పాలస్తీనా దేశ భవిష్యత్, జెరూసలెం స్టేటస్, 1948-49 యుద్ధంలో శరణార్థులుగా మారిన పాలస్తీనియన్ల పరిస్థితేంటి వంటి వాటికి పరిష్కారం లభించలేదు.
పాలస్తీనియన్లకు ఐరాసలో సభ్యత్వాన్ని ఇజ్రాయెల్ బలంగా వ్యతిరేకిస్తోంది.
‘‘ఈ చర్చలు జరగడం ఇప్పటికే నరహత్యా ఉగ్రవాద విజయానికి కారణం. అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడుల తర్వాత ఉగ్రవాదానికి బహుమతిగా విజయవంతంగా ఈ బిడ్ నిలుస్తుంది’’ అని ఏప్రిల్ నెల ప్రారంభంలో వార్తా సంస్థ ఏఎఫ్‌పీకి ఇజ్రాయెల్ ఐరాస రాయబారి గిలాడ్ ఎర్డాన్ చెప్పారు.
ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలున్న దేశాలు, పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం వల్ల తమ మిత్రదేశానికి కోపం తెప్పించినట్లవుతుందని భావించాయి.
1933లో మాంటెవీడియో కన్వెన్షన్‌లో నిర్దేశించిన దేశ హోదా కీలక అర్హతలకు పాలస్తీనియన్లు సరిపోవడం లేదని ఇజ్రాయెల్ మద్దతుదారులు కొందరు అంటున్నారు.
శాశ్వత జనాభా, నిర్దేశిత భూభాగం, ప్రభుత్వం, ఇతర దేశాలతో సంబంధాలను ఏర్పాటు చేసుకునే సామర్థ్యాలకు సంబంధించి మాంటెవీడియో కన్వెన్షన్‌లో ఒప్పందాలు జరిగాయి.

ఫొటో సోర్స్, EPA
ఐరాసలో పాలస్తీనా భూభాగాలకు ఉన్న హోదా ఏంటి?
‘హోలీ సీ’ లాగా పాలస్తీనియన్లకు నాన్-మెంబర్ అబ్జర్వర్ స్టేట్ హోదా ఉంది.
ఐరాసలో శాశ్వత సభ్యత్వం కోసం పాలస్తీనా 2011లోనే దరఖాస్తు పెట్టుకుంది. కానీ, ఐరాస భద్రతా మండలిలో అవసరమైన మద్దతు లేకపోవడంతో ఇది విఫలమైంది. ఆ దరఖాస్తు ఓటింగ్‌కు రాలేదు.
తీర్మానాలలో ఓటు హక్కులు ఇవ్వకుండా, జనరల్ అసెంబ్లీ చర్చలలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ 2012లో ‘నాన్ మెంబర్ అబ్జర్వర్ స్టేట్’ హోదాను కల్పించింది ఐక్యరాజ్యసమితి.
వెస్ట్ బ్యాంకు, గాజా స్ట్రిప్ ప్రజలు స్వాగతించిన, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు వ్యతిరేకించిన 2012 నిర్ణయంతో పాలస్తీనియన్లు ఐరాస ఉన్నత న్యాయస్థానం వంటి ఇతర అంతర్జాతీయ సంస్థలలో చేరేందుకు అనుమతి ఉంటుంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఇది 2015లో చోటు దక్కించుకుంది.
‘‘ఐరాసలో శాశ్వత సభ్యత్వం పొందడం వల్ల, పాలస్తీనియన్లకు మరింత దౌత్య సహకారం అందుతుంది. తీర్మానాలకు నేరుగా స్పాన్సర్ చేసే సామర్థ్యం పొందుతుంది. జనరల్ అసెంబ్లీలో ఓటు వేయొచ్చు(సభ్యత్వం లేని దేశాలు జనరల్ అసెంబ్లీలో పాల్గొనవచ్చు, కానీ ఓటేయడానికి వీలు లేదు). భద్రతా మండలిలో అవసరమైన మేరకు ఓటు హక్కు లభిస్తుంది.’’ అని వాషింగ్టన్‌లోని మధ్య ప్రాచ్య ఇన్‌స్టిట్యూట్ థింక్ ట్యాంక్‌లో పాలస్తీనా, పాలస్తీనా-ఇజ్రాయెల్ వ్యవహారాలకు ప్రొగ్రామ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఖలిద్ ఎల్గిండి చెప్పారు.
‘‘ ఇవేమీ కూడా ద్విదేశ పరిష్కారాన్ని తీసుకురాలేవు. ఈ పరిష్కారం ద్వారా మాత్రమే ఇజ్రాయెల్ ఆక్రమణను ఆపవచ్చు’’ అని అన్నారు.
ఐరాసలో శాశ్వత సభ్యత్వం పొందడంతో పాలస్తీనా అధికారులు అంతగా సాధించేది ఏమీ ఉండదని లండన్‌లోని ఓరియంటల్, ఆఫ్రికన్ స్టడీస్ స్కూల్‌లో డెవలప్‌మెంట్ స్టడీస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న గిల్బర్ట్ అచ్కార్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- మద్యం తాగడం ఒక్కసారిగా మానేస్తే ఏమవుతుంది?
- తొమ్మిది నెలల చిన్నారి హత్య కేసు, తీర్పు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్న న్యాయమూర్తులు
- పెనైల్ క్యాన్సర్: పురుషాంగం తొలగించడానికి కారణమవుతున్న ఈ క్యాన్సర్ ఎలా వస్తుంది?
- శామ్ పిట్రోడా: ‘ఆఫ్రికన్’ కామెంట్లపై సొంత పార్టీ ఎలా స్పందించింది... ప్రధాని చేసిన విమర్శలేంటి?
- గుడ్డు గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















