బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, ఈ వైరస్ సోకిన ఆవు పాలు తాగొచ్చా?

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో ఆవులకు H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు గుర్తించారు.

అమెరికాలోని పాడి పశువుల్లో కనిపించే బర్డ్‌ ఫ్లూగా పిలిచే ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ అవశేషాలు మార్కెట్‌లో దొరుకుతున్న పాలల్లో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

కాన్సాస్, మిచిగాన్, టెక్సస్‌తో సహా అనేక రాష్ట్రాల్లోని కొన్ని ఆవులకు హెచ్‌5ఎన్1 వైరస్‌‌ సోకినట్లు గుర్తించారు.

డెయిరీల నుంచి సేకరించిన దాదాపు 300 శాంపిళ్లను పరీక్షించిన అనంతరం పాశ్చరైజ్డ్ పాలల్లో వైరస్ బతికున్న ఆనవాళ్లు కనిపించలేదని యూఎస్ ఫుడ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) మే 10న తెలిపింది.

సాధారణంగా ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకదు.

కానీ, బర్డ్‌ ఫ్లూ సోకిన ఆవులకు దగ్గరగా ఉన్న టెక్సస్‌లోని ఓ వ్యవసాయ కార్మికుడికి ఏప్రిల్‌లో బర్డ్ ఫ్లూ పాజిటివ్‌గా తేలింది.

ఆయనకు యాంటీవైరల్ మందులతో చికిత్స చేయడంతో పాటు ఐసోలేషన్‌లో ఉంచారు.

''ఇలా సోకడం చాలా అరుదు అయినప్పటికీ, H5N1 బర్డ్ ఫ్లూ వైరస్‌ ఒక క్షీరదం నుంచి మనిషికి సోకుతుందనడానికి ఇదే తొలి ఉదాహరణ'' అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) తెలిపింది.

ఒక జీవజాతి నుంచి మరో జీవజాతికి వైరస్ ఎలా వ్యాప్తి చెందిందనే విషయాన్ని వివరించేందుకు ప్రస్తుతానికి శాస్త్రవేత్తల వద్ద కచ్చితమైన సమాధానం లేదు.

''ఒక జంతువు నుంచి మరో జంతువుకి, ఒక జీవజాతి నుంచి మరో జీవజాతికి వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమయ్యే జన్యు పరివర్తనాలపై (మ్యుటేషన్స్) మరింత పరిశోధన అవసరం'' అని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో యానిమల్ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ హుయిజున్ జౌ అన్నారు.

''ఈ విధమైన మ్యుటేషన్లు ఒకే జాతి జంతువుల మధ్య, లేదా వివిధ జాతుల మధ్య వైరస్ వ్యాప్తిని పెంచగలవు, లేదా తగ్గించగలవు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, H5N1 వైరస్‌‌ను 1996లో చైనాలో తొలిసారి గుర్తించారు.

బర్డ్ ఫ్లూ ఎలా వ్యాపిస్తుంది?

బర్డ్ ఫ్లూ అనేది పౌల్ట్రీకి (పెంపుడు పక్షులు), అడవి జాతి పక్షులకు సంబంధించిన అంటు వ్యాధి. ఇది సుమారు వందేళ్ల నుంచి ఉంది.

పక్షులతో పాటు నక్కలు, అడవి కుక్కల వంటి అటవీ జంతువులు, సీల్స్, ఆట్టర్ వంటి సముద్ర, జలచరాలకు ఈ వ్యాధి సోకుతుంది.

H5N1 వైరస్ 1996లో తొలిసారి చైనాలో కనిపించింది.

పక్షుల రెట్టలు, వాటి లాలాజలం, లేదా కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా రోజుల వ్యవధిలోనే ఈ అంటువ్యాధి పక్షుల మందలకు వ్యాపిస్తుంది.

ఈ వైరస్ సాధారణంగా మనుషులకు సోకదు.

కానీ, పౌల్ట్రీతో ప్రత్యక్ష సంబంధం ద్వారా, లేదా కలుషిత పరిసరాల వల్ల మనుషులకు ఈ వైరస్ సోకిన అరుదైన ఘటనలు ప్రపంచంలో పలుచోట్ల నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది.

ఆసియా, ఆఫ్రికా, యూరప్, అమెరికాలోని పలు దేశాల్లో ఇలాంటి కేసులు నమోదయ్యాయి.

మనుషులకు H5N1 సోకిన కేసులు అమెరికాలో రెండు నమోదయ్యాయి. ఒకటి 2022లో. ఆ రోగి కోలుకున్నారు. రెండోది 2024 ఏప్రిల్‌లో.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, గత 20 ఏళ్లలో 888 మంది H5N1 ఏవియెన్ ఫ్లూ బారినపడ్డారు. వారిలో 463 మంది ప్రాణాలు కోల్పోయారు. మానవుల్లో ఈ వైరస్ వల్ల చోటుచేసుకున్న మరణాల రేటు 52 శాతంగా ఉంది.

వైరస్ సోకిన జంతువులకు దగ్గరగా ఉండడం, లేదా వాటిని వధించడం, లేదా ఆ జంతువుల నుంచి వచ్చే స్రావాల వల్ల కలుషితమైన పరిసరాలతో పరోక్ష సంబంధాలు కలిగి ఉండడం ద్వారా ఇది సోకే ప్రమాదం ఉంటుంది.

ఈ వైరస్ సోకిన వారిలో ఫ్లూ లక్షణాలైన శ్వాసకోశ సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్లు, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధి లక్షణాలు కూడా కనిపించవచ్చని సీడీసీ తెలిపింది.

వ్యక్తికి సోకిన వైరస్, ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై వ్యాధి తీవ్రత ఆధారపడి ఉంటుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

పాలు తాగడం సురక్షితమేనా?

పాశ్చరైజ్డ్ పాలల్లో కనిపించిన జన్యు అవశేషాల వల్ల వ్యాధి సోకుతుందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని అమెరికా అధికారులు, ఎఫ్‌డీఏతో సహా ఫెడరల్ ఏజెన్సీలు తెలిపాయి.

పాలను నిర్ణీత ఉష్ణోగ్రత వద్ద, నిర్ణీత సమయం వరకు వేడి చేయడం ద్వారా హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌ చనిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతారు.

పాశ్చరైజేషన్ వల్ల పాలు నిల్వవుండే సమయం పెరుగుతుంది. పచ్చి పాలను (పాశ్చరైజ్ చేయని పాలు) వినియోగించవద్దని ఎఫ్‌డీఏ చెబుతూనే ఉంది.

''పచ్చి పాలలో ఉండే అనేక రకాల వ్యాధికారక క్రిముల కారణంగా ఆహార సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది'' అని తెలిపింది.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

H5N1 వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడమెలా?

ఆవులకు ఈ వైరస్ సోకుతుందని బయటపడినప్పటి నుంచి అమెరికాలో పాడి ఆవుల మందలను, గొడ్డు మాంసాన్ని, పాల ఉత్పత్తులను అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు ఎఫ్‌డీఏ తెలిపింది.

కానీ, కొలంబియా తరహాలో కెనడా వంటి పొరుగు దేశాలు అమెరికా నుంచి పశువులను దిగుమతి చేసుకోవడంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చాయి.

డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం, గత 20 ఏళ్లలో మనుషులకు H5N1 వైరస్ సోకిన కేసులు 23 దేశాల్లో నమోదయ్యాయి.

అమెరికాలో ఏప్రిల్‌లో కేసు నమోదు కావడానికి ముందు 2024 మార్చిలో వియత్నాంలో ఇలాంటి కేసు నమోదైనట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. సరైన వైద్యం అందించే పరిస్థితులు లేక వ్యాధి లక్షణాలు తీవ్రమై, వయోధికుడైన ఆ రోగి మరణించారు.

బర్డ్ ఫ్లూ నుంచి కాపాడడానికి ఇప్పటి వరకు ఎలాంటి వ్యాక్సీన్ లేదు.

బర్డ్ ఫ్లూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మనుషులకు బర్డ్ ఫ్లూ సోకడం చాలా అరుదు అయినప్పటికీ, ఇటీవల H5N1 కేసులు నమోదవడంపై డబ్ల్యూహెచ్‌వో ఆందోళన చెందుతోంది.

''మనుషుల్లో కనిపించే ప్రతి ఇన్ఫెక్షన్ కూడా మానవ శరీరంలో తనకు తాను వృద్ధి చెందేందుకు వైరస్ చేసే ప్రయత్నం. ఇప్పటి వరకు ఇది అరుదుగా జరుగుతున్నప్పటికీ, ఆ వైరస్ ఒక్కసారి విజయం సాధించిందంటే ఇక ఇన్‌ఫ్లూయెంజా మహమ్మారి మొదలైనట్టే'' అని డబ్ల్యూహెచ్‌వోలోని గ్లోబల్ ఇన్‌ఫ్లూయెంజా ప్రోగ్రామ్ హెడ్ డాక్టర్ వెన్కింగ్ జాంగ్ చెప్పారు.

అయితే, కోవిడ్ - 19 మహమ్మారితో ఉన్న గత అనుభవం, ఆ సమయంలో తీసుకున్న నివారణ చర్యల వంటివి ఈ వైరస్ వ్యాప్తిని నివారించడంలో సాయపడతాయని నిపుణులు భావిస్తున్నారు.

బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి చెందుతున్న దేశాలకు వెళ్లినట్లయితే, భోజనానికి ముందు, తర్వాత చేతులను తరచూ సబ్బుతో గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.

ముఖ్యంగా పౌల్ట్రీ సంబంధిత ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పౌల్ట్రీ పరిశ్రమలకు, బతికి ఉన్న పక్షులకు దూరంగా ఉండాలి.

అమెరికా వెలుపల H5N1 వైరస్ వ్యాప్తిని నివారించేందుకు మనుషులు, పాడి పశువులు, పెంపుడు జంతువులు, వన్యప్రాణుల కోసం ఒక విధానం అవసరమని డాక్టర్ జౌ అంటున్నారు.

కోవిడ్ - 19 మహమ్మారి సమయంలో పాటించిన కొన్ని విధానాలు ఏవియెన్ ఫ్లూ వ్యాప్తిని తగ్గించేందుకు ఉపయోగపడతాయని ఆయన అన్నారు.

''అవసరమైతే డేటాను పంచుకోవడం, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ నిఘా వర్గాల మధ్య కమ్యూనికేషన్, వ్యాధిని గుర్తించడం, వేగవంతమైన వ్యాధి నిర్ధరణ ప్రక్రియ'' వంటి వాటి గురించి ఆయన వివరించారు.

అమెరికాలో ప్రస్తుతం నమోదైన కేసుల్లో మనిషి నుంచి మనిషికి ఈ వైరస్ సోకినట్లు ఎలాంటి ఆధారాలూ లేవని నిపుణులు చెబుతున్నారు. మహమ్మారి ప్రబలేందుకు కారణమయ్యే వైరస్ సామర్థ్యానికి సంబంధించిన కీలక విషయం ఇది.

అయితే, ఆవుల నుంచి టెక్సస్ కార్మికుడికి బర్డ్ ఫ్లూ సోకడం ఆందోళనలను పెంచుతోందని డాక్టర్ జౌ అన్నారు.

''ఈ ప్రమాదకర పరిస్థితి దృష్ట్యా మనం జాగ్రత్తగా ఉండాలి'' అని హెచ్చరించారు.

''ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, వైరస్ పిల్లులకు వ్యాపించింది, ఈ వైరస్ సోకిన పిల్లుల్లో సగానికి పైగా పిల్లులు పచ్చిపాలు తాగడం వల్ల చనిపోయాయి. పర్యావరణ పరిస్థితులను బట్టి ఎప్పుడైనా మ్యుటేషన్లు జరగొచ్చు. వాటిని గుర్తించడంలో ఆలస్యం కూడా కావొచ్చు. వైరస్, అది సోకిన జీవి, పర్యావరణ పరిస్థితుల వల్ల ఈ మ్యుటేషన్లు ఎప్పుడు, ఎక్కడ సంభవిస్తాయో అంచనా వేయడం కష్టం'' అని జౌ చెప్పారు.

ఇవి కూడా చదవండి: