అంతరిక్షంలోకి రొట్టెలు తీసుకెళ్తే ఏమవుతుంది? వ్యోమగాములు ఏం తింటారు?
- రచయిత, లారా హాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
అంతరిక్షంలో జీవించాలన్న మానవాళి ప్రయత్నానికి చంద్రుడు చివరి మజిలీ కావచ్చు, అయితే మనం అక్కడకు వెళితే ఏం తినవచ్చు? గాలి నుంచి తయారు చేసిన పాస్తా, ప్రొటీన్ బార్లు జస్ట్ ఒక ప్రారంభమేనా? ఇంకా అనేక రూపాల్లో ఫుడ్‌ను తయారు చేస్తున్నారా?
అంతరిక్షం మీద ఆధిపత్యం కోసం పోటీ వేగం పుంజుకుంది. రానున్న రెండేళ్లలో అర్టెమిస్ కార్యక్రమం ద్వారా వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపాలని నాసా ప్రణాళిక సిద్ధం చేసింది. 15 ఏళ్లు కక్ష్యలో ఉండేందుకు నిర్మించిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) ప్రస్తుతం 26వ ఏడాదిలోకి అడుగు పెట్టిది. త్వరలో దీనిస్థానంలో మరోక సెంటర్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
అంతరిక్షంలోని ఇతర గ్రహాల మీదకు మనిషిని పంపించేందుకు శాస్త్రవేత్తలు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనికి తోడు డబ్బులున్న వ్యక్తుల్ని రాకెట్ల ద్వారా అంతరిక్షం అంచుల్లోకి తీసుకెళ్లే పర్యాటక కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అంతరిక్షంలోకి చేరుకున్న తర్వాత అక్కడ మనం ఏం తినాలి, ఎలా బతకాలి?
"సరైన ఆహారమే ఆస్ట్రోనాట్స్‌ను ఆలోచనాత్మకంగా పనిచేసేలా చేస్తుంది” అని యూరోపియన్ అంతరిక్ష సంస్థలో ఆస్ట్రోనాట్ ఆపరేషన్స్ డిప్యూటీ లీడ్ డాక్టర్ సొంజా బ్రంగ్స్ చెప్పారు.
“డీప్ స్పేస్ మిషన్లు విజయవంతం కావాలంటే వ్యోమగాములకు వివిధ పోషక గుణాలున్న సరైన ఆహారాన్ని అందించడం ముఖ్యం. చాలా కీలకమైన విషయాన్ని ఎవరూ సరిగా పట్టించుకోవడంలేదని నాకు అనిపిస్తోంది” అని ఆయన అన్నారు.
ప్రస్తుతం వ్యోమగాములకు సిద్ధం చేసి ఉంచిన ఆహారాన్ని (ప్రిపేర్డ్ ఫుడ్) చిన్న ప్యాకెట్లలో పెట్టి ఇస్తున్నారు.
ఈ ఆహారాన్ని ప్రత్యేకమైన ఆహార సంస్థలు తయారు చేస్తున్నాయి. ఆహారాన్ని సిద్దం చేశాక దాన్ని ఘనీభవింపచెయ్యడం, నిర్జలీకరణం లేదా థర్మో స్టెబిలైజ్ చేస్తాయి.
ఈ ఆహరాన్ని తినేందుకు ఆస్ట్రోనాట్లు దీన్ని నీటితో వేడి చెయ్యడం లేదా చల్లబరచడం చేస్తారు. కొన్ని సందర్భాల్లో వాళ్లు ఇంటి నుంచి కూడా ఆహారం తెచ్చుకుంటారు. ( దీన్ని చాలా జాగ్రత్తగా తయారు చేసి థర్మో స్టెబిలైజ్ చేస్తారు)

ఫొటో సోర్స్, ESA/Nasa
అంతరిక్షంలోకి తీసుకెళ్లలేని ఆహార పదార్ధాలు
బ్రెడ్ లాంటివి అంతరిక్షంలోకి తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఎందుకంటే తక్కువ గ్రావిటీ (గురుత్వాకర్షణ) ఉన్న వాతావరణంలో ముక్కలు సులభంగా గాలిలోకి వెళతాయి. అంటే వాటిని మనం తినడానికి బదులు పీల్చుకునే ప్రమాదం ఉంది. అంతరిక్షంలో ఉప్పు కూడా తక్కువగానే వాడాలి. మానవ శరీరం అంతరిక్షంలో సోడియంను వేర్వేరుగా నిల్వ చేస్తుంది. దీని వల్ల ఎముకలు గుల్లబారతాయి.
వ్యర్థ జలాల రీసైక్లింగ్ వ్యవస్థను ప్రభావితం చేసే ఆల్కహాల్‌ను కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో అనుమతించడం లేదు.
‘కొత్తగా చేసే పనుల్లో అనే సమస్యలు ఎదురవుతుంటాయి’ అని బ్రంగ్స్ చెప్పారు.
“ఆరు నెలల పాటు అంతరిక్షంలో ఉన్న వ్యోమగాములు కరకర నమిలే ఆహార పదార్ధాలకు సంబంధించిన అనుభూతిని కోల్పోతారు. అందుకే సుదీర్ఘమైన అంతరిక్ష యాత్రల్లో పాల్గొనే వ్యోమగాములకు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందుకే వారికి వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండటం ముఖ్యం.
అంతరిక్షంలో పరిమిత వనరులతో ఆహారాన్ని సృష్టించడం, అందులో నుంచి వ్యర్థాలు తక్కువగా ఉత్పత్తయ్యేలా కొత్త మార్గాలను కనుగొనడానికి 2021లో నాసా డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్‌ను ప్రారంభించింది. ఆ ఆహారం సురక్షితంగా ఉండటమే కాక, పోషకాలతోపాటు రుచిగా ఉండాలని సూచించింది.
ఈ చాలెంజ్‌లో తుది దశకు చేరిన ఎనిమిది కంపెనీల్లో హెల్సింకీ కేంద్రంగా నడుస్తున్న సోలార్ ఫుడ్స్ ఒకటి. ఈ సంస్థ స్పేస్ వేస్ట్ ద్వారా ప్రొటీన్ తయారు చేసే అద్భుతమైన ఆలోచనతో ముందుకొచ్చింది.
‘స్థూలంగా చెప్పాలంటే, మేం గాలి నుంచి ఆహారం తయారు చేస్తాం.’ అని సోలార్ ఫుడ్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అర్టూ లూకానెన్ చెప్పారు. ఆయన కంపెనీ ఫిన్‌లాండ్ గ్రామీణ ప్రాంతాలలో కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్ మిశ్రమంతో పెరిగిన తర్వాత తినదగిన సూక్ష్మజీవిని గుర్తించింది.
ఈ ప్రొటీన్ బాక్టీరియా నుంచి ఏర్పడింది. దీనిని ఇతర పదార్ధాలలో కలపవచ్చు. దీంతో పాస్తా, ప్రొటీన్ బార్ల వంటి పోషకాహారాన్ని తయారు చేయవచ్చు. ఇది మాంసాహారం, గుడ్లకు కూడా ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.
“మేము స్పేస్ ఫుడ్ గురించి ఆలోచిస్తున్నాము. ఎందుకంటే అంతరిక్షంలో నివసించే వారిలో వేస్ట్ గ్యాస్‌లు రెండే ఉన్నాయి. అవి హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్.” అని లూకానెన్ చెప్పారు. “అందుకే మేము అంతరిక్షంలో ఆహారం గురించిన సాంకేతికతను గురించి మాత్రమే కాదు, పర్యావరణ నియంత్రణ, జీవించడానికి అవసరమైన వ్యవస్థల గురించి కూడా ఆలోచిస్తున్నాము” అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Nasa/Amanda Griffin
తాజా ఆహారంపైనా ప్రయోగాలు
సోలార్ ఫుడ్స్ కనుక్కున్న ప్రోటీన్‌ను పేస్ట్ లేదా పౌడర్‌గా మార్చవచ్చు. దీన్ని పిండితో పాటు విలక్షణమైన ఆహార పదార్థాలతో కలిపి పాస్తా, ప్రోటీన్ బార్‌లు, ప్రొటీన్లు అధికంగా ఉండే చాక్లెట్ వంటి వాటిని తయారు చేయవచ్చు.
దీన్ని( ప్రోటీన్ పౌడర్‌ను) నూనెలతో కలిపి స్టీక్(మాంసం లేదా చేప ముక్క) లాంటి ఆకారానికి తీసుకురాగలమా లేదా అన్నది పరిశోధిస్తున్నారు. ఇందుకోసం త్రీడీ ప్రింటర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
వ్యోమగాములు తాజాగా ఆహారం కావాలనుకుంటే విటమిన్ టాబ్లెట్లు కొంత వరకు పడవచ్చు, సూర్యరశ్మి, గురుత్వాకర్షణ శక్తి లేని చోట కూరగాయల్ని పండించడంపై ప్రయోగాలు కొనసాగుతున్నాయి.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వెజ్జీ అని పిలిచే చిన్నకూరగాయల తోట ఉంది. ఇందులో మైక్రో గ్రావిటీలో మొక్కల ఎదుగుదలపై వ్యోమగాములు అధ్యయనం చేస్తున్నారు.
ఫ్లోరిడా రాష్ట్రంలోని మెరీట్ ఐలండ్‌లో ఉన్న ఇంటర్‌స్టెల్లార్ ల్యాబ్ చిన్న చిన్న మొక్కలు, కూరగాయలు, పుట్టగొడుగులు, కీటకాలను ఉత్పత్తి చెయ్యడానికి మాడ్యులర్ బయో జనరేటివ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది.
నాసా డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఎనిగ్మా ఆఫ్ ద కాస్మోస్‌తో పాటు ఈ సంస్థ కూడా ఫైనల్‌కు చేరింది. ఎనిగ్మా ఆఫ్ కాస్మోస్ అంతరిక్షంలో చిన్న మొక్కలను పెంచడంపై పరిశోధన చేస్తోంది.

ఫొటో సోర్స్, ESA/Nasa
అంతరిక్షంలో భవిష్యత్ ఆహారంగా కనిపిస్తున్న పదార్ధాల జాబితాలో ఫంగి కూడా ఉంది. డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్‌లో ఫైనల్‌కు చేరిన ఆరు సంస్థల్లో మూడు సంస్థలు ఫంగిని ఆహారంగా అభివృద్ధి చేసే పనిలో ఉన్నాయి.
ఇందులో స్వీడన్‌లోని గొతెన్‌బర్గ్ కేంద్రంగా నడుస్తున్న మైకోరెనా అనే సంస్థ సూక్ష్మరూపంలో ఉండే నాచు, బూజుని కలిపి మైక్రో ప్రొటీన్ ఉత్పత్తి చేసే వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
‘ఫంగి చాలా వైవిధ్యభరితమైనది’ అని మైకోరెనా పరిశోధనా విభాగంలో పని చేస్తున్న కార్లోస్ ఒటెరో చెప్పారు. ‘దీన్ని వివిధ రకాల ఉపరితలాలపై పెంచవచ్చు. ఇది వేగంగా పెరుగుతుంది. వ్యోమనౌకలో ఉండే సిబ్బందికి అవసరమైనంత ఉత్పత్తి చేసేలా చిన్న డిజైన్‌తో చక్కని వ్యవస్థను తయారు చేసుకోవచ్చు. చాలా శక్తివంతమైనది, ఆరోగ్యకరమైనది, రేడియో ధార్మికతను తట్టుకుంటుంది. దీన్ని నిల్వ చెయ్యడం, తీసుకెళ్లడం చాలా తేలిక’ అని ఆయన చెప్పారు.
ప్రయోగాల దశలో ఉన్న అంతరిక్ష ఆహారం భూమి మీద ఆహార చక్రానికి దగ్గరగా ఉంది.
దీంతో మరో అదనపు ప్రయోజనం ఏంటంటే ఈ ఆహారంలోని ప్రోటీన్స్‌లో మనిషి శరీరం పని చెయ్యడానికి అవసరమైన అన్ని అమినో యాసిడ్స్ ఉన్నాయి.

ఫొటో సోర్స్, Claes Bech Poulsen
అంతరిక్షంలో క్యాటరింగ్
ప్రైవేట్ సంస్థలు అంతరిక్ష పోటీలోకి ప్రవేశించే అవకాశాలు పెరుగుతున్న కొద్దీ, ప్రైవేట్ షెఫ్‌లకు కూడా అవకాశాలు పెరుగుతాయి.
కోపెన్‌హేగెన్‌లోని అల్కెమిస్ట్ రెస్టారెంట్‌లో పని చేస్తున్న షెఫ్ రాస్ముస్ ముంక్ తన ప్రత్యేక వంటకాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి అక్కడ వడ్డించేందుకు ఫ్లోరిడాలోని స్పేస్ స్టార్టప్‌తో జట్టు కట్టారు.
నెప్ట్యూన్ అనే అంతరిక్ష నౌకలో ఆరుగురు ఔత్సాహికులతో కలిసి ఆయన అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. ఇందుకోసం స్పేస్ వీఐపీ అనే సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఆయన తెలిపారు.
ఈ నౌకలో ఆరు గంటల ప్రయాణానికి ఒక్కొక్కరి నుంచి 495,000 డాలర్లు ( సుమారు రూ. 4 కోట్ల 10 లక్షలు ) వసూలు చేస్తున్నారు.
అంతరిక్షంలోకి పర్యటకులను తీసుకెళ్లే వ్యోమనౌకల్లో క్యాటరింగ్ అవకాశాలను అందుకోవాలని భావిస్తున్న అనేకమంది షెఫ్‌లో ఆయన కూడా ఒకరు.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ ఖరీదైన ప్రయాణాన్ని చేయగల వారు చాలా తక్కువమంది ఉన్నారు. అంతరిక్ష ఆహారాన్ని తయారు చెయ్యడంలో ముఖ్య ఉద్దేశం గురుత్వాకర్షణ శక్తి లేని చోట వాటిని ఉత్పత్తి చేయడమే కాకుండా, భూమి మీద కూడా వాటిని తినడానికి ఉపయోగపడేలా చూడటం.
వనరులు అంతగా లేని ప్రాంతాలు, అసాధారణ వాతావరణ పరిస్థితులతో పాటు భూమి మీద కూడా అత్యాధునిక ఆహారాన్ని ఉత్పత్తి చేయడమే నాసా డీప్ స్పేస్ చాలెంజ్ ఉద్దేశం.
“వాతావరణ మార్పులు కరవు ప్రభావిత ప్రాంతాలలో ఆహార ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి” అని లూకానెన్ చెప్పారు. భూమి మీద మనం వాడుకున్న వనరుల నుంచి వచ్చే వ్యర్థాలతో మంచి వస్తువులు తయారు చేస్తున్నాం. సర్క్యులర్ ఎకానమీ ఫిలాసఫీ ఇదే. భూమి అత్యున్నత వ్యోమనౌక. మనం దాని మీదనే ఉన్నాం. ఇక్కడ వనరులు పరిమితంగా ఉన్నాయి” అని ఆయన అన్నారు.
“అంతరిక్షంతో పాటు భూమి మీద కూడా వనరుల్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడమే మా మిషన్ లక్ష్యం” అని చెప్పారు మైకోరెనా పరిశోధనా విభాగం హెడ్ క్రిస్టినా కార్ల్‌సన్.
“భవిష్యత్‌లో కర్భన ఉద్గారాలు ఉండవు, వ్యర్థాలు, వృధా ఉండదు. ఇలాంటి ప్రాజెక్టుని అభివృద్ధి చెయ్యడానికి అంతరిక్షం సరైన ప్రాంతం. ఇది అక్కడ సాధ్యమైతే, భూమి మీద కూడా సాధ్యమవుతుంది” అని ఆమె అన్నారు.
నాసా డీప్ స్పేస్ ఫుడ్ చాలెంజ్‌లో మూడో దశ ఈ వేసవిలో జరగనుంది.
ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టులు అంతరిక్షం తరహా వాతావరణంలో ఎలా పని చేస్తాయనే దాన్ని పరీక్షించనున్నారు. ఈ ఆధునిక ఆహార పదార్దాలు వ్యోమగాముల పోషకాహారంలో భాగం అవుతాయా? రానున్న రోజుల్లో మనం భూమి మీద తినే ఆహారం కూడా ఇదేనా అనేది ఈ పోటీల్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం.
ఇవి కూడా చదవండి:
- అర ఎకరంలో 60 బోర్లు, సాగునీటి కష్టాలకు ఐకమత్యంతో చెక్ పెట్టిన అనంతపురం రైతులు
- తెల్ల గుడ్లు, ఎర్ర గుడ్లు: వేటిలో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ఆంధ్రప్రదేశ్: పింఛన్లు ఇంకా అందకపోవడానికి అసలు కారణమేంటి? ఈసీ ఏం చెప్పింది?
- కుప్పం నియోజకవర్గానికి నీళ్లొచ్చాయా? రాలేదా? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














