బిడ్డ చనిపోయి మూడు నెలలైనా మరిచిపోలేక పోతున్న తల్లి చింపాంజీ, ఏం చేసిందంటే...

జంతువులు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, నటాలియా జన్మనిచ్చిన 14 రోజులకే తన బిడ్డను కోల్పోయింది
    • రచయిత, డారియో బ్రూక్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నటాలియా అనే 21 ఏళ్ల చింపాంజీ బిడ్డను కోల్పోవడం ఇది రెండోసారి. ఫిబ్రవరి ప్రారంభంలో అది జన్మనిచ్చింది. స్పెయిన్‌, వాలెన్సియా నగరంలోని జంతుప్రదర్శనశాల(జూ) 'బయోపార్క్‌'లో అంతా బాగానే ఉన్నట్లు అనిపించింది.

కానీ, రాత్రివేళ చింపాంజీ పిల్ల "ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించి చనిపోయింది.

''కచ్చితమైన కారణం తెలియదు. కానీ, తల్లి వద్ద బిడ్డకు అవసరమైనన్ని పాలు లేవని అర్ధమైంది'' అని బయోపార్క్ డైరెక్టర్ మిగ్యూల్ కాసారెస్ బీబీసీతో చెప్పారు.

చనిపోయిన బిడ్డకు దూరంగా ఉండాలని నటాలియా అనుకోవడం లేదు. మూడు నెలలుగా ఎటువెళ్లినా తనతో పిల్ల చింపాంజీ కళేబరాన్ని తనతోపాటే తీసుకెళుతోంది.

"బిడ్డను వదిలిపెట్టి వెళ్లడం లేదు. ఇది డిస్క్రైబ్డ్ బిహేవియర్. అప్పుడే పుట్టిన పిల్లలు చనిపోయినప్పుడు కొన్నిసార్లు తల్లి చింపాంజీల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అది అడవిలో అయినా, జూలో అయినా ఒకేలా ఉంటుంది.'' అని పశువైద్య నిపుణులు కాసారెస్ వివరించారు.

సాధారణంగా తల్లి చింపాంజీలు తమ బిడ్డలను నాలుగు నెలల వరకూ మోసుకెళ్తాయి.''ఇలా ప్రతిసారీ జరగదు. అయితే, ఆడ చింపాంజీలు చనిపోయిన బిడ్డలను కొన్ని రోజులపాటు, లేదా కొన్ని వారాల పాటు తమతోనే తీసుకెళ్తుంటాయి. కానీ, ఇక్కడ నెలలుగా జరుగుతోంది'' అని బయోపార్క్ డైరెక్టర్ చెప్పారు.

జూకి వచ్చిన సందర్శకులు చనిపోయిన బిడ్డతో కలిసి ఉన్న తల్లిని చూసి బాధపడ్డారు.

''మొదట్లో చింపాంజీ పిల్ల చనిపోయి ఉండడం స్పష్టంగా కనిపించింది. అంతా ఆశ్చర్యపోయారు. అది చూసి సానుభూతి చూపించడం మేం గమనించాం'' అని కాసారెస్ చెప్పారు.

చింపాంజీ పిల్ల మృతదేహం కుళ్లిపోతూ వస్తోంది. బిడ్డను వదిలేసేంత వరకూ నటాలియాకు ఆరోగ్య సమస్యలు రాకుండా జూ జాగ్రత్తలు తీసుకుంటోంది.

జంతువులు

ఫొటో సోర్స్, Reuters

అలా తీసేయడం సరికాదు

చింపాంజీ నటాలియా 2018లో కూడా ఒక శిశువును కోల్పోయింది. అప్పుడు కొద్దిరోజుల్లో ఆ పరిస్థితి నుంచి అది బయటపడింది.

కానీ, ఈసారి అలా జరగలేదు. బయట లేదా జూ పార్కుల వంటి నియంత్రిత ప్రదేశంలో నివసించే ఇతర వానరాల మాదిరిగానే బయోపార్క్‌లోని చింపాంజీలు కూడా చాలా స్నేహపూర్వకంగా ఉండడంతో పాటు ఐక్యంగా ఉంటాయి.

''మొదట్లో అవి చాలా సన్నిహితంగా ఉండేవి, ఒకదానినొకటి కౌగిలించుకునేవి. చూడడానికది చాలా బావుండేది. ఎందుకంటే, మనుషులు ఎలా ఉంటారో అలాగే అనిపించేది. చాలా దగ్గరగా చూసేవాళ్లం'' అని కాసారెస్ వివరించారు.

పీటీ వెరూస్ ఉప జాతులైన ఈ రకం చింపాంజీలు ప్రపంచంలో అంతరించిపోన్న జీవజాతుల్లో ఒకటి. అవి సాధారణ జీవితాన్ని గడుపుతాయి.

కానీ, నటాలియా తన శిశువు శరీరాన్ని వదిలిపెట్టకూడదని అనుకుంటోంది.

జంతువులు

ఫొటో సోర్స్, Reuters

జూ నిపుణులు అక్కడి పరిస్థితిని విశ్లేషించారు. తల్లి చింపాంజీ తనకు నచ్చినట్లు చేయాలనుకుంటోంది. అలాగే, శిశువు శరీరాన్ని తన నుంచి వేరు చేయడం సంక్లిష్టమైన పని మాత్రమే కాదు, ప్రమాదకరం కూడా.

''వాటి గుంపు ఎప్పుడూ కలిసే ఉంటుంది. కాబట్టి, శిశువు మృత శరీరాన్ని తల్లి నుంచి వేరుచేయాలంటే తల్లి చింపాంజీకి మత్తుమందు ఇవ్వాలి. అప్పుడు ఆ గుంపులోని ఇతర సభ్యులకు కూడా మత్తుమందు ఇవ్వాల్సి ఉంటుంది'' అని కాసారెస్ చెప్పారు.

''మా దగ్గర మరో ఆడ చింపాంజీ ఉంది. అది దాని సోదరి. దానికి ఒక చిన్న పిల్ల ఉంది. ఈ పనితో అది ఆ శిశువును ప్రమాదంలో పడేస్తుంది.'' అన్నారాయన.

జంతువులు

ఫొటో సోర్స్, Reuters

'మరణం కూడా జీవితంలో భాగమే'

నటాలియా రోజువారీ కార్యకలాపాలు సాధారణంగానే ఉన్నాయి. చనిపోయిన తన బిడ్డ మృతదేహంతో నెలలుగా ఉన్నప్పటికీ ఇతర చింపాంజీల తరహాలో ఆరోగ్య సమస్యలు కనిపించలేదు.

''మేం వయసు ఎక్కువ ఉన్న జంతువుల ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలూ లేవు. కానీ, శిశువు మృతదేహం కుళ్లిపోతోంది. అయితే, అదృష్టవశాత్తూ చింపాంజీల రోగనిరోధక శక్తి చాలా శక్తివంతమైనది'' అని కాసారెస్ వివరించారు.

ఇందులో అవసరమైతే జూ నిపుణులు జోక్యం చేసుకోవచ్చు. కానీ, తల్లి చింపాంజీ శ్రేయస్సు దృష్ట్యా పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉండడానికి ప్రాధాన్యత ఇచ్చారు.

నియంత్రిత ప్రదేశంలో ఉన్నప్పటికీ ఈ జూలో ఉన్న చింపాంజీలు ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువులు కావని కాసారెస్ చెప్పారు.

అడవిలో లేదా నియంత్రిత ప్రదేశాల్లో ఏం జరుగుతుందో వాటికి ఇక్కడ కూడా అలాగే జరుగుతుందన్నారు.

''ఇది కేవలం చింపాంజీలలో మాత్రమే కాదు, ప్రకృతిలో సహజం. స్నేహపూర్వక వానరాలు, పెద్ద కోతులు, బబూన్లు, ఏనుగుల వంటి జంతువుల్లోనూ తల్లీబిడ్డ మధ్య బలమైన బంధంతో పాటు క్లిష్టమైన కుటుంబ ప్రవర్తన కూడా చూడొచ్చు'' అని ఆయన వివరించారు.

జంతువులు

ఫొటో సోర్స్, Reuters

''జూల్లో చిన్నచిన్న జంతువులు, అందంగా కనిపించే పిల్లలు ఆటలాడుకోవడం మాత్రమే కాదు, కొన్నిసార్లు చనిపోతాయి. మరణం కూడా జీవితంలో భాగమే'' అన్నారాయన.

ఇదెంతో అద్భుతమైన విషయం, చాలామందిని ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలను. అందువల్ల ఏం జరిగిందో వివరించడానికి జూ సభ్యులు అక్కడే ఉంటున్నారు.

''వివరించి చెప్పినప్పుడు చాలా మంది ఆ బాధను అర్థం చేసుకున్నారు. బిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న తల్లిపై సానుభూతి, గౌరవం చూపించారు'' అని బయోపార్క్ డైరెక్టర్ కాసారెస్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)