ఎల్జీబీటీక్యూ: వీరి కోసం ఏయే దేశాలు కొత్తగా హక్కులు కల్పించాయి, ఎక్కడ నిషేధం విధించారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఓనూర్ ఎరెమ్
- హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్ ప్రతినిధి
2004 నుంచి హోమోఫోబియా, ట్రాన్స్‌ఫోబియా, బైఫోబియాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని మే 17న నిర్వహిస్తున్నారు. 100 కంటే ఎక్కువ దేశాలలో ఎల్జీబీటీ కమ్యూనిటీ వారు ఈ రోజును జరుపుకొంటారు.
ప్రపంచవ్యాప్తంగా ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి చెందిన వారు అనుభవిస్తున్న హింస, వివక్షపై ప్రభుత్వం, ప్రజలు, మీడియా దృష్టిని ఆకర్షించడం ఈ ఈవెంట్ లక్ష్యం.
1990 మే 17న స్వలింగ సంపర్కాన్ని మానసిక రుగ్మత వర్గీకరణ నుంచి తొలగించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీసుకున్న నిర్ణయానికి గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నారు. 1948లో డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణలో స్వలింగ సంపర్కం చేర్చింది.
అయితే, 1970ల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య సంస్థలు ఈ అభిప్రాయాన్ని సవాలు చేయడం ప్రారంభించాయి. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ 1973లో దాని డయాగ్నస్టిక్ మాన్యువల్ నుంచి స్వలింగ సంపర్కాన్ని తొలగించింది.
మానసిక రుగ్మత వర్గీకరణలో నుంచి స్వలింగ సంపర్కాన్ని తొలగించడానికి పట్టువదలకుండా కృషి చేసిన ఎల్జీబీటీక్యూఐ కార్యకర్తలకు అమెరికా ప్రెసిడెంట్ జో డైడెన్ ధన్యవాదాలు తెలిపారు.
అయితే డబ్ల్యూహెచ్‌వో ఇలాంటి చర్య తీసుకోవడానికి రెండు దశాబ్దాల సమయం తీసుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
నేడు పరిస్థితి ఎలా ఉంది?
డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. ఒక పరిస్థితి లేదా వ్యాధి వర్గీకరణపై ఆరోగ్య వ్యవస్థలు, కమ్యునిటీలు అర్థం చేసుకునే, ప్రతిస్పందించే విధానంలో వ్యత్యాసం ఉంటుంది.
ట్రాన్స్ జెండర్ సంబంధిత, లింగ-వైవిధ్య గుర్తింపు సమస్యలు వర్గీకరణకు పలు అడ్డంకులు సృష్టించాయి.
"ఉదాహరణకు హెల్త్ ఇన్సురెన్స్ కవరేజీలో లింగం ధ్రువీకరించాల్సి వస్తే ఈ వ్యక్తులు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించాల్సి వస్తుంది" అని డబ్ల్యూహెచ్‌వో గుర్తుచేసింది.
అనేక ఆరోగ్య సంస్థలు స్వలింగ సంపర్కంపై తమ అభిప్రాయాలను మార్చుకున్నప్పటికీ, పలు దేశాలలో ఇప్పటికీ ఎల్జీబీటీక్యూ+ వ్యక్తుల పట్ల వివక్ష చూపే చట్టాలు, విధానాలున్నాయి.
ప్రపంచంలో పరిస్థితులను ఇంటర్నేషనల్ లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్ , ఇంటర్‌సెక్స్ అసోసియేషన్ (ఐఎల్జీఏ) క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంటుంది.
సౌదీ అరేబియా, ఇరాన్, నైజీరియాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో స్వలింగ సంపర్కం నేరమంటూ మరణశిక్షలున్నాయని ఆ సంస్థ అంటోంది.
ఇప్పటికీ 62 దేశాల్లో స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తున్నారని అసోసియేషన్ పేర్కొంది.
మరోవైపు, ప్రపంచంలో వివాహ సమానత్వం ఉన్న దేశాలు కేవలం 36 మాత్రమేనని ది హ్యూమన్ రైట్స్ క్యాంపెయిన్ ఫౌండేషన్ అంటోంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా స్వలింగ వివాహాలను ట్రాక్ చేస్తుంటుంది.
ఏ దేశాలు ఎల్జీబీటీల కోసం హక్కులు కల్పించాయని, మేం ప్రపంచాన్ని నిశితంగా పరిశీలించే హ్యూమన్ రైట్ వాచ్, ఐఎల్జీఏ సంస్థలను అడిగాం. గత పన్నెండు నెలల్లో అధ్వాన్నంగా ఉన్నాయని రెండు సంస్థలూ బదులిచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఉగాండాలో కొత్త చట్టం
ఏకాభిప్రాయంతో స్వలింగ సంపర్క వ్యతిరేక చట్టం తీసుకొచ్చింది ఉగాండా. స్వలింగ సంపర్క చర్యలకు మరణశిక్షను ప్రవేశపెట్టింది, ఇది 2023 నుంచి అమలులోకి వచ్చింది.
ఎల్జీబీటీ సమస్యలపై న్యాయ సాయాన్ని, వాక్ స్వేచ్ఛను కూడా చట్టం తీవ్రంగా నియంత్రిస్తుంది. ఉగాండా పార్లమెంటులో జరిగిన చర్చలో ఒక ఎంపీ స్వలింగ సంపర్క వ్యతిరేక నినాదాలున్న డ్రెస్ ధరించి కనిపించారు.
స్వలింగ సంపర్కులపై నేరపూరితమైన నిబంధనలు అమలవుతున్నాయని సూచించే గణనీయమైన సాక్ష్యాలు ఉన్నాయని, అరెస్టులు, విచారణలు, బహిష్కరణలు జరుగుతున్నాయని ఐఎల్‌జీఏ పేర్కొంది.
ఎల్జీబీటీక్యూ+ కమ్యూనిటీకి, ఉగాండా వాసులందరికీ ఇది ‘‘ చీకటి రోజు, విచారకరమైన రోజు" అని రాయిటర్స్ వార్తా సంస్థతో ఉగాండా హక్కుల కార్యకర్త క్లేర్ బైరుగాబా ఆందోళన వ్యక్తంచేశారు.
"ఉగాండా అధ్యక్షుడు ఈ రోజు హోమోఫోబియా, ట్రాన్స్‌ఫోబియాను చట్టబద్ధం చేశారు" అని బైరుగాబా తెలిపారు.
అయితే, ఈ చట్టం కారణంగా ప్రపంచ బ్యాంకు ఉగాండాకు కొత్త రుణాలను నిలిపివేసింది.
దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిందని ఉగాండాకు చెందిన ఎల్జీబీటీ వ్యక్తి ఒకరు బీబీసీతో చెప్పారు.
''నన్ను, నా గర్ల్ ఫ్రెండ్‌ను కొట్టారు'' అని డయాన్ (అసలు పేరు కాదు) తెలిపారు. ట్రాన్స్ రెస్క్యూ సాయంతో తప్పించుకొని కెన్యా పారిపోయానని చెప్పారు.
ట్రాన్స్ రెస్క్యూ అనేది ప్రపంచంలోని ప్రమాదకరమైన ప్రదేశాల నుంచి ప్రజలు తప్పించుకోవడానికి సహాయపడే ఒక ఎన్జీవో.
"మీకు తెలిసినవన్నీ ఒక్కసారిగా వదిలివేయడం, మళ్లీ కొత్తగా ప్రారంభించడం భయానక విషయం" అని డయాన్ తెలిపారు.
"సమాజంలో ఏదో చెడు ఉంది. మాపై దాడి జరుగుతోంది, మేం సురక్షితంగా లేము, ఉగాండా సురక్షితంగా లేదు" అని డయాన్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మలేషియాకు సెగ..
గతేడాది మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరిగిన మహిళా దినోత్సవ మార్చ్‌లో ఎల్జీబీటీ హక్కుల కోసం డిమాండ్‌లు వినిపించాయి.
మలేషియాలో స్వలింగ సంపర్కం చట్టవిరుద్ధం. అతిక్రమిస్తే కొరడా దెబ్బలు లేదా మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. అక్కడ ఎల్జీబీటీల మార్పిడి ప్రక్రియను ప్రభుత్వమే చేపడుతోందని ఐఎల్జీఏ ఆరోపిస్తోంది.
ఈ విధానాన్ని విమర్శిస్తూ 2024 మార్చిలో ఆగ్నేయాసియా ఎల్జీబీటీ సంస్థలు ప్రకటన విడుదల చేశాయి. మార్పిడి చికిత్స, సంబంధిత పద్ధతులను నిషేధించాలని ఏసియన్ సభ్య దేశాలను ప్రకటనలో కోరాయి.
“మలేషియాలో నేరపూరితమైన నిబంధనలతో పాటు, స్థానిక షరియా చట్టాలు ఏకాభిప్రాయ స్వలింగ లైంగిక చర్యలను, విభిన్న లింగ వ్యక్తీకరణలను నేరంగా పరిగణిస్తాయి. దీనిలో అరెస్ట్‌లు, ప్రాసిక్యూషన్‌లకు సంబంధించి డాక్యుమెంట్ సాక్ష్యాలు ఉన్నాయి" అని ఐఎల్జీఏ అంటోంది.
దేశంలోని ఎల్జీబీటీ వ్యతిరేక చట్టాలపై బ్రిటిష్ గాయకుడు మాటీ హీలీ విమర్శలు చేయడంతో మలేషియా ప్రభుత్వం ఇటీవలి ఆయన ఈవెంట్‌ను రద్దు చేసింది.
అంతర్జాతీయ ఎల్జీబీటీ ఉద్యమాన్ని తీవ్రవాదంగా గుర్తించి, దాని కార్యకలాపాలను నిషేధించాలని న్యాయ మంత్రిత్వ శాఖ చేసిన అభ్యర్థనను రష్యా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒలేగ్ నెఫెడోవ్ చదివి వినిపించారు.
రష్యా ఏకాభిప్రాయ స్వలింగ సంపర్క చర్యలను స్పష్టంగా నేరంగా పరిగణించదు. కానీ, ఐఎల్జీఏ ప్రకారం, ప్రభుత్వం ఎల్జీబీటీ వ్యక్తులపై అణచివేతకు చట్టపరంగా ఒక విధానం ఏర్పాటు చేసింది.
అంతర్జాతీయ ఎల్జీబీటీ ఉద్యమాన్ని రష్యన్ సుప్రీంకోర్టు తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. నవంబర్ 2023లో దేశవ్యాప్తంగా దాని కార్యకలాపాలను నిషేధించింది. అంతేకాదు ఇంద్రధనస్సు జెండాను కూడా కోర్టు నిషేధించింది.
"రష్యా ఎల్జీబీటీ గ్రూపుల్లో భయాందోళనలు ఉన్నాయి. ప్రజలు వలసలు వెళ్తున్నారు. మా సొంత దేశం నుంచి ఖాళీ చేయవలసి వస్తోంది, ఇది భయంకరమైన అనుభవం" అని బీబీసీ రష్యా ఎడిటర్ స్టీవ్ రోసెన్‌బర్గ్‌తో సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చెందిన స్వలింగ రాజకీయవేత్త సెర్గీ ట్రోషిన్ అన్నారు.
హెచ్‌ఆర్‌డబ్ల్యూ ప్రకారం, చట్టం అనుసరించి పలువురిపై ఇప్పటికే తీవ్రవాద నేరారోపణలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎల్జీబీటీ హక్కులలో పురోగతి
కొన్ని దేశాల్లో ఎదురుగాలులు వీచినప్పటికీ, గత సంవత్సరం ఎల్జీబీటీ హక్కుల విషయంలో కొన్ని అడుగులు ముందుకు పడ్డాయి.
జపాన్‌లో స్వలింగ సంపర్కుల జంటలకు రక్షణ పెరిగిందని ఐఎల్జీఏ తెలిపింది. ఈ సంవత్సరం జపాన్ జిల్లా కోర్టులలో వెల్లడైన రెండు తీర్పులు స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయాలనే ఒత్తిడిని పెంచాయి.
చట్టపరమైన లింగ గుర్తింపు పొందాలనుకునే ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు స్టెరిలైజేషన్ సర్జరీని తప్పనిసరి చేసే చట్టం రాజ్యాంగ విరుద్ధమని జపాన్ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
పొరుగున ఉన్న కరేబియన్ దేశాలైన ఆంటిగ్వా, బార్బుడా, సెయింట్ కీట్స్ అండ్ నెవిస్, బార్బడోస్‌ల మాదిరి, 2024 ఏప్రిల్‌లో ఏకాభిప్రాయ స్వలింగ సంబంధాలను డొమినికా లీగలైజ్ చేసిందని హెచ్‌ఆర్ డబ్ల్యూ తెలిపింది.
కానీ, కరేబియన్‌లోని ఇంకా ఐదు దేశాలలో చట్టాలు వీరికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆ సంస్థ అభిప్రాయపడింది.

ఫొటో సోర్స్, Getty Images
థాయ్‌లాండ్, హాంకాంగ్ కూడా..
స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపును ఇచ్చే బిల్లును ఈ ఏడాది థాయ్‌లాండ్ దిగువ సభ ఆమోదించింది.
చట్టంగా మారడానికి దీనికి సెనేట్, రాయల్ ఆమోదం ఇంకా అవసరం. అయితే ఇది 2024 చివరి నాటికి జరుగుతుందని విస్తృతంగా భావిస్తున్నారు. దీంతో స్వలింగ కమ్యునిటీలను గుర్తించే ఏకైక సౌత్ ఈస్ట్ ఆసియా దేశంగా థాయిలాండ్ నిలవనుంది.
"ఈరోజు సమానత్వం సాధించామని భావిస్తున్నాను. ఎల్జీబీటీక్యూఐ+ హక్కుల కోసం పోరాడుతున్న థాయ్ పార్లమెంట్‌కి ఇది చరిత్రాత్మకమైన రోజు." అని ప్రతిపక్ష మూవ్ ఫార్వర్డ్ పార్టీకి చెందిన గే ఎంపీ తున్యావాజ్ కమోల్‌వాంగ్‌వాట్ అభిప్రాయపడ్డారు.
చైనా ప్రత్యేక పరిపాలనా ప్రాంతమైన హాంకాంగ్ కూడా స్వలింగ కమ్యునిటీలపై చట్టపరమైన పురోగతిని సాధించింది.
గత సంవత్సరం అంతర్జాతీయ ఎల్జీబీటీ క్రీడా ఈవెంట్ ‘గే గేమ్స్’కు ఆతిథ్యమిచ్చిన మొదటి ఆసియా దేశంగా హాంకాంగ్ నిలిచింది.
హాంకాంగ్ ఉన్నత న్యాయస్థానం సెప్టెంబరులో ఇచ్చిన తీర్పులో...రెండు సంవత్సరాలలో స్వలింగ సంపర్కుల కోసం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించింది. భర్తతో తన వివాహాన్ని అధికారికంగా గుర్తించాలని ప్రజాస్వామ్య అనుకూల కార్యకర్త జిమ్మీ షామ్ చేసిన విజ్ఞప్తికి ఇది పాక్షిక విజయం. కోర్ట్ ఆఫ్ ఫైనల్ అప్పీల్ దీనిని తిరస్కరించింది, అయితే నగరం ప్రత్యామ్నాయాలను అందించడంలో విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది.
ఫిబ్రవరిలో గ్రీస్ పార్లమెంట్ స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడానికి ఓటింగ్ జరిపింది. (అలా చేసిన మొదటి క్రిస్టియన్ ఆర్థోడాక్స్ మెజారిటీ దేశంగా గ్రీస్ నిలిచింది), స్వలింగ సంపర్కుల దత్తతలను కూడా చట్టబద్ధం చేసింది.
2023 జూన్‌లో ఎస్టోనియా పార్లమెంట్ వివాహ సమానత్వానికి మద్దతుగా ఓటు వేసింది, 2024 జనవరి 1 నుంచి చట్టం అమలులోకి వచ్చింది. దీంతో సోవియట్ యూనియన్ నుంచి బయటికొచ్చిన తర్వాత స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన మొదటి దేశంగా ఎస్టోనియా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్ వరదలు: ‘మా వాళ్ల మృతదేహాలు వీధుల్లో దొరికాయి’
- పెద్దక్కగా పుట్టడం శాపమా, అది ఒక మానసిక సమస్యగా మారుతోందా?
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెరిగిన పోలింగ్ శాతం దేనికి సంకేతం, ఎవరికి అనుకూలం?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2024: మీరు ఎవరికి ఓటేశారో తెలుసుకోవడమెలా?
- ‘నాకు పెళ్లి కావడం లేదు, సెక్స్ వర్కర్ల దగ్గరకు వెళుతుంటాను. ఇలా ఎన్నాళ్లంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














