అంటార్కిటికాలోని ఈ జీవుల చర్మం కమిలిపోతోంది, చూపు పోతోంది ఎందుకు?

సీల్ చేపలు, అతి నీల లోహిత సూర్య కిరణాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అతినీల లోహిత కిరణాల వల్ల జుంతువుల చూపు దెబ్బ తింటుందని భావిస్తున్న పరిశోధకులు
    • రచయిత, విక్టోరియా గిల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అంటార్కిటికాలోని వివిధ జీవులకు ప్రాణులకు సూర్యుడి అతి నీల లోహిత కిరణాల నుంచి ముప్పు పెరిగింది.

వాతావరణం పైన ఉన్న వాయువుల నుంచి భూమి మీద ఉన్న వాటిని రక్షించే కవచంగా ఉన్న ఓజోన్ పొరకు ఈ ప్రాంతంలో రంధ్రం ఏర్పడింది.

వాతావరణ మార్పుల కారణంగా ఆస్ట్రేలియాలో అడవులు కాలిపోవడం వల్ల ఏర్పడిన భారీ పొగ వల్ల ఓజోన్ పొరకు నష్టం ఏర్పడి ఉండవచ్చని భావిస్తున్నారు.

గ్లోబల్ ఛేంజ్ బయాలజీలో దీని గురించి ఓ కథనాన్ని ప్రచురించారు.

“ఓజోన్ పొరకు పడిన రంధ్రం గురించి నేను ప్రజలకు చెప్పినప్పుడు, వాళ్లు అది ఇంకా మెరుగు పడలేదా? అని అడిగేవారు” అని యూనివర్సిటీ ఆఫ్ ఊలన్‌గాంగ్ క్లైమేట్ ఛేంజ్ బయాలజిస్టు ప్రొఫెసర్ షరోన్ రాబిన్సన్ బీబీసీతో చెప్పారు.

ఓజోన్ పొర, అంటార్కిటికా, సముద్ర జీవులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంటార్కిటికాలో ఓజోన్ పొరకు రంధ్రంతో అక్కడి జీవులకు ప్రమాదం

అంటార్కిటికాలో పని చేస్తున్న శాస్త్రవేత్తలు 1985లోనూ ఓజోన్ పొరకు రంధ్రం పడినట్లు గుర్తించారు. అప్పుడు భూమిని చేరుతున్న రేడియేషన్‌ను కొలవడం ద్వారా ఈ నిర్ణయానికి వచ్చారు.

ఓజోన్ పొరను దెబ్బ తీస్తున్న అనేక రసాయనాలు దీనికి కారణం, ముఖ్యంగా క్లోరోఫ్లోరో కార్బన్‌లు. ఓజోన్ పొరను దెబ్బ తీస్తున్న రసాయనాలను పూర్తిగా నిషేధించాలని 1987లో ప్రపంచ దేశాలన్నీ అంగీకరించాయి. ఈ ఒప్పందాన్ని మాంట్రియల్ ప్రొటోకాల్‌గా పిలుస్తున్నారు. చరిత్రలో ఇదొక విజయవంతమైన ఒప్పందంగా భావిస్తున్నారు.

ప్రస్తుతం ఓజోన్ పొర కోలుకుంటోంది. “అయితే ఒక చోట రంధ్రం ఉంది. అక్కడ ఓజోన్ పొర క్షీణించింది. అది ప్రతి శీతాకాలంలో అంటార్కిటికాలో కనిపిస్తోంది” అని ప్రొఫెసర్ రాబిన్సన్ చెప్పారు. ఆమె అంటార్కిటికా పర్యావరణ భవిష్యత్ పరిశోధన కేంద్రానికి డిప్యూటీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఓజోన్ పొరకు జరిగిన నష్టం కూడా ప్రత్యేకించి మంచు ఖండం మీద ప్రభావం చూపుతోంది. ఎందుకంటే ఇక్కడి తక్కువ ఉష్ణోగ్రత, మేఘాల్లో అధిక వేడి వల్ల రసాయన ప్రతిచర్యలు సంభవిస్తాయి. అవి ఓజోన్‌ను భారీగా దెబ్బ తీస్తాయి. ఒక పొరను పూర్తిగా తినేస్తాయి.

అంటార్కిటికా ప్రాంతంలో ఏడాది పొడవునా ఓజోన్ పొరకు ఉండే రంధ్రం సెప్టెంబర్, అక్టోబర్‌లో పెద్దదిగా మారుతుంది. ఈ కాలంలో మొక్కలు, జంతువులు, మంచు కవచం కింద సురక్షితంగా ఉంటాయి. సముద్ర జీవులు విస్తృతమైన మంచు పొర కింద ఉంటాయి.

సూర్యుడు, అంటార్కిటికా

ఫొటో సోర్స్, Victoria Gill

ఫొటో క్యాప్షన్, అంటార్కిటికాలో వేసవిలో సూర్యుడి అతి నీలలోహిత కిరణాల బారిన పడుతున్న జంతువులు

ఇది డిసెంబర్ ఆ తర్వాత వేసవి వరకు కొనసాగుతుంది. “అయితే వేసవిలో అంటార్కిటికాలో జంతువులు బయటకు వస్తాయి. అది వాటికి ప్రమాదకరంగా మారుతోంది”. అని ప్రొఫెసర్ రాబిన్సన్ చెప్పారు.

సూర్యుడి నుంచి వచ్చే కిరణాలలో కొన్ని రకాల అల్ట్రా వయొలెట్ కిరణాల వల్ల రేడియేషన్ వస్తుంది. అందులో యూవి- బి కిరణాలు శరీరాన్న తాకడం వల్ల చర్మం కమిలిపోవడం, క్యాన్సర్ బారిన పడటం, చూపు కోల్పోవడం వంటి ప్రమాదం పెరుగుతుంది.

అయితే అంటార్కిటికాలోని క్షీరదాలు, పక్షుల విషయంలోనూ ఇలాగే జరుగుతుందా అనే దానిపై పరిశోధకుల వద్ద ఇప్పటికీ సమాచారం లేదు.

అయితే, వెంట్రుకలు, రెక్కలు ఉండే సీల్స్, పెంగ్విన్ల వంటి వాటికి సూర్యుడి అతి నీల లోహిత కిరణాల నుంచి రక్షణ లభిస్తుందని ప్రొఫెసర్ రాబిన్సన్ చెప్పారు.

“అయితే అంటార్కిటిక్‌లోని జంతువులకు కంటి చూపు పోయే ప్రమాదం ఉంది” అని ఆమె అన్నారు.

నాచు మొక్కలు, సీల్స్, చేపలు, పక్షులు

ఫొటో సోర్స్, University of Wollongong

ఫొటో క్యాప్షన్, అంటార్కిటిక్ మొక్కలు, నాచు సూర్య కిరణాల నుంచి రక్షణ కవచాలను సహజంగా అభివృద్ధి చేసుకుంటున్నట్లు గుర్తించిన పరిశోధకులు

అంటార్కిటికాలోని మొక్కలు, జంతువుల మీద అల్ట్రా వయోలెట్ కిరణాల ప్రభావం ఎంత ఉందనే దానిపై అనేక అధ్యయనాలను లోతుగా విశ్లేషించినట్లు ప్రొఫెసర్ రాబిన్సన్ ఆమె సహచరులు తమ నివేదికలో పేర్కొన్నారు.

అంటార్కిటికాలోని నాచు మొక్కలు అతినీల లోహిత కిరణాల ప్రభావాన్ని తట్టుకునేలా “సన్ స్క్రీన్ కాంపౌండ్స్”ను అభివృద్ధి చేసుకున్న ఆధారాలను వారు గుర్తించారు.

“ఆ మొక్కలు ఎండను తట్టుకునే పొరను అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ ఖర్చు పెట్టినట్లైతే, అవి ఎదగడానికి తమలో ఉన్న శక్తిని తక్కువ ఖర్చు పెడతాయి. ఎందుకంటే సూర్యుడి వేడిని తట్టుకునే పొరను అభివృద్ది చేసుకునేందుకు కచ్చితంగా శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది” అని ప్రొఫెసర్ రాబిన్సన్ చెప్పారు.

అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొర దెబ్బ తిన్నదని చెప్పడానికి మరో ఆధారం ఏంటంటే.. ఈ ప్రాంతంలోని జంతువుల ఆహార చక్రంలో కీలకమైన క్రిల్ అనే జీవి.. అతి నీల లోహిత కిరమాల బారి నుంచి తనను తాను కాపాడుకునేందుకు సముద్రంలో బాగా లోతుకు వెళుతున్నట్లు గుర్తించారు. దీని వల్ల క్రిల్స్‌ను తిని బతికే తిమింగలాలు, సీల్ చేపలు, పెంగ్విన్లు, ఇతర పక్షులపై ప్రభావం పడుతోంది.

అంటార్కిటిక్ ప్రాంతంలోని జీవులకు ఆహార క్రమంలో అత్యంత కీలకమైన క్రిల్ అనే అనే జీవి విషయంలోనూ అతి నీల లోహిత కిరణాల ప్రభావం రుజువైంది.

క్రిల్, వేల్స్, సీల్స్, పక్షులు

ఫొటో సోర్స్, Pete Harmsen/Australian Antarctic Division

ఫొటో క్యాప్షన్, అల్ట్రా వయోలెట్ కిరణాల వల్ల తమ ప్రవర్తన మార్చుకున్న అంటార్కిటిక్ క్రిల్

ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం చాలా కాలం కొనసాగడానికి ప్రధాన కారణాల్లో 2019,2020ల్లో ఆస్ట్రేలియాలో భారీ విస్తీర్ణంలో అడవులు తగలబడటం ఒకటి.

అంటార్కిటిక్ ప్రాంతంలో ఓజోన్ పొరకు రంధ్రం ఇంత కాలం కొనసాగడం “ప్రపంచానికి ఇదొక మేలు కొలుపు” లాంటిదని అట్మాస్పిరిక్ సైన్స్ ఎట్ ద యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్‌టర్‌లో ప్రొఫెసర్ జిమ్ హేవుడ్ బీబీసీతో చెప్పారు.

“ఓజోన్‌ పొరను కాపాడే విషయంలో మనం సాధించిన విజయాలతో సమాజం సంతృప్తి చెందకూడదు” అని ఆయన అన్నారు.

అయితే ఓజోన్ పొరకు పడిన రంధ్రం నుంచి కోలుకోవడంలో జరుగుతున్న ఆలస్యానికి అనేక కారణాలు ఉన్నాయి. బద్దలవుతున్న అగ్ని పర్వతాల నుంచి వెలువడుతున్న లావా, ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తగలబడుతున్న అడవులు లాంటివి. వీటి నుంచి విడుదలయ్యే పొగ, దూళి కణాలు ఓజోన్ పొరను దెబ్బ తీసే ప్రతిచర్యలకు ఆజ్యం పోస్తున్నాయి.

వాతావరణం పై పొరల్లోకి కొన్ని కణాలను పంపడం ద్వారా మేఘాలను తయారు చేయడం అనే జియో ఇంజనీరింగ్ ప్రక్రియ లాంటి వాతావరణాన్ని చల్లబరిచే ప్రయోగాల గరుంచి ప్రొఫెసర్ రాబిన్సన్ వివరించారు.

“దీని వల్ల కూడా ఓజోన్ పొర దెబ్బ తింటుంది. ఆ ఆలోచన కరెక్ట్ కాదు” అని ఆమె చెప్పారు.

“అంటార్కిటికాకు మనం చెయ్యగలిగిన పెద్ద మేలు ఏదైనా ఉందంటే వీలైనంత త్వరగా కర్బన ఉద్గారాలన తగ్గించడం, వాతావరణ మార్పులపై చర్య తీసుకోవడం, అడవుల తగలబడటాన్ని ఆపడం. కోలుకుంటున్న ఓజోన్ పొర మీద ఇంకా ఎక్కువగా ఒత్తిడి పెట్టవద్దు” అని రాబిన్సన్ కోరారు.

వీడియో క్యాప్షన్, జంతువులకు ప్రాణాంతకంగా మారుతున్న అల్ట్రావయొలెట్ కిరణాలు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)