ఇతియోటిటాన్ సెవెర్నిసిస్: అతిపెద్ద, పురాతన సముద్ర జీవి గుర్తింపు

ఫొటో సోర్స్, Sergey Krasovskiy
- రచయిత, జార్జినా రనార్డ్
- హోదా, సైన్స్ రిపోర్టర్
అతిపెద్ద సముద్ర జంతువు (మెరైన్ రెప్టైల్)గా భావించే ఒక జీవిని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ జీవి రెండు బస్సుల కంటే పొడవుగా ఉంటుందని చెబుతున్నారు.
ఈ జీవి దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్లతో కలిసి జీవించింది.
శిలాజంగా మారిన ఈ జీవి దవడ ఎముక 2016లో సోమర్‌సెట్‌లోని బీచ్‌లో ఒక శిలాజ వేటగాడికి దొరికింది. 2020లో ఒక తండ్రీకూతుళ్ల జోడీకి ఇలాంటిదే మరో దవడ ఎముక లభ్యమైంది.
ఈ దవడ ఎముకలు భారీ ఆకారంలో ఉండే రెండు ఇతియోసార్ రెప్టైల్స్‌కు చెందినవని నిపుణులు చెబుతున్నారు. ఇవి 25 మీ. పొడవు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
‘‘దవడ ఎముక పరిమాణం ఆధారంగా ఈ జీవి ఓవరాల్‌గా 25 మీ. పొడవు ఉంటుందని మనం అనుకోవచ్చు. అంటే దాదాపు బ్లూవేల్ పరిమాణంలో ఇది ఉండొచ్చు. లభ్యమైన దవడ ఎముకల్లో ఒకటి ఒక మీటర్ పొడవు ఉండగా, మరొకటి రెండు మీటర్ల పొడవు ఉంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్‌కు చెందిన పాలియోంటాలజిస్ట్, డాక్టర్ డీన్ లోమాక్స్ చెప్పారు. ఆయన రాసిన శాస్త్రీయ పత్రం (సైంటిఫిక్ పేపర్) బుధవారం ప్రచురితమైంది.

ఫొటో సోర్స్, Gabriel Ugueto
కానీ, ఆ జీవి కచ్చితమైన పరిమాణాన్ని నిర్ధారించడానికి పుర్రె లేదా అస్థిపంజరం వంటి మరిన్ని ఆధారాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ భారీ ఇతియోసార్లు ఒక్కసారిగా అంతరించిపోయాయని, ఆ తర్వాత జీవించిన ఇతియోసార్లు ఈ స్థాయి భారీ పరిమాణానికి చేరుకోలేకపోయాయని ఆయన చెప్పారు.
2016లో మొదటగా ఈ జీవి గురించి తెలిసింది. శిలాజ వేటగాడు అయిన పాల్ డి లా సాలే అనే వ్యక్తి సోమర్‌సెట్ బీచ్‌లలో ఈ జీవి శిలాజాలను చూశారు. ప్రముఖ శిలాజ శాస్త్రవేత్త స్టీవ్ ఎచెస్ ప్రేరణతో పాల్ 25 ఏళ్ల పాటు శిలాజాలను సేకరించారు.

ఫొటో సోర్స్, Tony Jolliffe BBC
తన భార్య కరోల్‌తో కలిసి బీచ్‌లో గాలిస్తుండగా పాల్‌కు ఈ భారీ జీవికి సంబంధించిన దవడ ఎముక శిలాజం దొరికింది.
డీన్ లోమాక్స్‌తో దీని గురించి మాట్లాడుతుండగా, ఏదో పెద్ద ఆవిష్కరణకు ఇది దారి తీస్తుందని వారికి అర్థమైంది. తమ పరిశోధనలకు వారు 2018లో ప్రచురించారు.
ఈ జీవి ఎంత పెద్దగా ఉంటుందో అర్థం చేసుకునేందుకు మరిన్ని ఆధారాలు అవసరమని వారు భావించారు.
డీన్ అన్వేషిస్తోన్న ఆధారాలను, 2020లో తండ్రీ కూతుళ్లయిన జస్టిన్, రూబీ రేనాల్డ్స్ అనే ఇద్దరూ బ్లూ యాంకర్ తీరానికి 10 కి.మీ దూరంలో గుర్తించారు.

ఫొటో సోర్స్, Tony Jolliffe/BBC
‘‘పాల్‌కు దొరికినట్లే, ఈ భారీ జీవులకు సంబంధించిన మరో దవడ ఎముక దొరికిందని నాకు అప్పుడే అర్థమైంది. నాకు చాలా ఉత్సాహంగా అనిపించింది’’ అని డీన్ చెప్పారు.
పాల్ వెంటనే బీచ్ దగ్గరకు పరిగెత్తి మరిన్ని అవశేషాలను వెలికితీయడంలో వారికి సహాయపడ్డారు.
‘‘ఆ బురదలో నేను తవ్వాను. ఒక గంటపాటు తవ్విన తర్వాత పారకు గట్టిగా ఏదో తగిలింది. తర్వాత భద్రంగా ఈ ఎముక బయటపడింది’’ అని ఆయన చెప్పారు.
ఈ రెండో దవడ ఎముకకు సంబంధించిన మిగతా భాగాల కోసం వారంతా కలిసి వెదకడం కొనసాగించారు. 2022లో దానికి సంబంధించిన చివరి ముక్క దొరికింది.

ఫొటో సోర్స్, Dean Lomax
జీవి పరిమాణాన్ని అంచనా వేసేందుకు ఈ ఆవిష్కరణ వారికి మరింత దోహదపడింది. ఈ భారీ జంతువు ఇతియోసార్‌లోని ఒక కొత్త జాతి అని ఇప్పుడు వారు నిర్ధారించారు. దీనికి ఇతియోటిటాన్ సెవెర్నిసిస్ అనే పేరు పెట్టారు. దీన్నే సెవెర్న్ జెయింట్ ఫిష్ లిజర్డ్ అని పిలుస్తున్నారు.
తాజా సైంటిఫిక్ పేపర్‌ను రూబీ రేనాల్డ్స్‌తో కలిసి డీన్ రాశారు. పాల్ గుర్తించిన అవశేషం, డీన్ బృందం విశ్లేషించేంతవరకు దాదాపు మూడేళ్లపాటు అతని గ్యారేజీలోనే ఉండిపోయింది. త్వరలోనే దీన్ని బ్రిస్టల్ మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీలో బహిరంగ ప్రదర్శనకు ఉంచనున్నారు.
ఇవి కూడా చదవండి:
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్‌లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే
- అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం 1967: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














