మనుషుల మెదడు పరిమాణం తగ్గిపోతోందా? దీని వల్ల మన తెలివితేటలపై ప్రభావం ఎంత?

మెదడు పరిమాణం

ఫొటో సోర్స్, Getty Images/BBC

    • రచయిత, జాస్మిన్ ఫాక్స్-స్కెల్లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆధునిక మానవుని మెదడు 1,00,000 సంవత్సరాల క్రితం జీవించిన హోమో సెపియన్ల మెదడు కంటే దాదాపు 13% చిన్నది.

అయితే, అది ఎందుకు కుంచించుకుపోయింది అనేది పరిశోధకులను ఆశ్చర్యపరుస్తోంది.

పెద్దగా ఉండే మెదడే మానవ జాతిని ఇతర జంతువుల నుంచి వేరు చేస్తోంది.

మనుషుల ఆలోచనలు, ఆవిష్కరణ సామర్థ్యమే కళా సృష్టికి, చక్రాన్ని కనిపెట్టడానికి, చంద్రునిపైకి వెళ్లడానికి అనుమతించాయి.

ఇదే పరిమాణంలో ఉన్న ఇతర జంతువులతో పోలిస్తే, మన మెదడు చాలా పెద్దది.

అయితే, గత 1,00,000 సంవత్సరాలలో మనుషుల మెదడు సగటు పరిమాణం తగ్గిపోయింది.

2023 నాటి అధ్యయనంలో భాగంగా న్యూయార్క్ నగరంలోని అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీకి చెందిన పాలియో ఆంత్రోపాలజిస్ట్, క్యూరేటర్ ఎమెరిటస్ ఇయాన్ టాటర్‌సాల్ కాలక్రమంలో పురాతన హోమినిన్‌ల మెదడు పరిమాణాన్ని కొలుస్తూ వచ్చారు.

మనకు తెలిసిన పురాతన జాతులతో దీనిని ప్రారంభించి, ఆధునిక మానవునితో తన పరిశోధనను ముగించారు.

ఆసియా, యూరప్, ఆఫ్రికా అంతటా వివిధ హోమినిన్‌ జాతులలో మెదడు వేగంగా పెరగడం వేర్వేరు సమయాల్లో స్వతంత్రంగా జరిగిందని ఆయన కనుగొన్నారు.

కాలక్రమేణా మెదడు పెరిగిన జాతులలో ఆస్ట్రలోపిథెకస్ అఫారెన్సిస్, హోమో ఎరెక్టస్, హోమో హైడెల్బెర్గెన్సిస్, హోమో నియాండర్తలెన్సిస్ ఉన్నాయి.

అయితే, ఆధునిక మానవుని పుట్టుకతో కాలక్రమేణా మెదడు పెరిగే ధోరణి తగ్గుతూ వచ్చింది. మంచు యుగంలో జీవించిన హోమో సెపియన్ల కంటే నేటి స్త్రీ పురుషుల పుర్రెలు సగటున 12.7% చిన్నవి.

"మన దగ్గర చాలా చిత్రమైన ఆకారంలోని పుర్రెలు ఉన్నాయి. అందుకని ప్రారంభ మానవులను గుర్తించడం చాలా సులభం. వారి మెదడు చాలా పెద్దగా ఉంటుంది" అని టాటర్‌సాల్ అన్నారు.

మనిషి మెదడు

ఫొటో సోర్స్, Getty Images

టాటర్‌సాల్ పరిశోధన, ఇతర పరిశోధనలలో వెల్లడైన విషయాలు దాదాపు ఒకటే.

ఉదాహరణకు, 1934లో, ఇల్లినాయిస్‌లోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త గెర్‌హార్డ్ట్ వాన్ బోనిన్, "గత 10,000 లేదా 20,000 సంవత్సరాలలో ఐరోపాలో మనిషి మెదడు పరిమాణం తగ్గినట్లు ఖచ్చితమైన ఆధారాలున్నాయి" అని అన్నారు.

మెదడు పరిమాణంలో సంకోచం సుమారు 1,00,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని టాటర్‌సాల్ సూచించారు.

‘‘మానవులు అర్థవంతమైన రేఖాగణిత చిత్రాలతో సింబాలిక్ కళాఖండాలను, బొమ్మలను చెక్కడం ప్రారంభించిన కాలం ఇది" అని టాటర్‌సాల్ అన్నారు.

ఆలోచనా శైలిలో ఈ మార్పుకు కారణం, ఆకస్మికంగా భాష పుట్టుకు రావడం అని టాటర్‌సాల్ అభిప్రాయపడ్డారు.

ఇది మెదడు నాడీ మార్గాలను మరింత సమర్థవంతంగా పునర్వ్యవస్థీకరించడానికి దారి తీసింది.

మరో మాటలో చెప్పాలంటే చిన్న, మెరుగైన వ్యవస్థీకృత మెదడు సంక్లిష్టమైన గణనలను చేయగలిగినందున, పెద్ద మెదడు అనవసరంగా మారింది.

"బహుశా మన పూర్వీకులు సమాచారాన్ని మొరటుగా అర్థం చేసుకునేవాళ్లేమో అని నాకు అనిపిస్తుంది. ఈ సందర్భంలో, తెలివితేటలను మెదడు పరిమాణంతో కొలిచేవాళ్లు. మెదడు ఎంత పెద్దదైతే, దాని నుంచి అన్ని ఆలోచనలు పుట్టుకొస్తాయి" అని టాటర్‌సాల్ చెప్పారు.

అయితే, ఇతర పాలియాంటాలజిస్టులు టాటర్‌సాల్ సూచించిన కాలం కన్నా, ఇటీవలి కాలం నుంచే మెదడు తగ్గిపోవడం ప్రారంభమైందని వాదిస్తూ, దానికి ఆధారంగా శిలాజ రికార్డులను చూపుతున్నారు.

అంటే.. మార్పును భాషతో అనుసంధానించలేం. టాటర్‌సాల్ చెప్పిన భాషా సముపార్జన (1,00,000 సంవత్సరాల క్రితం) కాలం కూడా వివాదాస్పదమైంది.

‘మన మెదడు చిన్నగా మారడానికి మారుతున్న వాతావరణమే కానీ భాష కాదు’ అని కాలిఫోర్నియాలోని నేచురల్ హిస్టరీ మ్యూజియంకు చెందిన కాగ్నిటివ్ సైంటిస్ట్ జెఫ్ మోర్గాన్ స్టిబెల్ అభిప్రాయపడ్డారు.

2023 అధ్యయనంలో, స్టిబెల్ గత 50,000 సంవత్సరాలలో దొరికిన 298 హోమో సెపియన్ల పుర్రెలను విశ్లేషించారు.

గత 17,000 సంవత్సరాలుగా, చివరి మంచు యుగం ముగిసినప్పటి నుంచి మానవుల మెదడు తగ్గిపోవడం మొదలైందని ఆయన అంటారు.

వాతావరణ రికార్డును పరిశీలించి, మెదడు పరిమాణానికి, వాతావరణానికి మధ్య సంబంధం ఉందని ఆయన కనుగొన్నారు.

"వాతావరణం వెచ్చగా ఉన్నప్పుడు మానవుల మెదడు పరిమాణం చిన్నగా, చల్లని వాతావరణంలో మెదడు పెద్దగా ఉంది" అని స్టిబెల్ చెప్పారు.

చిన్నగా ఉన్న మెదడు మానవులు త్వరగా చల్లబడటానికి అనుమతించేది. వేడి వాతావరణంలో జీవించే మానవులలో ఉష్ణాన్ని తగ్గించుకోవడానికి సన్నగా, పొడవైన శరీరాలు అభివృద్ధి అయ్యాయనే విషయం అందరికీ తెలిసిందే.

మన మెదడు కూడా ఇదే పద్ధతిలో అభివృద్ధి చెంది ఉండొచ్చు.

"ఈ రోజుల్లో మనం వాతావరణం వేడిగా ఉన్నప్పుడు టీ-షర్టు ధరిస్తున్నాం. కొందరు స్విమ్మింగ్ పూల్‌లో దూకవచ్చు లేదా ఏసీ కింద కూర్చోవచ్చు. కానీ 15,000 సంవత్సరాల క్రితం ఇవన్నీ మనకు అందుబాటులో లేవు" అని స్టిబెల్ వివరించారు.

"మెదడు అన్ని అవయవాలలో అతి ఎక్కువ శక్తిని ఉపయోగించుకుంటుంది. ఇది మన శరీర ద్రవ్యరాశిలో 2% బరువు ఉన్నా, మన జీవక్రియ శక్తిని 20% వినియోగించుకుంటుంది. కాబట్టి, మెదడు శక్తిని, వేడిని అధికంగా వినియోగించుకుంటే, అది వాతావరణానికి అనుగుణంగా మారుతుంది అనేది స్పష్టం. చిన్న మెదళ్ళు వేడిని ఎక్కువ విడుదల చేస్తాయి. వాటి పరిమాణ రీత్యా ఉష్ణాన్ని విడుదల చేసే నిష్పత్తి కూడా ఎక్కువ అనేది మా సిద్ధాంతం’’ అని చెప్పారు.

ఈ రోజు వేగంగా వేడెక్కుతున్న గ్రహం మన మెదళ్లను మరింత కుంచించుకుపోయేలా చేస్తుందని ఈ పరిశోధన సూచిస్తుంది.

పెద్ద మెదడు

ఫొటో సోర్స్, Getty Images

సంక్లిష్ట నాగరికతల ప్రభావం

2021లో, అమెరికాలోని డార్ట్‌మౌత్ కళాశాల శాస్త్రవేత్త జెరెమీ డిసిల్వా, మియోసిన్ హోమినిడ్ రుడాపిథెకస్ (9.85 మిలియన్ సంవత్సరాల క్రితం) నుంచి ఆధునిక మానవుల వరకు (300,000 నుంచి 100 సంవత్సరాల క్రితం) దొరికిన కపాలాల శిలాజాలను విశ్లేషించారు.

ఆయన మన మెదడు పరిమాణం తగ్గిపోవడం 20,000 - 5,000 సంవత్సరాల క్రితం జరిగిందని వాదిస్తారు.

సంక్లిష్ట సమాజాలు, సామ్రాజ్యాల పుట్టుక అంటే జ్ఞానం అభివృద్ధి చెంది వివిధ కార్యకలాపాలు విస్తరించడం అని డిసిల్వా అంటారు.

దాంతో, ప్రజలు ప్రతిదీ తెలుసుకోవలసిన అవసరం లేకపోయింది, వ్యక్తులు జీవించడానికి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేకపోవడంతో వారి మెదడు పరిమాణం తగ్గింది.

అయితే, ఈ సిద్ధాంతమూ వివాదాస్పదమే.

"ఈజిప్షియన్లు 3,000 సంవత్సరాల క్రితం మారినట్లు, అన్ని వేటగాళ్ల సమాజాలు సంక్లిష్టంగా మారలేదు. కానీ ఇలాంటి సమాజాలలోనూ మెదడు పరిమాణం తగ్గింది" అని ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయంలో కోహ్న్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హిస్టరీలో ఎమెరిటస్ ప్రొఫెసర్ ఎవా జబ్లోంకా అన్నారు.

సంక్లిష్ట సమాజాలు ఉద్భవించినప్పుడు మెదళ్ళు కుంచించుకుపోయినా, మెదడు కుంచించుకుపోవడం దానికి తప్పనిసరి ప్రతిస్పందన కాదని జబ్లోంకా వాదిస్తారు.

"3,000 సంవత్సరాల క్రితం సంక్లిష్టమైన సమాజాలు ఆవిర్భవించి ఉంటే, సామాజిక తరగతులలో చాలా వ్యత్యాసాలు ఉండి ఉండొచ్చు. పర్యవసానంగా ఎక్కువ మంది ప్రజలు పేదలైతే పేదరికం, పోషకాహారలోపం లాంటి అంశాలు మెదడు పరిమాణం మీద ప్రభావం చూపి ఉండవచ్చు’’ అని చెప్పారు.

మనిషి మెదడు

ఫొటో సోర్స్, Getty Images

పోషకాల లోపమే మన మెదడు కుంచించుకుపోవడానికి కారణం అని కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలోని లెవర్‌హల్మ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎవల్యూషనరీ స్టడీస్‌కు చెందిన మార్తా లాహర్ అభిప్రాయపడ్డారు.

2013లో ఆమె యూరప్, ఆఫ్రికా, ఆసియాలలో ఎముకలు, పుర్రెలను విశ్లేషించారు.

అతిపెద్ద మెదడు గల హోమో సోపియన్లు 20,000 నుంచి 30,000 సంవత్సరాల క్రితం జీవించారని, 10,000 సంవత్సరాల క్రితం మానవ మెదడు కుంచించుకుపోవడం మొదలైందని ఆమె గుర్తించారు.

మన పూర్వీకులు వేట మానేసి వ్యవసాయానికి మారారని భావిస్తున్న కాలంలో ఇది జరిగింది.

వ్యవసాయంపై ఆధారపడటం వల్ల విటమిన్, మినరల్ లోపాలు తలెత్తి, ఫలితంగా మెదడు వృద్ధి మందగించి ఉండవచ్చని ఆమె అన్నారు.

అయితే కొంతమంది శాస్త్రవేత్తలు కుక్కలు, పిల్లుల వంటి పెంపుడు జంతువుల మెదడు వాటి పూర్వీకుల కంటే 10-15% చిన్నగా ఉందనే వాస్తవం ఆధారంగా, ఒకే చోటికి పరిమితం కావడం వల్లే మానవ పుర్రెలు చిన్నవిగా ఉన్నాయని ప్రతిపాదించారు.

‘‘మనిషి స్నేహపూర్వకంగా, సామాజికంగా జీవించడం జరిగి ఉంటే, అది 800,000 సంవత్సరాల క్రితం జరిగి ఉండాలి. ఆ సమయంలో మానవ మెదడు కుంచించుకుపోయిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు" అని జబ్లోంకా అంటారు: "

దురదృష్టవశాత్తూ, మెదడు ఎందుకు కుంచించుకుపోయిందో అర్థం చేసుకోవడానికి, సంకోచం ఎప్పుడు ప్రారంభమైందో మనం ఖచ్చితంగా గుర్తించాలి.

కానీ మన దగ్గరున్న శిలాజాల రికార్డుతో ఇది దాదాపు అసాధ్యం. పాత శిలాజాలను కనిపెట్టడం కష్టం కావడం, కొత్త నమూనాలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించడంతో ఈ పరిశోధనలో లోపాలున్నాయి.

"ప్లీస్టోసీన్‌లో, మానవ మెదళ్లు నియాండర్తల్ మెదడులాగే ఉండేవి, ఇది నేటి సగటు మానవ మెదడు పరిమాణం కంటే కొంచెం పెద్దది. సుమారు 20,000 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న అన్ని హోమో సెపియన్స్ సగటు మెదడు బరువు కూడా ఎక్కువే. కానీ మెదడు బరువు ఎప్పుడు తగ్గడం ప్రారంభమైంది అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. మనకు తెలిసిందల్లా అప్పటి మెదళ్ళు పెద్దవిగా ఉండేవి. అవి నేడు 13% చిన్నవిగా మారాయి" అని టాటర్‌సాల్ చెప్పారు.

సంక్లిష్ట సమాజం

ఫొటో సోర్స్, Getty Images

మన తెలివి తగ్గుతోందా?

మెదడు పరిమాణం తగ్గిపోయిందంటే, మానవ మేధస్సు విషయం ఏమిటి? మెదడు చిన్నగా కావడం వల్ల మనం తెలివి పెరిగిందా లేక, బుద్ధిహీనులం అయ్యామా లేక, మేధస్సుపై ఎలాంటి ప్రభావం చూపదా అనే నిర్ధరణకు రావడం మనం ఏ సిద్ధాంతాన్ని విశ్వసిస్తాం అనేదాని మీద ఆధారపడి ఉంది.

మెదడు పరిమాణమే అన్నింటినీ వివరించదనేది నిజం. పురుషుల మెదడు వారి శరీర పరిమాణం కారణంగా మహిళల మెదడు కన్నా 11% పెద్దది. అయినా, స్త్రీపురుషులిద్దరికీ ఒకే విధమైన మేధోసామర్ధ్యాలు ఉంటాయని పరిశోధనల్లో తేలింది.

హోమో ఫ్లోరెసియెన్సిస్, హోమో నలేడి వంటి మెదడు చిన్నగా ఉండే హోమినిన్ జాతులలోనూ సంక్లిష్టమైన ప్రవర్తన కనిపిస్తుందని కొన్ని వివాదాస్పద ఆధారాలు ఉన్నాయి.

మెదడు చాలా చిత్రమైనది, మెదడులోని న్యూరల్ కనెక్షన్లు ఎలా ఉన్నాయనే దాని మీదే మేధస్సు ఆధారపడి ఉంటుంది. అయితే, సాధారణంగా, శరీర పరిమాణానికి అనుగుణంగా, పెద్ద మెదడు ఉంటే మేధస్సూ ఎక్కువగా ఉంటుంది.

"ప్రస్తుతం మన మెదడు పరిమాణం గణనీయంగా తగ్గుతోందనే వాస్తవం. దీని వల్ల మనలో మేధో సామర్థ్యం తగ్గిపోతోందని లేదా కనీసం అది పెరగడం లేదనే తార్కిక ముగింపుకు రావచ్చు" అని స్టిబెల్ చెప్పారు.

"అయితే, గత 10,000 సంవత్సరాలుగా మనం అభివృద్ధి చేసిన సాంకేతికత సహాయంతోనే మనం సమాచారాన్ని కంప్యూటర్‌లలో నిల్వ చేయగలుగుతున్నాం. మన సమస్యల పరిష్కరానికి వాటిని ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి మన మేధోసామర్థ్యం తగ్గుతుండవచ్చు. కానీ ఒక జాతిగా, మన తెలివి సమిష్టిగా తగ్గుపోతున్నట్లు అర్థం కాదు" అని స్టిబెల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)